పుట:అనిరుద్ధచరిత్రము.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కఱకఱినేసె వేసినను గంజదళాక్షుఁడు వాని నన్నిటిన్
నఱకి నిశాతకాండములు నాటఁగ నేసెఁ దదీయదేహమున్.

60


శా.

ఆసంరంభముఁ జూచి సైఁపక హరుం డాగ్నేయబాణంబుఁ బ్ర
జ్ఞాసామర్థ్యముతోడ నేసిన ఘనజ్వాలావృతంబై పయిన్
రా సత్యారమణుండు వారుణమహాస్త్రంబుం బ్రయోగించి సాం
ద్రాసారంబగు వారిపూరమున మాయంజేసె నత్యుద్ధతిన్.

61


ఉ.

శర్వుఁ డఖర్వగర్వమున శౌరిపయి న్మరుదంబకంబు గం
ధర్వసుపర్వపన్నగవితానము లద్భుతమంద నేసినన్
సర్వమయుండు చక్రి యది సంహరణం బొనరించె నుజ్జ్వల
త్పరత సాయకంబున విపక్షబలంబులు దల్లడిల్లఁగన్.

62


శా.

ఆటోపంబున శంకరుం డపుడు బ్రహ్మాస్త్రంబు సంధించి మౌ
ర్వీటంకార మెసంగ నంబుధియు ఘూర్ణిల్లంగ చేయ న్నిరా
ఘాటంబై చనుదేరఁ గన్గొని తదుగ్రస్ఫూర్తి వారించె దో
షాటధ్వంసితదంబకంబున నమర్త్యశ్రేణి కీర్తింపఁగన్.

63


శా.

అత్యుగ్రాకృతియైన పాశుపతదివ్యాస్త్రంబు భూతేశుఁ డౌ
ద్ధత్యం బొప్పఁగ నేసె నప్పుడు మహోద్యద్విక్రమస్ఫూర్తి నౌ
న్నత్యంబై యసమానమై వెలుఁగు శ్రీనారాయణాస్త్రంబు సం
స్తుత్యప్రాభవశాలి కృష్ణుఁ డుపమంత్రోక్తిం బ్రయోగించినన్.

64


మహాస్రగ్ధర.

రాలె న్నక్షత్రపఙ్కుల్ రహి చెడియ నహోరాత్రిరాణ్మండలంబుల్
వ్రీలెన్ దిక్కుడ్యసంధు ల్విఱిగిపడియె నుర్వీధ్రశ్భంగంబు లోలిం
దూలెన్ మేమౌఘ మత్యద్భుతజవపవనోద్ధూతధూళీసమంబై
కూలెన్ వృక్షాళి మ్రొగ్గె న్గువలయభరభృత్కుంభికుంభీనసంబుల్.

65


క.

ఖండేందుధరజనార్దన, కాండము లొండొంటిఁ దాఁకి గగనంబున ను
ద్ధండగతిఁ బోరిపోరి ప్ర, చండత హరిశరము హరునిశరముం దోలెన్.

66


తే.

తనదుదివ్యశరంబులు దైత్యదమను, చే నిరర్థక మగుటయు మానసమున
నూహదక్కి రణోత్సాహ ముజ్జగించి, యుండెఁ గళ్యాణశైలకోదండుఁ డపుడు.

67


మ.

జలజాతాక్షుఁ డవక్రవిక్రమమున న్సమ్మోహనాస్త్రంబు భూ
తలసంక్షోభము గాఁగ నేయుటయు నిద్రాపారవశ్యంబుతో
వలనొప్ప న్వృషభేంద్రుమూఁపురముపై వ్రాలెన్ హరుం డొయ్యనన్
గలధౌతాచలశృంగసంగతశరత్కాలాంబువాహాకృతిన్.

68


వ.

రుక్మిణీకుమారుండును గుమారుండును నుద్దండపుండరీకంబులవిధంబునం గడంగి కోదండ
పాండిత్యంబు భువనస్తుత్యంబుగా భండనంబు సేయుచు.

69