Jump to content

పాంచాలీపరిణయము/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

పాంచాలీపరిణయము

చతుర్థాశ్వాసము

క.

శ్రీరంగనిలయపాణి మ, ణీరంగద్వలయ విశిఖనికృతోదన్వ
త్తారంగవిలయగుణ నట, నారంగన్మలయ సహ్యనగజానిలయా.


వ.

అవధరింపుము జనమేజయునకు వైశంపాయనుం డిట్లనియె.


క.

ఘనఫణిమణితోగణ ఘృణి, కనకాంబరకాయమాన గణచిత్రములన్
మునుపంటి పురము గాదిది, యనిపించిన పార్షదాలయము గనిపించెన్.


చ.

చిగురులతోరణంబులును జీలుగుఁబువ్వు లనంటికంబముల్
పగడపుఁగుచ్చు లద్దములు బంగరువ్రాఁతదుకూలజాలముల్
మొగలివిరుల్ సరుల్ సవరముల్ ధ్వజముల్ గజనిమ్మపండ్లు తీ
రుగ నగరీగృహంబు లడరున్ రథముల్ కయిసేయు కైవడిన్.


ఉ.

మేరులతీరు లాకురుఁజు మీఁదులఁ జెక్కిన టెక్కియంబు లా
గారుడరత్నతోరణధగద్ధగలా తెలిగచ్చుమచ్చు లా
బేరిమిటారికత్తియలు పెట్టినముత్తెపుమ్రుగ్గుసిగ్గు లా
యారతినాతివ్రాఁతపను లంగడి ముంగిళు లాపురంబునన్.


క.

పట్టుంజల్లియు సవరము, కట్టాణిమెఱుంగు మౌక్తికపుఁదోరణ మె
ప్పట్టునఁ దెలిపుట్టము మే, ల్కట్టొకటిం బట్టణమునఁ గనమెట్టి నెడన్.


క.

చెంగావికట్టు గట్టని, ముంగిలి ముత్తెపుమ్రుగ్గు మంపని కడపల్
బంగరుచిత్తరు వెత్తని, యంగణముం గాన మెందు నప్పురమందున్.


సీ.

గ్రామీణఘటమానకటకాయమానంబు దర్వీముఖాకృతి తత్క్షవృతన
భిత్తికాలంక్రియాభృత్యభృన్నిశ్రేణి భస్త్రికాజనగళత్పాంసుభరన
నటమౌరజికవధూనతినందదధికారి యార్తనిస్వనమాంసలాజనివహ
ఘోషవద్గోధూమమాషఘరట్టంబు బహులశర్కరతైలపక్వసురభి
ఘస్రఘఠికాఘటీతటి ఘజితరజని, లేఖన పురోహితాహ్వాన లీడగాంచి
ధావనాయాత యాతవదత్పదాతి, పెల్లురొద చెల్లునప్పు డప్పెండ్లియింట.


క.

అంతట నృపుఁ డంతఃపుర, కాంతలం గుంకుమహిమాంబు కస్తూరికలన్
వింతగ నలుంగులిడుఁడని, కుంతీనందనులఁ బెండ్లికొడుకులఁ జేసెన్.


ఉ.

జోడుగఁగూడి ప్రోడగమి చొక్కిపడన్ ధవళంబు భైరవిం

బాడిని బాడి రిద్దఱు జపాకుసుమాధర లాధరాధినా
థోడుకళత్రనేత్ర యుగళోత్పలము ల్వికసిల్ల వల్లకీ
గౌడవరాళివైరి కలకంఠగళోద్య దనర్గళధ్వనిన్.


మ.

అలరుంబోఁడులు గూడి ధర్మజున కీనబ్జేక్షణాజాణ వే
తలయంటు దగుదీవు భీమునితలం దైలంబిడ న్నీవు పా
టలగంధీ యిటురమ్ము క్రీడిశిర సంటన్ మీరు మాద్రీకుమా
రుల కభ్యంగము సేయుఁడంచు కయినేర్పు ల్చూపి రేర్పాటుగన్.


మ.

అలకల్ విప్పి చిటుక్కునం గొసరుడాయంగుక్కినంతం దలన్
గలయన్నూనియ వెట్టుటల్ వలయనిక్వాణంబు రానంటుటల్
సొలయన్ దువ్వుటలుండఁగా నడుమనాసుభ్రూకరస్పర్శ మే
కళయం టెందలయంటుటింతయు నెఱుంగంజాల రప్పాండవుల్.


చ.

అటకలి వెట్టె నొక్కకుటిలాలక నీలకచావతంసకం
బటకలితాంబువుల్ మణిమయంబుగుతంబుగ వంచెనోర్తు దు
ప్పట మొకహాటకాంగి నునువాటపు బెన్నెరు లంటఁజుట్టె నం
తటఁ దడియొత్తె నోర్తు వనితామణియున్ శిఖ వైచె వైఖరిన్.


క.

వడి వేఱువేఱ శిరసులు, గడిగి బెడంగయిరి కుంతి కాంచిన కొడుకుల్
వెడవింటి జోదుమెరవడి, గడిగిన నారాచపంచకంబో యనఁగన్.


సీ.

అరచుట్టు పైఁగట్టు నపరంజి రెట్టెంపు నునుకట్టుఁ గని వెన్నుఁ డనుకరింప
తీగైన నెలవంకతిరుమణి హిమఘృణి చూచి యమ్మక్కని చొక్కిపడఁగ
సిగమీఁది విరవాది చేర్చుక్కపస గాంచి మరివసంతుఁడు కొంతమరులుకొనఁగ
సొమ్ముల యమరికల్ సొరిది నిరీక్షించి కలవానిసుతుఁడింత కన్ను వ్రేయ
పాంచజన్య భుజప్రాణ పంచకంబు, త్యాగలేఖద్రుపంచకం బసమబాణ
బాణపంచక మున్నిద్ర భద్రవేది, పంచకరుదెంచెఁ బాండవపంచకంబు.


వ.

ఆ సమయంబున.


చ.

నిటలతటిన్ శుభాక్షతలు నిల్పుచు దీవన లిచ్చి యిమ్మహా
కుటిలకచాశిరోమణికిఁ గొమ్మలు సంపెఁగనూనెయంట రే
యట కలివెట్టరే జలకమార్చి వడిం దడియొత్తి చిక్కుదీ
ర్చుటలుఁ బసిండికుంచె నెరిసోగలు గన్పడ దిద్దరే నెరుల్.


ఉ.

పాటలు పాడుచున్ గొనబు పాపటఁ దీఱిచి కొప్పమర్చరే
పాటలగంధికిన్ నిటలపట్టికఁ గస్తురిబొట్టుఁ బెట్టరే

కాటుక దీర్పరే యెరకగన్పడఁ జెందురుకావి గట్టరే
గాటపుగబ్బిగుబ్బచనుకట్టులఁ జేర్పరె హారవల్లరుల్.


సీ.

బాగాయెఁగా కెంపుపాపటబొట్టుతో గొనబుముత్తెపుఁగుచ్చు వనితనొసల
చెలురాయెఁగా జంట చెంగావిరవికతో సరులిచ్చు మకరికాస్తనభరంబు
రంగాయెఁగా రత్నరశనతోఁ గావిచొక్కపుపావడదుకూలకటితటంబు
నలువాయెఁగా రణన్మణినూపురములతో నపరంజిమట్టె లాక్షాంఘ్రియుగళి
యమ్మ యిమ్ముద్దుగుమ్మ కేసొమ్మొకింత, నెమ్మెయి నలంకరింప నీనిలువు నూరు
బండినటువలె నున్న దీపాండుసూను, పంచకము భాగ్యమౌకారౌర పడఁతులార.


మ.

అనుచో వృద్ధపురోహితుండొకఁడు డాయంబోయి మీపాటలం
దినెరుల్ దువ్వుచుఁ గొప్పుఁ బెట్టుచుఁ దుది న్నిందించు నీయంచు ము
ట్టనిసింగారము లేఁది లగ్న మిదిగో డాసెన్ మహోగ్రుండు రా
జునయో నిన్ను నెఱుంగరా కదలుఁడంచుం బండ్లుగీటెన్ వడిన్.


చ.

బిసరుహలోచనామణిని బెండిలితిన్నియఁ జేర్ప దుప్పటిన్
ముసుఁ గొనరించుఁడీ నొసలిముంజెఱఁ గించుక వంచిపట్టుఁడీ
బిసబిగఁబోక యొయ్య నడపింపుఁ డరుంగుమెఱుంగుమెట్టికల్
మసలిక నెక్కుఁ డెచ్చరిక మచ్చిక నిల్పుఁడు భద్రపీఠికన్.


గీ.

వెలఁది కదలారతికి నెంతవేగిరంబు, క్రొత్తముత్తెంబులనివాళి యెత్తరాదె
గౌరికల్యాణమున కేమి కంతుఁ గన్న, తల్లి ధవళంబు పాడరాదా లతాంగి.


గీ.

వెలఁది వీడెంబు పసవెట్ట వేళ లేదె, ధవళమనుమన్న వదనాబ్జధవళమునను
నీవు నీవంచు నెలగ మొగంబేల చూడ, సిగ్గుపడనేల మగవారిచెంత ననుచు.


శా.

నీకేవచ్చు సువాలయుంధవళ మింతీ యల్లోనేరేళ్ళు గౌ
రీకల్యాణములంచు నింటికడ నేరీతిన్ విజృంభింతువే
నాకీవిచ్చటనంచు నిద్దఱుసతుల్ వాక్యోపవాక్యంబులన్
గాకై ముందలపట్లకుం దొడఁగి రాకల్యాణవేదిస్థలిన్.


ఉ.

అఝ్ఝమలోచనల్ పలుకునప్పుడు విప్రులు హోమ వేళ మీ
రొఝ్ఝులు రండు రెండు సమిధోత్కర మీయవధానీ బ్రహ్మయీ
యఝ్ఝములోన యాపససయన్న వశిష్ఠులు మీరు శ్రౌతమం
దఝ్ఝరెయంచుఁ బంచుకొనిరందఱు వేల్చుచు ద్రవ్యదక్షిణల్.


క.

మిహరాసిత గురుబుధకవి, మహికాంశుక రాహుకేతు మహిసుతు లనుచున్
గ్రహియించెన్ ధనము నవ, గ్రహనెపమున విప్రరాజరాజులచేతన్.

ఉ.

మంగళసూత్రమంగ గరిమంగళలంగను సర్వమంగళా
పాంగ నటద్ఘృణాఖనికి నంగనకున్ గళసీమఁ గట్టె రా
ట్పుంగవచక్రవర్తి విధుపూర్ణముఖీకుచకుంభపాతశా
తాంగభవాసిభాసినఖరాంకురముల్ గిలిగింతగొల్పఁగన్.


మ.

కులుకుందోరపు గబ్బిగుబ్బచనుముక్కుల్ నిక్కి చొక్కంపుకం
చుళి నొక్కింతవకావకల్ గొలుప మించుల్ గ్రమ్ముదోర్మూలని
ర్మలశోభల్ భుజభూషలం జికిలిదోమం బ్రోన్నమత్ప్రాంజలిం
దలఁబ్రా ల్వోసెఁ దలోదరీమణి పృథాతామ్రాధరాసూతికిన్.


గీ.

ధన్యకన్యక ద్రుపదుండు ధారవోయ, ధర్మతనయుని వెనుక నాధౌమ్యుఁ డంత
నింతిఁ బాణిగ్రహణము చేయించె నటుల, కడమ నల్గురిచే యథాక్రమము గాఁగ.


మ.

ద్విపముల్ నూఱురథంబులట్ల హయముల్ వెయ్యేసి దాసీమణుల్
చపలాక్షుల్ పదివేవురుం గనకచంచన్మంచకాంచన్మణీ
తపనీయాభరణంబు లెన్నియయినన్ ద్రవ్యం బపారంబుగాఁ
గృప నొక్కొక్కరి కగ్నిసాక్షిగ నొసంగెన్ మామ యల్లుండ్రకున్.


మ.

ఘనపాకాన్నము గన్నవారల కిడన్ గన్నారె రూకన్న నా
కును బోకన్న నోకన్న మున్నిటులు గోకొమ్మన్నచో టున్నదా
మనప్రాకెన్న చెలంగెఁ గీర్తిలతికల్ పాకారిలోకంబువెం
టనె ప్రాఁకె న్నయమొప్పనంచు నరులాడంజొచ్చి రిచ్ఛాగతిన్.


గీ.

నాగవల్లి మించె నానామనీషి పు, న్నాగవేల్లితేచ్ఛ బాగుదీర్చి
త్యాగ మెల్లి యనుచుఁ దక్కువార లొసంగు, నాగవల్లిమాత్రమే గణింప.


గీ.

ఏగుఁ బెండ్లినాఁడ హీనకాహళశంఖ, పటహవాద్యపద్యబాణవిద్య
భోరుకలఁగె భూనభోభాగ మారేయి, పట్టపగలుచేసెఁ బంజు లెల్ల.


ఉ.

విందులకెల్ల నేఁ డిచట విందనినన్ సచివుల్ పురోహితుల్
గొందఱు బజ్జిపచ్చడులు గూరలు చారులు పిండివంట లె
ల్ం దగఁదెచ్చిరైందవ శిలాకులతుందిల పాకమందిరా
ళింద బహిర్మహీ రచితలేఖ మణీఖచితాగ్రవేదికిన్.


క.

వంట యొకించుక చేయుం, డంట ల్విన్నారొ లేదొ యచటిసువారం
బింటికలకంఠు లొకగడె, యంటనె కావించి రీశ్వరాయుతమునకున్.


మ.

పిలువంబోయిన యంగజాలతరువుల్ బీరమ్ములున్ ఱొమ్ము టె
క్కులపూఁతల్ గసివింతయెత్తుబురుసాకుళ్ళాయ లందంపుఁజే

జలగఁదంబరచట్టకుంకుములు కత్తుల్ హత్తి గేహాల్పభో
జులునై యెమ్మెలభోజనంబులకు రాజుల్ వచ్చి రచ్చోటికిన్.


క.

విందున కరుదెంచిరి తల, కుందగు దోవతులు పట్టుకోకలు వెంటం
గొందఱుపిల్లలు జతగా, నాందోళికలం బురోహితామాత్యవరుల్.


మ.

బుడుతల్ పెద్దలు వీజనంబులును జెంబుల్ గొప్ప దొప్పాకులున్
నిడియందంబుల చొప్పయీనె లొకయింతే ప్రొద్దు పోకుండ నాఁ
గడు నీరల్వలెఁ బెట్టరాదనుటలుం గన్పట్టఁగా నూరగా
మిడిబాప ల్చనుదెంచి రాద్రుపదభూమీభర్త యిల్చేరఁగన్.


క.

తెప్పలుగా దొప్పలు మరి, దొప్పలకుం దగినయాకు తుదినాకులకుం
జెప్పనగు పసిఁడిచెంబులు, నప్పార్థివుఁ డేర్పరించె నయ్యెడ నెడకున్.


క.

కడలేనివెడలు పెంతే, నిడివియు నగ్రముల తగులు నిగనిగలిగురుం
గడిమి గల యనఁటియాకుల, యెడఁ జూచినఁ గడుపు నిండదే భోక్తలకున్.


ఉ.

ఇక్కడఁ గూరుచుండుటల కీరలె పెద్దలు లేచిరండు మీ
రొక్కరు వంటశాల కడుయోగ్యము మీ కది తేమ కేమి యీ
ముక్కలిపీటమీదియది మూర్ఖుల చో టిట మేలటంచు స
ద్వాక్కుల నక్కులాధికుల వైదికులం దగుచోట నుంచినన్.


ఉ.

వడ్డనఁ జూపి రంత చెలువల్ తెలియోగిర మొల్పుపప్పు మెం
డొడ్డిన కూరగాయ ఘృతముక్కెర చక్కెరతేనెలడ్డువా
లిడ్డెన నానవాలు చలియించని తైరులు మోరు మేరు పై
గిడ్డి తలంచిరోయనఁగ గేస్తులకబ్బె సమస్తభాగ్యముల్.


క.

చేత మెతుకంటకుండన్, శీతాభోగముల వారిచిన యోగిరమౌ
రా తుమ్మిపూల తెలుపా, హా తావి యయారె వేఁడియని వేఁడి రొగిన్.


క.

గేస్తులకుఁ బసిఁడిగిన్నెల, కస్తూరి యనంగ నెంత కర్పూరంబే
శస్తమన వాసికెక్కిన, నిస్తులసద్యోఘృతంబు నెలఁతుక వంచెన్.


క.

ధూర్తులు దిఙ్మారీచమ, వార్తక మటంచు మరీచవర్ణన గనుచున్
గీర్తించిరి తొడిమన్ ధి, గ్వార్తాకమవృంతకమని వంకాయఁ దగన్.


గీ.

ఉప్పుపులుసుఁ బట్టి యొక్కింతమిరియంబు, ముట్టి తిరుగఁబోఁత చుట్టినట్టి
వేత వేఁచినట్టి నిడుపుఁ గాకరకాయ, వరుసనిడియె నొక్కవంటలక్క.


క.

ఉడికిన పిమ్మట మిరియము, పొడి బెల్లము చల్లి యుద్దుపొడి రాలిచి నే
తిడి నెఱ్ఱఁగ వేఁచిన వేఁ, పుడుఁగంద మిళిందవేణి పొందుగ నిడియెన్.

క.

ఇడఁదగిన పులుసుమిరియము, గుడుముంగల వేఁడివేఁడి గుమ్మడితునకల్
బెడిదంపురసము గూడఁగఁ, బడఁతుక వడ్డించె నొకతె బడలిక దీఱన్.


క.

ముట్టినదె ముట్టి మఱియును, బట్టినదే పట్టి ముళ్లువడక పడంతుల్
గట్టి మిటారులు బంగరు, చట్టుల వడ్డించి రెట్టిజగజెట్టులనన్.


ఉ.

ఎందఱు బోనకత్తెలు మహిందలచూపరు మందయాన లా
యందెలమ్రోఁత లానగవు లాపిఱుఁదంటిన కీలుగంటు లా
కుందనపుందనూలతల కొందళుకుం దొలుకారుమించు లా
యిందుకళాకలాపుఁ డొకయింత గన న్వడదాఁకి చొక్కఁడే.


శా.

వక్కాణింపఁగరాని వీజననభస్వత్కాచయంత్రాంబుభృ
ద్దిక్కేలద్ఘటకోటి నిందు మణివేదీవాలుకావాలతన్
మక్కాచెంబులఁ జల్లఁజేయ వడిగండ్లంబోలు సౌరభ్యస
మ్యక్కద్వీపతీజలంబు జన మాహా యంచుఁ ద్రావెం దమిన్.


గీ.

ఓర్పుగలవార లామీఁద దర్పుతారి, యోర్పుగలవారు రాజకందర్పులార
యోర్పు గావింపరాదె యీ యూర్పులకును, నేర్పుతో నంచు బంతులు తూర్పువట్టినన్.


సీ.

అమృతోష్ణపక్వతావ్యక్తంబు భుక్తంబు గ్రామాంతరాపణాగతము ఘృతము
పవమానసఖముఖాపాకంబు శాకంబు లసదామ్లలవణనీరసము రసము
ప్రోద్ధూతశర్కరారూపంబు పూపంబు విగళితమాధుర్యనగరి సిగరి
యంబుగోధస్యఖిన్నంబు క్షీరాన్నంబు హతశుచి రుచిపాలు నానవాలు
చారులేకావు బజ్జిపచ్చళ్ళతీరు, పేరుకోకున్న యీతైరునీరు మోరు
లెటుల భుజియించెదరటంచుఁ గృపదలిర్ప, ద్రుపదనృపదర్పకుం డప్పు డుపచరించె.


క.

బుధులరుదా ద్రుపదాధిప, మధురశరచ్చంద్రికా సమధిగతదీధి
త్యధరీకృత చణమాహిష, దధికలశోదధికిఁ గలశతనుభవు లగుటల్.


క.

వడపిందెయు మామెనమా, రెడుగాయయు నల్లమున్ మిరియవూర్గాయల్
కడనుండఁగఁ దొక్కుడుమా, మిడికాయయు నూరుఁబిండ్లు మెచ్చి రలంతుల్.


క.

అజ్జనములు లవణైలాం, చజ్జృంభము మిళితజంభ సంధిన్నగహృ
త్వజ్జాంభము గుంభితరం, గజ్జంభము నీరుమజ్జిగం గొనియాడెన్.


క.

ఉప్పూరఁగాయ వడియం, బప్పడముం బారుఁగూర లన్నము ఘృతమున్
బప్పుం బాయసముం బా, లప్పాలున్ దధియుఁ దక్రమౌ నని రధిపుల్.


శా.

ఓరన్బెట్టిన యప్పళాలు కడలందొప్పారు నేద్దొప్పలున్
దొరన్ వట్టిన చంద్రఖండములు దొంతుల్గన్న వెన్నప్పముల్

ధారల్గట్టిన పుట్టతేనె వఱదల్ దార్కొన్న క్షీరాన్నముల్
మేరల్పట్టిన గట్టితైరులివి సుమ్మీ భోక్తృసంత్యక్తముల్.


సీ.

ఒకవ్రేలఁ జవిచూచి యోరద్రోచిన బజ్జి యాఘ్రాణమునఁ బేర్చు నామ్రఫలము
వాసనిడ్డెన నేతనద్ది నిల్పిన దొప్పపై చప్పరింతల పనసతొనలు
చక్కెరఁ బొరలించి చాలించు రసదాళ్ళు కడద్రుంచి యుంచిన కమ్మవడయు
మీఁదిమీఁగడమాత్రమే గ్రహించిన దధి యంటివైచిన కలవంటకములు
కొఱికివిడిచిన యూర్గాయకొంత నాల్క, నోపి పడవైచు జున్నులు మూతిముట్టి
మీటు కర్లపుటీతక్రమే ఘటిల్లె, భోజనాంతాన మత్కుక్షిభాజనములు.


క.

చేతుల కిడు నూతనకల, శీతలకేతకసుగుంధిశీతలజలముల్
భూతలమున దొరుకుట యె, ట్లీకల సింహాసనస్థహితసేవనకున్.


క.

పొంకముగ నతఁడు నృపమీ, నాంకులకంకురితఘుమఘుమామోదహి మై
ణాంక మృగీమదపేషిత, కుంకుమ పంకంబు గాజుఁగోరల నొసఁగెన్.


క.

ఆగుణమణి యొక్కనికిడు, బాగాలేచాలు బహుళపరిణయములకున్
బాగైన వలువ లొకనివి, భోగింపఁగ సీమ కేండ్లుపూండ్లకుఁజాలున్.


శా.

గవ్యాపారకృపాకృపాణహత రక్షఃకుక్షిదోరంగ రం
గవ్యాపార పరాపరాశర నిరీక్షాహృష్టభాచక్ర చ
క్రవ్యాధూతమురామురళ్యమిత రాగస్థాపనాదక్ష ద
క్షవ్యాళక్షతి తార్క్ష్యదేవనుత రక్షాదీక్ష దీక్షానిధీ.


క.

కస్తూరిరాయకౌస్తుభ, వస్తూరీకృత శరీరవైభవభవ భ
వ్యస్తవనభవన నవనీ, తస్తేయవిధేయ సంతతస్మేరముఖా.


ఉత్సాహము.

మిత్రజాంబవద్విదర్భమేదినీశ్వరాది స
త్పుత్రికాభుజాగృహీత భోగ్యనాగవల్లికా
చిత్రవర్ణతాళవృంత చేలఖండ చామర
ద్విత్ర పంచషాఖ్యముఖ్య వీక్షణీయలక్షణా.


గద్య.

ఇది శ్రీమద్రామభద్రభజనముద్రకవిపట్టభద్ర కాద్రవేయాధిపవరసమాగత
సరససారస్వతలహరీపరిపాక కాకమాని ప్రబోధబుధకవిసార్వభౌమపౌత్ర
రామలింగభట్టపుత్ర కౌండిన్యగోత్రభాగధేయ మూర్తినామధేయప్రణీతంబైన
పాంచాలీపరిణయంబను మహాప్రబంధంబునందుఁ జతుర్థాశ్వాసము