పానశాల/కేతిరెడ్డి విద్యాపీఠం

వికీసోర్స్ నుండి

కేతిరెడ్డి విద్యాపీఠం

“దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా" అన్న గురజాడ సూక్తి ఆధారంగా --- చిమ్మ చీకటిలో చిరుదీపంలా --- 1987 లో ఆవిర్భవించిన మా కేతిరెడ్డి విద్యాపీఠం ఇప్పుడిప్పుడే నడక ప్రారంభించింది.

పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయడం ఉత్తమ రచనలను ప్రోత్సహించడం ఇవీ – ప్రస్తుతానికి మా ఆశయాలు.

ఆ నేపథ్యంలోనే గత 4 సం||గా మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగులో ఎం.ఎ., ఎం.ఫిల్., పి. హెచ్డి. చేస్తూ ఉత్తమ ప్రతిభను నిరూపిస్తున్న విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ. 500/- చొప్పున 15 మందికి; నెల్లూరు జిల్లా విడవలూరు కళాశాలలో ప్రతిభావంతులైన డిగ్రీ విద్యార్థులకు రూ.500/-; +2 లో ప్రతిభగల విద్యార్థులకు రూ.250/చొప్పున మొత్తం రూ.15,000/- ప్రతిసంవత్సరం అందజేస్తున్నాము.

సింహపురి కీర్తి కిరీటం 'కవికోకిల' దువ్వూరి రామిరెడ్డి గారి రచనలు కనుమరుగై పోతున్నాయన్న బాధతో భావితరం వారికి ఆయన రచనలు ఎంతో అవసరం అని భావించి అందులోని అత్యంత ప్రఖ్యాతి గాంచిన “పానశాల” ను పునర్ముద్రిస్తున్నాము. మున్ముందు ఆయన గ్రంథాలన్నింటినీ పునర్ముద్రించాలనే దృడనిశ్చయంతో ఉన్నామని తెలియ జేయడానికి సంతోషిస్తున్నాము.

మా సంకల్పానికి సాహిత్యాభిమానులు, కవులు, పండితులు, అధ్యా పకులు మొ|| వారి ఆశీస్సులు, అండదండలు మాకెల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాము.

- కేతిరెడ్డి హరిప్రసాద్ రెడ్డి, మేనేజింగ్ ట్రస్ట్రీ, కేతిరెడ్డి విద్యాపీఠం. పొర్లపల్లి (P.O.), విడవలూరు, (M), నెల్లూరు - 524 318.