పుట:అనిరుద్ధచరిత్రము.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దటఁ బొడగాననైతిఁ బరితాపభరంబున నాఁటనుండి నే
నిటువలె నున్నదానఁ గృశియించుచు జీవము వానిసొమ్ముగన్.

92


చ.

మదగజవైరివంటినడు మాకమలంబులవంటికన్ను లా
యదనశశాంకువంటి మొగ మాముకురంబులవంటిచెక్కు లా
మదనునివంటిచక్కఁదన మామధురాధర వానిరూపు నా
హృదయపటంబునందు లిఖియించినకైవడిఁ గాననయ్యెడున్.

93


తే.

ప్రాణసఖి వైననీకు దాపంగ నేల, విన్నవించితి నామది నున్నవిధము
వానిఁ గన్నులఁ జూపి జీవంబు నిలుపు, మనుచుఁ గన్నీరు దొరఁగ దైన్యంబు నొందె.

94


ఉ.

అయ్యలివేణి దైన్యమున కాత్మఁ గలంగుచు బాష్పబిందువుల్
పయ్యెదకొంగునం దుడిచి భక్తిమెయిన్ శిశిరోపచారముల్
సయ్యనఁ జేసి నెమ్మది విషాదము దీఱఁగ నూఱడించి తా
నయ్యెడఁ గొంతసేపుహృదయాబ్జమునం దలపోసి నేర్పునన్.

95


శా.

రంగుల్మీఱుపటంబున న్వివిధవర్ణద్రవ్యముల్ గూర్చి సా
రంగారంకానన వ్రాసె ముజ్జగములన్ రాజిల్లు రాజన్యులం
బంగారంపుమెఱుంగువ్రాతజిలుగుల్ పైపైఁగళ ల్దేఱఁగా
శృంగారంపురసంబు వెల్లివిరియం జిత్రక్రియావైఖరిన్.

96


చ.

కళలు సెలుంగుమోములు వికాసవిలాసముఁ జూపుకన్నులుం
జెలువము గుల్కుమేనులును జెక్కులపైఁ బ్రసరించునవ్వులున్
దళుకులు చల్లుభూషణవితానముఁ గల్గి సజీవచిత్రముల్
నిలిపినయట్లు వ్రాసె రమణీమణినేర్పు వచింప శక్యమే.

97


ఆ.

వ్రాఁత కజుఁడు గర్త సేఁతకుఁ దాఁ గర్త, యనుట కిది విరోధ మైన నేమి
సేఁత కజుఁడు గర్త వ్రాఁతకుఁ దాఁ గర్త, యనుచుఁ జిత్రరేఖ ననఁగవచ్చు.

98


వ.

ఇవ్విధంబునం ద్రిభువనంబులంగల్గు పురుషశ్రేష్ఠుల లిఖియంచిన యప్పటంబు నుషా
సుందరిముందట నుంచి యిట్లనియె.

99


చ.

త్రిభువనవాసులై వెలయు దేవమనుష్యభుజంగకోటిలోఁ
బ్రభుతయు రూపసంపదయుఁ బ్రాజ్ఞతయుం గలవారినెల్ల నే
ర్చి భగవతీమహామహిమచే లిఖియించితి నిప్పటంబునం
దభినవమూర్తియై తగినయాఘనుఁ డెవ్వఁడు వీరిలోపలన్.

100


వ.

అని మఱియు నిట్లని వివరింపందొడంగె.

101


ఉ.

దివ్యవిమానయానముల దివ్యసుగంధవిలేపనంబులన్
దివ్యలతాంతవాసనల దివ్యధునీజలకేళిలీలలన్