పుట:అనిరుద్ధచరిత్రము.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


విభ్రాంతియు విస్మయంబును విచారంబును విషాదంబును విరహంబును నంతరం
గంబునం బెనంగొన నంతకంతకు నతిశయంబు మోహావేశంబునఁ దదీయసౌందర్యసౌ
కుమార్యవిలాసహావభావంబులు పలుమాఱుఁ దలంచుచు నాజగదేకసుందరుండు తన
ముందరం బొడగట్టిన ట్లైనం బట్టరానితమకంబున బట్టబయలు కౌఁగిటంబట్టఁబోయి
భుజలతాయుగంబునకు నప్రాప్తంబైన డెందంబు చిందఱవందఱయై నయనారవిందం
బులం దొరంగు నశ్రుజలబిందుసందోహం బమందంబై ప్రవహింప సహింపనలవిగానిపరి
తాపంబున వేఁడినిట్టూర్పు లొదవించుచు నిట్లని తలంచు.

66


ఉ.

నిద్దురవోవుచున్నయెడ నిశ్చయమైనవిధంబు దోఁప న
న్నొద్దికఁ జేరికూడి సుఖ మొందఁగఁజేసి భ్రమించినట్టి యా
ముద్దులుగుల్కుజవ్వనపుముమ్మరపుంనెఱజాణ యెవ్వఁడో
పెద్దయు నాటె వానిపయిఁ బ్రేమ మనంబున నేమి సేయుదున్.

67


శా.

ఆచక్కందన మావచోమధురిమం బామందహాసామృతం
బాచాతుర్యము నావయోవిభవ మాహా మోహముం జేయదే
యేచంద్రాస్యలకైనఁ బొందఁగలదా యీమేనితో వానితో
నేచందంబున నామనోరథఫలం బీడేఱునో దైవమా.

68


వ.

అని చింతించుచు.

69


క.

లలనామణికూటమి లీ, లలనామణిభూషణాంగు లలిఁగలసిన యా
కలమాటలు నిక్కంబుగఁ, గలమాటలుగాఁ దలంచుఁ గడుభ్రమచేతన్.

70


సీ.

మొనపంటికొలఁది నొక్కిననొక్కుచేఁ గెంపుటధరంబు చిమచిమయనినయట్లు
చెలువారుగోళ్లనాటుల తేఁట చెక్కిళ్లపై నెలవంక లేర్పడినయట్లు
చెలరేఁగి యలమిన చేపట్టుబిగువుచే గబ్బిగుబ్బలు కసుఁగందినట్లు
కళల సొక్కొదవిచు గాటంపురతులఁ బూవంటిదేహము వసివాడినట్లు
భావమునఁ దోఁచు స్వప్నలబ్ధంబులైన, సౌఖ్యములు మిథ్యలయ్యు నిశ్చయముగాఁగఁ
బురుషసంగతి చేసినకరణి నపుడు, పద్మదళనేత్ర కరుణానుబంధమునను.

71


క.

అంత సఖీప్రేరితయై, సాంతత్యం బైనయట్టిసమయోచితముల్
స్వాంతమున నిచ్చ లేకయు, దంతావళయాన యొకవిధంబున నడపెన్.

72


సీ.

బింబోష్ఠి దర్పణబింబంబుఁ జూపుచోఁ జెలువునిముద్దుచెక్కులు దలంచి
కలకంఠి మృగమదతిలకంబు దిద్దుచో సరసునిమేనివాసనఁ దలంచి
కలికి ముక్తామాలిక లలంకరించుచో రమణునిమందహాసముఁ దలంచి
పొలఁతి నీలోత్సలంబులదండ లొసఁగుచో రామునిచికుడభారముఁ దలంచి
గంధగజయాన హృదయంబుకరిగి కరిగి, యసురసురమంచుఁ బారవశ్యంబు నొందు
నిగిడి పుంఖానుపుంఖంబు లగుచుఁ దాఁకు, దర్పకునిపువ్వుటమ్ములఁ దాళలేక.

73