పుట:అనిరుద్ధచరిత్రము.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

నరసింహపాదభక్తుఁడ, నరసింహకృపాప్రసాదనయలబ్ధమతిన్
నరసింహార్పితహృదయుఁడ, నరసింహునికరుణఁ జాలనమ్మినవాఁడన్.

32


వ.

ఇట్టి నాచేత విరచనీయంబగు నేతత్ప్రబంధసామ్రాజ్యంబునకు మూర్థాభిషిక్తుండగు
మహానుభావునిప్రభావంబు వర్ణించెద.

33


సీ.

శ్రీవైష్ణవాలయశ్రేణులందుఁ జెలంగు ద్రావిడగంధనాదములవలన
వరమహీసురయజ్ఞవాటికాంతరములఁ గొనరారుహోమధూమములవలన
విపణీవీథులయందు వినిహితంబైనట్టి ధనధాన్యముఖపదార్థములవలన
నేలాలవంగతాంబూలవల్లీచందనముఖశోభితవనాంతములవలనఁ
గమలకైరవకల్పాదకలితలలిత, విమలజలసాంద్రకాసారవితితివలన
భాసురంబగులక్ష్మీనివాస మగుచు, దివ్యతిరుపతిమంగళాద్రిస్థలంబు.

34


క.

తిరుపతులు నూటయెనిమిది, పురుషోత్తమశేషశైలములు మొదలుగ నా
తిరుపతులలోన మంగళ, గిరి విష్ణునిజస్థలంబు కేవల మరయన్.

35


మ.

జగదానందకరంబు మోక్షపదవీసోపానమార్గంబు యో
గిగణాకీర్ణగుహాంతరంబు శిఖరక్రీడావిలోలాప్సరో
మృగనేత్రాసుకరాంగుళీచలితతంత్రీవాతవీణారవా
నుగుణాంచత్పికనాద మద్రి చెలువొందున్ మంగళాభిఖ్యతన్.

36


ఉ.

ఆమహనీయశైలశిఖరాగ్రమునందు నృసింహమూర్తి తే
జోమయదివ్యవక్త్రమున శోభిలుచున్ నిజభక్తకోటి శ్ర
ద్ధామతిఁ జేయుపానకముఁ దా నెలమిన్ సగ మారగించి త
త్కామితముల్ ఫలింపఁగ సగంబుఁ దగన్ దయసేయు వారికిన్.

37


చ.

గిరిదిగువన్ వినూత్నమణికీలితమండపమధ్యభాగభా
సురతరపీఠమందు నతిసుందరమూర్తి ధరించి యిందిరా
తరుణియుఁ దాను నుండు నిరతంబు నృసింహుఁడు దివ్యహారనూ
పురకటకాంగుళీయకవిభూషణపుంజవిరాజమానుఁడై.

38


తే.

ఇట్టిమంగళగిరియందు నెగువదిగువ, తిరుపతుల రెంటిమధ్యప్రదేశమందు
శంకరుఁడు సర్వమంగళాసహితుఁ డగుచు, నుండు నెప్పుడు సహవాసయోగ్యుఁ డగుచు.

39


సీ.

కళ్యాణసరసిలోఁ గదిసి మజ్జనమాడి ధౌతవస్త్రంబు లందముగఁ దాల్చి
కుధరాగ్ర మెక్కి మార్కొండలక్ష్మి భజించి నరసింహునకు వందనములు చేసి
మిరియంటు లేలకుల్ మెదిపి చక్కెరతోడఁ గలిపి తియ్యనిపానకములు చేసి
స్వామి కర్పించి శేషం బైనసగమును భక్తుల కెల్లను బంచిపెట్టి
నగము దిగివచ్చి శివదర్శనంబు చేసి, దిగువనరసింహు నిందిరాదేవిఁ గొలిచి
భోగమోక్షంబు లనుభవింపుదురు జనులు, సత్య మిది మంగళాచలస్థలమునందు.

40