పుట:అనిరుద్ధచరిత్రము.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నైల్యంబైన బాణబాహుళ్యంబువలన మార్తాండమండలగోచరలక్షణంబులేమి
దుర్దినంబై యుత్కర్షవర్షాగమంబు ననుకరించియుండె నప్పుడు వేతాళప్రేతపిశా
చశాకినీఢాకినీప్రముఖభూతంబు లుత్సాహసమేతంబులై మాంసఖండంబులు కడు
పులనిండ మెక్కి రక్తపానంబు చేసిన గఱ్ఱునం ద్రేపుచు, శ్వేతతురంగచర్మంబులు
ధవళాంశుకంబులుగా ధరియించుకొనుచు, మేదఃపంకంబు రక్తజలంబులం బదనుచేసి
లేపనంబులుగాఁ దనువుల నలందికొనుచుఁ, దునుకలై పడిన యాతపత్రంబులఁ బువ్వు
లుగా నలంకరించుకొనుచు, గజకళేబరంబులు పర్యంకంబులుగాఁ బవ్వళించుచు,
ఘోటకాండంబులు క్రముకఖండంబులును, గుంజరకర్ణంబులు తాంబూలపర్ణంబులు
ను, వసలు చూర్ణంబులునుం గాఁ గలయ నమలి విడియంబులు చేసి జిహ్వావలోకనం
బులు చేసికొనుచుఁ గామినీభూతంబులతోడి సురతక్రీడావిలాసంబులం జొక్కుచు,
గంధర్వపిశాచంబులు సేయు గార్దభస్వరసంగీతంబులకు నానందంబు నొంది కరితురగ
నరమాంసంబులు త్యాగంబు లిచ్చుచో వారల గానంబులకుఁ దాముం దమవదాన్యతా
సౌందర్యవిశేషంబులకు వారును శిరఃకంపంబులు చేసి మెచ్చుకొనుచు, నివ్విధంబున
వివిధభోగంబులం దనిసి యుభయబలంబులం బొగడుకొనుచుం దాండవంబులు సలుపు
నమ్మహాకోలాహలంబువలన సంగరప్రకారంబు ఘోరంబై వర్తిల్లె నందు.

55


చ.

హరిహరులిద్దఱుం గదిసి యాహవకేళి యొనర్చి రుధ్ధతిన్
సురనికరంబు లబ్రపడి చూడఁగ శార్ఙ్గపినాకచాపముల్
కరములఁ బూని యెండొరులకంఠభుజోరులలాటమర్మముల్
గురుతరచండకాండములఁ గ్రుచ్చుచు రోషమహోగ్రమూర్తులై.

56


మ.

హరుఁ డాకర్ణధనుర్గుణుం డగుచు బాహావిక్రమక్రీడ ని
ష్ఠురనారాచపరంపర ల్వఱపిన న్సొంపారునెమ్మోమునన్
దరహాసద్యుతి వింతయై నిగుడఁ బద్మామానినీజాని భీ
కరబాణంబుల వానినన్నిటి వెస న్ఖండించె నొక్కుమ్మడిన్.

57


క.

భగవంతుండగు శంభుఁడు, గగనదిశాపూరితముగఁ గడుఁదీవ్రతతో
నగణితవిశిఖౌఘంబులు, నిగిడించి మహోగ్రతమము నిండఁగఁ జేసెన్.

58


మ.

గరుడాంకుం డరుణాంతనేత్రుఁ డగుచు న్గాలాగ్నిసంకాశభీ
కరకాండాళిఁ దదంధకార మడఁగంగాఁ జేసె నాతీవ్రతం
బరివేషస్థితి నుండె విల్లు రవిబింబస్ఫూర్తి నొప్పె న్ముఖాం
బురుహం బుగ్రమయూఖలీలఁ దనరె న్బుంఖానుపుంఖాస్త్రముల్.

59


చ.

మఱియు ననేకబాణములు మర్మము లంటఁగ నేసి హుంకృతుల్
నెఱప లలాటలోచనుఁడు నిష్ఠురశాతశిలీముఖావళుల్