పుట:అనిరుద్ధచరిత్రము.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

వేంకటాచలమున వేసటనొందక వడలు భుజింపఁగాఁ బొడము దప్పి
శ్రీరంగమున నాసదీఱఁగఁ బొంగళ్లు భోజనం బొనరింపఁ బొడము దప్పి
కాంచీపురంబులోఁ గాంక్షకొద్దినిఁ జేరి యిడ్డెనల్ భక్షింప నెసఁగు దప్పి
యళగిరిస్థలమున నాపోఁవగా దోసె లారగించినఁ బుట్టినట్టి దప్పి
యర్చకస్తోమహస్తశంఖాగ్రముక్త, లలితగుడజలధారాఘళంఘళంఘ
ళాయమానపానీయమహిమచే నఁణచికొనుచు, జలజనాభుండు మంగళాచలమునందు.

41


ఉ.

ముంగిటికల్పభూరుహము మూలధనంబు నివేశనంబులో
బంగరువాన చేతికగపడ్డతలంపులమానికంబు ముం
గొంగుపసిండి భక్తులకుఁ గోర్కులపంట జగంబులందు న
మంగళశైలవల్లభుసమం బగుదైవము లేదు చూడఁగన్.

42

షష్ఠ్యంతములు

క.

ఈదృగ్విధకల్యాణగు, ణోదారప్రాభవునకు మద్యల్లీలా
సాదరకటాక్షవీక్షా, పాదితవిబుధేంద్రకమలభవవిభవునకున్.

43


క.

అతులితమతియుతనుతగుణ, యతికృతసుధ్యానగతనిరాకారునకున్
శ్రితకమలాసితకమలా, యతవిమలాంబకసుఖప్రదాకారునకున్.

44


క.

భూషాలంకారునకును, దోషాటభటచ్ఛటానుదోత్కటగజహృ
ద్భీషణకంఠీరవగళ, ఘోషితకృతపాంచజన్యఝాంకారునకున్.

45


క.

మందారకుందచందన, మందస్మితసుందరైకమందిరనయనా
నందవదనారవిందున, కుందామరసోద్భవాస్యకుముదేందునకున్.

46


క.

వరసుగుణభక్తజనకృత, సరసగుణాంభోర్ధపానసౌఖ్యునకు శుభా
కరమంగళాచలస్థల, నరసింహాఖ్యునకు సద్గుణశ్లాఘ్యునకున్.

47

కథాప్రారంభము

వ.

అంకితంబుగా నేరచియింపంబూనిన యనిరుద్ధచరిత్రంబునకుఁ గథాప్రకారం బెట్టిదనిన
భగవత్కథాసుధానుభవకుతూహలసాంద్రులగు శౌనకప్రముఖమునీంద్రులు సకలపు
రాణేతిహాసప్రసంగవచనచాతురివిఖ్యాతుండగు సూతునిం గనుంగొని యిట్లనిరి.

48


చ.

జలజభవాభవప్రముఖసంస్తవనీయశేషవిష్ణుని
ర్మలగుణకీర్తనామృతము మామకకర్ణరసాయనంబు గాఁ
బలుమఱు నీవు దెల్పుటకుఁ బాత్రులమైతిమి పూర్వపుణ్యముల్
ఫలితము నొందె నీవలన భవ్యగుణాగ్రణి రౌమహర్షణీ.

49


క.

అనిరుద్ధునిచారిత్రము, వినుటకు మాహృదయములను వేడుక పొడమెన్
వినుపింపు సవి స్తరముగ, వినుతబుధవ్రాతసూతవినయోపేతా.

50