పుట:అనిరుద్ధచరిత్రము.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దివ్యవిలాసినీరతుల దివ్యశరీరములన్ సుఖాత్ములై
దివ్యపథంబున న్మెలఁగు దేవతల న్వివరించి పల్కెదన్.

102


శా.

ఆనందాకరవైభవానుభవు రంభాద్యప్సరోనాట్యలీ
లానిత్యోత్సవుఁ బారిజాతకుసుమాలంకారహారు న్సుర
స్థానావాససుఖోన్నతుం ద్రిభువనీసామ్రాజ్యసింహాసనా
సేను న్నిర్జరభర్తఁ జూడు మితని న్శీతాంశుబింబాననా.

103


ఉ.

ఆహవనీయదక్షిణసమాఖ్యలచేఁ జెలువంది మంత్రపూ
తాహుతుల న్సరోరుహభవాదులఁ దృప్తి వహింపఁజేసి యా
వ్యాహతలీల సాధకజనాళికి సౌఖ్యము లిచ్చుపుణ్యుఁ డు
త్సాహగుణాసమానుఁడు కృశానుఁ డితఁ డిటు చూడు కోమలీ.

104


వ.

అని తెలిపి వారియం దనాదరంబైన తదీయహృదయంబుఁ దెలిసి శేషించిన దిక్పాలక
దేవతాగణంబుల వేర్వేర వివరించెద ననుచు నిట్లనియె.

105


చ.

అతులితధర్మవంతుఁడు కృతాంతుఁ డనూనుఁడు యాతుధానుఁ డా
యతశుభుఁ డంబురాశివిభుఁ డంచితదేహుఁడు గంధవాహఁ డు
న్నతమతి గుహ్యకాధిపతి నాగధరుండు హరుండునుం జుమీ
యితఁడు నితం డితం డితఁడు నీతఁడు నీతఁడు సుందరీమణీ.

106


ఉ.

కామునిమించు సుందరము కంజవనాప్తుని గెల్చుతేజమున్
సోమునిఁ గేరునెమ్మొగము శోభిలువాఁ డలకల్పవృక్షచిం
తామణికామధేనుసహితంబగు సంపద లింట గల్గుసు
త్రామునికూర్మినందనుఁ డితండు జయంతుఁడు నీరజాననా.

107


శా.

భారాంతస్పృహు లైననిర్జరుల పైపైసోఁకి యెవ్వాని నిం
డారం బైకొను నర్తనాభినయభావారంభసంరంభరం
భారంభోరుముహుర్ముహుస్తరళితాపాంగచ్ఛటామాలికా
సారం బానలకూబరుం డితఁడు తత్సౌందర్య మీక్షించితే.

108


సీ.

కంబుకంధర వీరు కమనీయనిరతయౌవనమదోద్ధతులు గీర్వాణతతులు
సరసిజేక్షణ వీరు సంగీత నృత్యవిద్యాధురంధరులు గంధర్వవరులు
కుటిలకుంతల వీరు ఘుటికాంజనాదిక్రియాసుసాధకులు విద్యాధరేంద్రు
లమృతాంశుముఖి వీరు సుమహితాష్టవిశేషసిద్ధిప్రసిద్ధులు సిద్ధవిభులు
గరుడకిన్నరరుద్రకింపురుషసాధ్య, యక్షరక్షోభుజంగగుహ్యకులు వీరు
నీకటాక్షాంచలంబులు నిగుడఁజేసి కెలన వీక్షింపు మోరాజకీరవాణి.

109


వ.

అని పలికి యనంతరంబ పాతాళలోకనివాసుల వ్రాసిన పటంబుఁ జూపి యిట్లనియె.

110