పుట:అనిరుద్ధచరిత్రము.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

అనుచుఁ జెలి పల్కు ఖేదవాక్యములతోన, వేఁడినిట్టూర్పుగాడ్పు లావిర్భవించె
నూరుపులతోన కన్నీరు లేఱులయ్యె, నశ్రువులతోన పరవశంబయ్యె మేను.

142


తే.

అతివ దురవస్థఁ గనుఁగొని యాత్మ గలఁగి, యువతి వివశత దీఱంగ నుపచరించి
యనుగుణం బైనమధురవాక్యములమనసుఁ, జల్లజేయుచునుండె నాసమయమునను.

143


వ.

అని శుకుండు పలికె ననినఁ దదనంతరవృత్తాంతం బెట్లయ్యె నెఱింగింపుమనుటయు.

144


చ.

చతురవిహారహారమణిసాంద్రలసద్భుజమధ్య మధ్యని
ర్జితమృగరాజ రాజసరసీరుహమశ్రసునేత్ర నేత్రశో
భితవసుభద్ర భద్రగజభీతిహరాదనభావ భావజా
హితమతివాస వాసవమణీద్ధరుచిస్ఫుటకేశ కేశవా.

145


క.

దురితపరితాపపరిహర, చరితాభరితాదరాత్మశంకరహృదయ
స్మరితహరిదశ్వకోటీ, స్ఫురితాస్ఫురితారినినదసంశ్రుతివినుతా.

146


భుజంగప్రయాతము.

మహామంగళాకారమాస్నేహమోహా
వహాభూధరోత్సాహవారాహదేహా
గుహాత్మజ్ఞ సాంచిత్య ఘోరాఘదాహా
మహామంగళాద్రి ప్రమావత్సుగేహా.

147


గద్య.

ఇది శ్రీమంగళాచలనృసింహకృపాప్రసాదసంప్రాప్తవిద్యావైభవ కనుపర్తిరా
యనమంత్రితనూభవ సుజనహితకృత్య నిత్యాబ్బయామాత్య ప్రణీతంబైన యనిరుద్ధ
చరిత్రం బను మహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము.