పుట:అనిరుద్ధచరిత్రము.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

సారథు ల్వడిన నశ్వము లీడ్చుకొనిపోవ నందంద పడిపోవునరదములును
దైన్యఘీంకారనాదములు సేయుచుఁ బటాపంచలై పాఱెడుభద్రకరులు
నేటులఁ బడి యెదురెక్కఁజాలక వాహకులతోన పఱచెడిఘోటకములు
ననిమొన నిల్వ ధైర్యములు చాలక తల ల్వీడంగఁ బరువెత్తువీరభటులు
నగుచుఁ గాళియదమనబాహాప్రచండ, కార్ముకజ్వాలతముక్తకాండపటల
దహనకీలాకలాపసంతానమునకుఁ, దాళక పలాయనము నొందె దనుజబలము.

77


వ.

అప్పుడు.

78


ఉ.

విచ్చినయాత్మసేనఁ గని వీరుఁడు బాణుఁడు తెంపు చూపఱుల్
మెచ్చఁగఁ జేయి వీచి మరలించినఁ దద్బల మెల్ల రోషముల్
హెచ్చఁగ నొక్కట న్మరలె నేపున సైన్యయుగంబు పోరికిం
జొచ్చిన సంకులాహవము చూడ భయంకరమయ్యె నయ్యెడన్.

79


శా.

బాణుం డప్పుడు రోషరక్తముఖుఁడై బ్రహ్మాండభీమాకృతిన్
జాణూరాంతకు డాసి మామకభుజాంచద్ధాటిచే సంగర
క్షోణిం బన్నగసిద్ధకింపురుషరక్షోయక్షగంధర్వగీ
ర్వాణుల్ నిర్జితు లైరి నాయెదుట నిల్వన్ నీవు శక్తుండవే.

80


చ.

అనవుడు మందహాసముఖుఁడై హరి నీభుజశక్తి నీవె నె
మ్మనమున లజ్జ లేక పలుమాఱును మెచ్చుకొనంగ నీతియే
యనిమొన నిల్చినప్పుడు నిరర్థక మీవెడమాట లేల నాఁ
కొని భుజియింపఁబోవుచును గూరలమే లడుగంగ నేటికిన్.

81


మ.

అనునాలోననహస్తపంచశతకోద్యచ్ఛాపుఁడై నిల్చి త
క్కినయేనూఱుకరంబుల న్శరము లుత్కృష్టప్రతాపంబునం
గొనిబె ట్టేయఁగ మండలీకృతమహాకోదండముక్తార్ధచం
ద్రనిశాతాంబకపఙ్క్తిఁ ద్రుంచె నవి రాధానాయకుం డుద్ధతిన్.

82


సీ.

శతములు వేలు లక్షలు కోటు లర్బుదంబుల శరౌఘంబులఁ బోదివిపొదివి
వాయవ్యగారుడవారుణప్రముఖదివ్యేషుజాలంబుల నేసియేసి
కరవాలశూలముద్గరశక్తితోమరప్రాసాయుధంబులఁ బఱపిపఱపి
శాంబరీమాయావిడంబనం బొనరించి శిలలు నెత్రుఁ గురియఁ జేసిచేసి
యసురభర్త విజృంభించి యార్చుటయును, నడుమ నన్నింటి ఖండించి పొడ వడంచి
త్రుంచి మాయించి కడువిక్రమించి మించి, తనప్రతాపంబు చూపె నద్దనుజవైరి.

83


వ.

మఱియును.

84


ఉ.

అత్తఱి నమ్ముకుందుఁడుఁ దదర్ధసహస్రశరాసనంబులున్
గత్తిమొగంపుటమ్ములను గండ్రలు సేయుచు నుండ నంతలో