పుట:అనిరుద్ధచరిత్రము.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

ఇంగితజ్ఞానియగుట నాయిందువదన, వలపుమర్మంబుగా మదిఁ దెలిసి యపుడు
పలికె నేకాంతమునఁ జేరి పడఁతితోడ, బడలికలు దీఱఁ జల్లనిభాషణముల.

84


ఉ.

ఎన్నఁడు లేనివిన్నఁదన మేల మొగంబున దోఁచెనమ్మ నీ
కెన్నఁడు లేనిచింత మది నెక్కడనుండి ఘటించె నమ్మ ముం
దెన్నఁడు లేని యీకృశత నేటికి దేహము చిక్కెనమ్మ నీ
యున్నవిధంబుఁ జూచి వగనొందెడు నాహృదయంబు కోమలీ.

85


సీ.

కమ్మనిచిగురాకుకెమ్మోవి కసుగందె నుసురసురని వెచ్చ నూర్చకమ్మ
కనకంపునెమ్మేను కాఁకచేతఁ గరంగె విరహానలంబుచే వేఁగకమ్మ
తళుకునిద్దంపుటద్దపుమోము కళ దప్పె వలవల కన్నీరు వడువకమ్మ
వెలిదమ్మికన్నులతెలివి మందము నొందెఁ దురుముమేఘము గ్రమ్మఁ బొరలకమ్మ
పలుకఁగదవమ్మ వేసట పడకవమ్మ, సొలయ నేలమ్మ మో మెత్తి చూడవమ్మ
యేలి చేసెదవమ్మ మ మ్మేటి కింత, జాలి పెట్టెదవమ్మ యోచంద్రవదన.

86


క.

పరిరంభణమృదుచుంబన, సరసాలాపాదిసురతసౌఖ్యంబులచే
గరఁగించువిభునిఁ బాసిన, విరహిణిచందంబు దోఁచె వెలఁదీ నీకున్.

87


శా.

బాలా నిన్ను మదీయజీవముగ నే భావింతు నెల్లప్పుడున్
జాలా నేఁ గలుగంగ నెంతపనికి న్సంతాపముం బొందఁగా
నేలా సిగ్గున గుట్టుఁ జేసి హృదయం బిం కిట్లు చింతించుటల్
మేలా దాఁపక తెల్పు నీతలఁపు నెమ్మిం బూని కావించెదన్.

88


వ.

అని యివ్విధంబునం జిత్రరేఖావధూటి పలికినఁ దద్వచనౌషధంబు ప్రియానుపానసహి
తంబై యాత్మీయహృదయసంజనితమదనజ్వరంబు శాంతిం బొందించుటయు సేదదేఱి
నిజాభిప్రాయమార్గనిరోధకంబైన లజ్జాప్రవాహంబు ధైర్యప్లవంబువలన నుత్తరించి
కించిద్గదళితశ్రుతి విపంచీపంచమస్వరోపమానంబగు గద్గదస్వరంబున నిట్లనియె.

89


తే.

పాన్పుపై నొక్కనాఁడు నేఁ బవ్వళించి, నిదురపోవంగ లావణ్యనిధి యొకండు
చేరి నాయౌవనంబెల్లఁ జూఱగొనియెఁ, గల యనుచుఁ దోఁచు నిక్కంబు గాఁగఁ దోఁచు.

90


సీ.

సొగసైనచెక్కిళ్ళు చుంబించి చుంబించి చేరి మోమున మోముఁ జేర్చి చేర్చి
కరమునఁ బాలిండ్లు గదియించి కదియించి యధరపల్లవరసం బాని యాని
కేలి మైఁ గౌఁగిటఁ గీలించి కీలించి గళమున నఖపఙ్క్తి నిలిపి నిలిపి
చెలఁగి గళధ్వను ల్చెలఁగించి చెలఁగించి నిద్దంపుఁబొక్కిలి నివిరి నివిరి
పోఁకముడి విచ్చి దేహంబు పులక లొదవ, నవయంబులు గదియంగ నదిమి యదిమి
యవల నేమేమొ చేసె నయ్యాగడంబు, నెట్లు చెప్పుదు సిగ్గు నోరెత్తనియదు.

91


చ.

అటువలె వానికౌఁగిట సుఖానుభవంబునఁ జొక్కియుండి యం
తటఁ గనువిచ్చి మేలుకొని తన్మహనీయవిలాసమూర్తి నా