పుట:అనిరుద్ధచరిత్రము.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అతనికి మేనమామసుతయై తగు రుక్మినృపాలపౌత్రి యం
చితసుమకోమలాంగి సరసీరుహపత్రవిశాలనేత్ర ని
ర్జితకలహంసయాన మదసింధురకుంభసమానవర్తులో
న్నతకుచ రుక్మలోచన యనంగ ననంగశరోపమానయై.

87


గీ.

బంధుజీవ మయ్యె బంధుజీవం బని, యధరమునకు బింబ మధర మయ్యెఁ
దమ్ము లయ్యె ననుచుఁ దమ్ములఁ గని కొమ్మ, యడుగులకును జిగురు లడుగు లయ్యె.

88


సీ.

కట్టిఁడివగను జేకట్లకు లోనయ్యె విరసభావంబు లై విద్రుమములు
ప్రత్యహంబును గళాభంగమయ్యను దామసప్రకాశతను నక్షత్రగణము
పగలుమించుట విదేశగతంబులయ్యె రాజావమానమున రథాంగకులము
కాఁక దెచ్చుక తుది లోఁకువై పలుమాఱుఁ బ్రహరణంబులఁ జెందెఁ బసిఁడికమ్మి
రమణియధరనఖస్తనాంగములతోడి, ప్రాతిపక్షికమున నివి భంగపడియె
వట్టియార్వేరమున బలవంతుతోడి, సాటికిఁ బెనంగు టెల్ల నిష్ఫలము గాదె.

89


సీ.

శాతకుంభమునకుఁ జాంపేయమునకుఁ దా ననుగుణంబగుఁ గాంచనాంగి యనుట
కంజాతమునకును గైరవంబునకుఁ బ్రియంవదంబు మహోత్పలాక్షి యనుట
శక్రోపలమునకు జలధరంబునకు వినయోక్తి ఘననీలవేణి యనుట
కలహంసమునకు శిఖావళంబునకు హితాలయ మండజయాన యనుట
యుభయభావంబు లతివయం దునికి సార్థ, కముగ నిట్లంట చతురత కల్పనాంశ
లందు వలసినయ ట్లందు రనఁగనిమ్ము, వారి కేమి నిరంకుశుల్ గారె కవులు.

90


వ.

ఇవ్విధంబునం బ్రభూతవయస్సమయమైయున్న రుక్మలోచనను వివాహంబు సేయ ను
ద్యోగించి తత్ప్రపితామహుండైన భీష్మకనృపాలుండును దక్కినవారలును సుహృజ్జను
లతో నాలోచించుచు.

91


ఉ.

ఈయలినీలకుంతలకు నీడును జోడును నైనవల్లభుం
డేయెడఁ గల్గునో యనుచు నెంతయునక్కఱతో విచారముల్
సేయుచునుండి బంధువులచే ననిరుద్ధుని రూపసద్గుణ
శ్రీయుతుఁ గా నెఱింగి తమచిత్తములం బ్రమదంబు నిండఁగన్.

92


క.

నెనరంటినచుట్టఱికం, బును గులమును గుణము రూపమును విద్య ధనం
బును బ్రాయము గలిగినవరుఁ, డొనఁగూడుట కన్యభాగ్యయోగమునఁగదా.

93


వ.

అని విచారించి ద్వారవతీపురంబునకుఁ దగువారలం బంపుచు.

94


క.

శ్రీమత్సమస్తసద్గుణ, ధామాంచితకీర్తి నెన్నఁదగువసుదేవ
స్వామికి భీష్మకభూప, గ్రామణి తా మ్రొక్కి చేయఁగలవిన్నపముల్.

95


క.

క్షేమం బిక్కడ మీపరి, ణామము వ్రాయంగవలయు నాపౌత్రుని పు
త్రీమణిని రుక్మనయనా, కోమలి ననిరుద్ధునకును గూర్పఁగవలయున్.

96