పుట:అనిరుద్ధచరిత్రము.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రసికరాజన్యముఖ్యసమాజబహుమానసతతవసంతాభిరతిఁ జిగిర్చి
దైవనామాంకితస్తవమనోహరభావపదవాక్యసుమములఁ బరిమళించి
యభినవస్థితిఁ బెంపొందు నస్మదీయ, భాగధేయసారస్వతపారిజాత
తరువునకుఁ దగు సత్ఫలోదయము గాఁగ, సముచితంబుగ నొకప్రబంధము రచింతు.

14


క.

చదువులకు మేర యెయ్యది, చదివినమాత్రంబె చాలు సరసవచస్సం
పదఁ దా నేర్చిన కొలఁదిని, యదనఁగవితఁ జెప్పి హరికి నర్పింపఁదగున్.

15


మ.

అతిదాక్షిణ్యుఁ డతండు పూర్వక వికావ్యప్రౌఢవాచారసో
న్నతులం దేలినఁ దేలుఁగాక యెపుడున్ నావంటికిం చిద్జ్ఞుచే
గృతి విశ్వాస మెఱింగి చేకొనియెడున్ శృంగారపద్వల్ల వీ
రతులం జొక్కియుఁ గుబ్జమేను వగమీఱన్ దీర్చి చేపట్టఁడే.

16


క.

భగవంతుని సద్గుణములు, పొగడువివేకంబై తమ కపూర్వైశ్వర్యం
బగుట నరస్తుతి సేయరు, జగతిన్ సత్కవులు తుచ్ఛసంపదకొఱకై.

17


మ.

హరినామాంకితకావ్య మెట్టిదయిన న్నానందమై సజ్జనా
దరణీయం బగుఁ బుష్పమాలికలలో దారంబు చందంబునన్
నరనామాంకితమైనకావ్యము రసౌన్నత్యస్థ మయ్యు న్నిరా
కరణం బై చను హీనజాతిపురుషం గైకొన్న వేశ్యంబలెన్.

18


చ.

కృతులు నిజాంకితంబు లొనరించిన నిష్టధనంబు లిచ్చి స
మ్మతిఁ బ్రభువుల్ కవీశ్వరుల మన్ననసేయట కీర్తిఁ గోరి ని
శ్చితమతి దేవతాస్తుతియె సేయుకవీంద్రుల నాదరించి స
త్కృతి యొనరించు సత్ప్రభునికీర్తికిఁ గీర్తి ఘటింపకుండునే.

19


వ.

అని తలంచి యొక్కనాఁటిరాత్రియందు నాయిష్టదైవం బైన శ్రీమంగళాచలనృసింహ
దేవు దేవాలయంబునకుం జని వివిధమణిగణనిరాజితంబును, ప్రదీప్తహాటకమయం
బునునై నయనారవిందంబులకు నూతనంబైన యానందవికాసంబు సంపాదించుచున్న
గోపురప్రాకారశిఖరగర్భగృహాంతరాళికాముఖమండపప్రభాసౌభాగ్యంబు లవలోకించి
యాశ్చర్యంబు నొందుచుఁ బ్రదక్షిణంబులు చేసి స్వామిదర్శనంబు సేయుచు నుత్సాహం
బున నంతర్గృహంబున కరిగి యందు.

20


సీ.

సంపూర్ణపూర్ణి మాచంద్రబింబమువంటి మోమునఁ జిఱునవ్వు మొలక లెత్త
నంకపీఠమున సుఖాసీనమైయున్న కమలావిలాసవిభ్రమ మెసంగ
శంఖచక్రగదాబ్జసంశోభితములైన బాహాచతుష్టయప్రభలు నిగుడ
గ్రైవేయమకుటకంకణకుండలాంగదహారావళులు మేన నందగింప
బాలికాహస్తపంకజాలోలచారు, చామరానిలమోదితస్వాంతుఁ డగుచు
దివ్యసింహాసనంబునఁ దేజరిల్లు, మోహనాకారు నరసింహమూర్తిఁ గంటి.

21