పుట:అనిరుద్ధచరిత్రము.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

భవనాలంకృతనూత్నరత్నరుచిసంపన్నంబు రాజీవకై
రవకల్హారమరందపానమధుపవ్రాతస్వనోదారభో
గవతీతీరమనోహరం బఖిలభాగ్యశ్రీనివాసంబు నై
ప్రవణంబొందినయట్టిలోకము గదా పాతాళ మబ్జాననా.

111


వ.

తద్భువననివాసు లైన నాగపుంగవుల వివరించెదం గనుంగొనుము.

112


శా.

పారావారవిహారియైనహరికిం బర్యంకమై ద్వీపశై
లారణ్యాంబు నిధిప్రయుక్తమహనీయక్షోణికి న్నిల్వనా
ధారంబై యురగేంద్రలోకమునకుం దా సార్వభౌమాంకుఁడై
శ్రీ రంజిల్లు ఫణాసహస్రకలితు న్శేషు న్విలోకింపుమా.

113


చ.

అతులసుధాపయోధిమధనావసరంబున మందరాద్రి క
ప్రతిహతలీల నావరణపాశలతాకృతిఁ దాల్చి దానవా
హితులకు వాంఛికంబు ఫలియింపఁగఁజేసిన కీర్తిశాలి భా
సితసితదీర్ఘదేహు ఫణిశేఖరు వాసుకిఁ జూడు మీతనిన్.

114


వ.

అని మఱియుం దక్షకకర్కోటకప్రముఖులైన చక్షుశవశ్రేష్ఠుల రూపనామంబు
లు చక్షుశ్శ్రవంబులకు గోచరంబులుగా దృష్టంబును శ్రుతంబును గావించిన దదీయ
రూపనామంబులు వేదాంతసిద్ధవచనప్రకారంబున నాత్మకు వేఱై యస్థిరం బగుటయుఁ
దదీయముఖచిహ్న౦బులవలనం దెలిసినదై తదనంతరంబ మధ్యమలోకపురుషపరివృఢులఁ
దెలుపందలంచి యిట్లనియె.

115


చ.

శుకపికశారికానినదశోభితకేళివనాంతరంబులన్
వికసితపద్మకైరవనవీనసుగంధసరోవరంబులం
బ్రకటసువర్ణగేహముల భద్రగజేంద్రతురంగమాదులన్
సకలసువస్తుసంపదల సౌఖ్యదమై తగుమర్త్య మంగనా.

116


వ.

ఏతద్భువనంబునం గలుగు రాజశేఖరుల నాలోకింపుము.

117


చ.

నిజగజనాథయూథపదనిర్ధళితోన్మదవైరిపార్థివ
వ్రజచతురంగసైన్యుఁడు విరాజితరత్నవిభూషణప్రభా
విజితవిభాకరుండు పరవీరభయంకరఖడ్గవిస్ఫుర
ద్భుజుఁడు కళింగభూభుజుఁడు తోయరుహానన వీఁడె చూడుమా.

118


చ.

లలితలవంగకోమలవిలాసలతాపరిణద్ధచందనా
మలమలయక్షమాభృదసమానసుగంధవిశేషశీతలా
నిలనిలసద్గవాక్షచయనిర్మితహర్మ్యవిహారి పాండ్యుఁ డీ
యలఘునిఁ జూడవమ్మ దరహాససుధారసరంజితాననా.

119