పద్మపురాణము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

పద్మపురాణము

ఉత్తరఖండము – ప్రథమాశ్వాసము

శా.

శ్రీరమ్యంబగు దుగ్ధవార్ధినడుమన్ శేషాహితల్పంబుపై
నారూఢంబుగ నిందిరాసహితుఁడై యానందలీలం గుణా
ధారుండై వరసంయమీంద్రులకు నాత్మజ్ఞానరూపంబు దా
నై రంజిల్లెడు వేల్పు ప్రోచుఁ గృపఁ గందామాత్యు నెల్లప్పుడున్.

1


చ.

చెలువగు జూటరంధ్రములఁ జెచ్చెరఁ బిల్లలఁ బెట్టి యింపులన్
వెలయు చకోరదంపతులు వెన్నెల మీఁగడ లంచు ముక్కులం
జెలఁగుచుఁ గుప్పసంబు పొర చింపఁగ మేల్కని చూచు శేషు మే
యలకువఁ గాంచి నవ్వు శివుఁ డబ్బయకందని ధన్యుఁ జేయుతన్.

2


చ.

తనకు నివాసమైన వెలిదమ్మిఁ జెలంగెడు చంచరీకని
స్వన మొగి విన్నవారలకు సామకృతాభ్యసనప్రభూతశి
ష్యనినదమో యనంగ నెసలారెడు వేలుపుఁబెద్ద నిత్యశో
భనయుతుఁ జేయుఁ గాతఁ బ్రతిభాన్వితు నౌబళమంత్రికందనిన్.

3


ఉ.

వాడనితమ్మిచూలి తలవాకిటఁ గాఁపురముండు దేవి యీ
రేడుజగంబులుం దనకు నిమ్మగు వేడుక బొమ్మరిండ్లుగా
నాడెడు కన్య విప్రులకు నాశ్రయమయ్యెడు పల్కుఁజేడె వా
దోడగుఁ గాత[1] మాకుఁ గృతి దూఁకొను నిశ్చలవాక్యసిద్ధికిన్.

4


ఉ.

తొండము మీఁది కెత్తుకొని దోర్యుగళంబునఁ దాళగించుచు
న్గండమదాంబుధారలకుఁ గ్రమ్మెడు తుమ్మెద లొత్తు కాఱుగాఁ
గొండలఱేని కూర్మిసుతకుం బ్రియ మొందఁగ నాడుచున్న వే
దండముఖుండు నవ్యకవితారససూక్తులు మాకు నీవుతన్.

5

క.

సరసిజభవ భవ విష్ణులు
పరువడిఁ దన బింబముననె ప్రతిభాసితులై
తిరిగెడు త్రిభువనదీపకుఁ
బరమాత్మునిఁగా భజింతుఁ బంకరుహాప్తున్.

6


క.

కాకుత్స్థాన్వయజలనిధి
రాకామృతధాముఁడైన రాముచరిత్రం
బాకల్పోన్నతిఁ జెప్పిన
యాకవితాగురుని మునిగణాగ్రణిఁ గొలుతున్.

7


చ.

అతులమనీషఁ బేర్చి నిగమావలి చిక్కులు దీర్చి సూత్రమున్
ధృతి నొనరించి పెంపెసఁగు దివ్యపురాణము లెల్లఁ జెప్పి భా
రత మనుపేర వేదము దిరంబుగఁ జేసిన విష్ణుమూర్తి సు
వ్రతు మహనీయబోధనుఁ బరాశరసూనుఁ [2]దలంచి మ్రొక్కెదన్.

8


ఉ.

భారత వేదవాక్యరసభావము లజ్ఞు లెఱుంగలేక ని
స్సారమనస్కులై తిరుగు చందముఁ జూచి తెనుంగుబాసఁ బెం
పార రచించి యందఱఁ గృతార్థులఁ జేసిన పుణ్యమూర్తులన్
సారమతి న్భజింతు ననిశంబును నన్నయ తిక్కనార్యులన్.

9


సీ.

హరిసేవనామృతాహ్లాదుఁ బ్రహ్లాదుని
       సన్నుతచారిత్రు శక్తిపుత్రు
సంగీతవిద్యావిశారదు నారదుఁ
       బుణ్యతమశ్లోకుఁ బుండరీకు
భారతసంహితాభ్యాసు వేదవ్యాసు
       నతులపావనవేషు నంబరీషు
నవిరళజ్ఞానవిద్యాసముత్సుకు శుకుఁ
       గృష్ణాఘకర్దమగ్రీష్ము భీష్ము

తే. గీ.

[3]నర విభీషణ సనక సనంద కపిల
వాయునందన శేషాహి వైనతేయు
లాది యగు భాగవతులను నాళువారిఁ
బరమభక్తిఁ దలంపుదుఁ బ్రతిదినంబు.

10


క.

ధర నిహపరములకును గురు
చరణంబులె యూఁత యగుటఁ జర్చించి మదిం
బరవాది భద్రవారణ
హరి ముఖ్యులఁ దిరుమలయ్య లార్యులఁ [4]దలఁతున్.

11


వ.

అని యాశీర్వచనపూర్వకంబుగా నఖిలలోకనియామకులై యాఢ్యు
లైన సరసిజోదర సర్వజ్ఞ శతానందులఁ దలంచి నమస్కరించి
యనంతరంబ సరస్వతి వినాయక ప్రార్థనంబును సూర్యపదారాధ
నంబును బురాణకవి ముఖ్యోపాసనంబును బరమభాగవతసంకీర్త
నంబును గురుచరణస్మరణంబునుం జేసి కృతకృత్యుండనై
యొక్కపుణ్యప్రబంధంబు రచియింపం బూని తత్కవితావధూ
ముఖతిలకం బగు వెలిగందల కందనామాత్యుం డను నుత్తమ
రత్నంబున కుపాశ్రయం బగు రామగిరి పట్టాణాధీశ్వరుండైన
ముప్పడి క్షోణిపాలుని యన్వయగుణవిశేషంబు లెట్టి వనిన.

12

కృతినాయక వంశావతారాభివర్ణనము :

మ.

గురిజాలాన్వయదుగ్ధవార్ధిశశిదిక్కుంభీంద్రహస్తాభబం
ధురభూభారధురీణనిశ్చలమహాదోర్దండుఁ డుగ్రారి భీ
కరుఁడై దిక్పరివర్తికీర్తి నెగడంగా భూరిభోగాఢ్యుఁడై
పరఁగెన్ ధాత్రిఁ దెలుంగురాయఁడు జగత్ర్పఖ్యాతరాజ్యోన్నతిన్.

13

చ.

అతనికి నగ్రభార్య వినయాంచిత నిత్యశుభైకశీల సు
వ్రత నియతాత్మ సజ్జనపరాయణ ధర్మవివేకసార[5]
మ్మతహృదయానుకూల గుణమండన నాఁదగు మల్లమాంబయం
దతులితరామలక్ష్మణశుభాకృతు లిద్దఱు పుట్టి రాత్మజుల్.

14


వ.

అం దగ్రసంభవుండు.

15


క.

శ్రీకరుఁడు సకలభువనవ
శీకరుఁ డతికీర్తియుతుఁడు చిరతరగుణర
త్నాకరుఁడు సతతదానద
యాకల్పుఁడు ముప్పడి క్షమాధీశుఁ డిలన్.

16


వ.

మఱియును.

17


సీ.

కమఠాహికోలదిక్కరులరాయిడి మాని
       యీవీరుభుజశక్తి నెసఁగె ధాత్రి
కలి నొక్కపాదమై కదలనేరని ధర్మ
       మీపుణ్యుఁ డూఁతగా నిలఁ జరించె
వెడఁగు రాజులచేత నడఁగిన కీర్తి యీ
       నృపచంద్రు మన్నన నింగి ముట్టెఁ
గర్ణాది నృపులతోఁ గడ చన్నదాన మీ
       [6]జగతీశ్వరునిచేత మగుడఁ బుట్టె


ఆ. వె.

ననుచుఁ బొగడనేలె నఖిలంబు గురిజాల
గోత్రవార్ధికుముదమిత్రుఁ డన్య
రాజమకుటకలితరత్నరంజితపదాం
బుజుఁడు తెలుఁగునృపతి ముప్పవిభుఁడు.

18


([7]వ.

తదనుజన్ముండు.)

సీ.

గారాబుతమ్ముండు గాదిలిచెలికాఁడు
       ప్రియశీలుఁ డాహవజయుఁ డుదారుఁ
డనుకూలభృత్యుండు గనుఱెప్ప వలపలి
       బరి యిష్టసచివుఁడు పట్టుఁగొమ్మ
కార్యదక్షుఁడు దయాకరమూర్తి రెండవ
       రాజు భూభారధురంధరుండు
మగచేగ దళవాయి మల్లాంబికాతపః
       ఫలము మాఱట మేను ప్రాణ మనఁగఁ


తే. గీ.

బ్రకటసౌజన్యభక్తితాత్పర్యకార్య
శౌర్యగాంభీర్యధైర్యవిస్తారశక్తు
లమర నన్నకుఁ దెలుఁగు భూపాత్మజునకు
ముప్పడయ్యకుఁ బెనుఁబ్రాపు ముత్తవిభుఁడు.

19


క.

చిత్తజ నల నలకూబరు
లెత్తొరగా కితరనృపతు లెనయే ధర న
త్యుత్తముఁడు తెలుఁగురాయని
ముత్తయ్యకు రాజమకుటముక్తామణికిన్.

20


వ.

అని ప్రశంసింపం దగి విభవవిలాసవిక్రమవిజయవిఖ్యాతులం
బ్రసిద్ధుండైన ముత్తభూపాలుండు తనకు సహాయుండుగా గౌతమీ
దక్షిణంబునం బరమపావనం బగు సబ్బినాటి రాష్ట్రంబున రామగిరి
పట్టణంబు నిజరాజధానిగాఁ బురందరవిభవుండై రాజ్యంబు
చేయుచు నిరువెత్తుగండ, గండగోపాల, కాంచిరక్షపాలక, చోడ
రాజ్యస్థాపనాచార్య, దొంతిమన్నియవిభాళన, చలమర్తిగండ
గజగంధవారణ, రాయగజకేసరి, మూరురాయరగదాళాది నానా
బిరుదవిఖ్యాతుండును, ననవరతదానశీలుండును నగు ముప్ప
భూపాలచంద్రునకు నిఖిలసామ్రాజ్యభూభారదురంధరుండును,
ధర్మచరితుండును, నీతిచాతుర్యవివేకవిశేషణగుణగుణాలంకారుండును
నై యమ్మహారాజు మన్నన వడసి విశేషవస్తువాహనఛత్రచామ

రాందోళికాదిచిహ్నంబులం బెంపొందు కందనామాత్యు వంశావ
తారం బెట్టిదనిన.

21


క.

శ్రీ నారాయణునాభి న
నూనం బగు తమ్మి నలువ యుదయించెం దా
నా నిఖిలగురుని వలనను
భూనుతుఁడు మరీచి పుట్టెఁ బొరి నాతనికిన్.

22


తే. గీ.

కశ్యపబ్రహ్మ యన జగత్కర్త పుట్టె
నతని తనువున నుదయించె నఖిలజగము
నతని గోత్రజులందుఁ బెంపతిశయింప
వాణసాన్వయ మొప్పారె వసుధమీఁద.

23


క.

ఇల వాణసవంశంబున
జలరుహభవనిభుఁడు నీతిచాణక్యుఁడు నాఁ
జెలు వమరు రుద్రసచివుఁడు
మొలగూ రేలుచును సౌఖ్యమునఁ జెలువొందున్.

24


క.

ఆతనికి నన్నమాంబకుఁ
బూతగుణోజ్జ్వలులు లోకపూజ్యులు పుత్త్రుల్
బాతిగ గన్నయ రుద్రయ
పోతయ మల్లయ లనంగఁ బుట్టిరి వరుసన్.

25


వ.

అం దగ్రనందనుం డగు గన్నయామాత్యుండు.

26


చ.

వరువడిఁ గాకతీయ గణపక్షితినాయకు నొద్ద మాన్యుఁడై
ధరణిఁ బ్రశస్తుఁడై నెగడి దానములెల్లను జేసి భక్తి పెం
[8]పిరవుగ గుళ్లు గట్టి గణపేశ్వరదేవుని గోపికాధిపున్
దిరమగుచున్న లక్ష్మిని బ్రతిష్ఠలు చేసెఁ బ్రభుత్వ మేర్పడన్.

27


వ.

మఱియు నమ్మొలగూరి పడమటి గవనియందు రుద్రసముద్రం
బనం దమతండ్రిపేరిట నగాధనిర్మలజలపూరంబగు బావియును

గాడియును గల్పించె ని ట్లధికదానసంపన్నుం డగు నాగన్న
సచివునకు గౌరమాంబయం దనేకతనయు లుదయించి రం దగ్ర
జుండు.

28


ఉ.

ఆ శతమన్యువైభవుఁ డహర్పతితేజుఁడు చంద్రచంద్రికా
కాశసమానకీర్తియగు గౌరమ మల్లనమంత్రి దిక్కులన్
వాసికి నెక్కి భక్తి ననివారణమై గుడి గట్టెఁ గట్టి రా
మేశుఁ బ్రతిష్ఠఁ జేసె నుతికెక్కఁగ నామొలగూరివాకిటన్.

29


వ.

ఇ ట్లనూనభాగ్యసంపదలం బ్రవర్తిల్లు మల్లనామాత్యునకు గౌర
మాంబికయందు గణపతియును గోపనయును రామనయును
[9]మంత్రి గన్ననయు ననంగా నలువు రుదయించి రందుఁ
 బ్రథమపుత్త్రుండు.

30


క.

గుణముల రఘుపతి యనుచును
రణముఖమునఁ బార్థుఁ డనుచు [10]రాజిల్లు కవుల్
ప్రణుతి యొనర్పఁగ వెలసెను
గణపతి కామార్థసిద్ధిగణపతి యనఁగన్.

31


క.

ఆ గణపతి విభుపత్ని ద
యాగరిమను నుచితనిర్మలాచార సదా
భ్యాగతపూజాగుణముల
నా గౌరమఁ బోలె గౌరమాంబిక వెలసెన్.

32


వ.

వార లిరువురకు వేదత్రయంబుమం బోలె మల్లనయు నబ్బయా
మాత్యుండును మంత్రియు ననంగాఁ బుత్త్రత్రయం బుదయించె నందు.

33

మ.

మతివాచస్పతి పుణ్యవర్తనుఁడు సన్మాన్యుండు నీతిజ్ఞుఁ డు
న్నతవంశాఢ్యుఁడు విష్ణుభక్తుఁ డభిమానప్రాభవారూఢుఁడై
పతిభక్తి న్దగుమన్నన ల్గని మహాప్రాజ్ఞుండు నా నొప్పె నీ
క్షితిలో గన్నయ యౌబళార్యుఁడు గుణశ్రేష్ఠుం డుదారస్థితిన్.

34


చ.

అతఁ డిలఁ గేసనార్యుని వరాత్మజ సన్నుతభాగ్యలక్ష్మణా
న్విత ననురక్త నుత్తమపవిత్రచరిత్ర దయానుకూల సూ
నృతమితభాష నాఁగ ధరణిం బొగడొందిన గౌరమాంబ నం
చితమతిఁ బెండ్లియయ్యె గుణశేఖరుఁ డబ్బయమంత్రి యర్మిలిన్.

35


క.

ఆ రమణీరమణులకును
గారవమునఁ బుట్టి రధికకల్యాణులు వి
స్తారోదారమనస్కులు
నారాయణుభుజములట్ల నలువురు తనయుల్.

36


క.

వారలలోపల నగ్రజుఁ
డారూఢగుణాభిరాముఁ డతులితవిద్యా
పారగుఁడు ధర్మశీలుఁడు
ధీరుఁడు నా నతిశయిల్లెఁ దిమ్మన జగతిన్.

37


వ.

తదనుసంభవుండగు కేసనామాత్యు గుణంబు లెట్టివనిన.

38


సీ.

తననీతి ముప్పడి ధరణీశుఁ డేలెడి
       ధరణికి వజ్రపంజరము గాఁగ
[11]దనమంత్ర ముద్దండదండనాయకులకుఁ
       బంబిన వాగ్బంధనంబు గాఁగఁ
దనదానసంపద ధారుణీసురులకుఁ
       జెలువారఁ బండినచేలు గాఁగఁ
దనకీర్తి దిగ్వధూధమ్మిల్లములమీఁద
       మహనీయపుష్పదామములు గాఁగఁ

తే.

గోరి భూజననయనచకోరములకుఁ
దనవిహారంబు వెన్నెలతనుపు గాఁగ
నురుతరైశ్వర్యలీలల నొప్పుచుండ
[12]మంత్రివరుఁడైన కేసనమంత్రివిభుఁడు.

39


చ.

అతులితలీలఁ గేసనచివాగ్రణి ధర్మపురంబునందు నం
చితముగ నన్నసత్ర మిడి శ్రీనరసింహున కుత్సవంబులున్
సతతమహోపహారములు సల్పుచు రామగిరీంద్రమందు సు
స్థితి గుడిగట్టి విష్ణునిఁ బ్రతిష్ఠ యొనర్చె నుదాత్తసంపదన్.

40


వ.

[13]అదియునుం గాక.

41


మ.

అనఘాత్ముల్ మును పెక్కుభంగుల ధనం బార్జించి పాతాళమం
దెనయం బాఁతుదు రూర్ధ్వలోకముల కంచేయూరి కేత్రోవరా
యని మా కేసనకేశవేంద్రుగుడిపై నాచంద్రతారంబుగా
నినతుల్యంబగు హేమకుంభశిఖరం బెత్తించె నత్యున్నతిన్.

42


వ.

మఱియును బహువిధంబులగు దానధర్మంబులను విలాసనీతి
చాతుర్యవిద్యావినయంబులను ననురక్తుండై ముప్పడి క్షోణిపాలు
నశేషరాజ్యభరణోద్ధరణపారీణుండును సపుత్త్రపౌత్త్రప్రవర్ధ
మానుండు నగు కేసయామాత్యు కూర్మితమ్ముండు.

43


సీ.

స్వామిభక్తుఁడు గార్యచతురుండు బహుకళా
       వేది నీతిజ్ఞుండు విప్రహితుఁడు
సరససల్లాపుండు సప్తాంగరక్షణ
       క్షముఁడు భావజ్ఞుండు సర్వసులభుఁ
డరిమంత్రభేదనపరుఁడు ధర్మాత్ముండు
       సుందరాకారుండు సుజనవినుతుఁ
డురుదయాపరుఁడు నిత్యోత్సవాసక్తుండు
      షడ్గుణాధారుండు సౌమ్యమూర్తి

తే.

సతతగురుదేవతాపరిచారరతుఁడు
గుణసముద్రుఁడు కాశ్యపగోత్రజనితుఁ
డనఁగ నుతికెక్కి పెంపున నతిశయిల్లు
మదనసదృశుండు కందనమంత్రివరుఁడు.

44


ఉ.

మించిన కీర్తివాఁ డధిగమించిన నేరుపువాఁడు దర్పకున్
మించిన రూపువాఁడు సిరిమించిన కన్నులవాఁ డుదారత
న్మించిన చేతివాఁ డలరుమించిన చిత్తమువాఁడు ధాత్రి వీఁ
డంచు నుతింప నబ్బసచివాగ్రణి కందన పొల్చు నున్నతిన్.

45


వ.

మఱియును.

46


సీ.

ఈ ధర్మచారిత్రు నే ధాత్రిపతి యేలె
       నా ధాత్రిపతి యేలు నఖిలజగము;
నీ కామినీకాము నే కామినులు చూతు
       రా కామినులు చూడ రన్యపురుషు;
నీ యర్కసుతతుల్యు నే యర్థి గొనియాడు
       నా యర్థి యొరు వేఁడ నాసఁజేయఁ;
డీ మంత్రికులచంద్రు నే మంత్రి పురణించు
       నా మంత్రి విముఖాత్ముఁ డఖిలమునకు;


ఆ.

[14]ననఁ బ్రగల్భరూపఘనదాననయమార్గ
ముల నుతింప నొప్పు ముజ్జగములఁ
దారహారహీరధవళాంశుసమకీర్తి
కలితుఁ డౌబళార్యకందవిభుఁడు.

47

క.

కందనమంత్రికి నెన సం
క్రందనమంత్రియును దైత్యగణమంత్రియుఁ గా
కెందును గార్యవివేకము
పొందెఱుఁగని [15]మంత్రిజనులఁ బోల్పఁగ నగునే?

48


ఆ. వె.

ఆతని ధర్మభార్య లత్యంతసౌభాగ్య
వతులు సతతదానరతలు ఘనలు
మల్లమాంబ కాచమాంబిక లనఁ బొల్తు
రెల్లసంపదలకు నెల్ల లగుచు.

49


క.

ఆతని తమ్ముఁడు నూతన
[16]చేతస్సంభవుఁడు ధర్మచిత్తుఁడు సుగుణో
పేతుఁడు నీతికళాగమ
చాతుర్యోన్నతుఁడు మంత్రిసచివుఁడు పొలుచున్.

50


ఆ. వె.

మంత్రివిభుఁడు నితిమతముల దేవతా
మంత్రిఁ బోలు దైత్యమంత్రిఁ బోలు
సరసవాక్స్వరూపసౌందర్యలీలల
బాణుఁ బోలుఁ బంచబాణుఁ బోలు.

51


చ.

తగవుల జన్మభూమి యుచితంబుల నిల్కడ పుణ్యరాశి సో
యగముల కాశ్రయంబు వినయంబుల యిక్కవివేకరాశి మ
చ్చికలకుఁ బట్టుఁగొమ్మ గుణసింధువు గీర్తినివాస మంచుఁ జె
న్నుగ నుతియింతు రబ్బయతనూభవు మంత్రి నమాత్యశేఖరున్.

52


వ.

అని ప్రశంసింపం బరఁగి యన్నదమ్ము లందఱును దీర్ఘాయురై
శ్వర్యసంతానపరంపరాభివృద్ధిసంపన్నులయి ప్రవర్తిల్లుచుండ
బంధుజనముక్తావళీమధ్యరత్నంబును వాణసకులరత్నాకర
సుధాకరుండును నిఖిలదిగ్భరితకీర్తివిలాసుండును నై మందారం
బునుం బోలె సకలవిబుధాశ్రయంబై సుధాకరుండునుం బోలెఁ

గువలయామోదకరుండై రత్నాకరుండునుం బోలె బహుజీవనో
దయస్థానంబై విలసిల్లు [17]వెలిగందల కందనామాత్యుం డొక్క
నాఁడు నిజసభామండపంబున నిఖిలవిద్వజ్జనసరసకవిగాయక
కామినీజనపరివృతుండై తారకాగ్రహమధ్యంబునం బొల్చు
చంద్రుచందంబునం జెలువొంది సకలపురాణేతిహాసగోష్ఠీవినో
దంబులం బ్రొద్దుపుచ్చుచుండి సప్తసంతానంబులందు నుత్తరోత్త
రంబులగు కీర్తిసుకృతంబులకు మూలంబు గృతిపతిత్వంబ కా
నిశ్చయించి యష్టాదశపురాణంబులందు సాత్త్వికంబును బరమ
ధర్మార్థకామమోక్షప్రదంబును విష్ణుకథాప్రధానంబు నగు పద్మ
పురాణంబు తెనుంగు [18]చేయింపం దలంచి.

53


క.

ఆ పరమేశ్వరమకుట
వ్యాపితగంగాప్రవాహవరకవితాస
ల్లాపుఁ డగు మడికి సింగనఁ
జేపట్టక కీర్తిగలదె [19]శ్రీమంతులకున్.

54


చ.

అని పొగడంగఁ బెంపెసఁగు నయ్యలు మంత్రికి సింగమాంబకుం
దనయుని విష్ణుమంగళకథాసుముఖాత్ముని నిత్యసౌమ్యవ
ర్తనుని సుశీలు నవ్యకవితారసపోషణవాగ్విలాసు భూ
జనసుతు సింగనార్యు గుణసాగరు నన్ బిలిపించి యర్మిలిన్.

55


వ.

దరహసితవదనుం డగుచు నత్యంతగౌరవంబునం గనుంగొని
యమ్మంత్రిచంద్రుం డిట్లనియె.

56


ఉ.

నీ సహవాససౌఖ్యముల నెమ్మిఁ జరించుటఁ జేసి దిక్కుల
న్వాసికి నెక్కి శిష్టజనవర్గముచేఁ బొగడొంది కావ్యవి
ద్యాసుఖకేళిఁ బేర్చి కడుధన్యతతో బహుదానలక్ష్ముల
న్భాసురకీర్తిమై నెగడి ప్రస్తుతి కెక్కితి మర్త్యకోటిలోన్.

57

వ.

అట్లు గావున.

58


క.

కృతిపతుల కీర్తి దిక్కుల
[20]నతులితమై యునికిఁ జేసి యనవరతంబున్
మతి వాంఛ గలదు నన్నుం
గృతిపతిఁ గావింపు పెంపుఁ గీర్తియు నెగడున్.

59


వ.

అది యెట్లంటేని.

60


సీ.

పొలుపారుచున్న యీ భువనత్రయమునందు
       నమరలోకము సారమైన యట్లు
[21]విశ్వపూజ్యం బైన వేదత్రయమునందు
       నమర సామము సారమైన యట్లు
కీర్తిఁ బెంపారెడి మూర్తిత్రయమునందు
       నంబుజాక్షుఁడు సారమైన యట్లు
సౌభాగ్యమయమైన శక్తిత్రయమునందు
       నబ్జవాసిని సారమైన యట్లు


తే.

అవని పద్మంబు ఖండత్రయంబు నందు
సర్వసారాంశమై పుణ్యజనక మగుచు
మండితంబైన యుత్తరఖండ మీవు
తెనుఁగు గావింపు నా పేర ననఘచరిత!

61


తే.

బాదరాయణముని ముఖప్రభవ మైన
యి ప్పురాణార్థ మిలఁ గొంద ఱెఱుఁగ నేర
కుండ నేటికి [22]నాంధ్రభాషోక్తిఁ దెలియఁ
జెప్పి లోకోపకారంబు చేయవలయు.

62

వ.

అట్లైన నేనుఁ గృతకృత్యుండ నగుదు నీకును గీర్తిసుకృతంబులు
సంభవించు నిప్పురుషార్థం బనుష్ఠింపు మనిన మంత్రిచంద్రుని
వాక్యంబులు నాకుఁ గర్ణరసాయనం బగుటయుం బరమానంద
కందళితహృదయుండనై మనంబున వితర్కించి.

63


చ.

అకుటిలలీలఁ గందసచివాగ్రణి నాథునిఁ జేసి ధాత్రిలోఁ
బ్రకటితపుణ్యభాజియగు పద్మపురాణము భక్తిఁ జెప్పఁగా
సుకృతముఁ గీర్తి లక్ష్ములును జొప్పడుచున్నవి యింతకంటె నొం
డొకపురుషార్థ మెద్ది యని యుల్లమునం గృతిఁ జెప్పఁ బూనితిన్.

64


ఆ.

సత్యనిరతుఁ డైన సాత్యవతేయుండు
చెప్పి నర్థమెల్లఁ దప్పకుండఁ
దెలుఁగు సేయరాదు నలువకైనను భక్తి
కారణంబుగాఁగఁ గథ రచింతు.

65


వ.

[23]అదియునుం గాక.


చ.

అమలిన మత్స్యకూర్మవిభవాదులు దీవులు వేదవాక్యసా
రము జలపూర మున్నతతరంగము లాగమశాస్త్రపద్ధతు
ల్విమలయశోభిరామమగు విష్ణుచరిత్రము భోగితల్పమై
యమృతపయోధి నాఁగఁ బఱపై చనుఁ బద్మపురాణ మి మ్మహిన్.

66


వ.

మఱియును.

67


సీ.

ధర్మబోధైశ్వర్యతతి మూలనికరంబు;
       విమలాదిశక్తులు వెలయు స్కంధ;
మామ్నాయశాస్త్రంబు లనుపమశాఖలు;
       బహుకథాసూక్తులు పల్లవంబు;
లుపనిషద్వాక్యంబు లురుపుష్పసంఘంబు
       పొలుపారు హరిభక్తి పుష్పరసము;
వరయోగి వైష్ణవవరులు భృంగంబులు;
       పరమసౌఖ్యాసక్తి పరిమళంబు;

తే.

బాదరాయణవాక్సుధాప్రౌఢిఁ బెరిగి
నిఖిలధర్మంబులకు నిల్వనీడ యగుచు
విష్ణురూపంబు దానయై వెలసి సౌమ్య
రసికమై యొప్పుఁ బద్మపురాణతరువు.

68


వ.

కలికాలజనితమహాదోషాతపసంతప్తాంతరంగులును సంసార
పథశ్రాంతస్వాంతులును నగు మనుష్యు లిప్పుణ్యతరుశీతల
చ్ఛాయ నాశ్రయించి కృతతత్ఫలరసాస్వాదనసుఖానుభవులై
తాపత్రయంబులం బాసి జరామరణభయబుభుక్షార్తిరహితులై
యవ్యయానందంబు నొందుదురు; అట్లు గావున నిప్పుణ్యపురా
ణంబు తెనుంగుబాస నా నేర్చిన చందంబునం గద్యపద్యంబుల
రచియించుట యిదియును [24]నప్పురాణపురుషునకు నొక్క
పూజావిశేషంబు గావుతమని యిచ్చంగోరి సకలవిద్వజ్జనానుగ్ర
హంబు వడసి యుపక్రమించి.

69

షష్ఠ్యంతములు

క.

శ్రీలలనావిలసదపాం
గాలోకనవిభవసంతతాభ్యుదయునకున్
వ్యాళాధిప[25]సమధికవా
గ్జాలునకును రాజనీతిచాణుక్యునకున్.

70


క.

తరుణీజనమన్మథునకు
గురుతరరిపురాయగండగోపాలునకున్
ఖరకరనిభతేజునకును
సురగిరిధైర్యునకు మంత్రి చూడామణికిన్.

71

క.

కుందశరదిందుతారక
చందనమందారశంఖసమసితజగదా
నందనసుందరయశునకుఁ
గందామాత్యునకు రూపకందర్పునకున్.

72


వ.

అఖిలకల్యాణాభ్యుదయపరంపరాభివృద్ధిగా నా యొనర్పం బూనిన
పద్మపురాణకథాప్రారంభం బెట్టిదనిన.

73

కథాప్రారంభము :

తే.

పుణ్యతమమైన నైమిశారణ్యమునను
శౌనకుండను నొకమునిసత్తముండు
సత్రయాగంబుఁ జేయంగ సకలమునులు
నచట నతిభక్తి వసియింతు రనుదినంబు.

74


సీ.

అచ్చట నొక్కనాఁ డర్థి వేదవ్యాస
      మునివరాగ్రణి శిష్యుఁ డనఘచరితుఁ
డారూఢమతి రోమహర్షణ మునిపుత్త్రుఁ
      డఖిలపురాణేతిహాసతత్త్వ
రసికవాగ్జాలుఁ డుగ్రశ్రవసుం డను
      సూతుఁడు చనుదెంచి ప్రీతితోడఁ
బ్రణమిల్లి యున్న నప్పరమపౌరాణికుఁ
      గని యమ్మునీంద్రులు గారవమున


తే.

నర్హపీఠంబు పెట్టించి యాదరించి
యర్ఘ్యపాద్యాదికృత్యంబు లాచరింప
నతఁడు ప్రియమంది ముకుళితహస్తుఁ డగుచు
నమ్మునీంద్రులకెల్ల నిట్లనియె నెలమి.

75


వ.

వేదవ్యాసమునీంద్రు ప్రసాదంబునం జేసి నా యెఱుంగని పుణ్య
కథాప్రపంచంబు లేదు గావున నావలన మీకు నే కథ విన నిష్టంబు
గలదు న న్ననుగ్రహించి యడుగుం డనిన నమ్మునీంద్రులంద
ఱతని కిట్లనిరి.

76

క.

విన నింపై సరసంబై
మునుకొని ధర్మార్థకామమోక్షప్రదమై
వనజోదరుచరితంబై
తనరిన కథ వినఁగ వేడ్క దనికెడు మాకున్.

77


వ.

అనిన విని మీ కందఱకు నభీష్టంబగు పుణ్యకథఁ జెప్పెద నత్యంత
సావధానులరై వినుండని శౌనకాదిమహామునులకు సూతుం
డిట్లనియె.

78


శా.

దివ్యజ్ఞానసుధార్ణవుండు త్రిగుణాతీతుండు వేదార్థసూ
త్రవ్యాపారవివేకశాలి బహుశాస్త్రప్రాప్తచాతుర్యసం
భావ్యారూఢమతిప్రకాశుఁడు కళాప్రావీణ్యగణ్యుండు వే
దవ్యాసుం డొనరించె నీ కథ జగత్ప్రఖ్యాతమై వర్తిలన్.

79


వ.

అదియునుం గాక.

80


సీ.

అత్యంతవేదవేదాంతార్థవిదితంబు;
      సకలశాస్త్రపురాణసమ్మతంబు;
కమనీయధర్మార్థకామమోక్షప్రదం;
      బఖిలాఘగహనదవానలంబు;
సకలధర్మారంభసంపద్విశేషంబు;
      నురుతరైశ్వరపుణ్యోదయంబు;
సర్వధర్మాగమశాసనస్తంభంబు;
      విష్ణుమంగళకథావిలసితంబు;


తే. గీ.

పరమవైష్ణవయోగీంద్రభాగధేయ;
మఖిలమంత్రార్థతత్త్వరహస్యమూల;
మంచితాధ్యాత్మవిద్యాసమర్థ మగుచుఁ
బ్రకటమై యొప్పుఁ బద్మపురాణ మవని.

81

చ.

చదువులు నాలుగున్ జదివి సాంగముగా జపహోమకృత్యముల్
వదలక సల్పి వేదవిధివంతముగా హయమేధయాగముల్
పది యొనరించు తత్ఫలము పాయక చేకుఱు నిత్యమంగళ
ప్రదమగు భక్తి నొక్కపరి పద్మపురాణము విన్నవారికిన్.

82


వ.

అని చెప్పి మఱియును.

83


క.

పారాశర్యుని చరణాం
భోరుహములు భక్తిఁ దలఁచి పురుషోత్తము నిం
పార మది నిలిపి పద్మ
శ్రీరచనలు విస్తరించి చెప్పఁ దొడంగెన్.

84


సీ.

అఖిలలోకజ్యేష్ఠుఁడైన శతానందుఁ
       డనుపమంబైన సర్గాదియందు
సమధికంబైన దేవమనుష్యజంగమ
       స్థావరాత్మకమైన జగమునెల్లఁ
బుట్టించి బహువిధభూతసంఘములకు
       వలయు వృత్తులు గతు ల్వరుసఁ జేయ
నబ్భంగి జరగక యఖిలభూతంబులు
       దమలోన లోభమోహములు గదిరి


తే. గీ.

యధికు లధముల వృత్తుల నపహరించి
యొండొరులచేత నిహతులై యొఱపు దఱిఁగి
యశనకాంక్షలఁ గడు డస్సి యడఁగియున్న
జగముఁ గనుఁగొని సరసిజసంభవుండు.

85


వ.

పెద్దయుం బ్రొద్దు విచారించి తన శక్తివలన స్వాయంభువమను
వునుం బుట్టించి యతనిని సకలజగద్రక్షణార్థముగ నియమించి
ప్రజాపరిపాలనశక్తి ప్రసాదించిన నమ్మహాభుజుండునుం గమల
గర్భునకుం గృతాంజలియై యిట్లనియె.

86

తే.

ఎద్ది సేయంగఁ బాపమై యేపు మిగులు
నెద్ది సేయంగఁ బుణ్యమై యెసఁగుచుండు
నట్టికర్తవ్య మెఱుఁగక యెట్టిభంగి
భూతకోట్లనుఁ బాలింతుఁ బూతచరిత!

87

పూర్వఖండ కథాసూచనము :

వ.

మఱియు బలాబలంబులును సారాసారంబులును గార్యాకార్యంబు
లును బుణ్యపాపంబులును నాదిగాఁ గల ప్రపంచంబంతయు
నాకుం దెలియ నానతిమ్మని యడిగినం గమలగర్భుండు కరుణించి
వసిష్ఠమహామునిం దలంచిన తత్క్షణంబ చనుదెంచి వినయవినతుం
డైన నమ్మునీంద్రునకు మనువుం జూపి యి మ్మహాత్ముం డడిగిన
యర్థంబంతయు సర్గాదియందు నాచేత నీకుఁ జెప్పంబడిన పద్మ
పురాణేతిహాసప్రపంచంబ కావున దాని సవిస్తరముగా నెఱింగింపు
మని నిర్దేశించిన వసిష్ఠమహాముని వలన నిప్పురాణంబు సర్వంబు
విని స్వాయంభువమనువు పుణ్యాత్ముండై సకలజగత్పరిపాల
నంబు చేసి పరమసిద్ధికిం జనియెఁ బదంపడి వైవస్వతమన్వంత
రంబున.

88


ఉ.

భూపకులప్రదీపుఁడు తపోదనసంస్తవనీయసత్యస
ల్లాపుఁడు ధర్మరక్షణకలాపుఁడు విగ్రహరాజభేదనో
ద్దీపితచండచాపుఁ డధరీకృతతాపుఁడు లోభమోహని
ర్లేపుఁ డవంధ్యకోపుఁడు దిలీపుఁడు నిర్జితపాపుఁ డున్నతిన్.

89


వ.

అమహ్మానుభావుం డిక్ష్వాకువంశసంభవుండు గావునఁ జతుస్స
ముద్రముద్రితం బగు వసుంధరావలయం బంతయుఁ దనశాస
నంబునం బ్రవర్తిల్ల నయోధ్యానగరంబు నిజరాజధానిగాఁ బురం
దరవైభవంబుతో రాజ్యంబు సేయుచుండి నిజకులక్రమాగతా
చార్యుండును బాదరాయణప్రపితామహుండును ద్రికాలజ్ఞుండును
భగవద్ధ్యానపరాయణుండును బరమజ్ఞానసుధాసముద్రుండును

నగు వసిష్ఠమహామునీంద్రు [26]నుపాశ్రయించి తత్ప్రసాదంబున
సకలవేదవేదాంగపారగుండై పరమపుణ్యస్వరూపంబునుం బద్మ
సంభవప్రోక్తంబును నగు పద్మపురాణంబున సర్గ ప్రతిసర్గవంశ
మన్వంతరంబులును బ్రహ్మర్షి రాజర్షి వంశకీర్తనంబును భూవిస్తా
రంబును సకలవర్ణాశ్రమధర్మంబులును సకలదీక్షానియమంబు
లును సకలవ్రతనియమాచరణంబులును సకలదేవతాశక్తి
స్వరూపభేదంబులు సకలమంత్రరహస్యంబులును శివరాఘవ
సంవాదంబును శైవరహస్యంబులును నాదిగాఁ గల బహుకథా
జాలంబంతయు సవిస్తరంబుగాఁ బూర్వమధ్యమఖండంబులు విని
పరమజ్ఞానసంపన్నుండై యమ్మహాముని దనకు నాచార్యుండుగా
సుదక్షిణాదేవి తనకు ధర్మపత్నిగా నఖిలమునిజనసమ్మతంబున
నశ్వమేధాధ్వరంబు సదక్షిణంబుగ సంపూర్తి గావించి యపభృథ
స్నానానంతరంబున దివ్యాంబరభూషణాలంకృతుండై సకలముని
జనాశీర్వచనంబులును వందిజనపఠననినదంబులును భేరీమృదం
గాదివాదిత్రనాదంబులును జెలంగఁ బురజనులు తన్నుం బరి
వేష్టించికొనియుండ సుఖోపవిష్టుండై కొలువున్న యవసరంబున.

90


తే.

మృగయుఁ డొక్కఁడు చనుదెంచి మొగుడుఁ గేలు
ఫాలతలమున నిడి భూమిపాలుమ్రోల
నిలిచి వినిపించె మృగముల నెలవులెల్ల
నరసి వచ్చితి దేవ! నీయడుగు లాన.

91


క.

అవ్వనములు దమమయమై
యౌవనమున నొకటి కొకటి నఱుముచు మిగులున్
గ్రొవ్వి కడుమసురు కనిసిన
వవ్విపినంబులను మృగము లవనీనాథా !

92

దిలీపమహారాజు వేఁటకై వనంబున కరుగుట :

వ.

దేవరకు నిది మృగయా వినోదావసరం బయి యున్నయది
కన్నులపండువుగాఁ జూడ వేడుకగలదేని విజయం చేయుమని
పలికిన నవ్వేఁటకాని మాటలకు దరహసితవదనుండై కొలువు
వారల వీడ్కొల్పి తగినసహాయులం గూర్చుకొని వేఁటరివిధం
బున నాయితంబై.

93


ఉ.

నెట్టన [27]బంచెఁ గౌఁ దొడిగి నెక్కొనఁ జెన్నగు పాగ మౌళిపైఁ
జుట్టి సితాసి దానిబడి సూటిగ నమ్ములు విండ్లు పూని యో
రట్టల చెప్పులుం దొడిగి యత్తెముఁ జర్మముఁ దాల్చి ద్రిండు వే
కట్టి దిలీపుఁ డొప్పెఁ గఱకంఠుఁడు లుబ్ధకుఁడైన కైవడిన్.

94


వ.

ఇవ్విధంబున మృగయాసన్నాహంబునం బురంబు వెల్వడి
యమేయసారమేయంబులును ననేకవాగురావలులును నానా
యుధహస్తులగు భటులును దోడఁ జనుదేర సింహవిక్రముం
డగుచు రాజసింహుండు నానామృగవినోదంబులు చూచుచు ననేక
నదు లుత్తరించి గాంధారవనంబు నందు.

95


సీ.

చటులతరాకారశార్దూలనికరంబు
       నడఁగించె నొక్కట నంపగముల
భీకరసూకరానేకయూధంబుల
       భంజించె నీఁటెలఁ బడలు పడఁగ
శాతశృంగోత్తుంగసారంగచయములఁ
       జటులతఁ దునుమాడె శస్త్రనిహతి
ఘోరసముద్దండసైరిభవ్రజముల
       బహువిధాయుధముల భంగపఱిచె

తే.

మఱియు వన్యగజంబుల మద మడంచె
గండమృగములఁ బెక్కింటి గండడంచెఁ
జెలఁగి మన్నులు మొదలైన బలుమృగములఁ
గడఁగి పరిమార్చెఁ దననేర్పు కడిమి మెఱయ.

96


వ.

ఇ ట్లనేకవిధంబులం జిత్రవధంబు సేసి యొక్కొక్కచోటం జటుల
విటపాంతరస్థలి నహీనకాకఘూకపారావతప్రముఖవిహగవ్రా
తంబును భీతహరిణీజాతంబును లతామందిరద్వారతోరణాయ
మానానూనభృంగసముదయమంగళసంగీతసమేతంబును దావ
పావకసంవర్ధనవలమానమహావాతంబును దుర్దమశార్దూల
నఖముఖనిర్భిన్నమృగాంగనిష్ఠూతరక్తధారారుణితప్రదే
శంబును ప్రభూతసింహకిశోరకోలాహలపూరితాకాశంబును
విదారితకుంభికుంభస్థలముక్తాఫలోపలక్షితహర్యక్షమార్గంబును
కంపితఖడ్గమృగవర్గంబును నానాతరుకుసుమమకరందబిందు
సందోహసమ్మిళితసుగంధబంధురగంధవహవిమోచితస్వచ్ఛ
తరుచ్ఛాయాప్రవిష్టపథికజనపరితాపంబును నిబిడదీర్ఘవల్లికా
నివహవిహితగంభీరకూపంబును సరణితకంచుకాంచితనాగాధిష్ఠి
తనగగుహంబును దావానలశిఖాకలాపవిరూపితమహీరుహంబును
కుంజపుంజనిర్గచ్ఛదనర్గలవృకవ్యాఘ్రచకితభటప్రకరంబును
త్రపనీకృతనిశ్వసితశశకశిశువిసరసమధిగతవనాంతరంబును
మహాక్రోధవ్యాధనికరకలకలప్రథితపలాయమానశరభ
శార్దూలగవయగండభేరుండవరాహప్రముఖఘోరమృగచరణ
సముత్థితసాంద్రధరణీపరాగపటలతిరోహితరోదోంతరాళంబును
బహుకంటకద్రుమాభీలంబును నైన వనస్థలంబుం గనుంగొని
యా రాజశేఖరుండు సాంధ్రవ్యాధవర్గంబుతో నిరర్గళప్రకారంబున
విహరించుచున్న సమయంబున.

97

శా.

ఆ కోలాహలభీతమై చటులవేగాన్వితసారంగ మ
స్తోకంబైన వనంబున న్వెడలి యత్యుద్యత్పదోల్లంఘితా
నేకానోకహదుర్గమార్గతతియై యేగె న్నిజేచ్ఛారతిన్
వైకల్యంబున నొక్కమాటు గగనవ్యాసంగియై వెండియున్.

98


ఆ.

కానవచ్చు నడఁగుఁ గ్రమ్మఱఁ బొడసూపు
మెలఁగి చూచు దాఁటు మిన్నుముట్టు
నంతకంత కమ్ము కందక వేగంబ
యెగుచు వేఁటకాండ్ర నిగిడి మృగము.

99


క.

తొడరి పతి వెంటఁ దగులఁగ
నడవులు నేఱులును గడచి యతిరభసమునం
గడుదూర మరిగి చూడ్కికిఁ
బొడచూపక యడఁగె మృగము; భూవరుఁ డంతన్.

100


ఉ.

కుత్తుక యెండి నోరఁ దడి కొంతయు లేక మొగంబు వాడ న
త్యుత్తమశౌర్యులై పరఁగు యోధవరుల్ నిబిడశ్రమార్తులై
యత్తఱిఁ గూడలే కచట నందఱుఁ గూడుక చిక్కియుండఁగాఁ
జిత్తము దప్పిచే మిగులఁ జేడ్పడుట న్వికలస్వరంబునన్.

101


క.

ఉండఁగ మధ్యాహ్నమునకుఁ
జండకిరణుఁ డేగుదెంచె జననాయకుఁడున్
బెండువడియుండి దిశ లొం
దొండ పరీక్షించుచుండె నుదకాపేక్షన్.

102


వ.

అంత.

103


క.

జనవర కొలనిదె రమ్మని
యనయముఁ జెప్పంగ వచ్చినట్టిదపోలెన్
[28]వనరుహసుగంధియగు న
య్యనిలము వీతెంచె నృపతి కానందముగన్.

104

వ.

ఇట్లు జలకణమిళితమందమారుతం బొలసినం జూచి దిలీపభూపతి
యచేచెరువ జలంబు గలుగనోపు నని యా చొప్పున వచ్చివచ్చి.

105


మ.

కనియె న్ముందట రాజచంద్రుఁడు లసత్కంజాతకింజల్కపుం
జనితాంతద్యుతి చారుతీరము నతిస్వచ్ఛాంబుసంపూరమున్
ఘనకల్లోలనినాదతోయ మనసంఘధ్వానవిస్తారమున్
జనితశ్రాంతిజనార్తిదూరము ఘనాసారమ్ముఁ గాసారమున్.

106


వ.

మఱియు సముద్రస్పర్ధియు ననేకపాదపప్రవృద్ధియు వికచకమల
కుముదకల్హరకువలయామోదమేదురంబును మకరందాస్వాద
మత్తమధుకరనికరంబును యథేష్టచలజ్జలచరనిర్భిన్నవీచితా
రాజివిరాజితంబును నానావిధవిహగనిరంతరకోలాహలసంకులం
బును నై సజ్జనహృదయంబునుం బోలె నతినిర్మలంబై ధూర్తు
చిత్తంబునుం బోలె నంతర్గ్రాహణక్రూరంబై దాతయుం బోలె
సర్వజనస్తవనీయజీవనోదకంబై మలయమారుతంబునుం బోలె
సంతాపహరంబై విలసిల్లు కొలనుఁ గాంచి జలదంబుఁ గనుం
గొన్నచాతకంబుచందంబున సంతుష్టాంతరంగుండై దిలీప
భూపాలుండు జలపానం బాచరించి విగతపథపరిశ్రాంతుండై
మధ్యాహ్నసమయానుష్ఠానంబు లనుష్ఠించి వివిధాస్త్రసంపన్న
సహాయసహితుండై వారలకు నిష్టకథలు వినిపించుచుఁ దత్తీరం
బున నున్న యవసరంబున.

107


చ.

ఘనమగు నెండతాఁకునకుఁ గాయము కంది [29]పరిభ్రమార్తుఁడై
జనపతి విశ్రమించె విలసన్మతిఁ జల్లని రాజు గాన న
య్యనఘుఁ దపింపఁజేయఁ దగదంచుఁ దొలంగినభంగి నర్కుఁ డొ
య్యనఁ జనియెన్ రథాంగకసమాఖ్యము లంగజుచేత బెగ్గిలన్.

108


ఆ.

అంత రాత్రియైన నవనీశుఁ డొకపెద్ద
మ్రాన నాదిపెట్టి పూనియుండె
శరశరాసనములు ధరియించి పదిలుఁడై
యచటి మృగగణంబు నరసికొనుచు.

109

క.

వ్యాధులును గూడి దిశలు ని
రోధించిరి వలలు పన్ని రోషంబున దు
స్సాధమగు వనములో బహు
సాధనములు పూని యధికసంరంభమునన్.

110


వ.

అంత.

111


చ.

తెలతెల వేగువేళఁ బఱతెంచె వరాహసమూహ ముగ్రతం
దలకొని నేలమట్టవియఁ దట్టుచు ముట్టెల ముస్త లొత్తుచుం
జెలఁగుచు ఘుర్ఘురధ్వనులు సేయుచుఁ దత్తటమెల్ల దారయై
లలిఁ బెనుఁ జీకువాలు మరలం జనుదెంచె ననంగ దట్టమై.

112


వ.

అప్పు డక్కలకలం బాలించి.

113


క.

[30]కొడతములు విచ్చి కుక్కల
విడుచుచుఁ బెనువలల నిగుడ విప్పుచుఁ గడఁకన్
వెడవెడ నార్చుచు నఱిముఱిఁ
గడువడి వలవేఁటకాండ్రు గనిసిరి పెలుచన్.

114


క.

అల [31]నృపుఁడు తరువు దిగి వెస
వలలకు లోబడక పాఱు వాలుమృగములం
బలుతూపులఁ బడ నేయుచుఁ
జులుకనఁ బొలియించెఁ బెక్కుసూకరసమితిన్.

115


వ.

మఱియు ననేకప్రకారంబులగు మృగంబుల వధియించి వేఁట
చాలించి యధికోత్సాహసంపన్నంబగు భటనికాయంబు బలసి
చనుదేర మృగావలి నోసరించి.

116


క.

భూపాలకుండు మృగముల
నేపున మోపించుకొనుచు నెసఁగఁగఁ దత్తీ
రోపాంతవనము వెడలి ప్ర
తాపంబునఁ బురము కరుగఁ దలఁపఁగ నంతన్.

117

సీ.

కమలినీముఖపద్మకాంతి నివాళింప
        నేపార నెత్తినదీప మనఁగఁ
బూర్వపర్వతశిరోభూషావిశేషమై
        చెలువారు గైరికశిల యనంగఁ
బ్రాచీదిశావధూఫాలదేశంబున
        లలినొప్పు సిందూరతిలక మనఁగ
జంభారివారణకుంభమధ్యంబున
        భాసిల్లు చెంగల్వబంతి యనఁగ


తే.

మెఱసి చీకఁటి విరియించి మిన్నుముట్టి
చక్రవాకాళితాపము సంహరించి
యళుల మేల్కొల్పి కొలఁకులఁ దెలుపు లొసఁగి
తరణి యుదయాద్రిఁ బొడతెంచెఁ దత్క్షణంబ.

118


వ.

ఇట్లు సూర్యోదయావసరంబునం జని చని పురోభాగంబున.

119

దిలీపుఁడు వైఖానసఋషినిఁ జూచుట :

ఉ.

భూతలనాథుఁ డిద్ధపరిపూర్ణయశోనిధిఁ గాంచె వృద్ధహా
రీతుని సత్తపోధనపరీతుని నూర్ధ్వజలౌఘపూతు వి
ఖ్యాత కులప్రసూతుని నగాధకృపారసికాంతరంగసం
స్ఫితునిఁ జిత్తభూవిపదభీతుని సజ్జనతావినీతునిన్.

120


ఆ.

ఊఁతకోల వట్టి యొడలితో లెమ్ముల
నంటి నరములెల్ల నంగకములఁ
గానఁబడఁగఁ దొంటిగతిఁ దప్పి ముదిసి మై
వదలి పలితుఁ డైనవాని విప్రు.

121


వ.

కనుంగొని సాష్టాంగదండప్రణామం బాచరించి కృతాంజలియై
మార్గమిచ్చి నిలిచియున్న యమ్మన్నుఱేనిం జూచి వైఖానసుం
డతనికిం బురుషార్థంబు సేయందలంచి యి ట్లనియె.

122

క.

కనుమిది మాఘాది మహీ
జనవర! కడుఁ బుణ్యతిథి ప్రశస్తంబగు నేఁ
డనఘా! ప్రాతస్స్నానం
బొనరఁగ నిక్కొలనఁ జేయ కుచితమె యరుగన్.

123


ఆ.

అనిన రాజు వలికె నవనీసురోత్తమ!
యెఱుఁగఁ దొల్లి దీని నిట్టి దివ్య
మహిమఁ గలుగునట్టి మాఘమాసస్నాన
ఫల మదెట్లు నాకుఁ దెలుపవయ్య!

124


చ.

అనవుఁడు రాజుమాట విని యమ్ముని వల్కెఁ దమోనివారణం
బున దిననాయకుం డుదయభూధర మెక్కుచు నున్నవాఁడు పెం
పొనరఁగఁ దీర్థమాడుటకు నొప్పెడు కాలము గాన నిప్పు డీ
వినుతకథాప్రసంగతికి వేళ యొకింతయు లేదు భూవరా !

125


వ.

అట్లు గావున నీవును సుస్నాతుండవై పురంబున కరిగి యి క్కథ
వసిష్ఠమహామునీంద్రు నడుగుమని స్నానార్థంబు వైఖానసుం
డరిగె; రాజును మరలి చనుదెంచి యక్కొలన నవగాహనంబు
చేసి మహాహర్షంబున బురంబునకుం జని నగరు ప్రవేశించి కృత
భోజనుండై వెలిమావులం బూన్చిన రథం బెక్కి కదలి మంత్రులం
గూడి సితచామరఛత్రంబులు మెఱయ వందిమాగధబృందస్తోత్రం
బులు చెలంగ మునివాక్యంబులఁ దలంచుచు వసిష్ఠాశ్రమంబు
డాయం జనుదెంచి.

126

దిలీపుఁడు వసిష్ఠాశ్రమమునకుఁ బోవుట :

క.

జాతివిరోధములగు మృగ
జాతులు తమవైర ముడిగి చరియించుట వి
ఖ్యాతుఁడగు నమ్మునీంద్రు మ
హాతపము మహత్వ మనుచు నవ్వనవీథిన్.

127


వ.

దఱియం జొచ్చి ముందట.

128

చ.

కనియె శ్రుతిస్మృతిప్రకరగాఢతరార్థవరిష్ఠు దివ్యబో
ధనపదవీమహత్వసముదగ్రగరిష్ఠుఁ దపోవిశేషసం
జనితనితాంతపుణ్యగణసంచయసువ్రతనిష్ఠు శేముషీ
జనితహితప్రభావమునిసంఘవరిష్ఠు వసిష్ఠు నయ్యెడన్.

129


వ.

కనుంగొని వినయంబున నమస్కరించిన నద్దిలీపభూపతి నాశీర్వ
దించి యాసనం బిడి యర్ఘ్యపాద్యాది విధులం బూజించి కుశలం
బడిగిన నమ్మునీంద్రునకు నరేంద్రుం డిట్లనియె.

130


చ.

అనఘ! భవత్ప్రసాదమున నారయ మాకు శుభంబయంచు న
మ్మునికి నమస్కరించి నృపముఖ్యుఁడు చేరి విఖానసోక్తు లె
ల్లను వినిపించి మీవలన లక్షణవంతములై తనర్ప నే
మును నృపధర్మకర్మములు మున్కొనివింటి నశేషతీర్థముల్.

131


వ.

మఱియు సకలధర్మంబులును సర్వవిధులును సమ్యక్ప్రకారంబున
విని కృతార్థుండనైతి నవ్వైఖానసుండు సెప్పిన యంత నుండి
యును మాఘస్నానఫలవిశేషంబులు విన నత్యంతకుతూహలం
బయ్యెడిని; దత్ప్రకారం బంతయు సవిస్తరంబుగా నాన తిమ్మని
వినయావనతవదనుండైన యా రాజునకు మునిరా జిట్లనియె.

132


సీ.

అవనీశ! నీవు న న్నడిగిన యర్థంబు
       పరమపవిత్రంబు పాపహరము
దానశీలురకుఁ గాంతారవాసులకును
       నతిథిభక్తులకును నందరాని
గతులఁ బొందించు లోకమున నేపుణ్యులు
       నమరసౌఖ్యముఁ గొంత యనుభవించి
మరలివత్తురు గాని మాఘమాసస్నాతు
       లగువారు నురలి రా రమృతపదముఁ

తే.

బొంది యేలోకముననైనఁ బూజ్యు లగుచు
నిత్యముక్తులు సుఖులునై నెగడుచుందు
రిట్టి మాఘంబుమహిమ నీ కధికభక్తి
నెఱుఁగ జెప్పెద వినుము నా యెఱిఁగినంత.

135


వ.

తత్ప్రభావప్రకారంబగు నొక్కయితిహాసంబు గలదు తత్పర
చిత్తుండవై వినుమని యిట్లనియె.

134

వసిష్ఠుఁడు దిలీపునకుఁ జెప్పిన భృగుమహర్షి వృత్తాంతము :

సీ.

తొల్లి పండ్రెండేండ్లు దురితకారణమున
        వానలు లేకుండ వసుధకెల్ల
దుర్భిక్ష మరుదేర దురపిల్లి ప్రజలెల్ల
        నశనకాంక్షల డస్సి యనువు దప్పి
హిమశైలసహ్యమధ్యమదేశమంతయుఁ
        బాడఱి పితృదేవబలివిధాన
హవ్యకవ్యములకు నన్నంబు ఫలమూల
        ములు లేక క్రియలెల్లఁ బొలిసిపోయె


తే.

నగ్నిహోత్రము లన్నియు నణఁగిపోయె
సకలవర్ణాశ్రమంబుల జాడ లుడిగెఁ
జోరబాధలు తఱుచయ్యె సుజనశీల
మవశమై పోయె నయ్యుపప్లవము వలన.

135


వ.

అంత.

136


తే. గీ.

వింధ్యపాదాశ్రయమున నవంధ్యనియతి
నుండి భృగు వట్టికఱవున కోర్వలేక
శిష్యగణములతో హిమశిఖరి దాఁటి
దివ్యనదులును గిరులు నతిక్రమించి.

137

చ.

చని చని కాంచెనంత మునిసత్తముఁ డున్నతశృంగజాలమున్
జనిమరణాదిదూరగణశంకరధారణనిత్యశీలమున్
వినుతయశోవిశాలమును విశ్రుతదివ్యమహీజజాలమున్
వనజభవాదిదేవమునివర్ణితహేలము రౌప్యశైలమున్.

138


ఆ.

అనఘ! తన్మహీధ్రమునకుఁ బశ్చిమదేశ
మున ననేకచారుకనకరత్న
మయశిలాఢ్యమైన మణికూట మను గిరి
కలదు తద్విశేషఘనత వినుము.

139


ఆ.

అంతరాంతరముల హైమరేఖాంకిత
మై సమస్తనిలయమైన యద్రి
మెరసియుండుఁ జూడ మృదుతటిల్లతికాస
మేతమైన నీలమేఘ మనఁగ.

140


క.

శిరము వినీలంబై మొద
లురుకాంచన [32]మయతఁ దేఱి యొప్పు మహీభృ
ద్వర మమలపీతవస్త్రం
బరుదుగ ధరియించునట్టి యచ్యుతుభంగిన్.

141


ఆ.

[33]దివ్యవృక్షములును దివ్యౌషధంబులు
గలయ బెరసి యద్రి పొలుపుమీఱి
రాత్రులందు మిగులఁ బ్రజ్వరిల్లుచు లీలఁ
జెలఁగు దావదహనశిఖరివోలె.

142


వ.

మఱియునుం దదీయకమనీయతటమకుటస్థితవిద్యాధరబృందం
బును గుహాగృహసమాసీనాంతర్నియమితమరుదనేకపరమయోగి
నికాయంబును మందారకుసుమామోదసురభీకృతదశదిశాభాగం
బును పారావతచకోరకీరమయూరమరాళప్రముఖనిఖిలవిహగ

కులారావసంకులంబును దేవయక్షరాక్షసనానావిధభూతజాత
సేవ్యమానంబును దరీముఖప్రసృతనిర్ఝరవారిధారాపాతచూత్కార
ముఖరితనభోంతరంబును మదకరికలభపృథుబృంహితబధిరీ
కృతసమీపదేశంబును కస్తూరికాసంకుమదపరిమళమిళితగుహాం
తరంబును విచిత్రచమరీమృగజాలాలోలవాలవ్యజనవిరాజితం
బును షట్త్రింశత్సంఖ్యాయోజనోన్నతంబును [34]శతయోజనా
యతవిస్తారంబును నైన మణికూటపర్వతంబుఁ జూచి సంతసిల్లి
దుర్భిక్షపీడితుం డగు భృగుమహాముని తత్ప్రదేశంబునఁ బర్ణశాల
నిర్మించి శిష్యగణసమేతుండై తపంబు సేయుచున్నంత
నొక్కనాఁడు.

143


తే.

పులియు హరిణియు నెడఁగూడి పొలసినట్లు
పరుషశార్దూలముఖుఁడైన పురుషు వెంట
పసిడిపుత్త్రిక గతి నొక్కపద్మవదన
కూడి చనుదెంచె నప్పు డక్కొండనుండి.

144

భృగు విద్యాధర సమాగమము :

వ.

ఇట్లు వచ్చి యమ్మహామునీశ్వరునకు నమస్కరించి దీనవదనులై
నిలిచిన విద్యాధరదంపతులం గనుంగొని భృగుమహాముని యి
ట్లనియె.

145


క.

ఎవ్వలననుండి వచ్చితి
వెవ్వలనికిఁ బోవు చిటకు? నెవ్వరు నీపే?
రివ్వామనయన యేమగు?
నివ్వగ నీకేల గలిగె? నింతయుఁ జెపుమా!

146


వ.

అనిన విద్యాధరుం డిట్లనియె.

147

క.

హృద్యతరగానమున నన
వద్యుం డగువాఁడ దివిజవరుసన్నిధి న
వ్విద్యాధరాలిలోపల
నాద్యుఁడ సుముఖుండు నాఁగ నలరుదు నచటన్.

148


ఆ.

దేవనగము కేగి దివిజేశు కడనుండి
వచ్చుచోట నిట్లు వరమునీంద్ర!
నెపములేక నాదు లపనంబు పులిమోము
భంగియయ్యెఁ దొంటిపాపమునను

149


వ.

నాటనుండి మొగ మెత్తనేరక సిగ్గువడి విపినంబులఁ జరించుచు
విషాదంబున నుండుదు; నే డిందులకు మీరు విజయం చేయుట
యెఱింగి చనుదెంచి భవద్దర్శనంబునం గృతార్థుండ నైతినని
చెప్పి కృతాంజలియై మఱియు నిట్లనియె.

150


సీ.

ఇది నా మనోహరి యిందుబింబానన
      తరలాయతాక్షి కాంతాలలామ
పిన్నపాయమునాఁడు కిన్నరేశ్వరుఁ గొల్చి
      కైలాసమున కేగి గారవమున
నవ్యవీణానాదదివ్యగానంబుల
     మృడుని నారాధించి మెప్పు వడసె
నారదుఁ డెప్పుడు నలినాక్షిగానంబు
     వినఁగోరి యెంతయు వేడ్క సేయు


తే.

నిట్టి సుకుమారి నా కబ్బినట్టిచోట
నింపుపొంపిరి వోవ భోగింపలేక
వికృతవదనంబు నాకైన వేదనమున
సంతతంబును నెరియుదు సన్మునీంద్ర!

151

మ.

ఇది యేకర్మఫలంబునం గలిగెఁ [35]దా నీపాప మింకేమిటం
దుదియందు న్నిది నాకుఁ జెప్పు మునిశార్దూలా! మహాభాగ! నా
వదనాబ్జంబున నవ్వుదేర భృగుఁ డవ్యాఘ్రాస్యుతో నిట్లనుం
ద్రిదశేంద్రాదులనైనఁ గర్మఫలముల్ [36]తేజంబు వారింపవే.

152


ఆ.

ఈఁగకాలి యంతయేనియు విషమైన
యదియు మృత్యుహేతువైన యట్ల
యల్పమయ్యుఁ గర్మ మట నొయ్యనొయ్యన
దారుణత్వ మొందు ధర్మచరిత!

153


వ.

అది యెట్లనిన నీవు కృతయుగంబున మాఘమాసంబునం దేకాదశి
యం దుపవసించి ద్వాదశియందుఁ దైలాభ్యంజనరంజితుండ
వైతివి కావున నప్పాపంబున నీ కిట్టివికృతాననంబు సంభవించె
నని చెప్పి భృగుండు దొంటికథ యొక్కటి గల దాకర్ణింపుమని
యి ట్లనియె.

154

పురూరవశ్చరిత్రము :

తే.

వీరశేఖరుఁడైన పురూరవుండు
చెంది నీయట్ల ద్వాదశియందుఁ దైల
మంటుకొనుదోషమున వికృతాంగ మొంది
మనుజు లెవ్వరు పడని యుమ్మలిక గదిరి.

155


చ.

తనతను వొందినట్టి వికృతత్వముఁ గన్గొని జాలిఁ బొంది య
య్యనఘుఁడు దేవతాతటినియం దవగాహము చేసి నిష్ఠమై
ననశనదీక్ష నొంది హరి నంబుజనాభునిఁ జక్రపాణి నె
మ్మనమున నిల్పి నిచ్చలును మాఘమునన్ వ్రత మాచరించుచున్.

156

వ.

ఉన్న పురూరవునకుం గరుడధ్వజుండు ప్రత్యక్షంబై సప్తసప్తి
మకరప్రాప్తుండైన యమ్మాసంబున నవగాహనంబు చేసి నను
నారాధించితి గావున మహాత్మా! నీకు సప్తజన్మార్జితతపఃఫలంబు
సంభవించెనని పలికి మాఘశుద్ధద్వాదశియందు నతనిశరీరంబున
శంఖోదకంబుల సమ్మార్జనంబు చేసి తైలసేవాదోషం బపనయించి
యతనికిం జక్రవర్తిపదవిం బ్రసాదించి లక్ష్మీశ్వరుం డంతర్హితుం
డయ్యె నంత.

157


క.

నరపతి గతపాతకుఁడై
నిరుపమకమనీయమూర్తి నెగడిన కతనన్
మరుని జయంతుని నలకూ
బరు నశ్వినులను జయించె భవ్యస్ఫూర్తిన్.

158


వ.

అంత.

159


క.

వెన్నెల నీనెడి నవ్వును
గన్నుల[37]చెలువంబుఁ జన్నుఁగవయొప్పిదమున్
నెన్నడుము బడువుఁ దనమును
బున్నమనెలఁ దెగడు మోముపొలుపును మెఱయన్.

160


సీ.

ఘననీలమణికాంతిఁ గనుపట్టుకొప్పుపై
       మందారపుష్పదామములు వెలుఁగ
నిభకుంభయుగమున కెనవచ్చుఁ జనుదోయిఁ
       బూననేరక లేఁతకౌను నులియఁ
బద్మరాగారుణపదపల్లవంబుల
       రత్ననూపురమంజురవము లులియఁ
గందర్పునందంబు గతిఁ బొల్చు మోమున
       మహితచందనలలామము దనర్పఁ

తే.

[38]గమ్మతావులు కటిపంక్తి గడలుకొనఁగ
శంబరాంతకు మోహనశక్తివోలె
నలరు నూర్వశి నా నొక్కయమరకాంత
తివుట నేతెంచె నప్పురూరవునికడకు.

161


క.

వచ్చి తగ నతని ముందట
మచ్చికతో నిలిచి యచటి మానవు లెల్లన్
మెచ్చి తనుఁ జూచుచుండఁగఁ
బచ్చనివిలుకానిబారిఁ బడి యి ట్లనియెన్.

162


ఉ.

నీ దగు రూపు సద్గుణవినిర్మలకీర్తులు నారదుండు దా
నాదరలీల నింద్రుసభయందు నుతింపఁగ విన్నమాత్రలో
నాదగునట్టి ధైర్యము [39]మనంబును విన్కలి చూఱవుచ్చినం
గాదన కిప్పు డేను నినుఁ గానఁగ వచ్చితి రాజశేఖరా!

163


వ.

అని యనుకంప దోఁపఁ బలికినం జూచి మన్మథాకారుండగు
పురూరవుండు శరణాగతరక్షణంబును నుత్తమస్త్రీలాభంబును దొర
కొనుట పురుషార్థంబుగా నిశ్చయించి సుపర్వస్త్రీపూర్వయగు
నూర్వశిం బరిగ్రహించి తనపురంబున కరిగి విష్ణువరప్రసాదం
బునం జక్రవర్తిపదప్రాప్తుండై యచ్చట రాజ్యసుఖంబు ననుభ
వించుచుండె నట్లు గావున.

164


క.

నీ దోషంబు నడంగెడు
నాదట నీవ్రతము సేయు మాతనిగతి వి
ద్యాధర పౌష్యపుశుద్ధ
ద్వాదశియును నీదు సుకృతవశమున వచ్చెన్.

165


వ.

అట్లు గావున నీ వచ్చునేకాదశియందు ని మ్మణికూటపర్వతంబునం
గల పుణ్యనదియందుఁ గృతస్నాతుండవై యనశనబ్రహ్మచర్య

వ్రతనిష్ఠ సలిపి త్రికాలంబును విష్ణు నారాధించుచు మాఘశుద్ధైకాదశీ
పర్యంతంబుగా నీవ్రతంబు నడపి దురితనిర్ముక్తుండ వగుము.
ద్వాదశినాఁడు నిన్ను మంత్రోదకంబుల నభిషిక్తుం జేసెద నంత
నీవు మదనవదనుండ వగుదువని చెప్పి భృగుండు విద్యాధరుం
గనుంగొని మఱియు ని ట్లనియె.

166


క.

విను మాఘస్నానంబున
ననయము నాపదలు వాయు నఘములు వొలియున్
వినుతాఖిలవ్రతాదిక
ఘనదాన[40]ఫలంబులెల్ల గలుగు నరులకున్.

167


క.

మాఘము యోగముకంటెను
మాఘము యజ్ఞములకంటె మతిఁ బరికింపన్
మాఘం బశేషధర్మా
మోఘఫలప్రదము గాదె ముల్లోకములన్.

168


సీ.

చెలఁగి పుష్కరకురుక్షేత్రంబులందును
       దనరు బ్రహ్మావర్తమునఁ బ్రయాగ
నవిముక్తమునను గంగాంబుధి సంగతిఁ
       బదివత్సరంబులు భక్తితోడ
సుస్నాతుఁడై నట్టి సుకృతంబు గలుగు మా
       ఘమునందుఁ ద్రిదినావగాహియైన
నని చెప్పు మునివాక్య మాకర్ణనము చేసి
       యయ్యాశ్రమంబున కధికనిష్ఠ


తే.

భృగువుతోఁ గూడి మణికూటనగముమీఁద
[41]నిర్ఝరిణియందు సుస్నాననిత్యవిధులు
సతియుఁ దానును గావించి యతని కరుణ
జంద్రముఖుఁ డయ్యె విద్యాధరేంద్రుఁ డధిప.

169

వ.

ఇవ్విధంబున సుముఖుండై తరుణియుం దానును నప్పర్వతం
బునం దత్యంతసుఖంబు లనుభవించుచుండె నంత దుర్భిక్షంబు
దెలిసిన భృగుమహర్షియును శిష్యగణసమేతుండై క్రమ్మర వింధ్య
గిరిపాదావతీర్ణయగు రేవానదీతీరంబున నాశ్రమంబు నిర్మించు
కొని సుఖంబుండె నట్లు గావున.

170


క.

భృగుముని విద్యాధరునకుఁ
దగఁ జెప్పిన మాఘమహిమఁ దాత్పర్యముతోఁ
దగిలి విను పుణ్యపురుషుల
కగణితమగు శుభము లొదవు నఘము లడంగున్.

171


వ.

అని చెప్పి వసిష్ఠుండు దిలీపున కిట్లనియె. నీవు న న్నడిగిన
యట్టి యిమ్మాఘమాహాత్మ్యంబు తొల్లి కార్తవీర్యుం డడిగిన నత
నికి సహ్యగిరిమీఁద నుండి దత్తాత్రేయుం డిట్లని చెప్పె.

172

కార్తవీర్యునకు దత్తాత్రేయుండు చెప్పిన మాఘప్రభావము

క.

వినవయ్య! కార్తవీర్యా
ర్జున!మాఘముమహిమ మున్ను సురముని కమలా
సను నడుగ నాతఁ డతనికి
వినిపించిన తెఱఁగు నీకు వినిపింతుఁ దగన్.

173


ఆ.

ప్రకట[42]ధర్మభూమి భారతవర్షంబు
గాన నిందునున్న కారణమున
మనుజులకును మాఘమజ్జనవశమునఁ
గాక యొంట సుగతి గలదె చెపుమ?

174


క.

వ్రతదానతపములందును
మతి హరి ప్రియమందఁ డుదయమాఘస్నాన
వ్రతనియమంబులఁ బొందిన
గతి నరయఁగ రాజచంద్ర! గాంభీర్యనిధీ!

175

వ.

మఱియు నస్థిస్తంబంబును స్నాయుబంధంబును మాంసరక్తలేప
నంబును జర్మావశదంబును మూత్రపురీషదుర్గంధసంగతంబును
జరాశోకవిషవ్యాప్తంబును మహారోగమందిరంబును సర్వదోష
సమాశ్రయంబును మంగళరహితంబును నవరంధ్రాన్వితంబును
దాపత్రయవిమోహితంబును నిసర్గధర్మవిముఖంబును గామ
క్రోధాదిశత్రుబాధితంబును నగునిట్టిశరీరంబు మాఘస్నానవర్జితం
బయ్యెనేని నిష్ఫలంబగు. నంతియ కాదు. వినుము. వైష్ణవభక్తి
రాహిత్యంబున విప్రుండును, మౌర్ఖ్యంబున యోగీంద్రుడును,
నబ్రహ్మచర్యంబున క్షత్రియుండును, డంబంబున ధర్మంబును,
గ్రోధంబునఁ దపంబును, ధార్ష్యంబున జ్ఞానంబును, బ్రమాదంబున
శ్రుతంబును, గర్వంబున బ్రహ్మచర్యంబును, విదీప్తానలంబున
హోమంబును, నసాక్షికంబున భోజనంబును, ననభ్యాసంబున
విద్యయు, నసత్యంబున వాణియు, సందేహంబున మంత్రంబును,
వ్యగ్రచిత్తత జపంబును, శ్రోత్రియదత్తంబు గాక దానంబును,
నాస్తికత్వంబున లోకంబును, దారిద్ర్యంబున నిహలోకసౌఖ్యం
బును, నిరర్థకంబులై నట్లు మాఘస్నానరహితం బయిన నరుని
జన్మంబు నిష్ఫలంబగు వెండియు.

176


క.

మకరగతి సూర్యుఁ డుదయిం
పక మును మజ్జనములేని పాపాత్ముఁడు పా
తకముల నె ట్లడఁగించును
బ్రకటంబగు త్రిదివ మెట్లు ప్రాప్తించుఁ దుదిన్?

177


క.

ఇలఁ దమలో మునుఁగు సురా
పుల బ్రహ్మఘ్నులను నైన బుణ్యులఁ జేయం
గలమని మాఘదినంబుల
జలజాప్తుని యుదయవేళ జలములు మ్రోయున్.

178


క.

మాఘస్నానం బెవ్వఁ డ
మోఘంబుగఁ జేయు నొక్కొ మునుకొని యని పా
పౌఘములు గంపమొందుచు
లాఘవమునఁ దూలి యడవులం గలయుఁ దుదిన్.

179

తే.

మాఘసుస్నానములఁ జేసి మనుజగణము
కడుఁ బ్రకాశించుఁ బాపసంఘములఁ ద్రోలి
బహుళతరమైన జలధరపంక్తిఁ బాసి
యున్నశీతాంశుతెఱఁగున నొప్పు మిగిలి.

180


సీ.

ఇంతయు నననేల యెట్టిది యైనను
       జిత్తకర్మాదులఁ జేయఁబడిన
యట్టి పాపము భస్మమైపోవు నగ్నిచే
       సమిధలవలెను నాశ్చర్యభంగి;
నెఱుఁగమి నొండేని యెఱుకమై నొండేని
       పాతకం బరయ సంప్రాప్తమైన
నర్కుండు నరుణోదయంబున నున్నచో
       స్నానంబు చేసిన సమసిపోవు;


ఆ.

బాపరహితులు శుచిఁ బ్రాపించి దివ్యులై
యమరలోకసౌఖ్య మనుభవింతు
రర్థి మాఘతిథుల నవగాహనము సేయఁ
గలిగెనేని నిక్క మలఘుచరిత!

181

వృక్షకాంగనచరిత్రము :

సీ.

మాఘమాసస్నానమహిమఁ జెప్పిన కథ
      గలదు సెప్పెద విను మలఘుచరిత
వృక్షక యను పేర నీక్షితి వెలసిన
      కన్యక భృగుపుత్రి దివ్యచరిత!
బ్రాహ్మణి మృదుపాణి ప్రాప్తవైధవ్యదుః
     ఖార్తయై వింధ్యాద్రియంతికమునఁ
బొల్చు రేవానదిపొంత తపంబు గా
     వించె నాచారసద్వృత్తు లమర

తే.

విష్ణుతత్పరయై [43]సంగవిగతబుద్ధి
నింద్రియంబుల [44]నెల్ల జయించి భక్తి
దేవపితృతర్పణము చేసి తివిరివేల్చి
యతిథిభుక్తాన్నశేషంబు లనుభవించు.

182


వ.

ఇవ్విధంబునం గృచ్ఛ్రపరాకాదివ్రతంబులు పునఃపునరారంభం
బున మాఘంబులఁ జరియించుచుఁ దపస్వినియును వల్కలినియు
మహాసత్త్వగుణసంపన్నయు నగు వృక్షకాంగనకు రేవాకపిలా
నదీసంగమంబున నఱువదిమాఘంబులు సంభవించె నప్పు
డుపవాసాదినియమవ్రతంబుల నశియించిన శరీరంబు విడిచి
మాఘస్నానపుణ్యఫలంబునం జేసి విష్ణులోకంబునం జతుర్యుగ
సహస్రంబు లనవరతసుఖంబు లనుభవించు చుండెనని దత్తా
త్రేయుండు గార్తవీర్యునకుం జెప్పిన విని యట మీఁదికథ యె
ట్లయ్యెనని యడుగుటయును.

183


ఉ.

తార మరాళ హీర హిమధామ తుషార మృణాళ ఫేన క
ర్పూర సితాబ్జ శంఖ సుర భూరుహ కాశ పటీర నారద
క్షీర మృగేంద్ర హార హర శేష సుధాకరతుల్య సర్వ ది
క్పూరిత కీర్తిజాల! గుణభూషణ! సంతతశిష్టపోషణా!

184


క.

వెలిగందల నరహరి పద
జలరుహమకరందమత్తషట్చరణగుణో
జ్జ్వలనవ్యమకరకేతన
విలసితనవకావ్యగీతవిద్యానిలయా!

185


మాలిని.

అనుపమశుభమూర్తీ! హారిదిక్పూర్ణకీర్తీ!
వినయగుణవిశాలా! విష్ణుసేవైకశీలా!
వనరుహదళనేత్రా! వాణసాంభోజమిత్రా!
కనకశిఖరిధైర్యా! కందనామాత్యవర్యా!

గద్య:

ఇది శ్రీనరసింహవరప్రసాదలబ్ధకవితావిలాస భారద్వాజగోత్ర
పవిత్రాయ్యలామత్యపుత్త్ర సరసగుణధుర్య సింగానార్యప్రణీతం
బైన పద్మపురాణోత్తరఖండంబునందుఁ బూర్వఖండకథాసూచ
నంబును దిలీపమృగయావినోదంబును వైఖానసదర్శనంబును
వసిష్ఠాశ్రమగమనంబును భృగువిద్యాధరసంవాదంబును పురూ
రవశ్చరితంబును మాఘస్నానవిశేషకథనంబును వృక్షకాంగన
చరిత్రంబును నన్నది ప్రథమాశ్వాసము.


  1. మా కృతికి దూకొను నిశ్చల కార్యసిద్ధికిన్ (తి).

    తి అనగా శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాచ్యపరిశోధనసంస్థ భాండాగారము నందలి తాళపత్రముల పాఠములు, తిరుపతి.
  2. గుఱించి (తి)
  3. నరు విభీషణు సనకు సనందుఁ గపిలు (ము)
  4. గొలుతున్ (ము)
    ము=ముద్రితప్రతి - పువ్వాడ వెంకటరావు పంతులు ప్రకటనము 1885
  5. సన్నుత (ము) యతిభంగము
  6. మానవేశ్వరుచేత (హై). హై=హైదరాబాదు ప్రతిపాఠములు
  7. (హై-మ). మ=మద్రాసు ప్రాచ్యలిఖిత భాండాగారము - సి పి. బ్రౌను పాఠములు.
  8. పెరవుగ (ము)
  9. మంచెనయు గన్ననయు ననంగా నేవు రుదయించి (తి)
  10. రాగిలు సుకవుల్ (మ-తి)
  11. తన మంత్రములు సముద్దండనాయకులకు (ము)
  12. మంత్రిమణియైన (మ-తి)
  13. అట్లుం గాక (ము)
  14. ననఁగఁ బ్రాగల్భ్యరూపదాననయ, మార్గముల నుతింపంగ నొప్పును ముజ్జగముల - పూర్వార్ధము తేటగీతి, ఉత్తరార్ధము ఆటవెలది (ము)
  15. మంత్రివరుల (ము)
  16. చేతోభవుఁ డఖిలధర్మ (మ)
  17. వెలిగందలామాత్యుం (ము)
  18. చేయం దలంచి (ము)
  19. శ్రీమంతునకున్ (ము)
  20. నతిశయమై ......... కృతివాంఛ గలదు నన్నుం, గృతిపతి గావించు నాకు గీర్తి యు (హై)
  21. త్రిజగదధిపమైన దేవత్రయమునందు నమరు శ్రీహరి సారమైన యట్లు (1), కడుపావనంబైన గంగా త్రయమునందు నమరు జాహ్నవి సారమైన యట్లు (2) (తి)
  22. నంధ్ర (హై)
  23. (తి-హై)
  24. నప్పుణ్యపురుషునకు (ము)
  25. సన్నిభవా (హై)
  26. నుపాసించి (ము)
  27. పట్టుగౌ పచ్చగౌ (తి)
  28. వనరుహసుగంధయుతమగు, ననిలము (తి)
  29. పరిశ్రమార్తుడై (తి)
  30. నడికియలు డుస్సి (తి-హై)
  31. లలి (మ), నలి (తి-హై)
  32. సానుతతుల నొప్పి ..... ధ్వరము ఘనపీత ... ధరించి యున్న (హై)
  33. దీప (తి)
  34. శతయోజనాయతంబును షోడశయోజనవిస్తారంబును (హై)
  35. నాకీ (హై-తి)
  36. ప్రేరేపి కారింపవే (హై-తి)
  37. పొలపంబు (హై-తి)
  38. కమ్మతావులగతి పంక్తి (ము)
  39. మనం బసమాస్త్రుఁడు (తి)
  40. వ్రతఫలములు (ము)
  41. నిర్ఝరులయందు (ము)
  42. కర్మ (తి)
  43. సంగవిగత బుద్ధి (తి)
  44. నైదింటి నెలమి గెల్చి (హై)