పద్మపురాణము/ఉపోద్ఘాతము
ఉపోద్ఘాతము
పురాణములు : 'ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయే'త్తని మహాభారతం చాటటంచేత వేదోపబృంహణార్థం వ్యాసభగవానులు పురాణవాఙ్మయమును సృష్టించినారని సంప్రదాయజ్ఞుల అభిప్రాయం. బ్రహ్మ వేదాలకంటె ముందే శతకోటిశ్లోకప్రవిస్తరమైన పురాణమును స్మరించినాడనీ దానిసారమునే వేదవ్యాసుడు భూలోకంలో ప్రతిద్వాపరంలో చతుర్లక్షపరిమితమైన అష్టాదశపురాణసంహితగా రూపొందిస్తాడని మత్స్యపురాణకథనం. వేదంకంటె అలిఖితపురాణమే ప్రాచీనమని తాత్పర్యం.
మొదట బ్రహ్మాండపురాణ మొక్కటే ఉండేదని తరువాత వాయ్వాదిపురాణాలు ప్రకటమైనాయని పరిశోధకుల తీర్పు. క్రీ. శ. 5వలశతాబ్దం నాటికే బ్రహ్మాండపురాణం యవద్వీపవాసుల కవిభాషలోనికి అనూదితమట. వాయుపురాణం "పురాణం సర్వశాస్త్రాణాం ప్రథమం బ్రహ్మణాస్మృతం, అనంతరం చ వక్త్రేభ్యో వేదాస్త స్య వినిర్గితాః"అని పురాణప్రాచీనతను చాటింది. వాజసనేయీ బ్రాహ్మణోపనిషత్తు వేదాలతోపాటు ఇతిహాస పురాణాలను పరమేశ్వర నిశ్శ్వాసరూపాలుగా అభివర్ణించింది. నారదీయపురాణము వేదార్థంకంటె పురాణార్థమే అధికమన్నది. వేదాల్లోని కథేతిహాసభాగాలు పురాణాలనుండి చేరినవట. వ్యాసులవారు తమశిష్యుడైన రోమహర్షణునికి పురాణసంహితను బోధించినాడని, ఆయన తన శిష్యులు అగ్నివర్చ - మైత్రేయ - సాంశపాయన - కాశ్యప - సావర్ణి అకృతప్రణాదులకు ఉపదేశించినాడని, వారు ఆ యా రాజులు చేసినయజ్ఞాల్లో పురాణాలు వినిపించినారని, తరువాతికాలంలో సూతవంశీయులు పురాణాలను ప్రచారం చేసినారని, కనుకనే తొలుత వేలసంఖ్యకు పరిమితమైన పురాణసంహిత రానురాను లక్షలగ్రంథంగా విస్తృతిని వైవిధ్యమును పొందినదంటారు.
"పురా౽సి నవం పురాణ" మని, "పురా నీయతే ఇతి పురాణ" మని, "యస్మాత్ పురా హి అనతి ఇదం పురాణ" మని, "పురా పూర్వస్మిన్ భూతమితి పురాణ" మని పురాణ నిర్వచనం తీరుతీరులు.మహాభారతకాలం నాటికే సంస్కృతంలో 18 పురాణా లుండినట్లు తెలుస్తుంది. వీటిని సులభంగా గుర్తుపెట్టుకోవటానికి—
| "భద్వయం మద్వయం చైవ బ్రత్రయం వ చతుష్టయమ్, | |
అనే శ్లోకం ఒకటి ప్రచారంలో ఉన్నది. భ ద్వయ మనగా భాగవత - భవిష్య పురాణాలు, మ ద్వయమంటే మత్స్య- మార్కండేయ పురాణాలు. బ్ర త్రయ మంటే బ్రహ్మ - బ్రహ్మవైవర్త - బ్రహ్మాండపురాణాలు. వ చతుష్టయ మంటే విష్ణు - వరాహ - వామన - వాయుపురాణాలు. అ = అగ్ని, నా = నారద, ప = పద్మ, లిం = లింగ, గ = గరుడ, కూ = కూర్మ, స్కా = స్కాందపురాణాలని సంకేతం. ఇవి మహాపురాణాలు. ఇవికాక 1. సనత్కుమార, 2. నరసింహ, 3. నంద, 4. శివధర్మ, 5. దుర్వాస, 6. నారదీయ, 7. కాపిల, 8. వామన, 9. ఔశనస, 10. మానవ, 11. వారుణ, 12. కలి, 13. మహేశ్వర, 14. సాంబ, 15. సౌర, 16. పరాశర, 17. మారీచ, 18. భార్గవములు ఉపపురాణములు. ఇవి అనంతరకాలానికి చెందినవి. ఇంకా మౌద్గలకాళ్యాద్యుపోపపురాణాలు పెక్కు లున్నవట.
అమరకోశం 'సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశోమన్వంతరాణి చ, వంశానుచరితం చేతి లక్షణానాం తు పంచకమ్' అని పురాణలక్షణాలను ఉట్టంకించింది. ఇవి 1. సర్గము = ఆదిసృష్టి, 2. ప్రతిసర్గము = కల్పాంతంలో జరిగే పునస్సృష్టి, 3. వంశము =దేవతల, దేవర్షుల బ్రహ్మర్షుల గోత్రానుక్రమం, 4. మన్వంతరము = మనువుల వంశాలు, వారి పరిపాలన కాలాలు, వంశానుచరితము = సూర్య చంద్రవంశపు రాజుల చరిత్రలు, ఈ లక్షణాలు కొన్నింటిలో కొన్ని, మరికొన్నింటిలో కొన్ని తప్పక కనిపిస్తాయి. పంచలక్షణాలు ఉపపురాణాలకే గాని మహాపురాణాలకు—
| "సర్గో౽స్యాధ విసర్గశ్చ వృత్తీ రక్షాన్తరాణి చ, | |
దశలక్షణాలని భాగవతపురాణ నిర్వచనం. ఇందులో వృత్తి = జీవకల్పనం, రక్ష = భగవదవతారాలు, సంస్థ = ముక్తి, హేతువు = అవ్యక్తజీవుఁడు, అపాశ్రయము = పరబ్రహ్మములనే మరొక ఐదు లక్షణాలు అదనంగా చేరినవి. బ్రహ్మవై వర్తపురాణం మహాపురాణ లక్షణాలు దశాధికంగా పేర్కొన్నది.
| సృష్టిశ్చాపి విసృష్టిశ్చ స్థితిస్తేషాం చ పాలనమ్, | |
కర్మవాసన, మోక్షనిరూపణం, హరినామసంకీర్తనం, వివిధదేవతావైశిష్ట్యగుణవర్ణనం దీనిలోని ప్రత్యేకతలు.
పురాణాలు మన అమూల్యనిధినిక్షేపాలు. మన మత రాజకీయ సాంఘిక తాత్త్విక కళాసంస్కృతీ సర్వస్వాలు. మన ప్రాచీనఋషులు మేధావులు. వారి ఆలోచనలు ప్రసరించినంత మేరకు అధిభౌతిక ఆధ్యాత్మిక జీవితవిషయాలకు సంబంధించిన సమస్తవిజ్ఞానాన్ని సమాచారాన్ని పురాణాలకు ఎక్కించినారు. దాన, వ్రత, భక్తి, యోగ, వేదాంత, వైద్య, సంగీత, నాట్య, భూగోళ, వాస్తు, గణిత, మంత్ర, తంత్ర, వ్యాకరణ, ఛందో౽లంకార, రాజనీతిప్రభృతి వివిధశాస్త్రవిషయాలు, నిత్యనైమిత్తికవిధులు, స్నాన జప తప స్తీర్థ క్షేత్ర మహాత్మ్యాలు చేర్చి పురాణాలను విజ్ఞానసర్వస్వాలుగా తీర్చిదిద్దినారు. పురాణాల్లోలేని విషయం ప్రపంచంలోనే లేదనిపిస్తుంది. అందుకే నారదీయ పురాణం—
| "యన్న దృష్టం హి వేదేషు తత్సర్వం లక్ష్యతే స్మృతౌ, | |
అంటూ పురాణాల ఘనతను చాటింది. పురాణాల్లో విషయవైవిధ్యం పెరగడంతో ప్రాచీన పంచలక్షణాల ప్రమేయం కుంచించుక పోయింది. సర్గాది పురా విషయప్రాధాన్యం తగ్గి పురుషార్థాలు మతాలు వాటిపాశస్త్యం వివిధదేవతా స్థల, వ్రత మాహాత్మ్యాలు పెరిగిపోయినవి. ఈ విధంగా 13వ శతాబ్దం దాకా పురాణాలు మార్పులకు చేర్పులకు గురిఔతూ బాగా పెరిగిపోయినవి. భారతీయ జనసామాన్యానికి పురాణానుశాసనం జీవితధర్మం ఐనది.
పురాణాలను వివిధదృష్టి కోణాలతో విభజించినారు. అమరసింహుడు చెప్పిన లక్షణాలకు అదనంగా చేరినవి ఎంతతక్కువై తే ఆ పురాణా లంతప్రాచీనాలని గుర్తించవచ్చు. ఈ దృష్టితో వాయు, బ్రహ్మాండ, మత్స్య, విష్ణుపురాణాలు ప్రాచీనతమములని నిర్ణయం. బ్రహ్మ, విష్ణు, శివ, అగ్ని, సూర్యాది దేవతల కిచ్చిన ప్రాధాన్యాన్ని బట్టి పురాణాలను సాత్త్విక, రాజసిక, తామస పురాణాలుగా విభజించినారు. శ్రీమన్నారాయణుని కీర్తించే మోక్షప్రదములైన విష్ణు నారదీయ భాగవత గారుడ పాద్మ వరాహ పురాణాలు సాత్త్వికము లన్నారు. సరస్వతీ చతుర్ముఖ కృశానుల స్తుతించే స్వర్గప్రదములైన బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, మార్కండేయ, భవిష్య, వామన, బ్రహ్మపురాణాలు రాజసికములుగా గుర్తించినారు. శివ, లింగ, వినాయక, కుమార, దుర్గాదులను కీర్తించే మత్స్య, కూర్మ, లింగ, శివ, స్కాంద, అగ్ని పురాణాలను తామసములుగా పరిగణించి నారు. ఈ సాత్త్వికాది భేదాలు మతదృష్టితో ఏర్పడినవని స్పష్టం. ఇంకా పురాణాలు పెక్కు తీరులు. 1. వివిధకళావిజ్ఞానశాస్త్రసారసంగ్రహాలుగా పేర్కొనదగినవి గారుడ, అగ్ని, నారద పురాణాలు. 2. తీర్థవ్రతమాహాత్మ్యాలు వర్ణించేవి పాద్మ, స్కాంద, భవిష్య పురాణాలు. 3. రెండుసార్లకంటె ఎక్కువ సంస్కరింపబడినవి బ్రహ్మ, భాగవత, బ్రహ్మవైవర్తపురాణాలు. 4. చారిత్రకాంశము లున్నవి బ్రహ్మాండ, వాయుపురాణాలు. 5. మతాలకు సంబంధించినవి శైవ, లింగ, వామన, శాక్త, మార్కండేయ పురాణాలు. ఖిలసంస్కరణములు వరాహ, కూర్మ, మత్స్యపురాణాలు.
ఉపనిషత్కాలంనాటికే పురాణాలు సుస్థిరరూపం తాల్చినట్లు పండితులు భావిస్తున్నారు. మన ధర్మశాస్త్రాల్లో స్మృతుల్లో పురాణానికి చాలా ప్రాధాన్యం ఉన్నది. వేదవేత్తకు పరిపాలకునికి పురాణజ్ఞానం ఆవశ్యకమన్నారు. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో రాజసభలో పౌరాణికుని నియుక్తి తప్పనిసరి చేసినాడు. రాజకుమారుల అవశ్యపాఠ్యాంశములలో పురాణాలను చేర్చినాడు. ఈవిధంగా వేదసారాన్ని పురాణేతిహాసాల కథోపాఖ్యానాల ద్వారా అందించే ప్రయత్నం మనదేశంలో చాలాకాలంనుండి వస్తున్న సంప్రదాయం. పండితులు అక్షరాస్యులు నిరక్షరాస్యులు జానపదులు పురాణశ్రవణం ద్వారానే మన ప్రాచీనవిజ్ఞానాన్ని సంప్రదాయాన్ని ఆకళించుకొని తరతరాల వారికి అందిస్తున్నారు. ఏబదేండ్లకు పూర్వం ప్రతిగ్రామంలో పురాణకాలక్షేపం జరిగేది. ఇప్పటికీ అక్కడక్కడ ఈ సంప్రదాయం ఉన్నది. అల్పసంఖ్యాకులైన బ్రహ్మక్షత్రియులుతప్ప మిగతా జనులందరు పురాణోక్త కర్మకాండను పాటించటం పురాణాల కున్న మాన్యతను చాటుతుంది.
తెలుగులో పురాణాలు: ఆంధ్రసాహిత్యం పురాణేతిహాసాల అనువాదంతో ప్రారంభమై తరువాతికాలంలో పురాణేతిహాసాల్లోని స్వల్పమైనకథలను విపులీకరించి ప్రబంధించుటతో పరిపుష్టమైనది. బ్రహ్మాండాది నానాపురాణవిజ్ఞాననిరతులైన నన్నయగారు పరమపౌరాణికుల్ బహుపురాణ సముచ్చయంబని కొనియాడే భారతాంధ్రీకరణానికి ఉపక్రమించినారు. తిక్కనగారి శిష్యుడు మారన తెలుగులో మొదటి పురాణరచయిత. కవిత్రయంలో చివరివాడైన ఎఱ్ఱాప్రగడ నరసింహ హరివంశపురాణాలు రచించినాడు. కవిత్రయం తరువాత మహాకవిగా పేర్కొనదగిన శ్రీనాథుడు అభ్యర్హిత బ్రహ్మాండాది మహాపురాణచయ తాత్పర్యార్థ నిర్ధారిత బ్రహ్మజ్ఞానకళా నిధానము. ఆయన వేమభూపాలుని కొలువులో అఖిలపురాణవిద్యాగమములు వినిపించేవాడు. ఆంధ్రకవితాపితామహ అల్లసాని పెద్దన పురాణాగమేతిహాసపదార్థస్మృతియుతుడు. ఆయన ఏ ముహూర్తాన ప్రబంధేతివృత్తానికి ఒరవడి పెట్టినాడో కాని తరువాతికవు లందరూ పురాణాల్లోని ఇతివృత్తాలను వస్తువుగా గ్రహించి ప్రబంధాలు ప్రపంచించినారు. ఆధునికయుగానికి పూర్వం తెలుగు కావ్యప్రపంచంలో
అధికభాగం పురాణేతిహాసాద్యాద్య సత్కథలే. మన పూర్వకవులు సంస్కృతంలోని ఈ పురాణాలను తెలుగుపద్య గద్య ద్విపదలుగా మలచి పురాణాల ప్రచారం చేసినారు. అట్టి వారిలో కొందరు—
1. ఆదిత్యపురాణం : ఎలకూచి బాలసరస్వతి తమ్ముడు పిన్నయ ప్రభాకరుడు
2. కూర్మపురాణం : రాజలింగ కవి, తిమ్మరాజు లక్ష్మణరాయ కవి
3. గరుడపురాణం : పింగళి సూరన
4. దేవీభాగవతం : త్రిపురాన తమ్మయదొర, దాసు శ్రీరామకవి, ఆకొండి రామమూర్తి శాస్త్రి, తిరుపతి వేంకట కవులు
5. నారదీయం : పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి
6. నృసింహపురాణం : వేములవాడ భీమకవి, ఎఱ్ఱాప్రగడ, ప్రోలు గంటి చిన్నశౌరి, హరిభట్టు
7. పద్మ పురాణం : మడికి సింగన, కామినేని మల్లారెడ్డి, త్రిపురాన వేంకట సూర్యప్రసాదరాయకవి, తెన్మఠం శ్రీరంగాచార్యులు, పినుపాటి చిదంబరశాస్త్రి
8. పురాణసారం : ఎఱ్ఱన (కొక్కోక రచయిత), గణపవరపు వేంకటకవి
9. భాగవతం : పోతన సింగన గంగయ నారయలు, మడికి సింగన, హరిభట్టు, రావూరి సంజీవరాయ కవి, తరిగొండ వెంకమ్మ, తంజనగరం తేవ ప్పెరుమాళ్ళయ్య, శ్రీపాదకృష్ణమూర్తిశాస్త్రి
10. బ్రహ్మపురాణం : జనమంచి శేషాద్రిశర్మ 11. బ్రహ్మాండపురాణం : రావూరి ఎల్లయ్య, జనమంచి శేషాద్రిశర్మ
12. బ్రహ్మవైవర్తపురాణం : గోపీనాథము వేంకటకవి (కృష్ణజన్మఖండము)
13. భార్గవపురాణం : రాజా బహిరీపామనాయక భూపాలుడు
14. మత్స్యపురాణం : లింగమకుంట రామకవి, హరిభట్టు, కాణాదము పెద్దనసోమయాజి, తిమ్మరాజులక్షణరాయకవి.
15. మనువంశపురాణం : పోచిరాజు వీరన్న
16. మార్కండేయపురాణం : మారన, ఎల్లకర నృసింహకవి, పొన్నతోట ఔబళకవి, మండ కామేశ్వరకవి, తిమ్మరాజు లక్ష్మణరాయకవి, నోరి నరసింహశాస్త్రి, కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులు, వేమూరి జగన్నాథ శర్మ
17. లింగపురాణం : కామినేని మల్లారెడ్డి
18. వామనపురాణం : లింగమకుంట రామకవి, పొన్నతోట ఔబళ కవి, ఎలకూచి బాలసరస్వతి
19. వరాహపురాణం : కమలనాభామాత్యుడు, నంది మల్లయ, ఘంట సింగయలు, హరిభట్టు
20. విష్ణుపురాణం : పశుపతి నాగనాథుడు, కలిదిండి భావనారాయణ, వెన్నెలకంటి సూరన
21. శివధర్మోత్తరఖండము : కామినేని మల్లారెడ్డి
22. శేషధర్మములు : కానాల నరసింహ కవి 23. స్కాందపురాణాంతర్గతం : భీమఖండ కాశీఖండములు శ్రీనాథుడు; నాగరఖండం తురగా రాజకవి, అయ్యంకి బాలసరస్వతి జంటకవులు; శివరహస్యఖండం రేవూరి అనంతయజ్వ, ముదిగొండ బ్రహ్మయలింగం, కోడూరి వేంకటాచలకవి, రాపాక వేంకటకవి; కాశీమహిమార్థదర్పణం కళులె నంజరాజు; కేదారఖండం పెదపాటి సోమయ్య; కేదార అరుణాచల కౌమారికా ఖండాలు జనమంచి శేషాద్రిశర్మ.
24. సూతసంహిత : పట్టమట్ట సోమనాథ కవి
25. హరివంశం : నాచన సోమన, ఎఱ్ఱాప్రగడ, గూళికల్లు వేంకటరమణ కవి
ఇక క్షేత్రమాహాత్మ్యాలు, స్థలపురాణాలు, వివిధపురాణభాగాలు లెక్కకు మిక్కిలి తెలుగులో వచ్చినవి. ఇటీవల మరల పురాణాంధ్రీకరణం ఒక ఉద్యమంగా తెలుగుదేశంలో విజృంభించినది. కాకతీయ సిమెంటు అధిపతులు, ధర్మనిష్ఠులు పి. వేంకటేశ్వర్లుగారు ఆర్షభారతి ట్రస్టును స్థాపించి పురాణాలు సంస్కృతమూలంతో ప్రకటిస్తున్నారు. వివిధపండితులచేత వచనానువాదాలు చేయిస్తున్నారు. కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులు అనువదించిన బ్రహ్మ, విష్ణు పురాణాలు, విష్ణుధర్మోత్తరీయం, పాతూరి సీతారామాంజనేయులు అనువదించిన మత్స్యపురాణం, దేవులపల్లి శివరామయ్య అనువదించిన దేవీభాగవతము, పుల్లేల శ్రీరామచంద్రుడు అనువదించిన అగ్నిపురాణం ప్రకటితమైనవి. మార్కండేయ, వామన, స్కాందపురాణాలు అచ్చులో ఉన్నవి. శ్రీవెంకటేశ్వర్లు గారు సంపన్నులు ధర్మాభిమానులు కనుక ఇంతగొప్పకార్యానికి పూనుకొన్నారు. కాని ఒక పేదపండితుడు "అనంత సాహితి" పేరుతో ఒక సాహిత్యసంస్థను స్థాపించి దాని పక్షమున పురాణాలన్నీ తామే సరళాంధ్రభాషలో అనువదిస్తూ ప్రకటిస్తున్నాడు. ఆయన గుంటూరు ఓరియంటల్ కళాశాలా ధిపతి ఏలూరిపాటి అనంతరామయ్య. ఇప్పటికి ఆయన విష్ణు, వామన, వరాహ, మార్కండేయ, బ్రహ్మవైవర్త, కూర్మ, లింగ పురాణాలు ప్రకటించినారు. స్కాందాంతర్గతములైన శివమాహాత్మ్య, విజ్ఞానయోగ, ముక్తి, యజ్ఞవైభవ ఖండాలు అచ్చులో ఉన్నవి. ఇది మన తెలుగుదేశంలో పురాణాలకున్న మన్ననను తెలియజేస్తుంది.
తెలుగు పద్మపురాణం : అష్టాదశ పురాణాలలో రెండవదైన పద్మపురాణం సాత్త్వికపురాణం. శ్లోక సంఖ్య 55 వేలు 626 అధ్యాయాలు. పద్మపురాణంలో ఆది, భూమి, బ్రహ్మ, పాతాళ, సృష్టి, ఉత్తరఖండా లారు. పద్మకల్పవృత్తాంతం చెప్పటంచేత దీనికి పద్మపురాణమని పేరు. దీనిలో శ్రీహరి పారమ్యం ప్రతిపాద్యము. దీనిని మొదట శ్రీహరి బ్రహ్మకు వినిపించినాడు. బ్రహ్మ మరీచ్యాది మునులకు చెప్పినాడు. ఇందులో చైత్రాది 12 మాసాల మాహాత్మ్యం, 26 ఏకాదశుల మహిమ, పితృభక్తి విష్ణుభక్తి మాహాత్మ్యం, భగవద్గీతల మహిమ, రామనామ వైభవం, పంచాఖ్యానము వంటి ప్రశస్తవిషయా లున్నవి. ఏ పురాణంలోను లేని అష్టాదశపురాణాత్మక విష్ణుస్వరూపవర్ణనం ఇందులో ఉన్నది. అందుకే మడికి సింగన పద్మపురాణాన్ని అమృతపయోధితో (I-66) పోల్చి దీని గొప్పతనం సూచించినాడు. కందనమంత్రి మడికి సింగనతో—
గీ. | అవని పద్మంబు ఖండత్రయంబునందు | I-61 |
అనటంచేత ఆనాటి పాద్మము ఖండత్రయంలో ఈనాటి ఖండషట్కం ఇమిడి ఉన్నట్లు భావించాలె. పూర్వమధ్యమ ఖండాలలో 408 అధ్యాయా లున్నవి. ఉత్తరఖండం 282 అధ్యాయాలలో సింగన 218 అధ్యాయాలు అనువదించలేదు. ఇవికూడ ఆయన దృష్టిలో పూర్వమధ్యమ ఖండాలే కావచ్చు. సంస్కృతం ఉత్తరఖండం 219 అధ్యాయం మొదలుకొని చివరి 282 అధ్యాయం వరకున్న 64 అధ్యాయాల శ్లోకాలు మాత్రమే సింగన తెనిగించాడు. ఈ 64 అధ్యాయాలలో 5790 శ్లోకా లున్నవి. వీటిని సింగన 2446 గద్యపద్యాలుగా అనువదించి మరింత సంగ్రహం చేసినాడు. వీటినే సింగన "పద్మశ్రీ రచనలు" (I-84) అన్నాడు. మహాపద్మం విష్ణుసంభవం. బ్రహ్మ పద్మసంభవుడు. ఆతని మానసపుత్రుడు వసిష్ఠుడు. ఆతని మునిమనుమడు వ్యాసుడు (వ్యాసం వసిష్ఠనప్తారం). వ్యాసభగవానుడు పురాణప్రవచనం చేయటానికి పూర్వమే పద్మపురాణం మూడుసార్లు కథితము. 282 అధ్యాయాలున్న ఉత్తరఖండంలో చివరి 64 అధ్యాయాలు మడికి సింగన తెనిగించటానికి కారణం ఆ భాగం భగవద్రామానుజులకు అత్యంతప్రీతిపాత్రమైనది. మడికి సింగన రామానుజదయాపాత్రుడు. శ్రీవైష్ణవసిద్ధాంతప్రతిపాదనకు తెలుగులో కావ్యత్వం ఆపాదించే ప్రథమప్రయత్నం చేసినవాడు మడికి సింగన. సింగన అనువాదానికి మూలమైన సంస్కృతభాగం తెలుగులిపిలో రెండు సంపుటాలుగా మాఘమాహాత్మ్యం పేరుతో భువనగిరి చెన్నకేశవులు 1889 లోను, పాద్మోత్తరఖండం పేరుతో తెన్మఠం శ్రీరంగాచార్యులు 1936లోను ప్రకటించినారు.
మడికి సింగన తాను అనువదించిన భాగం కథాక్రమానికి భంగం కలుగకుండా పూర్వ మధ్యమఖండాలలో కథలను సూచనమాత్రంగా తెల్పి కందనామాత్యుని కోరిక (I-61) తీర్చినాడు. బ్రహ్మదేశంతో వసిష్ఠుడు ముందుగా స్వాయంభువు మనువుకు, అటు తరువాత వైవస్వతమన్వంతరంలో దిలీపమహారాజుకు పూర్వ మధ్యమ ఖండాలు వినిపిస్తాడు. దిలీపుని అశ్వమేధపరిసమాప్తితో ఉత్తరఖండం ప్రారంభం ఔతుంది. ఈ ఉత్తరఖండం కూడ ఉన్నదున్నట్లు సింగన తెనిగించలేదు. మాఘమాహాత్మ్యాన్ని, హరిపారమ్యాన్ని తెలిపే భాగాలనే ఆంధ్రీకరించినాడు. మాఘమాహాత్మ్యం తెలిపే పునరుక్తులు సువ్రతుని వృత్తాంతము, గజమోక్షం, పుష్కరునిచరిత్ర వంటివేకాక శివాధిక్యం తెలిపే మార్కండేయచరిత్రం, శివరాత్రిమాహాత్మ్యం, శివరాత్రివ్రతవిధానం, భీమసేనవృత్తాంతం, మృగశృంగోపాఖ్యానం, తీర్థమాహాత్మ్యాలు, మానసతీర్థాలు, సౌభరిచరిత్ర మొదలైనవాటిని విడిచిపెట్టినాడు. సింగనది స్వతంత్రానువాదమని చెప్పవచ్చు. శాస్త్రవిషయాలను స్తోత్రాలను సంగ్రహించి కథాగతిని పోషిస్తూ, వివిధధర్మాలను బోధించటానికి సన్నివేశాలు క్రొత్తగా కల్పిస్తూ శబ్దకాఠిన్యం అన్వయక్లేశం లేకుండా పురాణశైలిలో అనువాదం చేసినాడు. "ఔచిత్యపోషణ కోసం చిన్నచిన్న మార్పులు చేసి మూలానికి మెరుగులు దిద్ది నైమిశారణ్యాన్ని నందనవనంగా మార్చినాడు."
పోతన భాగవతాన్ని-
చ. | లలితస్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మం | |
-(I-20) అని వర్ణించినట్లే సింగన పద్మపురాణాన్ని ఒక పద్యంలో అమృతపయోధి (I-66) తోను, మరొకపద్యంలో తరువుతోను (I-66) పోల్చి మనోహరంగా వర్ణించినాడు.
పద్మపురాణంలో అక్కడక్కడ మూలాతిశాయి వర్ణనలు కూడ ఉన్నవి. దిలీపమహారాజు వేటాడి అలసి ఒకకొలను చెంత మాధ్యాహ్నికక్రియలు ముగించి విశ్రమిస్తుండగా సాయంకాలం ఐనది.
చ. | ఘనమగు నెండతాఁకునకుఁ గాయము కంది పరిభ్రమార్తుఁడై | (I-108) |
ఇది మూలంలో లేదు. ఇందులోని 'చల్లని రాజు' దిలీపునికి చంద్రునికి వర్తిస్తుంది. చంద్రుడు సూర్యకిరణాల మూలంగానే ప్రకాశిస్తాడనేది వైజ్ఞానికసత్యం.
పురూరవునికి తైలసేవాదోషం శ్రీమహావిష్ణువు అపనయించినంతవరకే మూలంలో ఉండగా సింగన ఊర్వశీపురూరవులసమాగమం క్రొత్తగా కల్పించినాడు. ఈ సందర్భంలోని వర్ణనం ప్రబంధఫక్కిలో ఉన్నది.
క. | వెన్నెల నీనెడి నవ్వును | I-160 |
సీ. | ఘననీలమణికాంతిఁ గనుపట్టు కొప్పుపై | |
గీ. | గమ్మతావులు కటిపంక్తిఁ గడలుకొనఁగ | I-161 |
పోతే సింగనది ఏమాత్రం కాఠిన్యంలేని సరళసుందరపురాణశైలి.
కాకతీయభానుడు అస్తమించిన తరువాత చీకటిముష్కరులు చేసిన దురాగతాలు ఇంతంత కాదు. దాదాపు పాతికసంవత్సరాలు యావద్దక్షిణాపథం రక్తసిక్తమై పోయింది. కాకతీయుల ఆడపడుచు విశ్వనాథుని శిష్యురాలు రెండవ కంపరాయల భార్య గంగాదేవి తన మధురావిజయకావ్యంలో ఆనాటిఘోరాలను ఈవిధంగా చిత్రించింది.
| సతతాధ్వర ధూమసౌరభైః ప్రాఙ్నిగమోద్ఘోషణవద్భి రగ్రహారైః | VIII-7 |
| మధురోపవనం నిరీక్ష్య దూయే బహుశః ఖండిత నారికేళషండమ్, | VIII-8 |
| రమణీయతరో బభూవయస్మిన్ రమణీనాం మణినూపుర ప్రణాదః, | VIII-9 |
| హిమచందనవారిసేక శీతాన్య భవన్యాని గృహాంగణాని రాజ్ఞామ్, | VIII-10 |
| స్తనచందన పాండుతామ్రపర్ణ్యా స్తరుణీనామ భవత్ పురాయదంభః, | VIII-11 |
| శ్రుతిరస్తమితా నయవ్రలీనో విరతా ధర్మకథాచ్యుతం చరిత్రమ్, | VIII-12 |
ఈ దుర్భరపరిస్థితిని విలస తామ్రశాసనం కూడ వర్ణించింది.
| ప్రతాపరుద్ర తిగ్మాంశౌ లోకాంతర తిరోహితే, | 21 |
| ప్రతాపరుద్రేణ పరం పరాస్తో రిపూ నధర్మో యవనాన్ గతోను, | 22 |
| కేచిద్ధనాఢ్యాః పరిబాధ్యమానా ధనాయ పాపైర్వివిధైరుపాయైః, | 23 |
| ద్విజాతయస్త్యాజిత కర్మబంధా భగ్నాశ్చ దేవప్రతిమా స్సమస్తాః, | 24 |
| అత్తే కర్షణలాభే పాపైర్యవనై ర్బలాత్కారాత్, | 25 |
| ధనదారాదికే నౄణాం కస్మింశ్చిదపి వస్తుని, | 26 |
| పేయా సురా గోపిశితం చ భోజ్యం లీలావిహారో ద్విజఘాతనం చ | 27 |
| ఇత్థం తైర్యవసభటైః ప్రబాధ్యమానం | 28 |
కృతిపతి వెలిగందల కందనామాత్యుని ఏలిక రామగిరి పాలకుడైన ముప్పభూపాలుని తండ్రి. గుంటూరు మండలం గురిజాల తెలుంగురాయడు. ఆతని పెద్దభార్య మల్లమ్మ. ఆమెకు ముప్ప భూపాలుడు, ముత్త భూపాలుడు - ఇద్దరు కొడుకులు. తమ్ముడు సహాయకుడుగా ముప్ప భూపాలుడు రామగిరి రాజధానిగా సబ్బినాటిరాష్ట్రాన్ని చక్కగా పాలించినాడు. అతనికి ఇరువెత్తుగండ, గండగోపాల, కాంచిరక్షపాలక, చోడరాజ్యస్థాపనాచార్య, దొంతిమన్నియవిభాళన, చలమర్తిగండ, గజగంధవారణ, రాయగజకేసరి, మూరురాయరగదాళాది బిరుదులున్నవి. తనకు అగ్రహారవృత్తులు కల్పించి, తన కృతిభర్తకు ఆశ్రయదాతయైన ముప్ప భూపాలునికి మడికి సింగన ఒక్క కృతియైనా అంకింతం ఎందు కీయలేదో? సింగన తొలికృతులు మనకు లభించలేదు. అందులో ఏవైనా ముప్ప భూపాలునికి అంకిత మిచ్చినాడో ఏమో? ముప్ప భూపాలుని ప్రసక్తి వర్ణనం తన నాలుగుకృతుల్లోను చేసినాడు సింగన. దానిలో రెండు పద్యాలు -
సీ. | కమఠాహి కోల దిక్కరులరాయిడి మాని | |
అ. | అనుచుఁ బొగడ నేలె నఖిలంబు గురజాల | (పద్మ. I-16) |
సీ. | సంపెంగ విరులతో జాజులుం గురువేరు | |
గీ. | మానినీకరచామరమరుతచలిత | (వాసిష్ఠ. I-38) |
కృతికర్త వంశము దేశ కాలములు : మడికి సింగన కృతులు 1. పద్మపురాణోత్తరఖండము, 2. భాగవత దశమస్కంధము - ద్విపద, 3. వాసిష్ఠ రామాయణము, 4. సకలనీతిసమ్మతము. మొదటి రెండు కృతులు వెలిగందల కందనమంత్రికి అంకితములు. మూడవకృతి అహోబల నృసింహస్వామికి అంకితము. నాల్గవకృతి రామగిరి కేశవదేవుని కంకితము. ఈ నాలుగు కృతుల్లోను సింగన తన వృత్తాంతం చెప్పుకున్నాడు.
I పద్మపురాణంలో—
క. | ఆ పరమేశ్వరమకుట | (I-54) |
చ. | అని పొగడంగఁ బెంపెసఁగు నయ్యలుమంత్రికి సింగమాంబకుం | (I-55) |
క. | ధర నిహపరములకును గురు | (I-11) |
II ద్విపద భాగవతం కాండాంతంలో—
| శోభితనవరూప సూనాస్త్రుపేర | |
III వాసిష్ఠరామాయణంలో—
ఉ. | ఆ జలజాక్షు నాభిజలజాత్మజు మానసపుత్రుఁడై భర | (I-23) |
క. | అంబుజనిభుఁ డాప | (I-26) |
సీ. | అతఁడు తిక్కన సోమయాజుల పౌత్రుఁడై (పుత్రుఁడై) | |
గీ. | యందుఁ గోవెల గట్టి గోవిందు నెన్న | (I-29) |
క. | అయ్యువతీరమణునకును | (I-30) |
సీ. | ఆత్రేయగోత్రపవిత్ర పేరయమంత్రి | |
| నధిపతి తొయ్యేటి యనపోతభూపాలు | |
గీ. | స్థిరతరరామతతులు సుక్షేత్రములును | (I-33) |
చ. | ఒనరఁగ నవ్వధూవరు లహోబలదేవునిఁ గొల్చి తద్వరం | (I-34) |
క. | వారలలో నగ్రజుఁడగు | (I-35) |
క. | కూనయ ముప్పనృపాలక | (I-36) |
గీ. | ఆ మహీవిభుచేత రామాద్రిసీమఁ | (I-40) |
IV సకలనీతిసమ్మతంలో—
క. | సరసకవితావిలాసుఁడ | (I-3) |
ఈ పద్యా లాధారంగా మడికి సింగన వంశవృక్షం దేశకాలములు తెలుసుకోవచ్చును. భారద్వాజగోత్రులు ఆపస్తంబసూత్రులలో బ్రహ్మన మంత్రి పుట్టినాడు. అతని కొడుకు గుండన. గుండన భార్య కొమ్మాంబ. ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు; అల్లాడమంత్రి గంగనలు. తిక్కన సోమయాజి పౌత్రుడు (పుత్రుడు) గుంటూరు కొమ్మవిభుని కూతురు చిట్టాంబికను అల్లాడమంత్రి వివాహమాడినాడు. కృష్ణా దక్షిణతీరాన రావెల అగ్రహారం పొందినాడు. అక్కడ గోపీనాథునికి ఆలయం కట్టించినాడు. అల్లాడమంత్రి చిట్టాంబికల తనయుడు అయ్యల మంత్రి. ఆయన భార్య పేరయమంత్రి బిడ్డ సింగమ్మ. అయ్యలమంత్రి రాజమహేంద్రవరపాలకుడు తొయ్యేటి అనపోతభూపాలుని ఆస్థానియై గోదావరిఉత్తరతీరాన పెద్దమడికిలో నివాసమైనాడు. సింగమ్మ అయ్యల మంత్రి దంపతులకు అహోబల నరసింహదేవుని వరంతో సింగన అనంతయ్య ఓబయ నారయలు జన్మించినారు. ఈ నలుగురిలో పెద్దవాడైన సింగనయే వలసపోయి రామగిరి పట్టణాధీశుడైన ముప్ప భూపాలుని ఆస్థానకవియై ఆతని మంత్రి వెలిగందల కందనమంత్రికి తన కృతులు అంకితం చేసినాడు. ఆతని గురువులు తిరుమల అయ్యలార్యులు. మడికి సింగన విశిష్టాద్వైతి.
ఇక సింగనకాలం గురించి. పద్మపురాణం కొన్ని తాళపత్రప్రతుల్లో చివరనగల మంగళమహాశ్రీవృత్తంలో చెప్పినతేదీ ప్రకారం పద్మపురాణరచన క్రీ. శ. 1420లో ముగిసినది. ఇది బ్రౌను పాఠముల్లోను ఉన్నది.
| "ఆకరయుగానలమృగాంకశకవత్సరములై పరగు శార్వరిని బుణ్య | |
కర=2, యుగ=4, అనల=3, మృగాంక=1. 'అంకానాం వామతోగతిః' చొప్పున శా. శ. 1342. దీనికి 78 కలిపితే క్రీ. శ. 1420. దీనిని వీరేశలింగం పంతులు మొదలుకొని చాగంటి శేషయ్య ప్రభృతి సాహిత్యచరిత్రకారులు ఆమోదించినారు. కాని మల్లంపల్లి సోమశేఖరశర్మ ప్రభృతులు తిథివారాలు కుదరలేదని నిరాకరించినారు. జూనియర్ వేదం వేంకటరాయశాస్త్రి ఆరుద్ర ప్రభృతులు మల్లంపల్లివారినే బలపరచినారు. కాని నిడుదవోలు వెంకట్రావు ప్రభృతులు పై మంగళమహాశ్రీ వృత్తంలోని 'మార్గశిరపంచమి'ని మాఘసితపంచమిగా సవరించి 8-1-1421 A.D. తేదిగా నిర్ణయించినారు.
ఇంతే కాదు. కాకినాడ ఆంధ్రసాహిత్యపరిషత్తు తాళపత్రప్రతి 1157/16 జ్ఞానవాసిష్ఠరామాయణం 190 తాటాకు చివరనగల మరొక మంగళమహాశ్రీవృత్తం ప్రకటించినారు.
| శ్రీకరశశాంకములు సింధురవరామయుతశీతకరమైన పరిధావిన్ | |
సింధు=4, రవ=5, రామ=3, శీతకర=1=1345+78=1432 A. D. పరీధావి ఫాల్గుణపౌర్ణమి శుక్రవారం అనగా 1-3-1433 A.D. తేదినాటికి వాసిష్ఠరామాయణరచన ముగిసినట్లు తేల్చినారు. ఆచార్య ఖండవల్లి నిడుదవోలువారల అభిప్రాయానుసారం మడికి సింగన శ్రీనాథుని సమకాలీనుడు. తదితరులదృష్టిలో క్రీ. శ. 1350-1400 నడిమికాలము వాడు. ఎఱ్ఱాప్రగడ పండువాడై యుండగా మడికి సింగన యువకుడు. కనుకనే పూర్వకవిస్తుతిలో నన్నయ తిక్కనలనే స్మరించినాడు గాని ఎఱ్ఱన ఊసెత్త లేదందురు.
మడికి సింగనకు ఆంధ్రసాహిత్య చరిత్రలో తగినస్థానం లభించలేదనిపిస్తుంది. అందుకు కారణం అతడు - అటు కవిత్రయం ఇటు శ్రీనాథుడు - ఉద్ధతుల మధ్యకాలంలో ఇరుకునపడ్డవా డనుకొందును. మనకు అతని నాల్గుకృతులూ విశిష్టమైనవే. పద్మపురాణోత్తరఖండం గురించి ఇదివరకే ముచ్చటించుకున్నాము.
మడికి సింగన రెండవకృతి ద్విపద భాగవతం దశమస్కంధం. తంజావూరు సరస్వతీమహల్ గ్రంథమాలలో 1950లో ప్రకటితము. పరిష్కర్త వాసిష్ఠ. అ. మహాదేవశాస్త్రి. ఇది పోతన భాగవతంకంటె ముందు వెలువడిన భాగవత దశమస్కంధం. ఇందులో మధుర, కల్యాణ, జగదభిరక్ష కాండలు మాత్రమే ఉన్నాయి. మిగతకాండలు లుప్తమైపోయినవి కనుక అసమగ్రం. ధనుర్యాగంనుండి జరాసంధుని బలరామకృష్ణుల హత్యాప్రయత్నంవరకు మధురకాండ, రుక్మిణీకల్యాణంనుండి ఉషాకల్యాణందాక కల్యాణకాండ, నృగశాపంనుండి శిశుపాలవధదాక జగదభిరక్షకాండ. పాల్కురికి సోమన, గోన బుద్దారెడ్డి చేపట్టిన తెలుగు జాతీయఛందస్సు ద్విపదల్లో శ్రీకృష్ణుని చరిత్రం ప్రజలు పాడుకోవటానికి మడికి సింగన చేసిన ప్రయత్నం ప్రశంసనీయం.
బలరామకృష్ణులు మధుర ప్రవేశిస్తుండగా పురస్త్రీలు శ్రీకృష్ణుని శౌర్యపరాక్రమాలు ఈ విధంగా కొనియాడినారు.
| ఈతఁడే యెలనాగ! ఇసుమంతనాఁడు | |
ఈ సందర్భంలో పోతన పద్యం ఇట్లా ఉన్నది:
సీ. | వీఁడటే రక్కసి విగతజీవగఁ జన్నుఁ | |
గీ. | వీఁడు లేకున్న పుర మటవీస్థలంబు | (I-1248) |
ఉద్దవునితో గోపికలు అన్యాపదేశంగా అన్న మాటలు:
| చంచరీకమ నీవు చంచలాత్ముఁడవు | |
ఉద్ధవుడు గోపికలను ఈ విధంగా ఊరడిస్తాడు!
| దానతపోధ్యానధర్మవర్తనల | |
| పరమానురక్తి హృత్పద్మంబులందు | |
మడికి సింగన మూడవకృతి వాసిష్ఠరామాయణం. దీనికి మూలం వాల్మీకివిరచిత యోగవాసిష్ఠం. దీనికి జ్ఞానవాసిష్ఠ మని మరొకపేరు. వసిష్ఠుడు శ్రీరామునికి బోధించిన తత్త్వజ్ఞాన మిది. ఇందులో వైరాగ్య, ముముక్షు, ఉత్పత్తి, స్థితి, ఉపశమన, నిర్వాణము లనే ఆరు ప్రకరణాలలో 32 వేల శ్లోకా లున్నవి. విశ్వతత్త్వాన్ని ఆకళించుకొని ఆత్మశాంతి పొందటానికి పరమసాధనమైన ఈ వాసిష్ఠరామాయణంలో ఆసక్తిదాయక మైన అనేక ఆఖ్యానా లున్నవి. ఇ దొకవిజ్ఞానశాస్త్రకోశం. ఆత్మజ్ఞానమూ ముక్తి కోరేవా రందరికి అవశ్యపఠనీయగ్రంథ మిది. మడికి సింగన ఆరు ప్రకరణాలను ఐదు ఆశ్వాసాలకృతిగా 1217 గద్యపద్యాలలో అనువదించినాడు. ఇందులో 39 ఆఖ్యానా లున్నవి. అహోబలనృసింహునికి అంకితమైన ఈ కృతి తెలుగువాఙ్మయంలో తొలివేదాంతకృతి. కవి ప్రతిజ్ఞలో—
క. | మృదుమధురరచనఁ గావ్యము | (I-14) |
క. | ఇది యల్పగ్రంథం బని | (I-15) |
కృతిసమర్పణంలో సింగన నృసింహదేవుడు తనకృతిని మన్నిస్తా డనటానికి కారణాలు చెప్పినాడు.
క. | తనపేరిటివాఁ డనియును | (I-19) |
ఈ గ్రంథానికి అధికారి—
గీ. | అకట! భవపాశబద్ధుండనైన నాకు | (I-58) |
"నారద వసిష్ఠ పరాశర బాదరాయణ భృగ్వాంగిరస గురు శుక్ర మతానుసారంబై దేవ మానవ రాక్షసంబులగు నయశాస్త్రంబులు పరీక్షించి యంధ్రభాషాకోవిదులగు సుకవీంద్రరచితంబైన ముద్రామాత్య పంచతంత్రీ బద్దె భూపాల చాణక్య ధౌమ్య విదుర ధృతరాష్ట్ర బలభద్ర కామందక గజాంకుశ నీతిసార నీతిభూషణ క్షేమేంద్ర భోజరాజ విభూషణ పురుషార్థసార భారత రామాయణాది మహాకావ్యంబు పురాణేతిహాసంబులు కందనామాత్యు నీతితారావళి లోకోక్తి చాటు ప్రబంధంబుల యందును గల నీతివిశేషంబు లూహించి తత్తత్సారాంశంబు లయ్యైవిధంబుల వర్గసంగతంబుగా సకలనీతిసమ్మతం బను పేర నొక్కప్రబంధంబు రచియింపుదు నని ప్రబంధసారంబునకు నే పురుషునిం బ్రార్థింతునో యని వితర్కించి" కేశవదేవుని ఎన్నుకున్నాడు. లోకోపకారార్థం తాను తలపెట్టిన సంకలనగ్రంథం గూర్చి ఈ విధంగా చెప్పినాడు.
సీ. | ఆలోలకల్లోలమగు దుగ్ధనిధిఁ ద్రచ్చి | |
గీ. | గృతులు మును చెప్పినట్టి సత్కృతులు ద్రవ్వి | (I-14) |
క. | కడవెఁడుదుగ్ధము లోపల | (I-16) |
పద్మపురాణం ప్రస్తుత సంశోధిత ప్రతి : మడికి సింగన కృతమైన పద్మపురాణోత్తరఖండం మొదటిసారి వండితపరిష్కృతమై పువ్వాడ వెంకటరావు పంతులవారిచే స్వకీయ వర్తమాన తరంగిణీముద్రాక్షరశాలలో 20-12-1865 నాడు ముద్రింపించి ప్రచురించనైనది. దీనికి విషయసూచిక మాత్రం ఉన్నది. ఉపోద్ఘాతం లేదు. ఇది 241 పుటల గ్రంథం. 11 ఆశ్వాసాలలో మొత్తం 2604 గద్య పద్యా లున్నవి. నాకు లభించిన ముద్రితప్రతి ఇదే. తరువాత మరల పువ్వాడ రామచంద్రరావు 1925 లో అచ్చు వేయించినారట కాని నా కా ప్రతి దొరకలేదు. తెలుగు వాఙ్మయోద్ధారకులు సి. పి. బ్రౌన్ మహాశయుడు దీనికి 1832 లో శుద్ధప్రతి సిద్ధం చేయించినాడు. దాని వివరాలు (D. No. 18 కాగితం)
"పద్మపురాణోత్తరఖండమునకు సింగనకవి లెస్సగా తెనుగుచేసి యుండగా కాలాంతరమందు లేఖకదోషములచేత ననేకస్థలములయందు చెడిపోయి శుద్ధప్రతి లేకయుండుటచేతను అనేకప్రతులు తెప్పించి గీర్వాణమునకు సరిగా అధ్యాయసంఖ్య యేర్పడేటట్టున్ను, నిర్దోషముగా నుండేటట్టున్ను, పార్శ్వములయందు ఆ యా కథాభాగముల యందలి వర్ణనాంశములు మొదలైన వాటియొక్క సూచనలు వ్రాయబడియుండేటట్టున్ను యీప్రకారము తీర్పు చేయవలసినదని మచిలీపట్టణం న్యాయకర్తలైన మహారాజశ్రీ చా. పి. బ్రౌన్ దొరగారు అనుజ్ఞ యిచ్చినందున శాలివాహన శకవర్షంబులు ౧౭౫౪ (1754) అగు నేటి నందననామ సంవత్సరమునకు సమానమైన యింగిలీషు యుగ ౧౮౩౨ (1832) సంవత్సరమందు బందరులో జూలూరు అప్పయ్య సంపూర్ణముగా పదకొండు ఆశ్వాసములున్ను తీర్పుచేసి గీర్వాణమునకున్ను తెనుగునకున్ను కొన్నిస్థలములయందు భేదములు వచ్చియుండగాను అధ్యాయక్రమవ్యత్యయములు ఆయాస్థలములయందు విశదపరచడ మైనది. యీ పద్మపురాణమందు ఉత్తరఖండము మాత్రము తెనుగు అయినట్టు తెలియబడుచున్నది కాని కడమ ఖండములకు తెనుగు చేసినట్టుగా యెక్కడ నున్ను మాకు కనబడలేదు. The Padma Purana Part Second Translated into Telugu by Ayyalacavi Singana. This is a very popular work among the Telugus and manuscripts are very common in the Northern districts. The Purvabhagam or First part of this Purana does not seem to have been translated into Telugu. A Zamindar in Rajahmundry told me that he had in vain tried to discover a copy of it and believed that it never has been translated. The present copy has been collated with four manuscripts and is perfect. The language used in this translation is easy and very beautiful.
బ్రౌనుగారు సిద్ధం చేయించిన ప్రతిలో ఇంతకుపూర్వం ఉదాహరించిన మంగళమహాశ్రీ వృత్తంకూడ ఉన్నది. బ్రౌను ప్రతితోపాటు తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాచ్యపుస్తకభాండాగారంలోని D 23, D 25, R 379 తాళపత్రప్రతులను, హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని తాళపత్రప్రతిని పాఠాంతరాలకోసం సంప్రదించినాను. 1885 ముద్రితప్రతి పాఠాలు 'ము' సంజ్ఞతోను, బ్రౌను మద్రాసు పాఠాలు 'మ' సంజ్ఞతోను, తిరుపతి పాఠాలు 'తి' సంజ్ఞతోను, హైదరాబాదు పాఠాలు 'హై' సంజ్ఞతోను సూచించినాను. మేల్తరములని తోచిన పాఠాలను గ్రంథభాగంలో చేర్చి మిగిలినవానిని అధోజ్ఞాపికలం దిచ్చినాను. తాళపత్రగ్రంథాల్లో లభించిన అధికపాఠాలు అధోజ్ఞాపికల్లోనే చేర్చినాను. అవసరమైన సంధి వచనాలను గ్రంథభాగంలోనే చేర్చినాను. ఇన్నిప్రతులు సంప్రదించినందుకు ముద్రితప్రతిలోని అనేక అhపాఠాలు గుర్తించగలిగినాను. ఈ ప్రతులు సంప్రదించటానికి అనుమతించిన మద్రాసు తిరుపతి హైదరాబాదు గ్రంథాలయాధికారులకు సహకరించిన మిత్రులకు, గ్రంథమును ముద్రించిన తిరుమల తిరుపతి దేవ నముల వారికి కృతజ్ఞుడను. సహస్రాధికపాఠాంతరాలు శతాధికమేలిపాఠాలు దశాధికఅధికపాఠాలున్న ఈ ప్రతి పాఠకులు మన్నిస్తారని ఆశ.
| "తిరువేంకటనాయకపద | (వాసిష్ఠరామా. I-8) |
16 - 6 - 1993,
1 - 8 - 117/2 చిక్కడ్ పల్లి
విధేయుడు
హైదరాబాదు - 500 020
బి. రామరాజు