పుట:అనిరుద్ధచరిత్రము.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

గంధేభేంద్రసమానయాన తెలియంగాఁ జూడు వీనిం జతు
ష్కంధిప్రావృతమేదినీవలయవిశ్రాంతప్రతాపాబ్జినీ
బంధుం యుద్ధకృశప్రసిద్ధబలవత్ప్రత్యర్థిరాజన్యని
ర్బంధుం సాంబశివార్చనానుగుణసంబంధుం జరాసంధునిన్.

120


శా.

చౌదంతి న్యుగదంతిగాఁ గొని సహస్రాక్షుండు యుగ్మాక్షుఁడై
మోదం బొప్ప ధర న్జరించుగతిఁ బెంపు న్సొంపు సంధిల్లగా
వేదండోత్తమవాహుఁడై వెలయు నీవీరుం బ్రభాభాసమా
నాదిత్యుం భగదత్తుఁ జూడుము నితంబాభోగహేమాంశుకా.

121


శా.

పూజ్యంబై తగుకౌరవాన్వయమునం బాల్పొంద జన్మించి సా
మ్రాజ్యం బేలుసుయోధనుం దెలివి మీఱం జూడు మొక్కింతది
వ్యజ్యోతిర్మయసాధను న్విహితబాహాదండకోదండదం
డజ్యానిర్యదఖండచండతరకాండప్రోద్భటాయోధనున్.

122


ఉ.

తోయజగంధి చూడుము విధూతతమోగుణదివ్యతేజుఁడై
ధీయుతమూర్తియై వసుమతి న్విహరించు పయోజబాంధవుం
డీయితఁ డంచు నెంచఁదగుఠీవి వెలుంగుచునున్నవాని రా
ధేయుని దానవైభవవిధేయుని వర్ణితభాగధేయునిన్.

123


సీ.

జయముచే ధర్మనిశ్చయముచే వైభవోదయముచేఁ దగువాఁడు ధర్మజుండు
దిటముచే భుజబలోత్కటముచే రణజయాగ్భటముచేఁ బెంపొందు పవనజుండు
యుక్తిచే విబుధానురక్తిచే వరబాణశక్తిచే నధికుండు సవ్యసాచి
బుద్ధిచే నతులప్రసిద్ధిచే భాగ్యాభివృద్ధిచేఁ బొగడొంది వెలయు నకులుఁ
డసమశరసమసుకుమారరసమనోహ, రావతారుండు సహదేవుఁ డంబుజాక్షి
వీర లేవురు పాండవవీరవరులు, పెంపు సొంపార నిటు విలోకింపవమ్మ.

124


చ.

సుమహితధాళధళ్యరుచిసుందరకోమలవిగ్రహంబుపై
నమలతరేంద్రనీలనికరాసితవర్ణఘనాంశుకంబుతో
నమరిన నీలమేఘరజతాచ రాజముఁ బోలు రేవతీ
రమణునిఁ జూడవమ్మ బలరామునిఁ గోమలపాటలాధరా.

125


సీ.

లలితరేఖాత్రయీకలితకంఠమువాఁడు ధవళవిస్తారనేత్రములవాఁడు
ఆజానులంబిబాహావిలాసమువాఁడు కమనీయనీలాలకములవాఁడు
హారశోభితవిశాలోరస్థలమువాఁడు తరుణారుణాంఘ్రిపద్మములవాఁడు
మహనీయనీలకోమలశరీరమువాఁడు నవదరస్మితసుధాననమువాఁడు
సరసకల్యాణగుణవిశేషములవాఁడు, మదనశతకోటిసౌందర్యమహిమవాఁడు
దేవకీనందనుఁడు కృష్ణదేవుఁ డితఁడు, వనిత గనుఁగొమ్ము నేత్రోత్సవంబు గాఁగ.

126