పుట:అనిరుద్ధచరిత్రము.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

హతశేషులు భయవిహ్వల, మతులై యేతెంచి కదనమార్గముఁ దెలుపన్
వితతంబుగ నాజ్యాహుతి, నతిశయజాజ్జ్వల్యమానమగువహ్నిక్రియన్.

112


వ.

బాణుం డక్షుద్రరౌద్రముద్రాసమున్నిద్రనేత్రకోణుండును, నాహనాటోపధురీణుం
డునునై కదిసె నయ్యనిరుద్ధుండును, సమరసన్నద్ధుండును, భుజావష్టంభసమృద్ధుండు
నునై యతనితోడం దలపడియె న ట్లయ్యిరువురును గంఠీరవంబులచందంబున, బెబ్బు
లులతెఱంగున, మత్తమాతంగంబులకైవడి, శరభంబులవిధంబున, గండభేరుండంబుల
చాట్పున, రోషావేశంబులు రెట్టింప, జయకాంక్షలు ముప్పిరిగొన, తర్జనభర్జనంబుల
గర్జిల్లుచు, నన్యోన్యముష్టిఘాతంబులను, బరస్పరపాదపార్థిప్రహారంబులను, నితరేత
రమర్మభేదంబులను, బాహాబాహియుఁ గేశాకేశియుంగాఁ బెనంగ, నయ్యిరువురకున్
రణంబు దారుణంబై చెల్లుచుండె నప్పుఁ డాఋశ్యకేతు నుద్దేశించి యశరీరవాణి యి
ట్లనియె.

113


క.

యదువంశతిలక వీనికి, విధి జయకాలంబు పెనఁగ నేటికి హరిచే
నొదవు నపజయము వీనికిఁ, గదియు శుభము నీకు నచిరకాలమునందున్.

114


గీ.

అనియె నమ్మాట వీనులయందుఁ దగిలి, రిపుమహీరుహవిదళనోద్వృత్తిఁ గెరలు
యదుకులాగ్రణి యాగ్రహోదగ్రకరిని, నిష్ఠురాంకుశభూతమై నిలువరించె.

115


వ.

అప్పుడు.

116


ఉ.

బాహుబలోద్ధతిం బ్రళయభైరవుభంగిఁ బరాక్రమించి య
వ్యాహతలీల వాని బెగడం దఁగఁజేసియుఁ గార్య మెంచి దే
వాహితుచేతఁ బట్టువడె నాహనుమంతుఁడు శక్రజిత్తుచే
నాహవభూమిఁ బట్టువడినట్లు ప్రశాంతనిజోగ్రకోపుఁడై.

117


క.

వనితాసంపర్కంబున, ననిరుద్ధు నిరుద్ధుఁ జేసె నరివర్గంబున్
వనితాసంపర్కంబున, ననిరుద్ధు నిరుద్ధుఁ జేయు నరివర్గంబున్.

118


వ.

ఇవ్విధంబున.

119


గీ.

పట్టుకొని యాఁపు సేయించె బాణుఁ డతని, నపుడు తద్భంగజనితఖేదాంధకార
భిన్నహృదయారవిందయై కేవలంబు, నయ్యుషాంగన సంతాప మందుచుండ.

120


సీ.

వేకువఁ గాంతిదప్పినచంద్రబింబంబువిధమున నెమ్మోము వెల్లఁబోయెఁ
బగలింటిసెగలచే సొగటొందు పూఁదీఁగెవడువున నెమ్మేను వాడుదెంచె
మునిమాపుజిగిఁ దొలఁగిన తమ్మిఱేకులరీతిఁ గన్నుల దైన్యరేఖఁ దోఁచెఁ
దగురేయి హిమ మంటు తాంబూలదళముల చెలువున చెక్కిళ్లు చెమట దోఁగెఁ
జిన్నఁబోవుచుఁ జెక్కిటఁ జేయిఁ జేర్చి, యాటపాటలపై వేడ్క లన్ని మఱచి
విరహసంతాపవేదన నేఁగుచుండె, నేమి చెప్పుదు నయ్యుషాకోమలాంగి.

121