పుట:అనిరుద్ధచరిత్రము.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రాజిల్లు తులసీపయోజాక్షమాలిక ల్ఫలశలాటులతోడిగెలలు గాఁగ
హరినామసంకీర్తనాలాపనినదంబు శుకశారికాపికస్ఫూర్తి గాఁగ
భసితలిప్తాంగరుచి సితప్రభలు నిగుడ, గహ్వరీభాగవిహరణగతి విలాస
జంగమాకారకల్పభూజంబుభాతి, నాకముననుండి విచ్చేసె నారదుండు.

7


చ.

నయనయుగంబునందుఁ గరుణారసవృష్టి చెలంగ భూషణో
దయరుచి చంచలాలతవిధంబునఁ బెంపు రహింప సాధుసం
చయముఖచాతకంబులకు సౌఖ్య మొసంగ సభానభస్థలిన్
నయగుణశోభియై వెలయు నందతనూభవనీలమేఘుమున్.

8


గీ.

కాంచి యానందహృదయుఁడై కదియవచ్చు, సంయమీంద్రునిఁ గని లేచి సపరివారుఁ
డగుచుఁ బ్రణమిల్లి కనకసింహాసనస్థుఁ, జేసి యర్ఘ్యాదివిధులఁ బూజించునపుడు.

9


క.

శ్రీరస్తు కుశలమస్తు మ, నోరథసంసిద్ధిరస్తు నుత్యశ్రీమ
న్నారాయణభవతే యని, సారెకు దీవించి పలికె జలజాక్షునితోన్.

10


క.

తలిదండ్రు లన్నదమ్ములుఁ, గులసతులును బుత్త్రపౌత్త్రకోటియు నాప్తుల్
చెలులుం జుట్టములును భ్ళ, త్యులుఁ బౌరులు సుఖుల రగుచునున్నారుగదా.

11


వ.

అనిన నమ్ముకుందుండు మందస్మితముఖారవిందుం డగుచు శతానందనందనున కి ట్లనియె.

12


గీ.

కమలజాత్మజ మీయనుగ్రహమువలన, వర్తమానమునందు సర్వము శుభంబు
భావికాలంబునకును శుభంబు నిజము, తావకాగమనంబు నిదానమగుట.

13


చ.

పరమమునీంద్ర మీచరణపద్మపవిత్రపరాగలేశ మె
వ్వరిగృహసీమనుం బొరయు వారిపురాకృతపుణ్య మెట్టిదో
దురితములన్నియుం దొలఁగుఁ దోడనె భాగ్యము లెల్లఁ జేకుఱున్
నిరుపమమోక్షలక్ష్మియును నిక్కముగా లభియించు వారికిన్.

14


వ.

అని మఱియుఁ దదీయమహిమానురూపంబు లగుమధురాలాపంబులు పలుకుచుండి
తదనంతరంబ, ప్రసంగవశంబున నిట్లనియె.

15


శా.

అయ్యా మాయనిరుద్ధుఁ డెం దరిగెనో యాకస్మికం బౌటచే
నయ్యైచోటులఁ జూడబంచితిమి గోరంతైన నవ్వార్త లే
దయ్యె న్వానిఁ దలంచి మామకజనం బత్యంతచింతామయం
బ య్యిట్లున్నది సేయఁగావలయు కార్యం బానతీయ న్దగున్.

16


మ.

అనినం గృష్ణునిమోముఁ జూచి దరహాసాంచన్ముఖాంభోజుఁడై
మునినాథాగ్రణి పల్కె సర్వమునకు న్మూలంబవై సాక్షివై
పెనుప న్మన్పఁగఁ గర్తవై ప్రభుఁడవై పెంపొందియు న్నీ వెఱుం
గనిచందంబున నన్నుఁ గార్య మడుగంగా నెంతధన్యుండనో.

17


వ.

నే నెఱింగినయర్థంబు విన్నవించెద నవధరింపుము.

18