పుట:అనిరుద్ధచరిత్రము.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

కని సాష్టాంగముగా వం, దనములు గావించి లేచి తత్సామీప్యం
బున నిలిచి కొలిచి యుండఁగ, ననుఁ జల్లనిచూడ్కిఁ జూచి నయముగఁ బలికెన్.

22


క.

బాలత్వమందె నీకు ద, యాళుఁడనై యొసఁగితి మదర్పితకవితా
ఖేలనమును మద్భజనా, శీలంబును దృఢముగాఁగఁ జేసితి వత్సా.

23


క.

అనిరుద్ధచరిత్రయుఁ జ, క్కని ముచ్చట విస్తరించి కణఁగి ప్రబంధం
బొనరింపుము శ్రేయోవ, ర్ధనమగు మాపేర నంకితము సేయుఁ దగన్.

24


వ.

అని పలికినఁ బరమానందభరితహృదయుండనై తద్వచనంబు మహాప్రసాదంబుగా నంగీ
కరించుకొని యిట్లంటి.

25


ఉ.

ఓ కమలామనోరమణ యో పరమేశ్వర యో జగత్పతీ
యో కరిరాజదైన్యహర యో శరణాగతవజ్రపంజరా
యో కరుణారసామృతపయోధి పునర్జననంబు మాన్పి సౌ
ఖ్యాకరమైనసత్పదము నందఁగఁజేసి కృతార్థుఁ జేయుమీ.

26


వ.

అని పునఃపునఃప్రణామంబులు చేసి తదనుజ్ఞ వడసి యందుండి మరలి గృహంబునకు
వచ్చితి నని యాదృశంబైన స్వప్నంబుఁ గాంచి మేల్కని యపరిమితప్రమోదరస
మగ్నాంతరంగుండనై కొంతదడవు తదీయదివ్యమంగళవిగ్రహంబు భావించుచుండితి
నివ్విధంబునఁ దదననుగ్రహంబు వడసినవాఁడనై యేతత్ప్రబంధరచనాక్రమంబునకు
నుపక్రమించి మద్వంశప్రకారంబు వర్ణించెద.

27


సీ.

శుభకరాపస్తంభసూత్రుండు కౌండిన్యగోత్రుండు నార్వేలకులపవిత్రుఁ
డగు బసవన మంత్రి కమరప్ప ముమ్మన పెద్దన యెల్లప్ప ప్రియతనూజు
లాకుమారచతుష్టయంబులో ముమ్మనామాత్యుండు సత్కీర్తిమండనుండు
తత్తనూజాతుఁ డుత్తమధర్మశీలుండు నిర్మలచరితుండు నిమ్మనాథుఁ
డతని నిజసాధ్వి యగుకొండమాంబ గర్భ, మందు జనియించె వినయవిద్యాచణుండు
హరిహరధ్యానసేవాపరాయణుండు, మహితరుచిహేలి యబ్బయామాత్యమౌళి.

28


ఉ.

నిండుమనంబు సత్యమును నీతియు శాంతము గల్గి కీర్తివం
తుండయి భోగభాగ్యములతోఁ జెలువొందుచుఁ గొండవీటి భూ
మండలనాయకుల్ మిగుల మన్నన సేయంగఁ బెంపుమీఱె స
త్పండితుఁ డబ్బమంత్రి కనుపర్తిపురాన్వయవార్ధిపూర్ణచం
ద్రుం డని లోకులందఱు నెఱుంగుటకున్ నుతిసేయ నేటికిన్.

29


తే.

అమ్మహాత్ముని గేహిని యైనపుణ్య, వతికి లక్ష్మాంబ కుదయించె సుతయుగంబు
మహితగుణశాలి రాయన మంత్రివరుఁడు, నిరుపమగుణోజ్జ్వలుం డగునిమ్మఘనుఁడు.

30


క.

ధీనిధి రాయనమంత్రికి, మానవతీమణికి నరసబాంబకు జననం
బైనార మిరువురమె యో, గానందుఁడు నబ్బనార్యుఁ డనఁదగు నేనున్.

31