పుట:అనిరుద్ధచరిత్రము.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చక్రసామ్యత వెలయు కుచంబులందు, సామ్యచక్రతఁ దగు వుక్కసపుఁబిఱుందు
రూఢి నారోహిణియు నవరోహిణియుఁగ, నెలఁతచెలువంబుసారె వర్ణింపఁదగును.

26


చ.

మలయజగంధి బిత్తరపుమాటలు వీనులు సోఁకినంతనే
చిలుకలు పల్కినట్లు విలసిల్లు వసంతపువేళఁ గోవెలల్
చెలఁగినయట్లు కిన్నరలు చిత్రవిధంబున మీటినట్లు వీ
ణెలు మొరయించినట్లు మదినిండుఁ బ్రమోదరసప్రవాహముల్.

27


ఆ.

ఇరులు సిరులు దొరలు కురులు తియ్యందనంపుఁ దీవి ఠీవి తావి కావి మోవి
కులుకులొలుకు పలుకు మెలఁకువసుమచాపు, తూపు రూపు మాపు చూపుకోపు.

28


చ.

కొలుకులకెంపుసొంపు రహి గుల్కెడు తారలనీలిమంబు క
న్బెళుకు మెఱుంగులుం గలసి పెంపమరెన్ హరిణాక్షిచూపు ల
వ్వలదొర ముజ్జగంబు గెలువన్ నవచూతదళంబు మేచకో
త్పల మరవింద మొక్క మొగిఁబట్టి ప్రయోగము సేయు కైవడిన్.

29


సీ.

మునుకారునను కారుకొని మీరు ఘనచారుతనుమారుకొనికేరుఁ దరుణికురులు
నలకుందములయందములచందములు మందములఁ నొందఁగాఁజేయుఁ జెలిరదాళి
తెగరానివగ మేనితొగరేని జిగిబూని తగుదానిసొగ సైననగుమొగంబు
వెల పెంపు వెలయింపు కళగుంపుఁ దులకింపులు కెంపుఁ దలపింపుఁ బణఁతిమోవి
సింగముల భంగముల నొందఁజేయునడుము, కీరముల దూరముల దొలఁగించుబలుకు
జక్కవలఁ దక్కువలఁ జేయుఁజన్నుదోయి, ముదితరూపంబు త్రిభువనమోహనంబు.

30


సీ.

ఇంపుసొంపుల గ్రుమ్మరింపుమాటలు వీణపలుకుల కక్షరాభ్యాస మొఁసగు
మందంపునడపులు మాయూరగతులకుఁ బలుమాఱు తిన్ననిఫణితిఁ జూపు
సరసంపునాసిక సంపెంగమొగ్గల కెక్కువతక్కువల్ చక్కదిద్దుఁ
జొక్కంపుగుబ్బలు జక్కవకవలకు దిట్టతనం బుపదేశ మిచ్చు
హొంతబాడుట వనవిహారోత్సవంబు, సలుపుటయుఁ బుష్పవితతివాసనలు గొనుట
నెఱిసరసిఁ గ్రీడలాడుట నెపములుగను, నతివసౌందర్య మింక నేమని వచింతు.

31


క.

ఇటువంటి యవయవంబుల, నెటువంటివిలాసవతుల నెనసేయఁగరా
నటువంటివగను రజనీ, విటువంటిమొగంబు గలిగి వెలఁదుక యొప్పెన్.

32


ఉ.

మేరుధనుష్కుదేవి స్వరమేళకళానిధి దత్తిలంబు భాం
డీరమ్ము కోహళియ్యకము నిగఁ గావ్యము నాటకం బలం
కారము శాస్త్రముల్ మొదలుగా మఱి యభ్యసనం బొనర్చె శృం
గారపువిద్య లద్దనుజకన్యకకున్ బరమానురక్తయై.

33


ఆ.

ఆడఁబాడ నేర్చియభినయింపఁగ నేర్చి, సరసకవిత చెప్పఁ జదువ నేర్చి
బాణదనుజపుత్రి బాలిక యయ్యును, సకలకళలయందు జాణ యయ్యె.

34