పుట:అనిరుద్ధచరిత్రము.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

మఱియును.

74


సీ.

విన్నఁదనంబుఁ గైకొన్ననెమ్మోమునఁ బొడమనిచిఱునవ్వుఁ బొందుకొలుపు
దీనభావంబు చెందినవాలుఁగన్నుల లేనివికాసంబుఁ బూనఁజేయు
గద్గదస్వరము సంగత మైనమాటల నొదవనిచాతుర్యయుక్తిఁ జూపు
నుల్లాసభంగ మైయున్నచిత్తంబునఁ గొలుపనియుత్సాహగుణము నెఱపు
ఘనవియోగవహ్నిఁ గ్రాఁగుచునుండియు, మఱుఁగుసేయు నితరు లెఱుఁగకుండ
సఖులు తెలిసిరేని సంశయింపుదురను, భయమువలనఁ గుముదబంధువదన.

75


సీ.

ఎలనాగ వీణె వాయించుచో నాహిరి ఘంటారవంబునఁ గలసి చెలఁగు
జలజాక్షి కావ్యంబుఁ జదువుచోఁ బాంచాలగతి చోట బాహాటక్రమము దొనఁకు
నెలఁత చిల్కకు మాట నేర్పుచో గీర్వాణభాషలోనఁ దెనుంగుఁబల్కు గలయుఁ
జెలియ పద్యంబు రచించుచో శృంగారరసముపై బీభత్సరసము నిల్పు
విరహవిభ్రాంతికతమున విద్రుమోష్ఠి, యొకటి సేయంగఁబోవ వేఱొకటి దోఁచు
నగ్గలపుఁజింత హృదయంబు నంటియున్న, నిట్టు లౌటకు మది సంశయింప నేల.

76


తే.

దర్పకుని బాణతీవ్రత దాళలేక, యంగనామణి శివశివా యని వచించుఁ
గలికి కోవెలరొదలచే నలసిసొలసి, రామ పలుమాఱు శ్రీరామరామ యనును.

77


క.

సెగలయ్యెఁ జలువవెన్నెల, పొగలయ్యెను గప్పురంపుఁబొడి కన్నులకుం
బగలయ్యెఁ జిలుకమాటలు, వగలయ్యెను సుఖము లెల్ల వనితామణికిన్.

78


చ.

కల కలగాక నిశ్చయముగా మదిఁ దోఁచిన నాఁటనుండి తా
గలకలకంఠకీరకులకంఠములం జనియించుదట్టపుం
గలకలము ల్చెవింబడఁగఁ గాయజునమ్ములగాయము ల్మదిం
గలకల నొంప యామములు కల్పములై చెలి యుండ ఖిన్నతన్.

79


వ.

ఆసమయంబున.

80


అమరారీశ్వరుఁ డైనబాణున కమాత్యశ్రేష్ఠుఁడై బాహు
క్రమకేళీవిజితాహితప్రకరుఁడై ప్రౌఢిం జతుష్టష్టితం
త్రమహామంత్రకలాపలక్ష్యపరుఁడై రాజిల్లు గుంభాండనా
ముమునం దైత్యవరేణ్యుఁ డొక్కరుఁ డసామాన్యప్రభావంబునన్.

81


ఆ.

వానియనుఁగుఁబట్టి వరసుందరాకార, రేఖ నొప్పుఁ జిత్రరేఖ యనఁగఁ
దండ్రివలన మంత్రతంత్రయోగక్రియ లభ్యసించియుండు సాంగముగను.

82


శా.

ఆనీలాలక బాణకన్యకకు బాహ్యప్రాణమోనాఁగ నెం
తేనేస్తం బొనరించియున్నదగుటం దీనాననాంభోజయై
గ్లానింబొందుచునున్న యారమణియాకారంబు వీక్షించి చిం
తానిర్మగ్నమనోంబుజాత యగుచుం దత్కార్య మూహించుచున్.

83