పాంచాలీపరిణయము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

పాంచాలీపరిణయము

తృతీయాశ్వాసము

క.

శ్రీరమణీ హీరమణీ, భారమణీయాగ్రనఖర భరితకపోలా
భూరితర భూరిచేలా, శ్రీరంగవిమానశయన శీతలనయనా.


వ.

అవధరింపుము జనమేజయునకు వైశంపాయనుం డిట్లనియె.


మ.

తులసీమృత్తిలకన్ విశుద్ధదశనన్ దోరంగుళీ కాశికా
స్థలముద్రాంకిత తామ్రముద్రికఁ బ్రభాతస్నాతఁ బశ్యాల్లగ
త్ఫలితశ్యామశిఖన్ బురాతన పరీతక్షౌమ లంబశ్రవ
శ్చలవర్షవ్రతతంతుఁ గుంతిఁ గని వాంఛన్ మ్రొక్కరంతన్ సుతుల్.


వ.

మ్రొక్కి యక్క యొక్కభిక్షంబుఁ దెచ్చితిమనఁ దత్క్షణమ దక్షణదిగ్రక్షతనయా
గ్రక్షోణి రాణించు నప్పద్మదళాక్షి మీరేవురు నుపయోగింపుండని పుండ్రేక్ష
ధర్మసామ్రాజ్యలక్ష్మి నాఁబశ్చిమక్షితి నీక్షింపందగిన యరవించాక్షిం గటాక్షించి
ధర్మభీతయై మాత ధర్మతనూజాతున కిట్లనియె.


శా.

 కంటే కన్యకయౌ టెఱుంగకయ భిక్షలంబేవురం బంచుకొం
డంటి న్నాపలుకింత తప్పదు మదీయాజ్ఞన్ విడంజాల రి
ట్లంటేనన్ ధర నవ్వునన్న యమజుం డయ్యర్జునుం జూచి కై
కొం టొప్పున్ సతిఁ దెచ్చు నీకనుటయున్ గోత్రారిజుం డిట్లనున్.


క.

కొండికవారికిఁ బెద్ద ల, టుండఁగ సతిఁ బెండ్లియాడు టుచితమె మీరే
కొం డిందఱియనుమత మిది, యొండొకపలు కేల యనుచు నుండెడువేళన్.


ఉ.

అండజరాజయాన వదనాబ్జముపైఁ గుచకుంభపాళిపైఁ
గండతలంబుపై వెడఁదకన్నులపైఁ గబరీభరంబుపైఁ
బాండుతనూజపంచక మపారకృపారసమానసంబు దృ
క్కాండము వంచెఁ గంజభవు కట్టడ దప్పునె యెట్టివాఱికిన్.


గీ.

అటుల చపలాక్షిపై మోహ మైదుగురికి, నేకమగుటెంచి మనమింద ఱిందుముఖి వ
రింత మిది వ్యాసునానతి యింతె యనుచు, నన్నతమ్ములతో నాడునవసరమున.


క.

ముసలాయుధకరుఁడును మరి, కిసలాయుధగురుఁడు వచ్చి కృపఁగనిరి సమి
ద్వ్యసనాభ్యసనారిజన, శ్వసనగ్రద్విరసన సన సమభుజు యమజున్.


గీ.

కని యెఱింగించుకొని ధర్మతనయునకును, గుంతికిని మ్రొక్కి భీమఫల్గునులఁ గౌఁగి
లించి మాద్రికొమళ్ళ దీవించియున్న, రామకృష్ణులతో ధర్మరాజు పలికె.

గీ.

కుశలమా మీకు బాడబగూఢవేష, భాషణాలంకృతుల మమ్ముఁ బాండవేయు
లగుట యేరీతిఁ దెలిసితి రన్న నగుచు, ధర్మసూతికి నందనందనుండు పలికె.


చ.

క్షత్రియతేజము ల్తెలియఁజాలరె ధీనిధులైనవారు భూ
మిత్రిదశాకృతుల్ గుఱుతె మీగుఱు తేయుటె తెల్పఁజాలెడిన్
ధాత్రిఁ బ్రధూమరేఖలు ధనంజయుఁ జూపవె యీధనంజయ
క్షాత్రమె బైలుచేసె ననఁగా యమసూనుఁడు హర్షితాత్ముఁడై.


మ.

కరటిం గాంచిన తండ్రి వీవ ధృవు రక్షారాహితిక్షీణు న
క్షరుగాఁ బట్టము గట్టినట్టి యజహత్కారుణ్యపాధోధి వీ
వరిపూర్విన్శరణార్థి కిచ్చు దొరవీవా నాఁటికిన్ నేఁడు నిన్
గరుడస్యందను నందనందను ఘనుం గంటింగదా మాధవా.


క.

ద్వారక యెక్కడ ద్రుపదుని, యూ రెక్కడ యూరిలోన నొకకడఁ గుం
కారాగారం బెక్కడ, యీ రరుదెంచుటకు భాగ్య మేమందు హరీ.


సీ.

కడుఁజిక్కి యెక్కఁడెక్కడ మొఱవెట్టునోయని యక్కడిదెక దాహాళి నీకు
పట్టి యెవ్వఁడు బంటుఁగట్టి కొట్టించునోయని యక్కడిదెకదా కనికరంబు
రిపుఁడైనను విపత్తు లెపు డడ్డపడునొకోయని యక్కడిదెకదా యాదరంబు
తలిదండ్రిప్రాపుతో దాసుఁ డెంత డలుసో యని యక్కడిదెకదా యమితకరుణ
తనులతాయాస మెంచెదొ తనవు దాఁచు
కొనెదొ యీగికిఁ గొంకెదొ కొసర నిడెదొ
కొలువు గొలిచిన మది నమ్ముకొన్న నిన్నె
యన్యులఁ దలంతురే రక్ష కంబుజాక్ష.


క.

మాతండ్రిగులు తెఱుంగుదు, మాతల్లివి తండ్రియైన మాధవ మాకున్
ధ్రాతవు నేతవు హితసం, ధాతవు గద యాదవాభ్యుదయకరహృదయా.


వ.

అని యని వారితోదితఖనియై కని యాతండు కొనియాడిన.


గీ.

లక్కయిలుచెంత నొక్కింత మొక్కవోక, వెక్కసపుఁగౌరవులనెల్ల లెక్కగొనక
కన్యఁ గైకొంటి రిఁక మేలుగలుగు ననుచు, నతని నూరార్చి సబలుఁడై యరిగె శౌరి.


ఉ.

అంతట నందనుం బిలిచి యాద్రుపదుండు కుమారిఁగొన్నవాఁ
డెంతటివాఁడొ పేరు కుల మెయ్యదియో నెల వెద్దియొక్కొ యా
వింతయుఁ గాంచిరమ్మనుచు వెంటనె పంపినఁ గుంభకార గే
హాంతముఁ జేరి వేఁ దెలిసి యాతఁడు గ్రమ్మఱి తండ్రి కిట్లనున్.

శా.

వారయ్యిద్దఱుఁ గృష్ణఁ గూడి ఘటకృద్వాసాప్తులై యొక్కవృ
ద్ధారత్నంబునకు బ్రణామ మిడి రంతన్ భూసురశ్రేణికిన్
గౌరాంగుం డనుపం జతుర్ద్విజులు భిక్షం బెత్తి తే నేడ్గురున్
వారెల్లన్ భుజియించి కూర్కి రచటన్ దర్భాజినశ్రాంతులై.


క.

గోత్రామరులో క్షత్రియ, పుత్రులొ కావలయు నల్ల భూసురవేషుల్
ధాత్రీశ యితరజాతిచ, రిత్రులుగా రుక్తిరూపరేఖలు చూడన్.


సీ.

ఇప్పపూరాజనా లింతమెచ్చని మచ్చెకంటి కాబిచ్చాలవంటకంబు
పళ్ళెరం బిడులోనె పారుపత్యము చేయు కలికి కాండండఱి కడలు కుడుపు
చెంగల్వవిరిశయ్య నంగమొత్తుట కుల్కు బిబ్బోకరాశి కాదబ్బపాన్పు
మణులయొడ్డాణం బమర్పిన బరువెన్ను క న్నె కాయార్వుఱ కాళ్ళమోపు
బాపురే విధియం చేరుపడని కాపు, రము విలోకించి పాంచాలి ప్రాపు గాంచి
సంచలించెను మామకస్వాంతవీథి, చెలువభాగ్యంబు దేవరచిత్త మధిప.


శా.

అంచుంబల్కఁ బురోహితుం బిలిచి జాత్యాదుల్ విచారించి ర
మ్మంచుం బల్కిన ధర్మజుంగని యతం డాశ్చర్యచర్యల్ తదీ
యాంచద్రూప మెఱంగివచ్చి ద్రుపదక్ష్మాధ్యక్షుతోఁ జెప్పినన్
జంచద్ఘోటురథంబు లేర్పఱచి ధృష్టద్యుమ్నుఁ దోడ్తెమ్మనన్.


ఉ.

ఆతఁడు తీవ్రయత్నమున నచ్చటి కేగి పరేతరాట్తనూ
జాతుని గాంచి యానృపుఁ డొసంగు సపర్యల కుబ్బి పార్షద
క్ష్మాతలనేత రమ్మనిన చందముఁ జెప్పిన మాతృభామినీ
భ్రాతృపరీతుఁడై నగరిపజ్జకు వచ్చె రథాధిరూఢుఁడై.


మ.

అలఘుప్రాసశరాసధారుల యుగవ్యాయామబాహాయుగా
ర్గళులన్ లోహకనాటగాఢతరవక్షఃపీఠ వైశాల్యని
ర్మలరేఖాఘనులన్ ఘనాంగసుషమామార్తాండులం బాండవే
యులఁ బాంచాలుఁడు చూచి బాహుజులెయం చూహించె నేతేరఁగన్.


క.

చనుదెంచి యిటులు కుంతీతనయులు తనయొద్ద రాజతనుజోచితపీ
ఠిని నిశ్శంకత గూర్చుం, డిన వారికి ద్రుపదుఁ డిట్లనియెఁ బ్రియ మెసఁగన్.


శా.

అయ్యా మీరలు బాడబాగ్రణులొ బాహాజన్ములో ద్రౌపదిన్
దియ్యంబోడి వరింపఁగా వసుధ కేతేఁజూచు నాదిత్యులో
మీయూరుం గులగోత్రముల్ తెలియ కీమీనాక్షి నుద్వాహ మేఁ
జేయంజాలనటన్నఁ బాండుతనయజ్యేష్ఠుండు తా నిట్లనున్.

ఉ.

ఇయ్యమ కుంతి ధర్మజుఁడ నే నితఁ డగ్నిసుహృత్తనూభవుం
డియ్యన యింద్రసూనుఁ డలయిద్దఱు మాద్రికొమాళ్ళు మున్నునూ
యయ్యను బాండురా జనఁగ నారసినాఁడవె యివ్వి మాకతల్
వియ్యము లియ్యనౌనొ పనిలేదొ తలంపుఁడు మాట లేటికిన్.


క.

అని పలికినఁ జెవులకు సుధ, గనిచినికిన యట్టులైనఁ గాంపిల్యవిభుం
డనుమోదలహరి విహరిం, చెను హరిహరి యనుచు వారిసేమము గనుచున్.


క.

లక్కయిలుదక్క నొక్కరుఁ , జిక్కక యిక్కుంతితోడఁ జేరిలి రిటులీ
దిక్కునకని ధర్మజుచే, నక్కథ నిని నింద చేసె నక్కురురాజున్.


క.

ఈజాడ నతఁడు సైరిభ, వాజివజీరునితనూజు వర్ణితతేజున్
బీజించి కొన్నినాళ్ళకు, రాజన్యులు కొలువ ధర్మరాజున కనియెన్.


క.

ఆఖండలనందనుఁ డీ, రేఖాఖనికన్యకాబ్జరేఖానిటలా
రేఖాశిఖామణికిఁ బతి, యై ఖేదం బడఁచె మోద మలవియె పొగడన్.


పంచచామరము.

స్వయంవరానులబ్ధలబ్ధవర్ణవర్ణనీయ మ
త్ప్రియాత్మజాత నర్జునుండు పెండ్లియాడువాఁడనిన్
వయోధికుండ నేను వాయునందనుం డటుండఁగా
నయుక్త మింద్రభూవివాహ మంచు ధర్మరా జనన్.


గీ.

అన ద్రుపదుఁ డగ్రజులు మీరలైనఁ బెండ్జి
యాడుఁడన నేవురమును గల్యాణమౌదు
నుత్తలోదరి మాతృవాక్యంబు కులగు
రూక్తియును నిట్టిదిదె మాకు నుచితమనిన.


క.

బహుభార్య లొక్కరునికి, న్సహజంబగుఁ బెక్కుమగలు సతికొక్కతెకున్
విహితంబగునా యదియే, మహిలో లేదనుచు ద్రుపడమహిపతి పలికెన్.


గీ.

పలికి లౌకికవైదికప్రకటధర్మ, తత్వవిదుఁడవు ధర్మనందనుఁడవు
నీనుడువు త ప్పదెల్లి యీవేనుఁ గుంతి, యును విచారించతమని చింతపడినమీఁద.


సీ.

ప్రొద్దుమద్దుకొమార్తె పురిటింటిపసిబిడ్డ భరతాన్వయప్రతిపాదకుండు
ప్రాఁగబ్బపుంబల్కుబడి చిక్కుదీర్పరి గారుడాదిపురాఁకర్త
రాచబాపన చివ్వరవ్వముమ్మనుమండు శుకయోగి వరకథాంశురపరమూర్తి
తొలుకాఱుమొగులు కొందళుకుమేనిమిటారి యపిపిశంగనిటాఘటాంగమూర్తి
కేలు కెందమ్మి దండంపుఁగోలవాఁడు
చటులకటిబద్ధపటుకృష్ణచర్మనిర్మ

లాంబరపరాయణుఁడు బాదరాయణుండు
కరుణఁ జనుదెంచెఁ బాండవాగ్రజునికడకు.


గీ.

ఇట్లు చనుదెంచు ముని కెదురేగి మ్రొక్కి, ధర్మతనయాదు లర్ఘ్యపాద్యంబు లిచ్చి
రత్నపీఠిక నిలుపు వారలను గుశల, మరసియున్నంత ద్రుపదుఁ డిట్లనియె మునికి.


చ.

పలుకు శిలాక్షరం బుచితభాషణుఁ డీయమనందనుఁడు నేఁ
డిలసతి నేవురుం బరిణయించెద మంచు వచించె ముజ్జగం
బుల నడవ ళ్ళెఱుంగుదురు ప్రోడలు మీ రిటువంటివర్తనం
బిలఁ గలదేని తెల్పుఁడన నిట్లను ధర్మజుఁ డందఱు న్వినన్.


క.

నగవునకుం గలనైనం, దగులునె మామకరసజ్జఁ దప్పుంబలుకుల్
తగవిది మాకేగురకుం, జిగురాకుంబోడిఁ బెండ్లి చేయుట యొప్పున్.


క.

మును గౌతమఋషికన్యక, తనను తపోగతి వరించెఁ దగ నేడ్గుర న
ట్లనె దాక్షాయణియను ముని, తనుభవతా భార్యయయ్యె దశపురుషులకున్.


క.

గురువులలో జనయిత్రియె, పరమంబగు గురువు జననిభాషణమె నిజం
బరయ వృథ సేయరాదన, ననవరునకు ననియె ద్రుపదనందనుఁ డంతన్.


శా.

సత్యము గాఁగ ధర్మము విచారము చేయ నశక్య మేరికిన్
నిత్యవిధిజ్ఞుఁ డార్యగణనీయుఁడుగానఁ ద్రిలోకవంద్యుఁ డీ
సాత్యవతేయుఁ డీయన వచస్స్థితివంక శుభంబటన్న నా
వ్రత్యవతంస మాద్రుపదరాణ్మణి కిట్లను నప్పు డొప్పుగన్


ఉ.

కుంతియు నేల తప్పఁబలుకు యమనందనువాక్య మేల యొ
క్కింతయఁజుల్క నౌ జగతి నిద్దఱిసుద్దియు దేవతావరం
బింతె కుమారి నేవురకు ని మ్మిది దైవకృతం బటంచు నే
కాంతగృహంబు చేరి యితిహాసము చెప్పదొడంగె నత్తఱిన్.


గీ.

 తొల్లి నాలాయనియనంగ దొరయు నింద్ర, సేనసతి యస్థిచర్మావశిష్ట కష్ట
తనునిఁ బతిఁ గుష్ఠరోగి మౌద్గల్యు వృద్ధుఁ, దగ భజించుఁ దదుచ్ఛిష్ట మొగి భుజించు.


గీ.

అంత నొకనాఁడు నిర్మలస్వాంతమౌని, మౌళి భుజియింపఁ బాత్రలో వ్రేలు దునికి
పడిన మది నీసడించక కడకుఁ దిగిచి, వైచి భుజియించె నప్పతివ్రతలతల్లి.


క.

భుజియింపఁగఁ గనుఁగొని ముని, నిజభ క్తికి మెచ్చి యెద్ది నీకిష్టంబో
గజగామిని యిచ్చెదఁ గొ, మ్ము జగమ్ము నుతింప నన్న ముద్దియ పలికెన్.


గీ.

నాథ నీయందు భోగేచ్ఛ నాకుఁ గలదు, హేయరూపాకృతులు సూప కిక్షుచాప
రూపసంపద సొంపు దార్కొనఁగఁ గోర్కి, దీర్పు కందర్పకేళి నీనేర్పుకలిమి.

మ.

పరమానందకరంబధః కృతపరబ్రహ్మం బసారీకృతా
జరసమ్రాట్పద మాహృతద్రవిణ చంచల్లాభలోభంబు శం
కరవార్యాన్యము సర్వసమ్మత మనేకప్రాపితానీక మా
సురతం బెవ్వరివెఱ్ఱిఁ జేయ దిదియే సు మ్మిష్ట మాత్మేశ్వరా.


క.

హృదయేశునిండుకౌఁగిట, వదలని మదవతికి వయసు వ్రాలదు రతిరా
ట్కదనంబు లేని ముదితయ, ముదియుట యెంతయ్య సకలమునికులతిలకా.


ఉ.

గద్దరిచేఁత నేతయిడుగళ్ళ నఖాంకము నాభినామమున్
నిద్దపుమోవికెంపు జిగినిచ్చలపుం గుతికంటు కెంపుసొం
పద్దము చూచి చొక్కు ముకురాననభాగ్యమె భాగ్య మొక్కెడన్
ముద్దియ పాన్పుపై నవలిమో మిడి త్రెళ్ళుట లేటిభాగ్యముల్.


క.

అన విని ముని నాలాయని, కనువగునని యేనురూపు లంది సహస్రాం
కునితేరుపయిం జనిచని, వినువాఁకం గ్రుంకి మేరువిహరణరతుఁడై.


సీ.

ఒకనాఁడు క్రీడించుశకునేడుదితచారుతరసుమేరునమేరు తరుతటముల
నొకప్రొద్దు రతితి సల్పు సకలద్రుమచ్ఛాయ మలయాద్రి వలయాద్రి మహితగుహల
నొకవేళ విహరించు సికతాలయోత్తాల హిమశైలసుమసాలసముదయముల
నొకపూట సుఖియించు శుకఘోటబలచూతకులగీతకలధౌతకుధరతటుల
చటులతర గంధమందరాచలపటీర
కుటజవిటపిచ్ఛటాకుంజ కుటిలనిటల
కుటిలనిటలాంకుఁడు నటత్కుటిల చికుర
ముకుముఖిఁ గామ సంగ్రామమునఁ గరంచె.


గీ.

గహనబహుమహీధరగుహాకటకటతటుల, నిటుల మౌద్గల్యమౌని యయ్యింద్రసేన
కూడికొని పెక్కువేలేండ్లు క్రీడ సలిపి, యంత సంతుష్టుఁ డగుచు బ్రహ్మత్వ మందె.


క.

పతియేగినతతి గ్రాఁగిన, సతి రేఁగినవలపుతోడ జాఱినవ్రీడన్
బతియోగము రతిభోగము, హితరాగము లేనిదాని కిట్లని వగచున్.


శా.

మౌద్గల్యానత వాలఖిల్యనుతనైద్మల్యా యహల్యాధరాం
చద్గల్యాకృతి దానదక్షతర వాక్సత్యాంఘ్రిసేవారతా
త్వద్గాఢాపఘనోపగూహనకళాదర్పానుకూలన్ నిశా
క్షడ్గాంశూత్కరముద్గరప్రహరణచ్ఛిన్నాంగఁ గావింతురే.


మ.

పడఁతిం బాసినవానిమోముఁ గను నప్పాపాత్ముఁడు
న్వేసవిన్
మిడిమధ్యాహ్నము పైనమై కదలువాని న్విన్నమందుం డొక

ప్పుడు రామస్మరణంబు చేయనియసభ్యుండున్నచోనున్న య
జ్జడుఁడున్ గన్పడఁడాత దృష్టి కనవా సన్మౌని సంక్రందనా.


చ.

చందురుఁడంత నీమొగము చందమువాఁడని లోకులాడుటల్
విందునుగాని చూచుటయు లేదెటువంటదొ యాస మౌని సం
క్రందన డెందమాపక మొకం బొకయించుక యెత్తి నేఁడురా
కేందునిఁ జూడఁగావలసె నెట్టివి కన్గొననున్నదాననో.


ఉ.

వింతకవుంగిలింతల నవీనగళధ్వని యెచ్చరింతలన్
దంతనఖక్షతంబుల నితాంతకచాకచిపైరుచిన్ శచీ
కాంతవనీనిశాంత శశికాంత శిలాతల కంతుకేళిగి
ల్గింతలు గొల్పునాఁటితగులే మన సయ్యెడు నేమి సేయుదున్.


క.

ఉపవనిమునివై శమివై, తపసినివై యునికిఁగనితొ తాపసలోక
ద్విపమాయని కృపమాయని, జపిరాయని వెదకి మదనశరబాధితయై.


ఉ.

ఇంచుకతీపువింటి కుదయించఁగఁ జేసి గుణంబుచేతఁ బా
టించిలకోరి వాసనగడించి పటానికి ఱెక్కచాలు గ
ల్గించితినం చయో సుదతికిన్ మదిలేని భయవ్యథలన్ సమ
ర్పించేను కన్నవారలకు రెండుదలంతురె భావసంభవా.


ఉ.

కేవలనిష్ఠుప్రథనకేళి మెయిం బురుషాగ్రగణ్యులం
గావక నొంపఁగావలయుఁగాక యకారణవైర మజ్జరే
ఖావరకంఠులన్ దలిరుఁగత్తులఁ గుత్తుకఁగోసి నెత్తురుల్
ద్రావెడువాఁడ వీవు నొకరట్టడిబంటవె సూనసాయకా.


క.

గాంగేయాంగులవిలువీఁ, కంగొని తెరవాటు గొట్టఁగాఁ గఁదనేఁడో
యంగభవభువనమున నొక, భంగిం దొరవైతి వీవు ప్రద్యుమ్నుఁడవై.


క.

ఉడుపతి హిమఘృణిచే బలెఁ, దడిప్రాంతన్ గొంతుగోయు తగ వెఱిఁగితివో
కడుమెత్తని తలిరాకులఁ, బడఁతులమెడ గోసె దీవు బాపురె మదనా.


క.

రూ పైతి వెటులనోయి ని, శాపతి దోషాకరుఁడవు జైవాతృకతన్
బాపీ చిరాయువను నా, లాపమ్ములు నిజములయ్యె లలనామణికిన్.


క.

సోముఁడ నంధకపైరి న, హా మృగలాంఛనుఁడననియు నంభోజముఖీ
స్తోమముపై లయకాలో, ద్దామతఁ గనిపించె దీవు ధవళమయూఖా.


గీ.

విషము గ్రక్కంగఁ జూచెదవే నిశీధి, నీభుజంగుండనంచునో నీరజారి
యైన హరి వౌదు గాక నీయాటలీడ, నగునె యండజరాజ యానాంగణమున.

క.

లేటిం దాఁచుకొనవొ ము, న్నీట న్నడయాడలేదొ నిను ద్విజరాజం
చేటికిఁ బలుకన్ గోకా, ఖేటకపాటవకిరాటకేసరివి శశీ.


శా.

సాయంసంధ్యకు రా వొకప్పు డది నష్టంబైన మధ్యాహ్నసం
ధ్యాయోగం బొకయింత లేడెకద ప్రాతస్సంధ్యకున్ సింధువున్
డాయంబోయి మునింగి బైటఁ గనుపట్టంగాన మేమీ తమీ
శాయీష న్నియమంబు లేదు ద్విజరాజత్వంబు నీకర్హమే.


గీ.

కామికళ్యాణహరుఁడు చక్రద్విజాప, హరుఁడు గురుతల్పగుఁడు సురాహారకర్త
మధుహితానుగుఁడని నిన్ను మనుజు లాడి, కొనరె పంచమహాపాతకుఁడవు చంద్.


శా.

గాటంపుం జనుదోయి నాభికుహరీక మ్రోరువుల్ నీకయో
పాటీరాగమొ సంకజాకరమొ రంభాకేళి కాంతారమో
తాటంకి న్యభిరామగాత్రములపై ఢాటీసమాటీకముల్
పాటింపందగవౌనె మందపవనా పాటల్యటజ్జీవనా.


ఉత్సాహ.

కోకనద మృగీలలామ కోటికాసమీరమా
ఱేకు మడఁచనిమ్ము కలువఱేనిభాసమీరమా
నీకుఁ గొమ్మయంగమింతే నిత్యవాస మీరమా
మాకు విన్నవించ నేల మలయగిరి సమీరమా.


గీ.

అనుచు రతిభోగములఁ దృప్తిగనక తనశ, రీరమంతట రోసి పరిత్యజించి
కాశిరాజను ఋషికిఁ జక్కగ జనించి, పెక్కువర్షంబు లయ్యింటఁ బెరుగుచుండి.


ఉ.

చక్కఁదనంబు రోసి పనిచక్కటికిం జని కంజనేత్ర యా
రిక్కలరాయనిం దలధరించిన వేల్పుగుఱించి నిష్ఠ పెం
పెక్కఁ దపంపుచేయ యమహేతి మదాప్తసురేశ్వరాశ్వినుల్
చొక్కి నిజాంశజప్రమద సుమ్మనిరంత భవాంతరాప్తికిన్.


మ.

ఒకకాలంబు జలానిలాశనముచే నొండొక్కకాలంబు దా
నొకపాదాంబురుహంబు నిల్కడలతో నొక్కొక్కకాలంబు పం
చకృశాన్వంతరభాగసంస్థితులతోఁ జంద్రాననామౌళి మౌ
క్తిక మత్యుగ్రతపంబు చేసె జనతాకీర్తుల్ ప్రవర్తిల్లఁగన్.


సీ.

రేరాచగేదంగిరేకు క్రొవ్వెదతోడ వెట్టకన్ జేగురుబొట్టుతోడ
రవణంపుటెమ్ము ముత్తెపుకంటసరితోడ మెడకప్పుకస్తూరి బెడఁగుతోడ
తియ్యవిల్ దొర బూది తెలిగందపొడితోడ గాడ్పుఁదిండి పసిండికడెముతోడ
పులితోలు చిఱుతపప్పళి పచ్చడముతోడ మొనపున్కడాకాలి మువ్వతోడ

కక్షపాలికతోడ మహోక్షకోరు, రూక్షతాదీక్షతోడఁ బద్మాక్షితోడ
వీక్షణీయుఁడగుచు నిటలాక్షుఁ డబల, కక్షయక్షమ కపుడు ప్రత్యక్షమయ్యె.


క.

ఇటులు ప్రసన్నుండై ధూ, ర్జటి వేఁడుము వరమటన్న సతి పతిదానం
బిట ఘటియింపు మటంచుం, బటువాచాప్రౌఢి నేనుమాఱులు పలికెన్.


క.

పలికిన కలికిం గనుఁగొని, యళికాంబకుఁ డిట్టులనియె నైదుగురం భ
ర్తల వరియించెదు నిజ మో, జలజాక్షీ యింక నొక్కజన్మమునందున్.


వ.

అనిన విని వినతయై వనిత యవనీతలంబున నొక్కసతికిఁ బెక్కండ్రు మగ లగుట
యనుచితం బగు గావున నే నొల్లనన నల్లన గిరిజావల్లభుం డిట్లనియె నావచనం
బున నేవురుపురుషులందు ధర్మ మెడయకుండునట్లుగా వరంబిచ్చితి మెచ్చితి నన్న
సన్నుతొాంగి యంగీకరించి యేవురవరులంచుఁ బ్రత్యేకరత్యనుభవంబును గౌమార
విభవంబును బతిశుశ్రూషా మనీషా విశేష కామభోగేచ్ఛా సౌభాగ్య భాగ్యంబును
బ్రసాదింపవలయునన దానికోరిన వరంబిచ్చి గంగాతరంగిణీతీరంబుననున్న యా
ఖండలు నాయండకుం దోడ్కొనిరమ్మనిన నక్కోమలి యట్ల కాకయని కోకిలవాణీ
పినాకపాణికిం బ్రణమిల్లి యాక్షణంబ చని సహస్రాక్షుం గంగాక్షోణిం బరీక్షించు
చుండె నట దండధరుం డనిమిషారణ్యంబున సత్రయాగంబు గావించుటంజేసి
మానవులు సుఖజీవులైన మహిమకు సహింపక శతమఖముఖసంఘంబు చతుర్ముఖ
సమ్ముఖంబునకుం జని దేవా మర్త్యు లమర్త్యులయిన మాకును వానికి నంతరం బెద్ది
యని తహతహపడిన దేవతలకుఁ బితామహుం డిట్లనియె జముని తేజంబును మీ
తేజంబునుం జేరి యేవురురాజులై జనించి వారయ్యంతకుచేఁతకు హేతువగుదురనిన
బురుహూతసహితంబుగా బృందారకబృందంబు మందాకినీతీరంబు చేరునప్పుడు
తత్తటినీమధ్యంబున నొక్కయణుమధ్యామణి మనస్తాపంబు నిలుపోప కయ్యవ
రంబున.


మ.

కుధరానర్గళవృష్టివోలె వలిచన్గుబ్బన్ దృగంబుల్ వడన్
విధుబించానన యేడ్చెఁ దత్తటవతి వేల్లత్పయోజోల్లల
న్మధుపాన ప్రధమాన షడ్చరణ నానాఝంక్రియా హంక్రియా
మధురేష్వాస గుణాంకగీతలహరీ మంద్రశ్రుతిప్రౌఢిమన్.


క.

అన్నీలవేణి యేడ్చినఁ, గన్నీళ్ళన్నియును గనకకమలము లయ్యెన్
గన్నులు తామరలుంబలె, నున్నవనం గూడుటెట్టు లున్నయ్యలకున్.


క.

అచ్చెలికన్నీళ్ళు సువ, ర్ణోచ్చ సరోజోచ్చయంబు లుదయించుటకున్
విచ్చలవిడి నచ్చెరుపడి, యచ్చేడియఁగని వియచ్చరాధిపుఁ డనియెన్.

క.

బాలా యేలా యేడ్చెద, వీలాగున వచ్చు టేమి యెవ్వతె వనది
క్పాలక నాతెఱ గెఱుఁగం, జాలిన నావెంట నింతఁజను దెమ్మనియెన్.


వ.

ఇట్లు రమ్మన నమ్మఘవుండు మగువ పిఱుందన చనిచని.


ఉ.

ముందఱఁ గాంచె దిగ్రమణముఖ్యుఁడు వారుణవేషభాషణున్
మంధరకంధరాకనకమందిర మధ్య వితర్ద్య మంద పౌ
రందర నీలకందర ధురంధర సింధురవైరి పీఠ వా
సేందుకళాకలాపు హృదయేశ్వరితోడను నెత్తమాడఁగన్.


క.

కాంచి వరుణుండు కాఁగఁద, లంచి పలికె వజ్రి నాబలం బెఱిఁగియు నీ
కాంచనపీఠికపై వ, ర్తించి చలించవు నమస్కరించ వయారే.


ఉ.

కన్నులు వేయి చేయిగురు కైదువు వజ్రము రాజ్యమంటిమా
యన్నిటికెక్కు డక్కజపుటాజియుఁ గొండలతోడి దీగియున్
మున్నె సుపర్వశాఖి గజముంజవుదంతి సురల్ భటాలి నా
కన్నఁగలాఁడె యొక్కఁడు మహాత్ముఁ డహంకృతి నీకు నర్హమే.


మ.

అనినన్ రుద్రుఁడు రౌద్రవీక్షత సహస్రాక్షు న్నిరీక్షించి యొ
య్యన నెయ్యంబున నెత్తమాడఁగ మదీయక్రీడ వారించె నీ
తని నోయుగ్మలి పట్టి తెమ్మనినఁ దత్కన్యాకరస్పర్శనం
బున ధాత్రింబడి చేష్టదక్కినను శంభుం డింద్రుతో నిట్లనున్.


వ.

అఖండలా యఖండ లాఘవాలాపంబులం గోపంబు పుట్టించితి దిట్టవేని గట్టితనం
బేర్పడ నిప్పర్వతశిఖరంబుఁ బెరుకుమన్న మొదటియెఱుకు నానతిం చా నతిత్వరిత
గతి శిఖరంబంటి మార్తాండచండకిరణంబులు రెండువిధంబులై యుండుటం జేసి
యాత్మసమానుల నలువురంజూచి యేలొకో యి ట్లేను నేనువిధంబులయితినం
చు నచ్చెరుపడియున్న వియచ్చరవరులం గాచి పంచముఖుండు మనుజయోనిం బుట్టుం
డని పంచె వారును వైవస్వతశ్వసనపాకశాసనాశ్వినులు తమకు నాధారవర్తులుగా
ధర్మజభీమార్జుననకులసహదేవులనఁ బుట్టిరి మఱియుఁ జతుర్ముఖప్రార్థితుం డైన
యచ్యుతు సితాసితకచద్వయంబులు బలభద్రకృష్ణులై దేవతాహితార్థం బుద్భవించిరి
వారికి వాసుదేవుండు సహాయుండయ్యె నయ్యింద్రులకు నేకపత్నిగాఁ దపంబాచ
రించి త్రిమూర్తియైన పాంచాలి హోమకుండంబునం బుట్టెనని చెప్పి నమ్మవేని
యిప్పుణ్యుల పూర్వకాయంబులు చూడుముని ముని దివ్యదృష్టి యిచ్చి చూపిన రమ
ణీయమణికుండల గండమండల మౌళితటఘటిత హాటక మకుటహరిదశ్వ వైశ్వా
నర వర్ణ వర్ణనీయదేహుల నాజానుబాహుల ధీరుల నేవురను వారికిఁదగిన సౌంద

ర్యధుర్యంబును నపూర్వతపంబు చేసిన యక్కన్య పూర్వదేహంబునుం జూచి
యద్భుతం బందియున్న యన్నరపతింగూర్చి యిట్టివిశేషంబులు తొల్లియుం గలవు
దైవాధిష్టితం బిది పాండవుల కేవురకుం బాణిగ్రహణంబు చేయింపుమని యొడఁ
బఱిచి యుధిష్ఠిరసమీపంబునకు వచ్చి కృష్ణద్వైపాయనుం డిట్లనియె.


క.

లోకోత్తరదినమిది రజ, నీకాంతుఁడు నేఁడు రోహణీయుక్తుండై
మీ కనుకూలత నున్నాఁ, డాకన్యక వరుసఁ బెండ్లియాడుఁడు మీరల్.


క.

అని యానతిచ్చి చనియెన్, మునిమాళి సృధావధూతనూజ మనోజుల్
పనిఁబూనిరి పాంచాలీ, వనజాయతలోచనావివాహోత్సుకులై.


శా.

కావేరీలహరీపరీతహిమరుక్కాసారవాసాదరా
సావేరీముఖరాగభాగ్దృహిణభూసంగీతభంగీరతా
కావేరీప్సితపల్లవీసదృశ రంగద్వల్లవీవల్లభా
భావేరీభవదోంక్రియామయసమభ్యంచద్విమానాంతరా.


క.

సప్తీకృత పత్రీశ్వర, సుప్తీకృత జలధిదర్శ శోధకశయ్యా
సుప్తా సప్తప్రాకా, రాప్తాలయ హస్తకిసల యస్థితమలయా.


భుజంగప్రయాతము.

 తృణావర్తహారీ నదీభూవిహారీ
మృణావర్తనాప్తా శమీశానగోప్తా
ఫణానర్తనాల్సా శ్యభాషాగ్రతల్పా
ప్రణావర్త దాసాధిపధ్వాంతవాసా.


గద్య.

ఇది శ్రీమద్రామభద్రభజనముద్రకవిపట్టభద్ర కాద్రవేయాధిపవరసమాగత
సరససారస్వతలహరీపరిపాక కాకమాని ప్రబోధబుధకవిసార్వభౌమపౌత్ర
రామలింగభట్టపుత్ర కౌండిన్యగోత్రభాగధేయ మూర్తినామధేయప్రణీతంబైన
పాంచాలీపరిణయంబను మహాప్రబంధంబునందుఁ దృతీయాశ్వాసము.