పుట:అనిరుద్ధచరిత్రము.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నెత్తెడువిండ్లు నారిబిగు వెత్తెడువిండ్లు శరప్రయోగసం
పత్తిఁ జెలంగువిండ్లు నటు బాణుకరంబుల నొప్పె వింతయై.

85


చ.

తొలుతటియమ్ము పంచశతదోర్ధనురావళి ద్రుంచికొంచు న
వ్వలఁ జన నింతలో మొదలివైపున బాణుఁడు గ్రమ్మఱం గరం
బులఁ గొనుచాపముల్ నఱకిపోవుచు రెండవయమ్ము ముందరన్
వెలుఁగుశరమ్ముఁ గూడ దివి నిండె హరిప్రదరంబు లీగతిన్.

86


శా.

కోపాటోపవిజృంభణారుణితచక్షుష్కోణసంజాతవీ
క్షాపాతఁబులు మేనఁ జొచ్చి వెడలె న్గాఁబోలునన్నట్లు త
చ్చాపోద్భూతశరౌఘముల్ తదనుసంచారంబులై వక్షమం
చాపూర్ణంబుగ నాటి వెల్వడు సురేంద్రారాతిదేహంబునన్.

87


చ.

ధనువులు ద్రుంచి సూతుతల ధారుణీమీఁద నలంకరించి వా
హనముల సంహరించి సముదంచితకాంచనకేతనప్రపా
తన మొనరించి మై రుధిరధారలు గ్రమ్మఁగ నుంచి మించి య
ద్దనుజవిరోధి యొత్తెఁ గృతదానవదైన్యము పాంచజన్యమున్.

88


క.

మతి బ్రమసినట్లు నిశ్చే, స్థితుఁడై బెగడొందు బాణుజీవము రక్షిం
చుతలంపున ముదిరక్కసి, యతినిజనని కోటరీసమాహ్వయ యంతన్.

89


ఉ.

అంబరహీనమైనవికృతాకృతితోడుత నాభిక్రేవలన్
లంబకుచద్వయంబు గదలం బులుచెక్కుల జుంజుఱౌ శిరో
జంబులు వ్రేల నమ్ముదినిశాచరి ఖేచరియై పిశాచరీ
తిం బఱతెంచి నిల్చె వసుదేవతనూభవు సమ్ముఖంబునన్.

90


శా.

దానిం జూడఁగ రోయుచు న్విముఖుఁడై దైత్యాంతకుం డున్న నా
లోనం బాణుఁ డెడంబు గాంచి పఱచెన్ లోకుల్ ప్రమోదింపఁగా
మానం బెల్లను వీడి యాత్మనగరీమార్గంబున న్భీతిదృ
క్పౌనఃపున్యతఁ బాదఘట్టనల భూభాగంబు కంపింపఁగన్.

91


ఉ.

ఆహరిముందట న్నిలిచినట్టినిశాటియు నేగె నంత స
మ్మోహనబాణపాతమున ముంచిన తాంద్రికముం దొలంగి కా
మాహితుఁ డంప శాంభవమహాజ్వర మంఘ్రులు మస్తకంబులు
బాహువులుం ద్రిసంఖ్యలను భాసిలఁగా నతిఘోరమూర్తియై.

92


మ.

తనమీఁదం జనుదేర నవ్వుచును బద్మానేత తీవ్రజ్వరం
బును బంపన్ భయదాకృతిం గదిసి యార్పుల్ మింటనంటంగఁ దాఁ
కొన నా రెంటికి నయ్యె నాహవము సోత్కృష్టప్రతాపోగ్రత
ర్జనసంభర్జనగర్జనంబులు జగత్సంక్షోభముం జేయఁగన్.

93