పుట:అనిరుద్ధచరిత్రము.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

అనిరుద్ధచరిత్రము

తృతీయాశ్వాసము




వత్సవైజయంతీ
శ్రీవనితాకౌస్తుభాదిశృంగారవిలా
సావహవక్షస్థలభువ
నావనసంభ్రమణమంగళాచలరమణా.

1


తే.

అవధరింపుము శౌనకుం డాదియైన, మునివరేణ్యులతోడ నిట్లనియె సూతుఁ
డాపరిక్షిన్మహారాజు నాదరమునఁ, జూచి విజ్ఞాననిధియైన శుకుఁడు పలికె.

2


వ.

అంత.

3


సీ.

వినతాతనూజకేతనకళాసంప్రాప్తజనితానురాగవిస్తార మనఁగ
నపరదిగ్జలధినాయకసమర్పితఫుల్లహల్లకమాల్యప్రభాంక మనఁగ
సమరసన్నాహరక్షశ్ఛటావిదళనకోపాగ్నికీలాకలాప మనఁగ
దత్కాలతాండవోద్ధతేమహాబిలకేశవరమణీమకుటరుగ్వ్యాప్తి యనఁగ
భాపరిగ్రహణార్థసమీపవర్త, గంధవహబంధుతేజఃప్రకాశ మనఁగ
నస్తశైలాగ్రమున భాస్వదరుణదీప్తి, మండలంబయ్యె మార్తాండమండలంబు.

4


చ.

ఇనుఁడు కరంబులం బొదివి యింపుగ సంగమ మాచరింపఁ బ
ద్మినివదనంబున న్నగవు మీఱ వికాసవిలాస మూని లో
నన ద్రవ ముబ్బిసొక్కి నయనంబులు మూయుచు నిద్రఁ జెందెనో
యన ముకుళీభవించె దివసాంతమునందుఁ బయోజషండముల్.

5


చ.

ఇనునకుఁ బద్మినీకువలయేక్షణపై మది నెంతమోహమో
తను నెడఁబాసి యెంతపరితాపము నొందునొ నాల్గుయామముల్
చనిన పునస్సమాగమము సంఘటనంబని తెల్పుమంచుఁ దాఁ
బనిచె సరస్యుపాంతతరుపఙ్క్తులనీడలపేరిదూతలన్.

6