పుట:అనిరుద్ధచరిత్రము.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నలపుసొల్పులఁ బల్కు పలుకులు వీనుల వినుటకు నొకవింతవేడ్క యొదవఁ
గమ్మనివాససల్ గ్రమ్మువాతెరతేనె లానుట కొకవింతయాసఁ గొలుప
మెత్తనై మెఱుఁ గెక్కిన మేను కౌఁగి, లింత కొకవింతముచ్చట సంతరింప
గర్భిణీరతజనితసౌఖ్యమునఁ జొక్కు, చుండె నవ్వేళ యదువంశమండనుండు.

102


వ.

అంత.

103


ఉ.

మందిరపాలికాజనులు మానినిఁ గన్గొని గర్భభార
చందమున న్ఘటించెనని సంశయము న్భయము న్విచారమున్
డెందమునన్ జనింపఁగ వడిం బఱదెంచి రహస్యరీతి సం
క్రందనవైరితోడ వివరంబున నిట్లని పల్కి రత్తఱిన్.

104


చ.

చెలఁగి భవత్తనూభవ వసించుగృహాంతము పోతుటీఁగెయున్
బొలయక యుండఁ గాఁచుకొని పూనిక నుండఁగ నేమిమాయయో
తెలియఁగఁజాల మమ్మదవతీమణి గర్భభరంబుఁ దాల్చె ని
న్నెళవు గృహంబులోపలను నిక్కముగా వివరింపఁగాఁదగున్.

105


వ.

అని విన్నవించిన.

106


ఉ.

ఖేదము క్రోధము న్మదినిఁ గీల్కొన బాహుబలాఢ్యులైన క్ర
వ్యాదులఁ గొందఱ న్గని యుషాంగన కేళిశిరోగృహాంతరం
బాదిగ నంతటం గలయ నారసి యిక్కొఱగామి దుర్మదో
న్మాదతఁ జేసినట్టిఖలు నాకడకుం గొనిరండు తీవ్రతన్.

107


క.

అని పలికిన రోషానల, జనితస్ఫుటనిస్ఫులింగచయభాతిని లో
చనరక్తదీప్తు లడరఁగ, దనుజులు వడి నేగుదెంచి తత్సౌధమునన్.

108


మ.

అమలేందూపలవేదికాస్థలమునం దాసీనుఁడై యయ్యుషా
రమణీరత్నముతోడ నక్షనిపుణారంభంబునం ద్యూతసం
భ్రమకేళీరతి నున్న పంచశరసామ్రాజ్యాధిపత్యప్రసి
ద్ధమనోజ్ఞప్రతిభాసమృద్ధు ననిరుద్ధుం గాంచి క్రోధాత్ములై.

109


మ.

భయదాహంకృతిఁ జక్రముద్గరగదాప్రాసాదిహేతిచ్ఛటో
దయరుగ్జాలదగద్ధగ ల్నిగుడ నాదైత్యు ల్విజృంభింప ని
ర్భయుఁడై యాగ్రహవృత్తి నుగ్రపరిఘప్రాంచద్భుజాదండుఁ డై
లయకాలాంతకుభంగి వారలపయి న్లంఘించి ధట్టించుచున్.

110


చ.

తలలు పగిల్చి కంఠము లుదగ్రతఁ ద్రుంచి భుజప్రదేశముల్
నలినలి గాఁగ మోది నిటలంబులు వ్రక్కలు సేసి దంతముల్
డులిచి యురస్థలు ల్చదిపి డొక్కలు చించి భయంకరాకృతిన్
సలిపె రణంబు రక్కసులు చచ్చియు నొచ్చియు విచ్చి పాఱఁగన్.

111