పుట:అనిరుద్ధచరిత్రము.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అని శుభలేఖ లంప విని హర్షము మాకు నవశ్య మంచుఁ గ్ర
క్కునఁ బ్రతిలేఖ లంపి యనుకూలపులగ్నము నిశ్చయించి చ
య్యన బలకృష్ణముఖ్యులు రయంబ సుహృచ్చతురంగయుక్తులై
యనుపమవాద్యఘోషము దిగంతములందుఁ బ్రపూరితంబుగాన్.

97


సీ.

కుండినపురికి నేఁగుటయు వైదర్భు లెదుర్కొని వారలఁ దోడి తెచ్చి
విడుదుల విడియించి వివిధవస్తువ్రాతసామగ్రి నడపించి సంభ్రమమున
లగ్నవేళకు మంగళస్నానయుతు లైన పెండ్లికొమార్తకుఁ బెండ్లికొడుకు
కెలమితో బాసికంబులు గట్టి కంకణబంధముల్ గావించి ప్రాజ్ఞులైన
విప్రముఖ్యులఖండోక్తవేదరవము, చెలఁగ నుచితప్రయోగముల్ సేయుచుండి
రపుడు తెరవట్టిచాటున కతివఁ దోఁడి, తెచ్చిరి పదాంగదధ్వను లచ్చుపడఁగ.

98


చ.

విచికిలగంధియున్ విభుఁడు వేడుకతోఁ దెరరెండువైపులన్
రుచిరకటాక్షపంక్తుల మెఱుంగులు నిండఁగ నిల్చి రయ్యెడన్
బ్రచురతరానురాగరసబంధురతం దెర చీరదూఱిపా
ఱుచు హృదయాబ్జముల్ మొగ మెఱుంగని చుట్టఱికంబు సేయఁగా.

99


క.

గ్రక్కునఁ దెరవాపుటయుఁ ద, ళుక్కున వెలుఁగొందె మృగవిలోచనముఖ స
మ్యక్కాంతి మెయిలుదొలఁగినఁ, జక్కఁగఁ జెలువొందుపూర్ణచంద్రుం డనఁగన్.

100


ఉ.

బంగరుపళ్లెరంబులను బ్రౌఢిగనించినముత్తియంబు లు
ప్పొంగుచు హస్తయుగ్మములఁ బూర్ణముగాఁ బలుమాఱు ముంచుచున్
రంగుగ నొక్కరొక్కరిశిరంబుపయిం దలఁబ్రాలు వోసి ర
య్యంగమరీచినవ్యమణు లై దిగుపాఱఁగ నవ్వధూవరుల్.

101


క.

ఈవిధమున సుముహూర్తము, గావించి వివాహవేదికాస్థలమునకున్
రావించి రపుడు పంచమ, హావాద్యధ్వనులు బహుళమై మొరయంగన్.

102


క.

చెలిపాదము చెలువుఁడు కర, జలజంబునఁ బట్టి నడపె సప్తపదంబుల్
పొలయలుక దీర్చునాఁటికి, యలవడునని వావియైనయతివలు నవ్వన్.

103


వ.

తదనంతరంబ ప్రధానహోమాదికంబులైన వైదికలౌకికప్రయోజనంబులు నడప వివిధ
విధభక్ష్యభోజ్యాదిపదార్థంబుల సకలజనసంతోషంబుగా భోజనోత్సవంబు గావించిరందు.

104


మ.

 పరమాన్నంబులుఁబిండివంటలును సూపంబుల్ గమాయించు పం
డ్లరసంబుల్ మధురామ్లశాకములు బెల్లం బాజ్యమున్ దేనె క
ప్పురపుందోయము మీఁగడల్ పెరుగు లుప్పుగాయలున్ మున్ను గాఁ
బరిపూర్ణంబుగ నారగించి రనువొప్పం బెండ్లివారందఱున్.

105


సీ.

చెలి పయోధరకుంభములు దాఁచుకొన నేల ఘనమయ్యెఁ దృష్ణ చేకొనఁగనిమ్ము
లతకూన మధురలీలాధరఫలరసంబులు చాలనభిలాషఁ బొడమఁజేసె