పుట:అనిరుద్ధచరిత్రము.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

మాయామానుషమూర్తివై తనరుబ్రహ్మంబు న్శివాబ్జాసనా
ధ్యేయుం నిన్ను నెఱుంగలేక నవనీతి న్మాఱుకొన్నందుకుం
బ్రాయశ్చిత్తము గాఁగఁ జేసితిని నాపాపంబు లోపంబు గా
నాయజ్ఞానము వాసె నీకరుణఁ గృష్ణా గోపికావల్లభా.

27


వ.

అని మఱియుం బునఃపునఃప్రణామపూర్వకంబుగా బహుప్రకారంబులం బ్రస్తుతించి
యుషాకన్యానిరుద్ధకుమారులంగా చేసి తోడ్కొనిరమ్మని పరిచారకులం బంచిన వారును
దదీయశుద్ధాంతకాంతాజనంబులకుం దెల్పిన నవ్వధూవరుల నుచితోపచారంబులం
బ్రీతులంజేసి యలంకరించి రప్పుడు.

28


సీ.

కంకణఝణఝణత్కారానుగుణముగా హస్తపద్మములు నాట్యములు సలుప
హసప్తద్మములనాట్యములతో నుద్దియై గుత్తంపుగుబ్బలు కులికియాడ
గుత్తంపుగుబ్బలకులుకుతో నైక్యమై కంఠహారఁబులు గంతులిడఁగఁ
గంఠహారంబులగంతులజత గూడి పిడికెడునడుము దా బెళుకుఁ జూప
విమలహరినీలరుచులతో వియ్య మంద, మరుకుమారునినునుసోగకురులయందు
లలితచాంపేయసురభితైలంబు నించి, యెలమిఁ దల యంటె నొక్కపూర్ణేందువదన.

29


క.

నలుఁగిడియె నొక్కకోమలి, మలయజపంకంబు లంటె మఱియొక్కతె ని
ర్మలకనకకలశముల జల, కం బొనరించెఁ గుసుమశరపుత్రునకున్.

30


క.

తడియొత్తె నొకతె వలిపెపు, మడుఁగులు గట్టంగ నిచ్చె మఱియొక్కతె యిం
పడరంగ నగరుధూపం, బిడె నొక్కతె పరిమళంబు లెంతయు నెసఁగన్.

31


గీ.

అర్ధచంద్రోపమంబైన యతనినుదుట, దిద్దె నొక్కతె కస్తూరితిలక మదియుఁ
దనరెఁ గందర్పకుసుమకోదండదండ, ఘటితనీలోత్పలాస్త్రసంకాశ మగుచు.

32


ఉ.

ఒక్కలతాంగి మౌక్తికసముజ్జ్వలభారములందు వజ్రపుం
జెక్కలతాళిబిళ్ల విలసిల్లఁగఁ గూర్చి యలంకరింపఁ బెం
పెక్కి తదీయవక్షమున నెంతయుఁ జూడఁగ నొప్పె నయ్యెడన్
జుక్కలగుంపులో మిగులశోభిలుపూర్ణశశాంకుకైవడిన్.

33


చ.

శ్రవణపదావిలగ్నమకరప్రకటాభరణోజ్జ్వలాస్యకై
రవహితులీల నాఘనుఁడు రాజిలె నీలరుచిం దళత్తళల్
గవయఁ బ్రజానురాగకరకంకణము ల్ప్రవహింపఁజూచి గౌ
రవగుణసంప్రపూర్ణజలరాశి కదా యని తజ్జ్ఞు లెంచఁగన్.

34


గీ.

నిలువుటద్దంబు ముందర నిలిపె నొకతె, యందుఁ బ్రతిబింబితం బైనయతనిరూపు
జూచి భ్రమ నొంది యొక్కతె సురటి వీవఁ, జెలులు ఘల్లున నగి రది సిగ్గువడఁగ.

35


సీ.

సరసవృత్తస్తని గురులీల వరమహోత్పలమాల రచియింపఁ బ్రౌఢవమ్మ
వరమహోత్పలవైరివదన నీ వంబరాలంకృతి సేయవలంతివమ్మ