పాంచాలీపరిణయము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

పాంచాలీపరిణయము

పంచమాశ్వాసము

క.

శ్రీరమణీమణిధారీ, ధారీధవసుత రథాంగతటభిన్నారీ
నారీశృంఖలపంగు శ, రీరీహిత గాంగలహరి శ్రీరంగహరీ.


వ.

అవధరింపుము జనమేజయునకు వైశంపాయనుం డిట్లనియె.


గీ.

ఏగుఁ బెండ్లినాఁడె హితబంధు సమ్మతిఁ, బెండ్లికూతు మొదటిపెండ్లికొడుకు
గూర్తుఁమంచు ద్రుపదకుంభినీభర్త దం, పతుల కేర్పరించెఁ బడకయిల్లు.


మ.

తనయత్యంతనిశాంతశేఖరముచెంతం దండ్రి బాల్యం బునన్
దన కర్పించిన దర్పకప్రముఖచిత్రస్తంభవిభ్రాజిభో
జనశాలాంగణపాకమజ్జనమహాశయ్యాగుహావ్యూహనూ
తనకృత్కేతనరాట్పురాతనమణీధామాంతరాళంబునన్.


మ.

నెలరాటాకుమిటారి చిత్తరువు కన్నెల్ సన్నసున్నంపుఁది
న్నెలు జేజేదొర రాతిగోడ కడవన్నె ల్వోవఁ జెంగావివ
న్నెలు పూఁగైదువు వన్నెరాయ పనిచిన్నెల్ గచ్చుమేల్మచ్చులున్
బెళకం జాలినకేళిధామ మటఁజూపెన్ మామ జామాతకున్.


క.

మంచిముహూర్తం బిది మన, పాంచాలిం దోడితెండు పతికడ కని మ
మ్మంచెన్ ద్రుపదక్షితిపతి, యంచుఁ బురోహితులు దేవి కయ్యెడఁ దెలుపన్.


క.

కొప్పువిరిదండదవిలిన, దుప్పటి వలెవాటుతోడఁ దొయ్యలి కైదం
డొప్పఁ దమతోడ నూడుపు, జొప్పలతో నప్పుడింతి సొంపుగ వెడలెన్.


గీ.

సుదతి యొడ్డాణ మేదట్టి చుట్టు గాఁగ, రాలయుంగరముల చాలెత్రాడు గాఁగ
మంచియరగందపొడి మేనిమట్టి గాఁగఁ, జిత్తజుభుజాభుజికి జగజెట్టివోలె.


గీ.

కట్టుకంబమునకుఁ గరివోలె దాదుల, బలిమి నరుగుదెంచి పడకయింటి
కడపదన్ని యవల నడుగింత యిడదాయె, నాతి మొనకు డాయ భీతిగాదె.


ఉ.

పట్టుతలాడయున్ హళఁదిపచ్చనునుం బఱపింద్ర గోపపుం
బట్టుకురాడముం దొగరుబట్టియుఁ దెల్లనిచల్వయుం బనుల్
వెట్టినకట్టుతో బటువుబిళ్లలు దంతపుఁగోళ్ళ గ్రచ్చు క్రొం
బట్టలుగన్న యానృపతి మంచముపై సతు లుంచి రచ్చెలిన్.


క.

అలకల్గొని భీతిత్రప, ల లఁతికవునుబట్టి సకియ లటునిటు దివియన్
నిలుచుండఁ గూరుచుండం, గలకంఠికిఁ బట్టె నొక్కగడియ కడంకన్.

గీ.

ఓరమో మొంది చక్కఁగా నుండుమన్న, నమ్రశిర సొంది చూడ్కిలో నానయంది
సరసఁ గూర్చుండి బాగాలొసంగి రెండు, మడుపు లీరాదె భర్తతుందుడుకు దీఱ


ఉ.

వీడియ మిచ్చి నీవు నొకవీడెము గొమ్మని కాంతుఁ డింత ప
య్యాడ గరుక్కునం గొఱికి యా కధరంబున నందియిచ్చుచో
వీడక పంట నొక్కి పెదవిన్నునుఁగెంపొదవింప కయ్యయో
వ్రీడకుఁ బాలువడ్డవెడవిల్తుఁడు శాంతుఁడటే తలోదరీ.


ఉ.

నీచలమే ఫలించెఁగద నీవఁట నీరమణుండఁటమ్మ కొ
మ్మా చిరసౌఖ్యముల్ గనుఁడు చుమక్కువ నొక్కటి మీరు వేఱు మే
మే చెలి పోయివచ్చెదము మీకవుఁగిళ్ళ సుఖించువేళలన్
మాచెలువల్ గదాయనుచు మమ్ముఁ దలంపుఁడు దంపతుల్ తుదిన్.


క.

గారామునఁ బెరిగిన శృం, గారాంబుధి గాని గడుసు గాదొకనాఁడు
న్నేరుపుల గాసిఁ బెట్టెదు, సూరాసుత చూడ సూన సుకుమార సుమీ.


క.

కొమ్మలు లేరా బంగరు, బొమ్మ సుమీ రాచయిండ్లఁ బుట్టుదురా యీ
యమ్మబలెఁ గన్యకార, త్నమ్ములు మీపూర్వజన్మతప మెట్టిదియో.


క.

మీభాగ్యంబున దొరికెన్, సౌభాగ్యనిధానమైన జవ్వని పాంచా
లీభామ భవజ్జనక, క్ష్మాభరణఫలాప్తి కిదియె కారణము సుమీ.


ఉ.

ఓయమృతాంశువంశనిధి యున్నసతుల్ వలెఁగా దొకింతయుం
జేయు టెఱుంగ దూడిగము చెప్పి పనుల్ గొనుఁ డింక నింతమం
కీయనుమనేర్పు నేరముల కెగ్గుగఁ జూడకుఁ డంచుఁ జేతిలో
జేయిడి యప్పగించి యల చెల్వలు వెల్వడి రిల్లు బల్విడిన్.


ఉ.

పట్టఁగ నీదు చన్నుఁగవ, పాణితలం బిడ నీదుకొప్పుపై
ముట్టఁగ నీదుమేను పలుమోపఁగ నీదధరోష్ఠ మాకులం
జుట్టదు చూడ దాడ దొకసుద్దియు గుండియ గూడుపట్టినాఁ
డెట్టు భరించినాఁడొ హృదయేశ్వరుఁ డవ్వలరాహళాహళిన్.


ఉ.

పైఁటకు లాగులాడి కటిపై ఘటియించిన చేవిదల్పులన్
బాటిలి నీవికై పెనఁగి పైఁబడి చేతులతట్టివేఁతల
న్మీటుగ నాటఁబట్టు బలిమింగనమిం దగదొట్టిజెట్టి పో
రాటములాయె నాయన కొయారి యెడాటములన్ హుటాహుటిన్.


క.

అక్కలభాషిణిఁ గొమ్మని, వక్కలు చే నిచ్చినప్పుడ వలచేఁఱేఁడు వడిన్
వ్రక్కలుగఁ గొట్టె బిట్టుగ, నక్కురునందనునిడెంద మరవిందగదన్.

క.

కన్నె కొనగోరఁ జీరిచి, సున్నంబిడి మడిచి యిచ్చు చుట్టులవీడం
బిన్నిదినంబులకన్నన్, గొన్నిచవుల్ హెచ్చుచూపెఁ గువలయపతికిన్.


క.

చక్కెర యొకపరి నొకతరి, నుక్కెర యొకసారి తేనె యొకమా టమృతం
బక్కీరవాణి వాతెఱ, నొక్కినతఱిఁ జిక్కెఁ బతికి నూఱేసిరుచుల్.


ఉ.

సం దొకయింత యీని బిగిసందిట గ్రుచ్చి ప్రవీణపాణిచే
నంది ముఖాముఖిన్ సఖిసుధాధరముం గబళించి పీల్చి తే
నెం దగఁగ్రోలి కెంపునిచి నిద్దపుగంటి రచించి చీ
ల్చెం దుది నజ్జునజ్జుగను జేసి నిజేశుఁ డవార్యవాంఛికన్.


ఉ.

వాచవి చూచిచూచి సతివాతెఱ చన్గవ పట్టిపట్టియున్
మాచతురత్వ మింక వెడమాటగుఁ గాక యనంగఁబోక కా
లోచితకార్య మెంచక నవోఢగదాయనఁగూడ కెంతయున్
వాచిన వానిరీతి రతి నాఁడు హళాహళి చేసె వాసిగన్.


చ.

గళరవభేదముల్ గఱపి కౌఁగిటిపట్ల బిగింబెనంగుటల్
దెలిపి సుసీత్కృతి ప్రకృతిదిద్ది కళీపెళులింత నేర్పి ని
స్తులనఖరద్విజక్షతము సొంపెఱిఁగించి యపారపున్ రతుల్
పలుమరు శిక్ష చెప్పి పతి ప్రౌఢను జేసె నవోఢ నంగనన్.


చ.

అలయిక యింత లేక పతినండి పెనంగెడుచోట జెట్టియై
బెళుకు దలిర్పఁగా నధరబింబము చించెడు బోటఁజిల్కయై
గళరవభేదముల్ దెలుపు గట్టితనంబునం బావురంబునై
కళలఁ గలంపనేర్చెఁ గలకంఠి రతిప్రకృతిప్రవీణయై.


ఉ.

కమ్మనియూర్పుగాడ్పు చలకమ్రకుచమ్ముల పూతయూతఁగా
నెమ్మెయి మర్మముల్ పొలుప నిద్దపుఁజెక్కుల తేటనవ్వులం
సమ్మునజాఱిజాఱు వగసందెడు క్రొవ్వెద క్రొవ్విరుల్ సహా
యమ్ముగ సేదదేర్పఁ బతి హా యనియెన్ సతి సల్పఁగా రతిన్.


గీ.

నటదురోజుంబు నిటలసంఘటితకచము, పర్యటద్దళ్లతాటంకపాటవంబు
కటితటీసమ్రటత్కాంచికాకలాప, ముపరిరత మిచ్చుఁగా సౌఖ్య మపరిమితము.


ఉ.

చొక్కి ప్రసూనశయ్య రతిసోలియుఁ జాలుఁజుమీ యనంగఁబోఁ
డిక్కమలాక్షి నిట్టె రమియించెదనంచుఁ దలంచు నాథుఁ డా
జక్కవగుబ్బలాడి యరజాఱిన కొప్పు పిసాళిచూపులుం
జక్కెరమోవితోఁ గళలు చల్లెడు మో మెటువంటిదోగదా.

సీ.

కసరు బలిమి కాటసిఁబోవు మోవితో గురుకచాకచి నొగుల్ కురులలో
కబళించివిడిచిన కర్లపాలికతోడఁ బెనఁకువవసివాడు తనువుతోడ
చుంబనక్రియమీఁదు చూచుముంగరతోడఁ జేపట్లమీఁజేతిచీరతోడ
రమ్యముష్టాముష్టి రాలుగాజులతోడఁ బైకొన్నరతి తొట్రుపాటుతోడ
నింతకటి మోపి కడమకో కెడమచంకఁ, బెట్టి ధమ్మిల్ల మొకచేతఁ బట్టి యొక్క
కేలఁ గీలించిన పసిండిగిండితోడ, విభునితోఁ గూడి పడకయిల్ వెడలె వెలఁది.


క.

వెడలి సతిరతిఁ బెనంగిన, బడలిక నిట్టూర్పు తొట్రుపాటును జనుగో
రడి మోవికాటు చిమచిమ, జడిచెమట నటింపఁజూపె సౌపానగతుల్.


ఉ.

బాణభుజారి భూనటదపారకృపారహితాజిఖిన్నతన్
ద్రాణయొకింతలేక నడతక్కువతోఁ జనుమోఁతతో గళ
ద్వేణిభరంబుతో నపుడు వెన్నెలబైటికి వచ్చినన్ జగ
త్ప్రాణము కూర్మికోడలికిఁ బ్రాణము దెచ్చగతిప్రవీణమై.


ఉ.

కూర్చిన పైకదంబములు కొన్ని గరంచితిఁ గాని క్రమ్మఱన్
గూర్చఁగ నేరనైతి ననుఁ గూడిన గాడ్పు గరంగి వీఁగురా
కూర్చినడెందమున్ దిరుగఁ గూర్చెఁగదా రతికన్న చింతనో
యేర్చినమిన్నవంటి తరలేక్షణమైచెమటల్ నశించుటల్.


క.

ఈపగిదిఁ గడమనల్గురు, ద్రౌపదితోఁ గ్రీడఁగనుచుఁ దమసంకేత
వ్యాపారనైపుణక్రమ, మేపార వశించి రొక్కయేఁ డవ్వీటన్.


గీ.

తరికి వానలు గురిసె భూతలము పండెఁ, బరచమూజారచోరాగ్నిభయము పఱచె
ధర్మమెంతయు నాల్గుపాదముల నడిచె, ధర్మరాణ్ముఖ్యు లవ్వీటఁ దనరుకతన.


శా.

ఈతీరంతయుఁ బౌరు లెంతయుఁ గరం బేపారఁగాఁ జెప్పినన్
జేతోమోదము దక్కి యక్కురుకులశ్రేష్ఠుండు దుర్యోధనుం
డైతేనేమి పృథాతనూభవవివాహాదుల్ విన న్వచ్చునా
జ్ఞాతిశ్చేదన లేన కిమ్మనుచుఁ జిన్నంబోయి యున్నంతటన్.


సీ.

కౌంతేయుల జయించు టెంతనియనెఁ గర్ణుఁ డనుచితంబని యాడె నాంబికేయుఁ
డిది యేటిమా టనియెను దుస్ససేనుండు పట్టితెత్తమటంచుఁ బలికె శకుని
యర్ధరాజ్య మొసంగుఁ డనియెను విదురుండు కార్యమౌ ననియె గంగాతనూజుఁ
డర్టును గెల్వరాదనియె ద్రోణాచార్యుఁ డందఱు నెఱుఁగుదురనియెఁ గృపుఁడు
ద్రుపదుఁ బరిమార్తమనియెను ద్రోణసుతుఁడు
సొమ్ముదినఁ బ్రాప్తు లనఁజొచ్చె సోమదత్తుఁ

డవును విదురునిఁ బంపి పాండవుల నిటకు
సరగఁ బిలిపింపుఁడని పల్కె సంజయుండు.


క.

దుర్యోధనుం డపు డిట్లను, దుర్యోచన లింతయేల దుష్టాత్మకులన్
గార్యము గాదిటఁ జేర్చుట, మర్యాదుల్ సాదు లెట్లు మఱి దాయాదుల్.


క.

దాయో బోయో యనఁగా, మాయోపాయోద్ధతులు కుమార్గులు హితమే
ధాయుక్తులబలె నుందురు, దాయాదులు వేళవచ్చుదాఁక సహిష్ణుల్.


క.

కుడిచినయింటికి రెండె, ప్పుడు దలఁతు రనంగవలదు భూతల మెఱుఁగున్
గుడి నుండియె గుడిత్రాళ్ళె, క్కుడుగాఁ గోయుట సగోత్రగుణములు సుమ్మీ.


క.

ఏయెడమది నెరపరికం, బైయుండినఁ గార్య మొప్ప దమరించుటకున్
డాయుచు రోయుచుఁ జేసిన, నాయంబగు సఖ్యభోజనంబులు ధాత్రిన్.


క.

దాయాదులు మాయాసము, దాయాదులు వచనమధురతామిష సకలా
దాయాదులు కలహామం, దాయాదులు ధరణి యెఱుఁగదా యాదుడుకుల్.


గీ.

అయిన నేమాయె నేమాయనైన నేమి, యంత లేదండ్రు గాకొక్కచెంత నంచు
విదురుఁ దోడ్కొంచురమ్మన్న వేగ నతఁడు, ద్రుపదపురిఁ జేరి పాండుపుత్రులను గాంచి.


మ.

ధృతరాష్ట్రుండు సుయోధనుండు మిముఁ దోడ్తెమ్మంచు మమ్మంపి రీ
గతిఁ బాంచాలునియింట బాములఁ బడన్ గర్తవ్యమా నేఁడు మీ
పితృరాజ్యంబు సగంబు గొమ్మని సమర్పించంగ నూహించి రీ
రతివేగంబున రండటంచు విరురుం డాడన్ మహెత్సాహులై.


ఉ.

పెట్టెలు పెట్టుఁడి క్కరటిబృందముమీఁదను బట్టుటెక్కెముల్
గట్టుఁడు యోధయూథములకున్ జగముస్తెయి దేర్పరింపుఁ డా
రట్టతురంగధట్టముల రాజుల కెల్లను బల్లకట్టుఁ డి
ప్పట్టణమందె రాణువకు బత్తెము వేయుఁ డటంచుఁ బల్కుచున్.


ఉ.

పైనము లైరి పాండునరపాలతనూజులు యజ్ఞసేన భూ
జానియనుజ్ఞ నశ్వములు సాఁగె రథప్రకరంబు వెళ్ళె మ
స్తేనుఁగుతండముల్ గదలె నేగె భటచ్ఛటబోనపుట్టికల్
మైనపుఁజీరపెట్టియలు మంకెనగిత్తలు గాంచె నెన్నడల్.


గీ.

పడుచు నంపునున్న పలుకు చేఁజెవి గ్రాఁగె, గుండెపగిలె దిగులు నిండె మిగులఁ
గలఁగె డెంద మేఱుగాఁ బాఱె కన్నీరు, కన్నతల్లి నెనరు గాననయ్యె.


గీ.

ఇల్లటంపుమాట కేపాటివాఁడైన, లేఁతరాచబిడ్డ లేకపోయె
రాజయో స్వయంవరం బేల చాటించె, వెలఁది పెండ్లి కేమి వేగిరంబు.

ఉ.

ఎక్కడఁ బుట్టె నిక్కలికి యెవ్వరు చన్నిడి రెత్తి పెంచఁగా
నెక్కడ మక్కువం బెరిగె యెవ్వరిపాల్ తుది చేరెఁ జెంతగా
దక్కట దూరదేశమున కంపకమాయని కన్నతండ్రి తా
స్రుక్కెఁ దలంచినం గడుపుచుమ్మలుచుట్టెడి నేమి సేయుదున్.


శా.

ఆఁడుంగాన్పును గంటకన్న సతి గొడ్రా లౌటయే మేలు నూ
ఱేఁడు ల్పెంచినఁ గూఁతు రేమి సతమా యీవియ్యముల్ కోడలిన్
గాఁడంబల్కినఁ దాఁళగావలసెఁగా కాఁగాని తిట్లాడికల్
నేఁ డీతండ్రియుఁ దల్లివంగడముగానీ పంచుకోనాయెఁగా.


సీ.

పాంచాలి పాంచాలి పరిణయేచ్ఛలనున్న లంచానఁ దలగడిగించ నెవ్వ
రెవ్వ రాఁకొన్నచో నింటియక్కల నొక్కకొలికికిఁ దేఁ దాళుకొనెడువారు
తెల్లవాఱకమున్నె పళ్ళెరంబిడి ముఖక్షాళ నాదరసూక్తి సలుపనెవ్వ
రెవ్వరు ప్రాల్మాలి పవ్వళించిన లేపి కన్నులుదుడిచి యాఁకటికి నరయ
రచ్చ సేయంగ వచ్చునో యిచ్చవచ్చు, నుత్సవముఁ జూడఁగూడునో యొకరికొకటి
యొసఁగంబొసఁగునో మిసుకరాదో పరులకుఁ, బుట్టి నిల్వలె నత్తయి ల్లెట్టులగును.


ఉ.

కాంతులు ధర్మరాణ్ముఖులుగా బలుగామిడిగాని యత్తగా
కుంతియు నాఁటినాఁటి కిదిగో పిలిపించెదనంటినా యయో
యింతలనంతలం బరులయిండులకన్యల ధన్యలన్ జన
న్యంతిక సంచరంతికల నమ్మలఁ జూచి భరింప శక్యమే.


వ.

అని వితర్కించి యక్కించి దవలగ్ననవలోకించి మిగుల వగలఁ దగులుట గని
దిగులుపడవలదని వలుదక్రొవ్వెదదువ్వి యన్వికచనయనచకచకలు చేర్చు చేర్చు
క్కఁ జక్కంజెక్కి చెక్కిటీ కన్నీటిచా లింతికొనగోరం బాఱమీటి మీతో
గాదని తొంటిది గెంటించి తాఁ బెట్టిన గట్టి ముక్కరపట్టికిం బెట్టి కట్టాణి ముత్తి
యంపుఁ గుత్తికంటు చేనంటి చూచి చూచుకంబుల పోటునం బాటిల్లు
పంక నిచయాంక కుచయాయిశిధిలాంబరంబు సవరగా సవరించి
నివిరి యరవిరిచందంపుటుదిరి యందంపు సంపంగివిరితండంపుడండ
లొకపూఁటనె వదులయ్యెనని తిప్పి తిప్పి యరసి కరశాఖాంగుళీయక
ణులం బోఁడిమి చేసి పాణితలరేఖ లీక్షించి కన్నుల నొత్తుకొని
పొక్కిలి ముద్దుకొని విక్కిలి సద్దుగనిన సిద్దంపు మొలనూలి చిఱుగంటలు
చిక్కు దీర్చి చెంగావి చేలనెరుక మీఁగాళ్లంగూర్చి పట్టిమట్టియలు
నార్చు కోరికలత్తుక చిత్తంబు వెల్లగింపఁ దనూవల్లి కౌఁగిటనల్లియల్లిబిల్లి

యాదుతల్లికిఁ దల్లి యిట్లనియె.


మ.

ఎదవోఁజూచెదవో సుదంతికిఁ బొలంతీక్షాంతి యొప్పంచుఁ జె
ప్పుదువే నీచదు వేలయెంచవు చవుల్ పుట్టింప నీపుట్టిని
ల్లిదె రేఁపే పిలిపించెనం జెదర నీ కేలమ్మ మేమున్న యీ
పదివేలేండ్లకు నేమిటం గడమ యోపర్వేందుబింబాననా.


శా.

నీపైంతీడ్రయె తండ్రికన్నకటులన్ నీమీఁదిదేదృష్టి నా
కాపంచాసులు నీవె సుమ్ము గొఱవంకల్ పెంపుడుంజిల్కలున్
నీపల్కుల్ ప్రకటింపఁగా మఱపు గంద్రేమాదృశుల్ రేపె యీ
దీపావళ్యభిధోత్సవంబునకె తోడ్తేఁ బంచెదం దొయ్యలీ.


ఉ.

చిత్త మెఱింగి భర్తలకు సేవలు సేయుట ధర్మమమ్మ లో
కోత్తర యత్తగారి కెదురుత్తర మెత్తకుమమ్మ యమ్మరో
యెత్తకు వంచినట్టితల యియ్యమ తొయ్యలులందు నంత య
త్యుత్తమరాలు మేలనఁగ నుండుట భూషణమమ్మ కోమలీ.


క.

కలవారిపడుచు ననుచున్, దెలిపెడు సూనడకచేత దీనులఁ జతులీ
వులు గొంచెమిడినఁ బదివేల్, ఫలియించె నటంచుగాని పదరెదు సుమ్మీ.


క.

వింటే యని తనయన్ వా, ల్గంటిం బంపుటకుఁ దల్లి కడువెలవెలనై
యుంటకు డగ్గుత్తిక తోఁ, గంటందడిపెట్టి రింటఁగల కలకంఠుల్.


ఉ.

సోదరిమాఱు నీకలతలోదరి నీదరిదాపె యీపెకున్
జూదరి గాదు సాదు ననుఁ జూచిన యట్లనె చూడు ప్రోడ యీ
దాదికొమార్తె యీయమ నదల్పకుమీయని యూడిగానకున్
బైదలిపిండు నిచ్చె నటఁ బంపుటకున్ జనయిత్రి పుత్రికిన్.


క.

ఆవేళఁ బురము పాండుమ, హీవల్లభుసుతులు వెడలి రేవురు శంఖా
రావములు నిగుడ రింఖా, వ్యావల్గద్వాహమోహనారోహణులై.


గీ.

అరుగుదెంచిన వృత్తాంత మాంబికేయుఁ, డెఱిగి దుశ్శాసనాదుల నెదురుపంప
వాహనవ్యూహసకలసన్నాహమహిమఁ, గరిపురికి వచ్చి రక్కుంతికన్నసుతులు.


సీ.

హీనవృత్తికిఁ జిత్తమింత యొగ్గఁడుగాని సత్యసంధత హరిశ్చంద్రుఁ డితఁడు
హాలాహరణహేల నావహిల్లఁడుగాని బాహాపటిమ బలభద్రుఁ డితఁడు
మత్తారిహతికి సామగ్రిగోరఁడుగాని వింటి నేర్పునకు ముక్కంటి యితఁడు
బడబోదరంబునఁ బడి వెళ్లఁడనికాని వాజి నెక్కుటకు రేవంతుఁ డితఁడు
పాలు మ్రుచ్చిలుటకుఁ బాలుపడఁడుగాని, ధేనుసంరక్షణకు వాసుదేవుఁ డితఁడు

బళిరయని వీథిఁ జనుదెంచు పాండవేయ, పంచకముఁ గాంచి రప్పు డప్సౌరు లెల్ల.


శా.

పాంచాలీచలదృక్పరాభవభయభ్రాంతిన్ నిలన్ లేక మి
న్నంచుల్ ప్రాఁకెడుచేఁపఁ జాపలత నేయంబాడియే యిన్నరుం
డంచుం దక్కినబేడసల్ గవిసెనా నప్పార్థుపైఁ బౌర భా
మాంచచ్చంచలలోచనాంచలనికాయం బంత వ్రాలెన్ వడిన్.


క.

అందఱిపైఁ జేరెడుపొడ, వందిన తుందిలు నమందయాను నభస్వ
న్నందనమణిఁ గని యందఱి, కిందగుటఁగి కాకికన్నగిరిపురివారల్.


క.

చక్కనివాఁడఁట తేజీ, నెక్కుటకున్ సవతులేద టేకామినియున్
జక్కనిదొక్కతె లేదఁట, యక్కరొ కనుఁగొంద మాదయాకులు నకులున్.


క.

మదిరాక్షికి నేగురుమగ, లదిరా మదిరాగ మీపె కని వదరెదవే
పదుగురు పదియేగురుగా, రిది యొకయాశ్చర్యచర్యయే కామినికిన్.


మ.

మెలఁతా కోవెలకుంట నామ మొకకొమ్మే దిద్ద నీప్రొద్దు వ
ర్తిలెఁగా రెండవకొమ్ము దిద్దుటకుఁ బ్రొద్దే చాలదొక్కింత వా
డల పిల్లల్ నగికొంచుఁ జప్పటలు గొట్టంగట్టుకొంగూడఁగాఁ
దలవీడం బరువెత్త నిత్తెఱవ వింతల్ చూడరాలేవుగా.


చ.

పసపులు పూయనిమ్ము తెలిపావడపై నునుఁగావిగట్ట ని
మ్మసమ కటీతటీ పటి సమంచితమేఖల యుంచనిమ్ము నె
న్నొసట లసన్మణీఘృణివినూత్నలలంతిక వెట్టనిమ్ము వె
క్కసపుఁ బిసాళు లిమ్మెఱుఁగుఁగమ్మలు చాలవె ముద్దుగుమ్మకున్.


సీ.

గౌరాంగికాచంద్రకావిచామనచాయ చామకేచక్కన చపలనయన
గొప్పాపెకాగట్టి కురుమట్టపుమిటారి కేకాకకీల్జడ కిసలయోష్ఠి
యలఁతిచన్నులదానికా హారవల్లరు లున్నతస్తనికెపో సన్నుతాంగి
బక్కామెకాలేఁత పాటీరపుంబూఁత లావైన లలన కెలసదసాంగ
వారి కొకపక్షమునఁ గఱివన్నెకోక, కొప్పుగుండుల పేరు బాగొప్పురవికె
చెప్పఁ జొప్పగునంచుఁ గైసేసి డాసి, సకులు నకులాదులను జూడసాగి రచట.


క.

చనుదెంచి యాంబికేయునకును గాంధారికిని మ్రొక్కి కుంజరపురిలో
ధనధాన్యవస్తునిస్తుల, ఘనత వసించిరి కుమారకంఠీరవులై.


క.

తనతనయవర్గమున క, న్నను ననువుగఁ బాండునందనగ్రామణులన్
ఘనఘృణులన్ దినమణులన్, ధనమణులన్ బెద్దతండ్రి దనిపెస్ మనిపెన్.


గీ.

హస్తిపురములోన నైదేఁడు లున్నంత, నంతకాత్మజునకు నాంబికేయుఁ

డర్ధరాజ్య మిచ్చి యభిషిక్తుఁ గావించె, సకలబంధుసంఘసమ్మతముగ.


క.

అభిషిక్తుఁ జేసి యిభపుర, విభుఁ డింద్రప్రస్థమనెడువీ డిచ్చినఁ బాం
డుభవుండు భీమసేన, ప్రభృతులతో భూమియేలెఁ బ్రాభవలీలన్.


సీ.

గంటెడునేలైనఁ బంటకబ్బనిచేను పింపిళ్ళు గూయని గుంపుపైరు
సేన పాతర కొల్చు లేనిహాళికమౌళి బానెడుపాలీని పాడియావు
పొడిచితే నెక్కడఁ బ్రొద్దాయెనని పెద్దజేజేయిడని ద్విజరాజరాజి
వింతకుబేరుఁడై విఱ్ఱవీఁగని బేరి పుట్టుభోగులుగాని భూభుజులును
బన్నిదమునకుఁగాన మెప్పట్టునందు, ధరణితరుణి శిరోమణి దారకరణి
తరణిశరణి భవద్ధామ ధర్మరాట్ప్ర, సన్నభుజపీఠిఁ గాపురంబున్నకతన.


ఉ.

తమ్ముడు దోర్బలాఢ్యుఁడఁట తమ్మునితమ్ముఁడు గార్ముకంబుచే
నిమ్మహి వార్త కెక్కెనఁట యిద్దఱు తక్కినతమ్ము లాజిలో
దుమ్ములు రేఁచుశూరులఁట దుర్మదవైరుల ధర్మకర్మఠుం
డమ్మరొ ధర్మరాజుఁ గొనియాడఁగఁ జెల్లదె యెల్లదేశముల్.


క.

ఆపదలు గదలు రాజ్యము, చేపడు జయమబ్బు సిరులు చేరున్ బహుక
న్యాపాణిగ్రహ మలవడు, నీపాంచాలీపరిణయ మించుక విన్నన్.


క.

అని వైశంపాయనముని, వినిపించిన విని వినీతవిమలాత్మకుఁ డా
జనమేజయ జగతీవిభుఁ, డనురాగసుధాళి నోలలాడుచునుండెన్.


మ.

భ్రుకుటీమాత్రకుటీవిలంఘనగళద్భూదేవతాదీనతా
ముకుటీరాజతటీపటిష్ఠరుచినిర్ముక్తాపరాశాతనూ
ప్రకటీభూతకటీరహాటకపటీపర్యంకహస్తాంబుజా
సుకటీరత్నఘటీ కుచామణితటిక్షుణ్ణాలయప్రాంగణా.


క.

శితకరపుష్కరిణీవిక, సితసరసీరుహమరందసేవాహావా
గతచరితదురితవిరహిత, హితమారుతశీతసురభిమృదుపర్యంకా.


మాలిని.

దితిసుతనుతకోటీ దేవపూజార్హపేటీ, కృతనటనవధూటీ కీర్తితాగా
శతమఖముఖజూటీ సంచరశ్సాదధాటీ, హతనతదురితాటీకాతి కార్పణ్య


గద్య.

ఇది శ్రీమద్రామభద్రభజనముద్రకవిపట్టభద్ర కాద్రవేయాధిపవరసమాగత
సరససారస్వతలహరీపరిపాక కాకమాని ప్రబోధబుధకవిసార్వభౌమపౌత్ర రామ
లింగభట్టపుత్ర కౌండిన్యగోత్రభాగధేయ మూర్తినామధేయప్రణీతంబైన పాంచాలీ
పరిణయంబను మహాప్రబంధంబునందుఁ సర్వంబును బంచమాశ్వాసము