పుట:అనిరుద్ధచరిత్రము.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

శరజన్ముండు ప్రదీప్తరోషముఖుఁడై శాతాశుగశ్రేణి నా
హరిజు న్నొవ్వఁగ నేసి యార్చిన మహోగ్రాకారుఁడై పేర్చి శం
బరవిద్వేషి శిలీముఖప్రకరసంపాతంబున న్ముంచి జ
ర్జరితాంగుం డగునట్లు చేసె సుర లాశ్చర్యంబునం బొందఁగన్.

70


తే.

నారిఁ దెగనేసి యతనిమయూరవాహ, నంబు నెమ్మేన నిశితబాణములు చొనిపి
చేతులాడక యుండంగఁ జిక్కు పఱుప, నిలువలేక విశాఖుండు తొలఁగి చనియె.

71


ఉ.

చండతరప్రతాపభుజశౌర్యధురంధరుఁడైన కామపా
లుండు హలంబుచే రణములో మడియించెను గూపకర్ణకుం
భాండుల భీమహుంకరణభగ్నపయోజభవాండభాండులన్
భండనభైరవస్ఫుటకృపాణమహోజ్జ్వలబాహుదండులన్.

72


గీ.

సాంబుఁ డక్షుద్రరౌద్రావలంబుఁ డగుచు, బాణనందను నధికదోర్బలుని బలుని
గదిసి వివిధాస్త్రశస్త్రసంఘాతములను, భూచరులు ఖేచరులు మెచ్చఁ బోరిపోరి.

73


గీ.

గుఱ్ఱములఁ జంపి కేతువుఁ గూల నేసి, రథము చెక్కలు సేసి సారథిని ద్రుంచి
ఘనతరాశుగపీడితాంగునిగఁ జేయ, నసురపతినందనుఁడు పలాయనము నొందె.

74


శా.

శైనేయుండును బాణుఁడున్ రణజయోత్సాహంబు లాస్యంబులన్
బూనం గార్ముకశింజినీభవరవంబు ల్దిక్కుల న్నిండ న
స్త్రానీకక్షతజాతరక్తజలపూరార్ద్రంబు లైనట్టి నె
మ్మేను ల్పుష్పితకింశుకంబులగతి న్మీఱంగఁ బోరాడుచున్.

75


వ.

ఉండి ర ట్లవ్వాసుదేవుండు సమ్మోహనబాణపాతంబున భూతేశు పరవశుం జేసి లబ్ధవిజ
యుండై నిరుపమోత్సాహంబున నిజవదననిర్గతనిరర్గళనిష్ఠురనినాదనిర్భిన్ననిఖిల
నిర్జరాహితసైన్యం బగుపాంచజన్యంబుఁ బూరించుచు విరోధివరూధినిపయిం గవిసి
కరాధిజ్యధనుర్ముక్తశరాధిక్యఘాతంబుల నరిశిరోధినిచయంబులు నఱకి ధరాధీనంబు
సేయుచుఁ గరాళంబులగు కరవాలంబులఁ గరిహరిప్రకరవాలంబులు కీలాలంబులు హే
రాళంబులై తొరఁగఁ దునుముచు ధృఢవంతంబు లైనకుంతంబులఁ బంతంబున దంతం
బులు విఱగంబొడిచి దంతావళంబుల నంతంతన కృతాంతనిశాంతంబున కనుపుచు నస
దృశంబులగు ముసలంబులు కరిబిసరుహంబుల విసవిసం ద్రిప్పి యసురవిసరంబులు పస
చెడి వనుమతిం గలయ నసువులం బాపుచుఁ గదలమెఱుంగులు చదలం బొదలం ద్రిప్పుచు
వలదని మదంబులం గదిసి యెదురుకొని పొదువుపదాతులం గదలమెదలనియ్యక వదనం
బులు చదిసి రదనంబులు డుల్లి గుదులు గొనుచుం జావమోదుచు నంతకంతకు నతిశయం
బైనవీరావేశంబునం బ్రళయకాలరుద్రాకృతిం బేర్చి రక్తప్రవాహంబులును మాంసరా
సులును బ్రేవులప్రోవులు నెముకలగుట్టలునునై రణం బతిదారుణంబుగఁ జిత్రక్రీడ స
లుపుచుఁ బాంచజన్యజృంభన్నినాదంబులు భూనభోంతరఁబులు నిండఁ బూరించుచుండె
నపుడు.

76