పుట:అనిరుద్ధచరిత్రము.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కరకారణసౌభాగ్యరేఖావళీకలితారుణకరతలంబును, జంద్రశేఖరమనోరంజితతాళ
ప్రమాణలయాలయవ్యాప్తివిస్తారరంగన్మృదంగవాద్యఘాతకారిణ్యంగుళ్యాభిరామం
బును, నక్తంచరీకుచకుంభయుగళచర్చితతుహినజలమిళత్పరకర్దమసురభిఘుమ
ఘుమాయమానంబును నైన బాణాసురుని జాహుసహస్రంబునందుఁ జతుష్టయావశిష్టం
బుగా ఖండించి వైచిన జంఝాసమీరణవిక్షేపవిదళితశాఖాసహస్రంబై మోడ్పడి
యున్న మహామహీరుహంబుచాడ్పునఁ బురందరకరాంభోరుహశుంభద్దంభోళిధా
రాహతపక్షంబైయున్న కుంభినీధరంబువిధంబున నుండె నప్పుడు.

18


క.

సురుచిరసురనికరకరాం, బురుహవికీర్ణ ప్రసూన పుంజము లొఱపై
హరిపైఁ గురిసె న్మొరసెన్, వరుసన్ రంభాదినాట్యవాద్యరవంబుల్.

19


గీ.

అవ్విరోచనపౌత్రునియందుఁ జాల, కరుణ గల్గుటఁ జేసి గంగాధరుండు
పురుషసూక్తంబు చదువుచు హరిని జేరి, విజయవాక్యప్రయుక్తి నిట్లని నుతించె.

20


చ.

అనఘుఁడ వప్రవేయుఁడ వనంతుఁ డవాద్యుఁడ వక్షరుండ
వత్యనుపమచిన్మయుండవు చరాచరజాలసమేతమైన యి
వ్వనజభవాండపఙ్క్తులు భవజ్ఙఠంబున నీదుమాయచే
జననము వర్ధనంబు నవసానము నొందుచు నుండు నీశ్వరా.

21


సీ.

అఖిలాత్మ నీనాభియందు నాకాశంబు మునివంద్య నీపాదములను ధరణి
సర్వేశ నీమానసమునఁ జంద్రుండును జలజాక్ష నీనేత్రముల నినుండు
గాంభీర్యనిధి నీముఖంబున నింద్రుండు మురహర నీకర్ణములను దిశలు
నురగేంద్రశయన నీయూర్పుల ననిలంబు ఘనమూర్తి నీమస్తకమున దివము
ప్రబల మగుచుండు నుపనిషత్పంచకమయ, దివ్యమంగళవిగ్రహస్థితి వెలుంగు
నిన్ను భావించి సేవించి సన్నుతించి, కాంతు రనఘులు మోక్షంబుఁ గమలనాభ.

22


క.

అని మఱియు బహువిధంబుల, వినుతించు శశాంకధరుని వినయోక్తులకున్
జనితప్రమోదమానస, వనరుహుఁడై పలికె గరుడవాహనుఁ డెలమిన్.

23


నీదయ వీనిపైఁ గలిమి నిక్కువ మింతియె కాదు వీఁడు ప్ర
హ్లాదునకుం బ్రపౌత్త్రుఁడు తదన్వయజాతుల నే వధింపఁ గా
లే దటుగాన జీవ మెడలింపక కాచితి బాహువిక్రమో
న్మాద మడంపఁగావలసి మట్టున నుంచితిఁ జంద్రశేఖరా.

24


క.

ప్రమథగణంబులలో ను, త్తముఁడై భవదీయసన్నిధానంబున మో
దముతోడ నుండఁగలఁ డీ, యమరాహితుఁ డింక నోపురాసురమథనా.

25


గీ.

అనుచు నానతి యిచ్చె నయ్యవసరమున, బాహువులతోన యజ్ఞానబంధములను
వీడుకొని మాధవుని జేరి వినయఫణితిఁ, జాగి మ్రొక్కుచు బాణుండు సంభ్రమమున.

26