పుట:అనిరుద్ధచరిత్రము.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

వీడు ముఖకాంతి వసివాళ్లు వాడు మేను, నెండు కెమ్మోవి బాష్పము ల్నిండు కన్ను
లామనోవ్యధఁ గనుఁగొన్న రామరామ, జగతిఁ బగవారికైనను జాలి గాదె.

122


వ.

ఇ ట్లమ్మనోహరాంగి విరహానలసంతప్తమానహృదయయై యుండె నంత నిక్కడ.

123


మ.

అనిరుద్ధుండు పురంబులోపలను లేఁ డాశ్చర్య మేమో కదా
యనుకొంచు న్వసుదేవముఖ్యులు విచారాక్రాంతచేతస్కులై
యనుమానించుచు భృత్యకోటులను శోధ్యస్థానము ల్చూడఁ బం
చిన వా రెందును గానమంచు మరలం జేరంగ నిర్యత్నులై.

124


ఉ.

తల్లియుఁ దండ్రియు బహువిధంబుల ఖేదము నొందుచుండఁగాఁ
బల్లవకోమలాంగి యగుభార్య వియోగముచేఁ గృశింపఁగా
నెల్లప్రజ ల్తదీయవ్యధ లెంచి విచారము నొందు గోపికా
వల్లభుఁ డంతయు న్హృదయవారిజమందు నెఱింగియుండియున్.

125


క.

కానున్న కార్య మయ్యెడు, నే నిప్పుడు వీరితోడ నిజముగఁ దెలుపం
గా నేల యనుచు మాయా, మానుషవేషుండు కార్యమతిచే నుండెన్.

126


వ.

అని శుకుండు పలికె ననిన నటమీఁదటికథావృత్తాంతం బెఱింగింపు మనుటయు.

127


ఉ.

అండభవప్రకాండగమనాదరపండితపుండరీకమా
ర్తండదిశేభతుండభుజదండధృతాంబుజజాండభాండరు
ఙ్మండలమూర్తికుండలిపదుండనచండతరైకకాండమా
ర్కొండరమేశరత్నమయకుండలమండితగండమండలా.

128


క.

శ్రితరాజహంసయోగా, యతిదివ్యవిలోకనాక్షయాగమహితగా
శ్రితరాజహంసయోగా, యతదివ్యవిలోకనాక్షయాగమహితగా.

129


స్రగ్ధర.

ప్రతాపవద్రిపుద్రుమప్రభంజనప్రభంజనా
క్రతుక్రియాచరిష్టమౌనిరంజనానిరంజనా
యతిస్థిరత్రిలోకభోగదాకరాగదాకరా
ప్రతిష్ఠితాంబుధిభ్రమద్ధరాధరాధరాధరా.

130


గద్య.

ఇది శ్రీమంగళాచలనృసింహకృపాప్రసాదసంప్రాప్తవిద్యావైభవ కనుపర్తిరా
యనమంత్రితనూభవ సుజనహితకృత్య నిత్యాబ్బయామాత్య ప్రణీతంబైన యనిరుద్ధ
చరిత్రం బను మహాప్రబంధంబునందుఁ దృతీయాశ్వాసము.