పుట:అనిరుద్ధచరిత్రము.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

హారకిరీటకుండలముఖాభరణోజ్జ్వలుఁడై సహస్రబా
హారుచిరాయుధప్రకరుఁడై బిరుదధ్వజఘంటికాస్వనో
దారరథస్తుఁడై తురగదంతిరథాదికచాతురంగసే
నారభటీకఠోరతరుఁడై పటహధ్వను లుల్లసిల్లఁగన్.

9


గీ.

శోణనగరంబు వెలువడి సురవిరోధి, ధరణి కంపింప నేతెంచి తాఁకుటయును
యాదవబలంబు విక్రమం బతిశయిల్ల, మాఱుకనిన రణం బతిఘోర మయ్యె.

10


సీ.

శరపరంపరలచే సైన్యంబు మగ్గంగ రథములు పఱపించు రథికవరులు
రథికులపైఁ గుంజరముల దీకొల్పి గర్వమునఁ దాఁకెడు గజవాహకులును
గజవాహకులమీఁదఁ గంఖాణములఁ దోలి కత్తుల నఱకు రాహుత్తగములు
రాహుత్తులను బరాక్రమలీల శోభిల్లఁ జేరి యీఁటెలఁ గ్రుమ్ము వీరభటులు
నగుచుఁ బోరాడె రోషంబు లతిశయిల్ల, నుభయచతురంగబలములు నుక్కు మిగిలి
పలలఖాదనభవకుతూహలపిశాచ, కంఠకోలాహలమున నాకసము వగుల.

11


వ.

అప్పుడు.

12


మ.

హరిపై బాణుఁ డహంకృతిం గదిసి బాహాపఙ్క్తి నొక్కుమ్మడిన్
శరము ల్తోమరము ల్గద ల్ముసలము ల్చక్రంబులు న్శూలముల్
పరిఘంబు ల్కరవాలము ల్పరశువు ల్ప్రాసాదనానాయుధో
త్కరము ల్శైలము గప్పుమంచుపగిదిం గన్పట్టఁగా నేసినన్.

13


చ.

భుజబలశాలి మాధవుఁడు పూని ధనుర్గుణటంకృతిన్ హరి
ద్గజములకర్ణము ల్పగులఁగా నిశితార్ధశశాంకసాయక
వ్రజములు పింజపింజఁ గరువం బరఁగించి తమం బడంచు నీ
రజహితులీల సాధనపరంపరలం దునుమాడి తీవ్రతన్.

14


మ.

విజయోత్సాహము మోమునం బొదలఁగా విశ్వంభరుం డార్చి య
క్కజమై తేజము దిక్కుల న్వెలుఁగ నాగర్వాంధదైత్యాబ్ధి ఘో
రజవస్పర్శనము న్హరామరపరబ్రహ్మాదికళ్యాణకృ
న్నిజసందర్శనమున్ సుదర్శరము నున్నిద్రప్రతాపంబునన్.

15


వ.

ప్రయోగించిన.

16


మ.

చటులంబై చలితక్షమావలయమై చంద్రార్కకోటిప్రభా
ఘటితాశాంతరమై చరాచరసమాక్రాంతాగ్నికీలాసము
త్కటమై చండతరాంశువై చకితరక్షశ్చక్రమై చక్ర మా
ర్భటితో వచ్చి వియచ్చరు ల్జయజయారావంబుతో మ్రొక్కఁగన్.

17


వ.

సముద్దండవేదండప్రకాండశుండాదండమండితంబును, గనత్కనకకంకణకేయూర
ముద్రికానిచయఖచితప్రచురమణిగణమరీచిమాలికాలంకృతంబును, ద్రైలోక్యభయం