పుట:అనిరుద్ధచరిత్రము.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

కమలినిపయిఁ గూరిమిచే, రమియించెంగా నన శుచిరాహిత్యముగా
నమరం దాన మొనర్చిన, క్రమమునఁ గమలాప్తుఁ డపరకంధిం గ్రుంకెన్.

7


తే.

అంబురుహసంభవాండగేహాంతరమున, దీపకంబైనభాస్కరదీపకళిక
యవలిదిక్కునఁ జేరినయంధకార, బంధురం బయ్యె దశదిశాభాగమునను.

8


చ.

అనయము జీవకోటికి భయంబుగ దారులు గట్టి కొల్లఁ గై
కొన సెలవిచ్చెఁనజోరులకుఁనగూర్మినపరాంగనలన్ రమింపఁగాఁ
బనిచె విటావలి న్భువనబంధుఁడు లేనియరాజకంబుచేఁ
దనరపమై చరి౦చె వసుధాస్థలి చీఁకటిపాలెగాఁ డొగిన్.

9


సీ.

ఆదట దీరంగ నంభోజగంధులబటువుగుబ్బలమీఁదఁ బ్రాఁకి ప్రాఁకి
కోరిక ఫలియింపఁ గుంభీంద్రయానల యధరపల్లవముల నాని యాని
ముచ్చట దీఱఁగ ముకురబింబాస్యల నిద్దంపుఁజెక్కిళ్లు నివిరి నివిరి
యభిలాష దనియంగ హరినీలవేణుల మవ్వంపుఁగొప్పులు దువ్వి దువ్వి
యంధకారాఖ్యకామాంధుఁ డన్యసతుల, నలముకొనుచుండెఁ గాని దోషానుభవము
తపనకరఘాతనెపమునఁ దాఁకుననుచు, నెఱుఁగలేఁడయ్యెఁ దామసుం డేమి యెఱుఁగు.

10


క.

జీవనమె జీవనంబై, యీవిధముననున్న మమ్ము నెడచేసె నయో
దైవమని భేద మొందెడు, కైవడి నమరెన్ రథాంగకరుణరవంబుల్.

11


సీ.

వరునిరాకకు నిశావాససజ్జిక మింటఁ బఱిచిన వెన్నెలపాను పనఁగ
గగనకేశునిమస్తకమున దిక్పాలురు పూజ చేసినయట్టి పువ్వు లనఁగ
దట్టమై తిరుగుచున్నట్టి ఖేచరకోటి ముత్యాలగొడుగులమొత్త మనఁగ
దమము గర్వ మడంప దండెత్తి రేరాజు ముందర నడపించుమూఁక యనఁగఁ
గెరలి మరుఁ డూర్ధ్వలోకము ల్గెలువ పింజ, పింజఁ గొన నేయు పుష్పాస్త్రవితతియనఁగఁ
గన్నులకుఁ బండుగై తోఁచె గగనభాగ, మండనంబైన తారకామండలంబు.

12


సీ.

అధిపలాలితలైన స్వాధీనపతికలు నలుక దీఱిన కలహాంతరితలు
వరునిరాకలు గోరు వాసకసజ్జిక ల్పతివంచకలు విప్రలబ్ధసతులు
పొరుగూర విభులున్న ప్రోషితభర్తృక ల్కలహించి విడనాడు ఖండితలును
ధవులు వేగంబ రాని విరహోత్కంఠిత ల్సంకేతగత లభిసారికలును
రమణసంభోగవిప్రలంభముల నొంది, రష్టవిధనాయికలు నిట్టు లతిశయముగఁ
గువలయానందభావానుగుణ్యకళల, విలసితంబైన యన్నిశావేళయందు.

13


శా.

మందాక్షాంచలము ల్గ్రమించి కులధర్మస్రోతసు ల్దాఁటి త
న్నిందాభీతి మహాటవు ల్గడచి పొందె న్బుంశ్చలీకోటి ని
స్సందేహస్ఫురణ న్భుజంగనిపసత్సాంకేతికస్థానముల్
కందర్పుం డనుమంత్రదేవత సమాకర్షింపఁగా నయ్యెడన్.

14