పుట:అనిరుద్ధచరిత్రము.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

నాయంతవానితో నని, సేయంగలిగెడును నీదుచేతులబరువున్
బాయు భవదీయకేతన, మేయెడఁ ధర గూలు నపుడు హీనవివేకా.

18


వ.

నిర్విచారుండవై యుండు పొమ్మని యానతిచ్చిన బలినందనుండు డెందంబున నానందంబు
నొందుచు నందివాహనున కందంద వందనంబు లాచరించి మరలి నిజమందిరంబున కేతెంచి
యాత్మీయశ్రేయోహానిహేతుభూతంబైన కేతుపాతంబున కెదురుచూచుచు నీచాః
కలహ మిచ్ఛంతి యనువచనంబునకు నగ్రసాక్షియై యుండె నంత.

19


ఆ.

ఆతనికూర్మికూఁతు రందంపుబిత్తరి, ముద్దుగుమ్మ భువనమోహనాంగి
కుందనంపుబొమ్మ కుసుమకోమలి యుషా, కన్య యనఁగ నొప్పు కమలనయన.

20


ఉ.

ముద్దులమాటలున్ జిఱుతమోమున నున్ననిలేఁతచెక్కులున్
గొద్దిగనున్న నెన్నడుము కూఁకటి కందక ఫాలపట్టికన్
విద్దెము సేయుముంగురులు విప్పగు ఱెప్పల గొప్పకన్నులున్
బ్రొ ద్దొకవింతయై యమరెఁ బుష్పసుగంధికి బాల్యవేళలన్.

21


సీ.

అరవిందములు మన్మథాస్త్రంబు లైనట్లు వాలుఁగన్గొనల గ్రొవ్వాఁడి వొడమె
హరినీలములు పేరు లైనచందమున నించుక లైనకురులు పెన్ సోగలయ్యె
వీణాశ్రుతులు మేళవిం పైనవగ ముద్దుపలుకులు ప్రౌఢసంపద వహించెఁ
గనకంపుఁఁణిక కుందన మైనరీతిఁ జాయలమేను నిండుతేపల వహించె
మ్మపూపలు ముది ఫలమ్ములైన, గతిఁ జనుకుదుళ్లు నిగిడి పొంకము వహించె
బంధుజీవాధర యతీతబాల్య యగుచు, నిండుజవ్వనమున నొప్పుచుండు నపుడు.

22


మ.

కలవాక్కీరహయంబు గల్ల మకరీకస్తూరికాపత్రస
ల్లలితాంకంబు నితంబబింబపటులీలాచక్ర మాలోకనాం
చలబాణౌఘము భ్రూలతాయుగ మహాచాపంబు నై శోభిలెన్
జలజాతాననవిగ్రహంబు రతిరాజస్యందనప్రక్రియన్.

23


ఉ.

తేనియ లొల్కు మోవియును దియ్యనిమాటలుఁ బువ్వువంటి నె
మ్మేనును ముద్దుఁజెక్కులును మెచ్చులుఁ గుల్కెడు గుబ్బచన్నులున్
మీనులవంటికన్నులును మిక్కిలియైనపిఱుందు సన్నపుం
గౌను నొయారపున్నడపుఁ గల్గి వెలుంగు మనోహరాంగియై.

24


తే.

ఒఱపుగలచందురునిచందమోము మోము, నలర శైవాలలీలఁ జెన్నారు నారు
పరిమళము గుల్కు కపురంపుఁబలుకు పలుకు, కలికి రాజమరాళసంగతులు గతులు.

25


సీ.

ఘనసారమును సారఘనము నాక్షేపించుఁ గలికిపల్కులయింపు కచముసొంపు
పద్మరాగము రాగపద్మము నదలించు రమణంపుమోవి పాదములఠీవి
మృగమదంబును మదమృగమును హసియించుఁ గాయంపువలపు కన్దోయిమెలఁపు
వరనాగమును నాగవరముఁ జుల్కఁగఁజేయు నవకంపునూఁగారు నడలతీరు