పుట:అనిరుద్ధచరిత్రము.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఇత్తెఱంగున నక్కోకకుచ తనరుచిరావలోకనంబులు పరమశాంతుని హృదయంబునం
బోలె దత్సౌందర్యలహరీమగ్నంబై యానందలహరిఁ దేలుచున్న నెట్టకేలకు మరలించి
కుంభాండకతనూభవ ముఖాంబుజంబున నిలిపి యిట్లనియె.

135


ఉ.

వీఁడు గదమ్మ నానిదురవేళ ఘటించినవాఁడు కోమలీ
వీఁడు గదమ్మ పంచశరవిద్యలు చూపినవాఁడు తొయ్యలీ
వీఁడు గదమ్మ నాహృదయవిత్తము నాచినవాఁడు యుగ్మలీ
వీఁడు గదమ్మ యీవిరహవేదనఁ గొల్పినవాఁడు నెచ్చెలీ.

136


క.

నిన్నుండి వీనిరూపముఁ, గన్నులఁ జూడంగఁగలిగెఁగా నేటికినో
క్రొన్ననఁ బోడిరొ నీఋణ, మెన్నిభవంబులకునైన నీఁగంగలనే.

137


వ.

మేఘాగమనంబునకు నెదురుచూచుచున్న మయూరంబువిధంబున, సంపూర్ణపూర్ణి
మాచంద్రబింబోదయంబుఁ గోరుచున్న చకోరంబుకైవడి, స్వాతివర్షంబు నపేక్షించు
చున్న మౌక్తికశుక్తిచందంబున, హృదయంగమాకారుండైన యీ రాజకుమారుతోడి
సంభోగంబునకు నాహృదయంబు నిరంతరవ్యాపారంబై యభిలషించుచున్నయది.
దురంతంబైన విరహపారావారంబు నీఁదవశంబు గాక మునుంగుచున్న నాకుం దెప్ప
విధంబున నాభాగ్యవశంబున నీవు సంఘడించితివి. ఏయుపాయంబుననైన నీతనిం
దెచ్చి మామకమనోరథం బీడేర్చి ప్రాణదానంబు సేయవలయు నిది యనుచితంబని విచా
రించెదవేని నాకర్ణింపుము.

138


సీ.

కలలోనఁ గన్నవార్తల కింతవలవంత కేమికారణమని యెంచుకొంటి
నాయున్కి గనుఁగొన్న నాసాటివారిలో నిది లాఘవంబని యెంచుకొంటి
మదిలోన నీ మాట మఱచియుండెదఁ గాక యెంత లేదని బుద్ధి పెంచుకొంటి
గుఱు తెఱుఁగనివానికూర్మి కాశించిన నేమిఫలంబని యెంచుకొంటి
నేమి సేయుదు వానికళామనోజ్ఞ, వదనపూర్ణేందుచంద్రికావ్యాప్తిఁ జంద్ర
కాంతరత్నంబుకైవడిఁ గరఁగియున్న, భావమున ధైర్య మింతైనఁ బాదుకొనదు.

139


ఉ.

కావునఁ బక్వబింబఫలకాంతులతోఁ దులఁదూఁగు వానికె
మ్మోవిసుధారసంబు మది మోహము దీఱఁగ నానకుండినన్
భావభవజ్వరజ్వలనబంధురతీవ్రశిఖాకలాపతా
పావహమైన నాదుహృదయవ్యధ దీఱునె యెన్నిభంగులన్.

140


మ.

కలికీ మాటలు వేయు నేమిటికి నీకాయంబుతో వానితోఁ
గలయ న్భాగ్యము గల్గకున్న విభునింగాఁ జేయుమీ వీని రాఁ
గలజన్మంబున నంచు బ్రహ్మకు నమస్కారంబుఁ గావించి య
వ్వల దేహాంతరతీవ్రలబ్ధి కుచితవ్యాపారముం జేసెదన్.

141