పుట:అనిరుద్ధచరిత్రము.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

త్రిజగన్మోహనరూపవైభవుని సాంద్రీభూతకీర్తింబ్రతా
పజయార్కున్ రతికామినీకుచతటీపాటీరముద్రాకరాం
బుజునిం గంఠవిలంబమానవిలసన్ముక్తామణిమాలికా
వ్రజుని న్మారటకృష్ణమూర్తి యగునీప్రద్యుమ్ను నీక్షింపుమా.

127


ఉ.

చక్కనివారిలో మొదలిచక్కనివాడగుతండ్రికన్ననుం
జక్కనివాఁడు భవ్యగుణసంపదఁదాతను బోలువాఁడు పెం
పెక్కినకీర్తివాఁడు కమలేక్షణపౌత్రుఁడు శంబరారికిన్
మక్కువనందనుం డితఁడు మానవతీ యనిరుద్ధుఁ జూడుమా.

128


వ.

అని యివ్విధంబున నవ్వనిత యవ్విలాసినీతిలకంబునకు భూలోకపురుషపుంగవుల
వేర్వేఱ వివరించుచు ననిరుద్ధకుమారపర్యంతంబునుం జూపునప్పుడు.

129


సీ.

అంగవంగకళింగబంగాళనృపులపై సారంగగతులచేఁ జౌకళింప
గౌళనేపాళపాంచాలభూభుజులపై నవతటిల్లతరేఖ నవఘళించి
మగధమత్స్యమరాటమద్రనాయకులపై మత్స్యపుటంబులమహిమ నిగిడి
యాదవవృష్టిభోజాంధకశ్రేణిపై యలతేఁటిదాఁటులనెళవు చూపి
మఱియు గోపాలదేవమన్మథులమీఁద, బొట్టెకోలలగతి దాఁకి మిట్టి తిరిగి
వ్రాలి యనిరుద్ధునందుఁ గ్రొవ్వాఁడిచిలుకు, ములికియై నాటె కలకంఠి బెళుకుఁజూపు.

130


చ.

కనుగొనఁగానె జల్లుమనెఁ గైరవలోచనగుండె దేహమె
ల్లను బులకించెఁ గన్నుల జలంబులు జాలయి పాఱె మోమునం
బెనఁగొని దైన్యరేఖ నవనీతగతిం గరఁగె న్మనంబు ము
న్పనుపడియున్న తాపశిఖి ప్రజ్వలభావము నొందె వింతయై.

131


ఉ.

కన్నులఱెప్ప లాఁగనివికాసపుఁజూపును మౌనముద్రతో
నున్నమొగంబు నిశ్చలత నొప్పుశరీరముగాఁ బటంబుపై
నున్నతలీల వ్రాసినప్రియుం గని పొక్కునఁ దాను నట్లయై
చిన్నెలు దక్కియుండె సఖి చేసినజంత్రపుబొమ్మకైవడిన్.

132


తే.

అతనిలావణ్యసరసియం దతివచూపు, నిండుకొని బారులయ్యెను గండుమీలు
నుప్పతిలి గుంపులయ్యె నీలోత్పలములు, పాదుకొని మూఁకలయ్యెఁ బుష్పంధయములు.

133


ఉ.

చూచుఁ జలించి పైఁబడఁగఁ జూచుఁ గుచంబుల నొత్తిపట్టఁగాఁ
జూచు నఖాలి మైఁ జెనకఁ జూచు సుధాధరబింబ మానఁగాఁ
జూచుఁ గవుంగిటం బెనఁగఁజూచుఁ గపోలము ముద్దు పెట్టఁగాఁ
జూచు లతాంగి యమ్మదనసుందరరూపముఁ జూచి భ్రాంతితోన్.

134