పద్మపురాణము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

పద్మపురాణము

ఉత్తరఖండము - పంచమాశ్వాసము

క.

శ్రీమత్కృపార్ద్రహృదయో
ద్దామ గుణాభరణ దానధర్మాచరణా
ధీమహిత సరసమానన
తామరసదినేశ కందదండాధీశా.

1


వ.

పరమయోగవిద్యాగరిష్ఠుం డగు వసిష్ఠుండు దిలీపున కిట్లనియె
నీయడిగిన యర్థంబులన్నియు నితిహాసరూపంబున [1]వినిపించితి
నింక నేకథ విననిష్టంబు వేఁడుమనినఁ గరకమలంబులు మొగిడ్చి
యారాజకుంజరుండు మునివరాగ్రణి కిట్లనియె.

2


సీ.

అనఘాత్మ! మీదయ నఖిలధర్మంబులు
         విని మీరు [2]వినుపంగ విశదమైన
[3]జాతిధర్మములు నాశ్రమధర్మములు నిత్య
         నైమిత్తకములు జన్నములు రాజ
ధర్మంబులును దీర్థదానవ్రతంబులు
        మొదలుగా స్వర్భోగముల నొనర్చు
నట్టికృత్యములు పె క్కాచరించితి నింక
        [4]నవ్యయంబగు మోక్షమందు నట్టి


ఆ.

మార్గ మెఱుఁగ వేఁడి మద్భాగ్యవశమున
నీదు దివ్యచరణనీరజములు
గంటి వినఁగ నాకుఁ గౌతుకం బయ్యెడిఁ
దెలియఁ జెప్పు మిపుడు దివ్యచరిత.

3

ద్వయమంత్రప్రభావము :

క.

ఏమంత్రము భవరుజలకుఁ
దా మందగు నవని మంత్రతతిఁ దలఁపంగా
నేమూర్తి దైవములలోఁ
దా మోక్షం బిచ్చుఁ బరమ[5]తత్త్వం బెందున్.

4


వ.

ఈయర్థం బంతయుఁ దేటపడ నెఱింగించి నన్నుఁ గృతార్థుం
జేయు మనిన నద్దిలీపునకు వసిష్ఠుం డిట్లనియె.

5


ఆ.

పరమమోక్షదంబు పరమరహస్యంబు
సర్వలోకహితము శాశ్వతంబు
నైన యర్థ మిప్పు డడిగితి నింతయు
వినుము చిత్తగించి మనుజనాథ!

6


ఆ.

[6]యజ్ఞదాననిరతు లగు శౌనకాదులు
ననఘ! నీవు నన్ను నడిగినట్లు
నలినభవతనూజు నారదు నడిగిన
నతఁడు వారితోడ ననియెఁ బ్రీతి.

7


క.

మునులార! వినుఁడు సెప్పెద
ననఘం బగు మంత్రమిది రహస్యము దీనిన్
సనకాదియోగివరులకు
వనజజుఁ డెఱిఁగించు తెఱఁగు వరుసను మీకున్.

8


వ.

ఎఱింగించెద నాకర్ణింపుండని శౌనకాదిమునులకు నారదుం
డిట్లనియె.

9


క.

ఒకనాఁ డేకాంతంబున
సకలాగమ[7]వేదులైన సనకాదులు మో
క్షకలనమంత్రం బీగతి
నకుటిలమతిఁ బద్మగర్భు నడిగిరి వేడ్కన్.

10

చ.

అడిగిన నవ్విరించి ప్రియమారఁగ వారికిఁ జెప్పె నన్ను మీ
రడిగిన యర్థమెంతయు రహస్యము దుర్లభ మేరికైన నీ
పుడమియు భూతసంఘమును బుట్టకముందరఁ బూజసేయఁ బెం
పడరఁగ నిందిరాసహితుఁడైన ముకుందుఁడు బ్రహ్మముందటన్.

11


వ.

ప్రత్యక్షంబై యతనికిం బ్రజాపతిత్వంబును సకలవేదశాస్త్ర
నిర్మాణమహత్వంబును నొసంగి స్వప్రకాశంబులై [8]వ్యాపకా
వ్యాపకరూపంబులగు మంత్రంబు లుపదేశించిన సంతుష్టాంత
రంగుండై యద్దేవునకు వెండియు నమస్కరించి విరించి
యిట్లనియె.

12


తే.

దేవ! లక్ష్మీశ! మోక్షంపుఁదెరువు గాంచి
నరులు సంసారసాగరోత్తరణు లౌదు
రెట్టి మంత్రంబుఁ బఠియింతు రెల్లనాఁడు
నట్టి మంత్రంబు దయసేయవయ్య నాకు.

13


క.

ధరఁగల మంత్రంబులలో
నరయఁ బునశ్చరణలేక యతిసులభంబై
నరుఁ డొక్కమాటు దలఁచిన
పరమపదం బొసఁగు మంత్రవర మెద్ది హరీ!

14


వ.

అని యడిగిన నప్పరమేశ్వరుం డిట్లనియె.

15


తే.

అంబుజాసన యిది లెస్స యడిగి తీవు
ఎట్టి మంత్రంబు పఠియించి యెల్లజనులు
నన్నుఁ గూడుదు రమ్మంత్ర మున్నరూపు
వినుము సెప్పెద నతిగుహ్యమును హితంబు.

16


క.

భువి సర్వమంత్రములలోఁ
బ్రవిమలశుభదాఖ్యమంత్రరత్నం బరయన్
దవిలి యొకమాటు దలఁచిన
నవిరళమగు మోక్ష మిచ్చునది యది యనఘా!

17

వ.

తత్ప్రభావంబు వినుము మంత్రరత్నంబును ద్వయంబును
న్యాసంబును ప్రవత్తియు శరణాగతియు లక్ష్మీనారాయణంబు
సర్వఫలప్రదంబు హితంబు ననం బర్యాయనామంబులు గలిగి
యొప్పు నిమ్మంత్రంబు నుచ్చరించినం బరితుష్టహృదయుండ
నగుదు.

18


సీ.

ఆరూఢకులజాతుఁ డతులతపోనిధి
         వేదపారగుఁడును విపులయజ్ఞ
దానపరుండు తీర్థస్నానపూతుండు
         [9]వ్రతి సత్యసంధుండు యతివివేకి
సుజ్ఞాని యైనను శుభతరద్వయమంత్ర
         మధిగమింపండేని నతని విడువ
వలయు భూసురరాజవైశ్యశూద్రాన్వయ
        [10]జనములైన నితరజనములైన


ఆ.

[11]నాదు భక్తి గల్గి మోదిల్లిరేని నీ
మంత్రమునకు నర్హమతు లనన్య
గతు లనన్యశరణరతుల ననన్యసా
ధకులు దీని నెఱుఁగ దక్షు లనఘ!

19


ఆ.

ఆర్తులైనవారి కతిశీఘ్రఫలదమౌ
నొక్కమాటు మంత్ర ముచ్చరింప
[12]దృప్తజాతులైన దేహాంతరంబుల
వలన ముక్తు లగుదు రలఘుచరిత!

20

తే.

[13]ఆర్తుఁ డర్థార్థి జిజ్ఞాసు వాత్మవిదుఁడు
తగిలి యొకమాటు విను మదిఁ దలఁచిరేని
వారి కయ్యైఫలంబులు వరుస నిత్తు
నమ్మ నేర్చిర యేనియు నలినగర్భ!

21


వ.

దీక్షితుండు గానివానికి భక్తిహీనునకు మానరహితునకు నాస్తికు
నకుఁ గృతఘ్నునకు పరాఙ్ముఖునకు శీలవర్తనంబు లెఱుంగని
వానికి నిమ్మంత్రం బుపదేశింపవలవదు కామక్రోధలోభమోహ
దంభవర్జితుండై యాలస్యంబు విడిచి భక్తియోగంబున నన్ను
సేవించు పరమవైష్ణవునకు నీమంత్రం బుపదేశింపవలయు.

22


తే.

దీక్షఁ దొరకొనునప్పుడు దేశకాల
శుద్ధు లరిమిత్రగతులను [14]జూడవలదు
న్యాసముద్రాపునశ్చరణాదివిధులు
వలదు మద్భక్తి గలిగిన వనజగర్భ!

23


వ.

మదీయసుదర్శనధారణంబును మచ్చరణారాధనంబును సకల
ధర్మంబులు నాయందు సమర్పించుటయు ననన్యసాధనత్వంబును
అకించనుండై యవైష్ణవసంభాషణం బుడుగుటయు ననన్య
దర్శనమతవర్జనంబును అన్యదేవతాపూజనవందనాద్యుపచారానభి
ముఖత్వంబునుం బ్రపన్నుల కర్హంబులు. అట్లు గావున నీగుణం
బులుగల వారలకు నిమ్మంత్ర బుపదేశించుట కర్తవ్యంబు.

24


సీ.

రమణీయమగు మంత్రరత్నంబునకు ఋషి
        విను సనాతనుఁడైన విష్ణుఁ డనఘ!
సరసిజోదరుఁడు వాత్సల్యసాగరుఁడును
        సర్వలోకేశుఁడు శక్తియుతుఁడు

శ్రీశుండు నిత్యసుశీలుండు సుభగుండు
         సర్వబంధుఁడు గృపాసాగరుండు
నైన శ్రీ నారాయణాఖ్యుండు దేవత
         ఛందంబు గాయత్రిసాంగ మగుచుఁ


తే.

బంచవింశతివర్ణాళి వఱఁగునందు
మొదల రెండును నే డాఱు మూఁడు నైదు
మఱియు రెండు షడంగసమ్మతము సేసి
న్యాస మొనరింపవలయుఁ బర్యాయ మెసఁగ.

25


మ.

సతతశ్రీయుతవామభాగలసితుం జక్రాబ్జకౌమోదకీ
సితపద్మాంకితదోశ్చతుష్టయు లసచ్ఛృంగారదివ్యాంబరాం
చితదేహు న్మణిదివ్యభూషణు ననుం జింతించి సద్గంధవ
స్త్రతతిం బూజలుసేయు నిత్యమును మంత్రజ్ఞుండు శుద్ధాత్ముఁడై.

26


వ.

ఈప్రకారంబున విశ్వరూపధరుండగు నన్ను నియతాత్ముండై
యీమంత్రంబున నొక్కమాటు పూజించిన సంతుష్టాంతరంగుం
డనై యభిమతంబు లిత్తు ననిన నారాయణునకు శతానందుం డి
ట్లనియె.

27


సీ.

సర్వదైవములును జననియు జనకుండు
        పతియు సఖుండును గతియు గురుఁడు
చుట్టంబు శరణు దోఁబుట్టువులును నీవ
        జనుల కభీష్టార్థజనక మయ్యు
నతిరహస్యంబగు నమ్మంత్రరత్నప్ర
        భావంబుఁ దెలిపితి దేవదేవ!
యే నీకు దాసుఁడ సూనుండ శిష్యుఁడఁ
       గారుణ్యజలధివిఁ గాన నిన్ను


తే.

నిపుడు వేఁడెద నిమ్మంత్ర మెల్లనాఁడు
నఖిలలోకోపకారార్థమైన దాని
దీక్షగొను భంగి నంతయుఁ దెలియఁ జెప్పు
మనిని విని యాదిపురుషుఁ డిట్లనియెఁ బ్రీతి.

28

ద్వయానుసంధాన విధానము :

సీ.

విను వత్స! యీమంత్రమునకు దీక్షావిధి
        కర్హుఁ డాచార్యుఁడౌ నతఁడు వేద
శాస్త్రసంపన్నుండు సత్యవ్రతుఁడు విష్ణు
        భక్తుఁడు మంత్రార్థపారగుండు
గతమత్సరుం డనాగతవేది మంత్రజ్ఞుఁ
        డతిముముక్షుఁడు విప్రుఁ డమలచరితుఁ
డనఘుఁడు బ్రహ్మవిద్యాసమర్థుం డరి
       దమనుండు సత్సంప్రదాయనిరతుఁ


తే.

డతులితాచారశాసనుఁ డగుటఁ జేసి
యట్టి పుణ్యుని నాచార్యుఁ డండ్రు పెద్ద
లతని యాజ్ఞకు మిగులక యనుదినంబుఁ
దత్పరాధీనుఁడై భక్తిఁ దనరునట్టి
ఘనుని నుత్తమశిష్యునిఁగా నెఱుంగు.

29


వ.

అట్టి సత్త్వగుణనిష్ఠుండగు శిష్యునకు నిమ్మంత్రరత్నం బుపదే
శింపవలయుఁ దత్ప్రకారం బెట్టిదనిన.

30


తే.

శ్రవణమున నొండె ద్వాదశిఁ దివిరి యొండె
వైష్ణవంబగు శోభనవాసరమున
నొండె నాచార్యసేవనాయుక్తుఁ డగుచు
దీక్షఁ గైకొనవలయు సురక్షితముగ.

31


క.

కనకమున నొండె రజతం
బున నొండెను రాగి నొండె మొగిఁ గంచున నొం
డెను చక్రము శంఖంబును
నొనరింపఁగ వలయు శాస్త్రయుక్తము గాఁగన్.

32


తే.

వినుము! పంచామృతస్నాన మొనరఁ జేసి
నాదు సన్నిధి గంధపుష్పాదివిధుల
చేతఁ దన్మంత్రమునఁ బూజచేసి యచట
నొనర గృహ్యోక్తవిధి నగ్ని యునుపవలయు.

33

సీ.

అగ్నిసన్నిధి నుండి యాచార్యుఁ డాజ్యంబు
       వోయుచుఁ దన్మంత్రమునను వేయు
నెనిమిది యొండె నూటెనిమిది యొండెను
       వేల్చి తక్కిన విష్ణుదేవు మంత్ర
తతిచేతఁ బురుషసూక్తముచేతఁ బాయస
       ఘృతములఁ గొన్ని యాహుతులు వేల్చి
యయ్యగ్నిలోపల నొయ్యనఁ జక్రశం
       ఖములు నిక్షేపించి క్రమముతోడ


తే.

మఱి షడక్షరి నిరువదిమార్లు వేల్చి
తప్తచక్రంబు మంత్రపూతముగ శిష్యు
కుడిభుజంబునఁ జక్ర మయ్యెడమవలన
శంఖమును గాఁగ గురుఁడు గూర్చంగవలయు.

34


వ.

మఱియు హోమశేషంబు సంపూర్ణంబు గావించి సుదర్శనపాంచ
జన్యంబులకుం బునఃపూజ యొనర్చి తదనంతరంబ నూతనకల
శంబులం బవిత్రజలంబుల నించి మంత్రరత్నంబున నభిమం
త్రించి యద్దీక్షితుమస్తకంబున నభిషేచనంబు చేసి ధౌతాంబర
ధరుండును నాచార్యవినయాన్వితుండును నైన యతనికి నాచా
ర్యుం డూర్ధ్వపుండ్రం బిడి మంత్రోపదేశంబు చేసి తన్మంత్రార్థం
బెఱింగించి నిత్యాచారవిశేషవర్తనంబులు బోధింపవలయు.

35


ఆ.

మంత్రలబ్ధుఁడైన మహితుఁ డాచార్యుని
భూషణాంబరములఁ బూజచేసి
యిట్టి మంత్రదీక్ష యేవైష్ణవుఁడు సేయు
నతఁడు నన్నుఁ జెందు నమరవంద్య!

36


వ.

[15]అని చెప్పెనని నారదుండు శౌనకాదిమహామునీంద్రుల కిట్ల
నియె.

37

క.

ఇత్తెఱఁగు సెప్పి మఱియును
నత్తామరసాననునకు హరి కారుణ్యా
యత్తుఁ డయి శంఖచక్రాం
కోత్తము గావించి మంత్ర ముపదేశించెన్.

38


శా.

ఈమంత్రంబు విరించి మజ్జనకుఁ డి ట్లేకాంతమై నాకుఁ దాఁ
బ్రేమం బారఁగఁ జెప్పె మీ రిపుడు సాభిప్రాయచేతస్కులై
యీమార్గంబున శంఖచక్రధరులై యీమంత్రరత్నోన్నతిన్
శ్రీమద్విష్ణుపదంబు నొందెదరు సుశ్రీనిత్యులై యిమ్ములన్.

39


వ.

అని యిత్తెఱంగున నుపదేశించిన దేవమునివాక్యంబులు విని
యత్తపోధనసత్తము లుత్తమంబగు ప్రపత్తిమంత్రాయత్త
చిత్తులై విష్ణుసాయుజ్యంబు వడసి రట్లు గావున భూపాలోత్తమా!
నీవును శాశ్వతం బగు విష్ణులోకంబుఁ బొందు చిత్తంబు గలదేని
యీమంత్రదీక్షాప్రకారంబున సుదర్శనపాంచజన్యధారణంబు
చేసి నారాయణచరణంబులు శరణంబుగా నాశ్రయింపుము.

40


ఆ.

సర్వలోకవిభుఁడు సరసిజగర్భుండు
నారదునకు నాకుఁ గోరి మంత్ర
మిచ్చె దీని సురమునీంద్రుండు నైమిశా
రణ్యమునుల కిచ్చెఁ బ్రమద మెసఁగ.

41


మ.

ఇది యత్యంతరహస్యమంత్ర మిల ని ట్లెవ్వారికిం దూర మా
త్రిదశేంద్రాసురసిద్ధకిన్నరమునిశ్రేణు ల్గనంజాల రీ
సదుపాయద్వయ మేఁ బరాశరునకుం సమ్యగ్విధిం జెప్పితిన్
విదితంబైన ప్రపత్తి దీక్ష యిది యుర్వీనాథ! యాలించితే.

42


క.

శ్రీవిభునకంటె నధికము
భావింపఁగ లేదు తగఁ బ్రపత్తికి మిగులన్
భూవలయంబున మంత్రం
బేవిధమున లేదు దలఁప నిది నిజ మనఘా!

43

వ.

అనిన విని దిలీపుం డిట్లనియె.

44


క.

మునివర! హరిభక్తి సుధా
వనధితరంగములు నీదు వాక్యచయంబుల్
విని తనివి సనదు వెండియు
వినవలఁతు న్విష్ణుభక్తి వినిపింపు తగన్.

45


క.

తాపత్రయాగ్నికీలా
వ్యాపనతప్తంబులైన యాత్మలకెల్లన్
శ్రీపతిభక్తిసుధాంబుధిఁ
బ్రాపింపక భవభయంబు పాయునె యెచటన్.

46


వ.

అట్లు గావున మహామునీంద్రులచేత నుపాస్యమానుండగు పరమ
పురుషు భక్తిభావంబు వినవలఁతుం జెప్పవే యనిన నతనికి వసి
ష్ఠుం డిట్లనియె.

47


ఆ.

<> </>అధిప! వినఁగ దీని నడిగితి విదియ సం
సారఘోరవార్ధిపార మెయ్ద
నరయ శ్రీశుఁడైన హరిభక్తి రససుధా
సేవఁగాక యొండు చెప్పఁగలదె!

48


తే.

లీలఁ గైలాసగిరిమీఁద బాలచంద్ర
ధరుని శంకరుఁ బరమాత్మ గిరితనూజ
యడిగె నీప్రశ్న నీవు న న్నడిగినట్ల
యత్తెఱంగెల్ల వినుము ధరాధినాథ!

49


వ.

అది యెట్లంటేని.

50


సీ.

శంకర! సర్వజ్ఞ! సర్వదేహులకును
        ముక్తిపద మగు విష్ణుభక్తి విధము
తదుపాసనంబును దన్మూర్తిపూజావి
       ధానమంత్రంబులుఁ దద్విభూతి

తద్గుణాదులు మఱి తద్భువనస్వరూ
         పంబులు నెఱిగింపు ప్రమథనాథ!
సృష్టియు లయమును స్థితియును లక్ష్మీశుఁ
        డేమిట నొనరించు నెద్దివొంది


ఆ.

తిరుగనేరనట్టి దేవుని తత్పదం
బెట్టి సాధనమున నెసఁగి దురిత
రతులు విషయనిరతియుతులు మానవు లెట్లు
పొందువారు చెప్పు భూతనాథ!

51

శివుఁడు పార్వతికిఁ దెలియఁజేసిన విష్ణుప్రపత్తి ప్రభావము :

క.

అని యడిగిన గిరితనయకు
ననురాగముతోడఁ ద్రిపురహరుఁ డిట్లనియెన్
వననిధిశయనుపదద్వయ
వనజములకు మ్రొక్కి వికచవదనుం డగుచున్.

52


ఉ.

ధన్యవు పుణ్యురాలవు కృతజ్ఞవు సంచితవిష్ణుభక్తిసౌ
జన్యవు గాన నీదగు లసద్గుణశీలవివేకరూపస
న్మాన్యవిశేషభంగులకు మన్నన చేసితి సర్వభూతచై
తన్యునిభక్తి నీకు విదితంబుగఁ జెప్పెదఁ జిత్తగింపుమీ!

53


వ.

మఱియును దన్మంత్రంబులుఁ దద్విధానంబులుఁ దదీయస్వరూ
పంబును నెఱింగించెద నది యెట్లనిన.

54


సీ.

నారాయణుఁడు లోకనాథుఁడు పరమాత్ముఁ
         డాదిదేవుఁడు విష్ణుఁ డచ్యుతుండు
శాశ్వతుఁ డీశుండు సర్వజ్ఞుఁ డమరేంద్ర
         వరుఁడు విశ్వాత్ముఁడు వాసుదేవుఁ

డజరామరుండు సహస్రశిరోనేత్ర
         పాదారవిందుండు పద్మనాభుఁ
డీశానుఁ డవ్యయుఁ డిందిరాధీశుండు
         సగుణనిర్గుణమూర్తి నిగమ[16]వినుతుఁ


తే.

డనఁగ బహునామములు గల్గు నతని మహిమ
నాకులకునైన విధికైన నాకు నైనఁ
దలఁప వాక్రువ్వఁ బ్రణుతింప నలవిగాదు
వినుము కన్నంత చెప్పెద వనజనేత్ర!

55


క.

వేదములవలన నుపనిష
దాదుల నిర్ణీత మయిన యది యా యర్థం
బా దేవోపాసన బహు
భేదంబులఁ బరఁగు వినుము భీతమృగాక్షీ!

56


వ.

అవి యెయ్యవి యంటేని శంఖచక్రాంకితంబును నూర్ధ్వపుండ్ర
ధారణంబును మంత్రపఠనంబును ధ్యానంబును నామస్మరణం
బొనరించుటయుఁ దత్సంకీర్తనంబు సేయుటయును వినుట
యును నభివందనంబు సేయుటయును దత్పాదోదకసేవనంబును
దత్ప్రసాదభోజనంబును దద్భక్తసేవనంబును ద్వయానుసంధా
నంబు ననన్యారాధనంబును ద్వాదశీవ్రతనిష్ఠయుఁ దులసీరోప
ణంబు తులసీదళభక్షణంబు నను నద్దేవుభక్తి యాద్యంతంబు
షోడశవిధంబు లని చెప్పంబడు నందు.

57


ఆ.

సంతతంబు దేవసమితికి నాకును
బూజనీయుఁ డాదిపురుషుఁ డట్లు
గాన మిగుల భక్తి గలిగి భూదేవతా
వరులకెల్లఁ గొలువవలయుఁ జువ్వె.

58

క.

ధరణీదేవుఁడు దగ సం
స్కరణానలతప్తశంఖచక్రాంకములం
గరమూలంబుల భక్తిని
ధరియించిన యేని హరిపదంబునఁ జెందున్.

59


ఆ.

చక్రమైన శంఖచక్రంబులైనఁ బం
చాయుధంబులైన నగ్నితప్త
ముగ భుజంబులందు మొగిఁ బూని బ్రాహ్మణుఁ
డాచరింపవలయు నర్హ[17]విధులు.

60


వ.

ఇ ట్లాచరించిన విప్రుండు ఘోరనరకదూరుండై విష్ణుసాయు
జ్యంబు నొందు.

61


క.

చక్రాంకరహితుఁ డగుచుఁ ద్రి
విక్రముఁ బూజించునట్టి విప్రుని జపదా
నక్రతుపూజాధ్యయనా
దిక్రియ లవి నిష్ఫలములు [18]దేవీ! తలఁపన్.

62


క.

ఉపనయనవేళఁ బాప
వ్యపగత హోమాగ్నిఁ గాఁచి యాతనిఁ జక్రాం
కపునీతుఁ జేసి పిమ్మట
నపరిమితబ్రహ్మకర్మ మగుఁ జేయింపన్.

63


చ.

భుజముల శంఖచక్రములు [19]పూనని విప్రునిఁ బైతృకాదిస
ద్భజనము చేయఁ గాదు విదితంబగు గోతిలభూహిరణ్యదా
నజపములైన రాక్షసగణంబుల పాల్పడుఁ గాన నుత్తమ
[20]ద్విజుఁడగు శంఖచక్రధరు నెంచి యొనర్చుట మేలు దానముల్.

64

ఆ.

తప్తశంఖచక్రధరుఁ డెవ్వఁడైనను
నతఁడు ఘోరదురితవితతిఁ బాసి
సకలదానయజ్ఞజపతీర్థఫలములఁ
జెంది విష్ణుపదము లొందు నగజ!

65


ఆ.

సర్వవేదశాస్త్రసంపన్నుఁడైనను
యజ్ఞశతము సేయు నతఁడునై న
చక్రచిహ్నలేని సద్విప్రుఁ బ్రాకృతుఁ
డండ్రు వలవ దన్న మతని కిడను.

66


వ.

ప్రాకృతుండగు విప్రుండు వాసుదేవసంస్పర్శన కనర్హుండు
గావున బ్రాహ్మణుండు తప్తచక్రాంకితుండు గావలయు నది
ప్రాకృతసంగమపాపహరణంబు గావున శూద్రస్త్రీజనంబులకుఁ
దప్తంబు సేసియైనను జందనంబున నైన నిడవలయు మఱియు
విప్రునకు శ్రౌతస్మార్తనిత్యానుష్ఠానమంత్రసిద్ధిఁ బొందను హరి
పూజాధికారార్థంబును వైష్ణవపూజనార్థంబునుగా విధ్యుక్తప్రకా
రాగ్నితప్తచక్రాంకితుండు గావలయు శంఖచక్రగదాఖడ్గశార్ఙ్గం
బులు దక్కఁ దక్కినలాంఛనంబులం దప్తుండుగాఁ జన దట్లైన
నతండు క్రియారహితుండు గావున నతనితో సంభాషింపం
దగదు.

67


ఆ.

వర్ణహీనుఁడైన వైష్ణవుఁ డయ్యెనే
నతఁడు పుణ్యపురుషుఁ డఖిలమునను
బ్రాహ్మణుండు విష్ణుభక్తుండు గాఁడేని
యతఁడు శ్వపచుకంటె నధముఁ డండ్రు.

68


క.

శ్రీకరచక్రాంకితులగు
లోకులు శుద్ధులు మహాత్ములును నగుదురు వా
[21]రీకరణిలేక యుండినఁ
బ్రాకృతులన ధాత్రి నెన్నఁబడుదురు మనుజుల్.

69

క.

ఏ యాశ్రమస్థుఁ డైనను
బాయక విప్రుండు విష్ణుపరుఁడై చక్రాం
కాయతనభుజుఁడుగాఁ దగు
నీ యర్థము [22]శ్రుతులు చెప్పు నిందునిభాస్యా!

70


వ.

అని యిట్లు మహోపనిషత్తులందు బ్రాహ్మణునకు శంఖచక్రంబులు
దక్షిణసవ్యభుజంబుల ధరియించుట యవశ్యకర్తవ్యంబని చెప్పం
బడు ఋగ్యజుస్సామవేదంబుల యం దిట్లయని చెప్పంబడు నట్లు
గావున.

71


ఆ.

విష్ణుభక్తులందు వెలయు వారలు శంఖ
చక్రములు ధరించి సౌమ్యు లగుదు
రట్లు లేమి నందకాదులు ధరియింతు
రఘభవాంబురాసు లణఁపఁగోరి.

72


వ.

అందు చరణంబు పవిత్రంబు వితతంబు పురాణంబు శుభంబు
బ్రాహ్మ్యంబు ప్రాజాపత్యంబు వాఙ్మయంబు జగత్పూజ్యంబు
నేమి యరిచక్రంబు సుదర్శనంబు సహస్రారంబు ప్రాకృత
ఘ్నంబు లోకద్వారంబు మహౌజసం బనం బర్యాయనామంబులు
గలుగు చక్రంబు దప్తంబు చేసి ధరియించునట్టి పుణ్యాత్ములు
ఘోరాఘపారావారోత్తరణంబు చేసి విష్ణుపదప్రాప్తు లగుదు రట్లు
గావున బ్రహ్మాదిదేవతలకును సుదర్శనధారణంబు పరమధర్మం
బని చెప్పంబడును. పురాణేతిహాసంబులు నిట్లని చెప్పు మఱియును.

73


మత్త.

ఫాలపట్టిక నూర్థ్వపుండ్రము బాహుమూలయుగంబునం
దోలిఁ జక్రము శంఖముం జెలువొందఁగా ధరియించుచున్
లోలురై హరిమంత్రము న్మదిలో జపించుచు నిత్యు లౌ
వారె విష్ణుపదంబుఁ జెందెడువారు వైష్ణవు లద్రిజా!

74

ఉ.

ఎవ్వరు ఫాలపట్టిక వహింతురు వేడుక నూర్ధ్వపుండ్రకం
బెవ్వరు శంఖచక్రముల నెంచి ధరింతురు సద్భుజంబులం
దెవ్వరు దాల్తు రక్కున మహిం దులసీనలినాక్షమాలికల్
నివ్వటిలంగ వారలు పునీతులఁ జేయుదు రెల్లలోకులన్.

75


క.

హోమాగ్నితప్తచక్రం
బే మనుజుఁడు పూను నాతఁ డెప్పుడుఁ బుణ్యుం
డా మనుజునింటి కేగిన
యా మనుజుఁడు నొందు మీఁద నవ్యయపదమున్.

76


సీ.

బహియు నంతరము నాఁబడు రెండువిధముల
        లక్షణంబులు గల వక్షయముగ
నందులో వెలికిఁ జక్రాదిచిహ్నంబులు
        లోనికి రాగాదు లూనకునికిఁ
బరమాత్మదర్శనపరతయు సర్వభూ
        తహితంబు విషయాలిఁ దగులమియును
బుత్త్రదారాదులమైత్రి వాటింపమి
        ప్రకటయోగభ్యాసపరిచయంబు


ఆ.

నన్యభక్తిలేక యాత్మేశుఁ గొలుచుట
యంతరంబు లయ్యె నింతపట్టుఁ
గాన శంఖచక్రగతి వైష్ణవం బది
లేనివాని భక్తిహీనుఁ డండ్రు.

77


వ.

అని సుదర్శనధారణప్రభావంబు సెప్పి శంకరుండు గిరిజ
కిట్లనియె.

78


క.

ధరణీదేవుఁడు నొసటను
ధరియించిన మాత్ర ఘోరతరపాపములం
బరిమార్చు నూర్ధ్వపుండ్ర
స్థిరమాహాత్మ్యంబు వినుము సెప్పెదఁ దరుణీ!

79

ఊర్ధ్వపుండ్రధారణ ప్రభావము :

ఆ.

పొలుపు మిగుల నూర్ధ్వపుండ్రమధ్యంబున
సిరియుఁ దానుగూడి హరి వసించి
యుండుఁ గాన శుద్ధుఁ డూర్ధ్వపుండ్రము దాల్చు
నాతఁ డతని గృహము నతిశుభంబు.

80


క.

నరుఁ డెవ్వఁడేని తెల్లని
తిరుమణి ధరియించు నతఁడు తీర్థము లెల్లం
బరువడి నాడిన ఫలమును
వరదీక్షల ఫలముఁ జెందు వనరుహనయనా!

81


క.

విను! మూర్ధ్వపుండ్రధారణ
మొనరించిన యట్టి భూసురోత్తముఁడు జగం
బునఁ నెల్లఁ బూజ్యుఁడై తుది
ననుపమసురయాన మెక్కి హరిపురి కరుగున్.

82


క.

తిరుమణి పెట్టిన సద్ద్విజ
వరు జూచిన నణఁగుఁ బాపవర్గంబెల్లం
గరమర్థిఁ జేరి మ్రొక్కినఁ
బరికింపఁగ సకలదానఫలములుఁ జెందున్.

83


ఆ.

ఊర్ధ్వపుండ్రధారణోత్తము నెవ్వఁ డేఁ
గోరి పైతృకమునఁ గుడువఁ బెట్టు
నతని పితరు లెల్ల నాకల్పశతములు
తృప్తులగుట నిజము తీవఁబోడి!

84


క.

నిట లోర్ధ్వపుండ్రమునఁ బ్ర
స్ఫుటుఁడై పైతృకముసేయు భూసురు పితరుల్
పటుగతి నేగుదురు సము
త్కటముగ గయఁ బిండమొందు [23]ధన్యుల గతికిన్.

85

ఆ.

ఊర్ధ్వపుండ్రహీనుఁ డొగిఁ జేయు సంధ్యాది
కర్మమెల్ల నసురగణము[24]పాలఁ
బడుట నిక్క మతఁడు పటుఘోరరౌరవ
నరకకష్టములను నలిననేత్ర!

86


సీ.

పుణ్యమృత్తిక నూర్ధ్వపుండ్రంబు ద్విజునకుఁ
        గస్తూరికాతిలకంబు రాజ
తతికి వైశ్యులకు గందమున బొట్టే కాల
       మపరజాతికి భూతి నడ్డ మిడుట
యగు నెల్లజనులకు హరిభక్తి గలిగిన
       నూర్ధ్వపుండ్రము దాల్చు టుత్తమంబు
హరికంటె నన్యదేవార్చనంబులును ద్రి
       పుండ్రంబు మొదలైన పుండ్రములును


తే.

నర్హములు గావు విప్రున కాతఁ డెట్టి
కులజుఁడైనను బుధుఁడైన నలికమునను
భస్మ మిడునేని సత్క్రియాబాహ్యుఁ డండ్రు
సకలవేదార్థవిదులును శైలతనయ!

87


వ.

అట్లు గావున సర్వవర్ణధారణయోగ్యంబు నూర్ధ్వపుండ్రప్రకారం
బెట్టి దనిన దండాకారంబును సుపార్శ్వంబును సుశోభనంబును
సుభగంబును సుదీర్ఘంబును విపులంబును విరళమధ్యంబును
విష్ణుపదసన్నిభంబునుంగా నిడవలయుఁ దన్మధ్యప్రదేశంబున
హరి లక్ష్మీసమేతుండై వసియించియుండు నట్లగుటం జేసి.

88


క.

నడుమ నెడ మీక యెవ్వఁడు
గడువేఁడుక నూర్ధ్వపుండ్రకం బిడెనే న
య్యెడమున హరి వసియింపక
కడువేగఁ దొలంగిపోవుఁ గమలయుఁ దానున్.

89

క.

ద్విజుఁ డూర్ధ్వపుండ్రవిధమున
రజనీరేణువు ధరింపఁ బ్రాఁతిగ విహగ
ధ్వజుఁ డందయుండుఁ దత్పద
భజనంబున నతఁడు వొందుఁ బరమపదంబున్.

90


సీ.

వేంకటభూధరవిమలమృద్ధరణంబు
         శ్రీపతిసాలోక్యసిద్ధిదంబు
ద్వారావతీపురవరమృత్తికాంకంబు
         రమణీయకామితార్థప్రదంబు
గంగానదీతీరకలితమృచ్చిహ్నంబు
         లాలితయాగఫలప్రదంబు
పీతచందనహేమభూతిధారణకృత్య
        మతిశయసర్వవశ్యప్రదంబు


ఆ.

కృష్ణమైన తులసిక్రింది మృత్తిక దాల్ప
సన్నుతాచ్యుత[25]ప్రసన్నకరము
గాన విష్ణుభక్తి నూని విప్రోత్తము
లూర్ధ్వపుండ్ర మిడుట యుత్తమంబు.

91


వ.

మఱియు దివ్యంబులగు హరిక్షేత్రంబులందును బర్వతాగ్రంబు
లందును బుణ్యనదీతీరంబులందును సముద్రజలాశయతీరంబు
లందును వల్మీకప్రదేశంబులందును విష్ణుస్థానోదకస్థలంబులం
దును శ్రీరంగాదివిశేషస్థానంబులందును దులసీవనంబులందునుం
గలమృత్తిక భక్తితోడం గొనివచ్చి నిత్యంబును విష్ణుపాదోదకం
బులం గరంగించి లలాటంబు మొదలైన యంగంబుల నూర్ధ్వ
పుండ్రం బిడువారలు విష్ణుసాయుజ్యంబు నొందుదురు మఱి
యును.

92

ఆ.

రమ్యపీతనీలరక్తపాండుర లగు
మృత్తికలు ధరించు నుత్తములకుఁ
గడఁగి యర్థధర్మకామమోక్షంబులు
వరుసఁ గల్గునండ్రు పరమమునులు

93


వ.

అదియును వర్తులంబును నడ్డంబును ఛిద్రంబును [26]హ్రస్వం
బును నతిదీర్ఘంబును నతివిస్తరంబును వక్రంబును స్వరూపహీనం
బును నగ్రహీనంబును లూనమూలంబును నగు పుండ్రంబులు పరి
హరణీయంబులు గావున నాసికామూలంబున నుండి భ్రూమధ్యం
బునుంగా నుభయరేఖామధ్యం బంగుళీద్వయమాత్రంబును దద్రేఖ
లంగుళమాత్రంబులుంగా ధవళంబగు మృత్తిక ఫాలతలంబున
[27]నాసికాదికేశాంతంబు ఋజువుగా నూర్ధ్వపుండ్రం బిడవలయు.

94


చ.

అలికము గుక్షి వక్షమున నఱ్ఱున దక్షిణకుక్షినిన్ భుజ
స్థలమున మూఁపుమీఁద మఱిదావలిప్రక్కను [28]బాహుమూలముం
దలకొని మూఁపు వీఁపు కకుదంబుల నొప్పుగఁ గేశవాదులై
చెలువగు నామము ల్దలఁచి చెచ్చెరఁ బెట్టఁగ నొప్పు పుండ్రముల్.

95


వ.

తదనంతరంబ తదవశేషమృత్తికాప్రక్షాళనతోయంబులు మస్తకం
బున వాసుదేవనామంబుగా ధరియింపవలయు నయ్యైస్థలంబు
లం గేశవాదినామంబులం దన్మూర్తులం దలంచి యిడనగు నవి
యును లలాటంబున భుజంబుల వీఁపునఁ గంధరంబునఁ గంఠ
కూపంబునం జతురంగుళప్రమాణంబులును బాహుయుగంబున
నురంబున నష్టాంగుళంబులును నాయతంబులునుగా నూర్ధ్వపుం
డ్రంబులు వెట్టవలయుఁ దన్నామాంకితంబుల మధ్యంబుల
నెల్లను హరిద్రారేణువు ధరియించుట బ్రాహ్మణులకు నిత్యకర్త

వ్యంబు. రాజులకు వాసుదేవ ప్రద్యుమ్నానిరుద్ధ పురుషోత్తమ
నామంబులు దలంచుచు ఫాలంబున వక్షంబున భుజంబుల నిడ
వలయు. వైశ్యులకు గోవిందనామంబుల నిటలంబున నుదరం
బున ధరియించునది కర్తవ్యంబు. శూద్రస్త్రీజనంబులకు నారా
యణ నామంబుల నొసల నిడవలయు. ఈప్రకారంబున సకల
జనంబులకు నూర్ధ్వపుండ్రంబు ధరియింపవలయు.

96


ఆ.

హరిపదాకృతియును నలరు దండాకార
ముగ ధరించు టధికమోక్షదంబు
పద్మముకుళబోధిపత్రవంశచ్ఛదా
కారములను వశ్యకరము లబల!

97


మ.

కరమూలంబులఁ జక్రచిహ్నితములున్ [29]గంఠప్రదేశంబుల
న్వరపద్మాక్షవిశాలమాలికలు శ్రీవత్సాంకనామంబులం
గర మొప్పారెడు నూర్ధ్వపుండ్రకములుం గాత్రంబునం బొల్చున
ప్పురుషు ల్సర్వజగంబుఁ బుణ్యగతులం బొందింతు రబ్జాననా.

98


వ.

అని యూర్ధ్వపుండ్రధారణమహత్వంబు చెప్పి శంకరుండు గిరిరాజనందన కిట్లనియె.

99

శ్రీమదష్టాక్షరీమంత్రప్రభావము :

తే.

న్యాసమున నొండెఁ దా నర్చనమున నొండె
నెపుడు నేకాంతియై మంత్ర మెఱుఁగవలయు
నది యవైష్ణవుచే దీక్ష యయ్యెనేని
ఫలము లేదు పునర్దీక్ష వలయుఁ జేయ.

100


ఉ.

వేదములుం దదంగములు వేయుఁ బఠించి మఘంబు లెల్ల న
త్యాదరలీలఁ జేసి విపులాన్వయుఁడైనను వైష్ణవుండు మం
త్రాదులయం దయోగ్యుఁ డగు నట్లగుటన్ భవమోచనార్థ మేఁ
డాది భజించెనేని గురుఁ డాతని కీఁదగు మంత్ర మిమ్ములన్.

101

క.

నిర్మలమతి యగు శిష్యుని
కర్మిలిఁ దద్గురువు తప్తమగు మంత్రవిధిన్
నిర్మించి యూర్ధ్వపుండ్రము
పేర్మిగ నిడి వైష్ణవంపుఁ బేరిడి పిదపన్.

102


సీ.

న్యాసంబ యొండె నష్టాక్షరి యొండెను
        మఱియొక్కవైష్ణవమంత్ర మొండెఁ
జెప్పి యాచార్యుండు శిష్యుని బోధింప
        వలయు మంత్రముల లోపలఁ బ్రపత్తి
బరమంబు వైష్ణవప్రతతి కెల్లప్పుడు
        సద్ద్విజశ్రేణి కాశ్రయముఁ దాన
ద్వయమునకంటెను బరమైన మంత్రంబు
        లేదు తథ్యం బిది లేమ! వినుము


ఆ.

ధరఁ బ్రపత్తి యనఁగ ద్వయము నాన్యాసంబు
నాఁగ [30]మఱియుఁ బెక్కునామవితతి
గల ప్రపత్తి గురుఁడు తొలుత నెఱింగించి
సర్వకర్మములను జరపవలయు.

103


క.

న్యాసాధికారి మంత్ర
న్యాసంబుల కెల్ల నర్హుఁ డగు నట్లగుటన్
భూసురవరుఁ దన్మంత్రా
భ్యాసిం గావించి పిదప నగు నెఱిఁగింపన్.

104


క.

శ్రీమహితాష్టాక్షరి యను
నామంత్రము నభ్యసింప నగు విప్రున క
ట్లే మంత్ర మష్టవర్ణని
యామకమై ప్రణవపూర్వమై విలసిల్లున్.

105

సీ.

[31]పరమనైసర్గికపరమార్థ మీమంత్ర
        మని చెప్పుదురు బుధు లన్యమంత్ర
ములకుఁ దత్ఫలపూర్తిఁ బొంది చెప్పఁగ[32]శుభ
       దంబగు సుస్వభావంబు లేదు
ప్రణవంబు సర్వమంత్రములకు నాయకం
       బగు నాదియగు బ్రహ్మ మదియ చూవె
యొకటి రెండును నేను నొనరింప వర్ణము
       లష్టాక్షరాఖ్యమై యతిశయిల్లు


తే.

నదియు నారాయణాహ్వయ మాదిప్రణవ
మిడ నమస్కృతితోఁ గూడ నెసక మెసఁగు
సర్వశుభదంబు సర్వార్థసాధనంబు
సర్వదుఃఖాపహరణంబు సౌఖ్యకరము.

106


వ.

సర్వమంత్రాత్మకంబును బరమరహస్యంబు నగు నీ మంత్రంబు
నకు నారాయణుండు ఋషి, శ్రీశుం డదిదేవత, ఛందంబు గాయత్రి,
ప్రణవంబు బీజంబు, నిత్యానపాయిని యగు లక్ష్మి శక్తి యని
త్రిపాదంబున నిమ్మంత్రరాజ ప్రభావంబు చెప్పి, మఱియును
నక్షరత్రితయాత్మకం బగు ప్రణవంబును నతిరహస్యంబులగు
నధిదైవతంబులును బంచవింశతితత్త్వంబులును దదధిష్ఠితంబు
లగు వర్ణంబులును దదుచ్చారణభేదంబులును దదర్థంబులును
బ్రకృతిపురుషాత్మకప్రభావంబులును శేషిశేషసంబంధంబులును
స్వాతంత్ర్యనివృత్తిని విగతమహత్త్వకారణనిదర్శనార్థంబును
నారాయణనామనిర్వచనవాక్యవిశేషంబులును దదీయస్వరూప
నిదర్శనంబులు నగు నుపనిషద్వాక్యంబులును వాసుదేవాచ్యుతా
నంతపురుషోత్తమభగవదాదులగు వివిధనామనిర్వచనంబు
లును వేదమయుండగు పరమపురుషు విరాడ్రూపంబును సర్వజగ
దుత్పత్తిస్థితిలయకారణంబును నారాయణుండ యనియుం బర
మార్థం బుపదేశించి శంకరుండు మఱియు నిట్లనియె.

107

ఆ.

సకలభూతములును జలజజుండును హరి
దాసవర్గ మగుటఁ దలఁచి మంత్ర
మధిగమింపవలయు నమ్మంత్రతాత్పర్య
మెఱుఁగ కభ్యసింప నేమిసిద్ధి.

108


వ.

అని చెప్పిన గిరీశునకు గిరిజ యిట్లనియె.

109


మ.

హరిమంత్రంబును దత్ప్రభావమును నే నాద్యంతము న్వింటి నిం
క రమాధీశుమహావిభూతులును [33]నాకారంబుఁ దద్వ్యూహముల్
పరమంబైన గుణంబులుం బరమ[34]ధామంబు ల్సమస్తంబు వి
స్తర[35]వాక్యంబుల నానతిమ్ము వరదా! చంద్రార్ధచూడామణీ!

110


క.

అన విని శంకరుఁ డిట్లను
విను నీ వడిగినవిధంబు విశ్వాత్ముని భూ
తినిరూఢి నెల్ల నా యెఱిఁ
గినగతి నెఱిఁగింతు నీకు గిరివరతనయా!

111


ఆ.

పరమపురుషుఁ డనఁగఁబడు నెవ్వఁ డతఁడు నా
రాయణుండు విష్ణుఁ డఖిలజగద
ధీశ్వరుండు పరమశాశ్వతుండు [36]వరుండు
విశ్వవిభుఁడు నాఁగ వెలయుచుండు.

112


సీ.

విశ్వస్వరూపియై వేయికన్నులు వేయి
      పాదంబులును గల్గి ప్రబలువాఁడు
భువనసంఘములకు బుధమానసములకుఁ
      దనమేను నిలుకడై తనరువాఁడు
పొడవుల కెల్లను పొడవు నడ్డంబునై
      యవ్యయంబగు రూపమైనవాఁడు
దివ్యమంగళమూర్తిఁ దివిరి శ్రీదేవికి
      నఖిలభోగాశ్రయమైనవాఁడు

తే.

స్థూల మయ్యును సూక్షమై తోఁచువాఁడు
తరుణుఁ డయ్యును బాలుఁడై తనరువాఁడు
చంద్రికాయుక్తిఁ జెన్నొందు చంద్రుమాడ్కి
మించి లక్ష్మియుఁ దానుఁ గ్రీడించువాఁడు.

113


వ.

కందర్పకోటిసుందరుండై యిందిరాసుందరితోడం బరమానం
దంబు నొంది పరమపదంబునందుండు పరమవ్యోమంబు నిత్య
భోగాస్పదం బగుటం జేసి భోగవిభూతి మూఁడుపాదంబులు
గల్గి నిత్యంబై యుండు భువనంబు లన్నియు నతండు నిర్మిం
చుచు నుపసంహరించు చునికిం జేసి యనిత్యంబై లీలావిభూతి
పాదమాత్రంబై విలసిల్లు నయ్యుభయవిభూతులు నప్పురు
షోత్తముండు తనశక్తిపెంపున వరియించుచుండు.

114


ఆ.

అట్టి పరమపదమునం దచ్యుతుఁడు తన
సతులు సిరియు ధరయు సమదలీలఁ
దన్నుఁ గొలిచియుండ నున్నతసౌఖ్యంబు
ననుభవించుచుండు ననుదినంబు.

115

లక్ష్మీస్తవము :

క.

వనజాక్షుఁడు సర్వాత్మల
ననువున విహరించునట్టు లాతనితనువం
దనపాయినియై మన్మథ
జననియు విహరించు నెల్లజగములయందున్.

116


సీ.

ఎల్లలోకములకు నీశాన హరిపత్ని
        సర్వతోముఖ శిరశ్చరణపాణి
నయన సదాశివ నారాయణీ శక్తి
       సర్వజగన్మాత సౌమ్యమూర్తి

[37]యేదేవి కడగంట నెప్పుడు జంగమ
        స్థావరాత్మకమైన జగము నిల్చి
[38]యుండు నందు నిమీలనోన్మీలనంబుల
       నుత్పత్తిలయములు నొందుచుండు


తే.

నట్టి యీశ్వరి త్రిగుణాత్మ యాదిలక్ష్మి
[39]సర్వజగములు వినుతించు సన్నుతాంగి
తనదు తేజంబు పెంపునఁ దానె జగము
శూన్యమగుచోట నిండంగఁ జూచు నెపుడు.

117


వ.

అమ్మహాదేవి లక్ష్మియు ధరణియు నీలయునాఁ ద్రిగుణాత్మికయై
ప్రవర్తిల్లు నందు లక్ష్మి[40]ధనవాగ్రూపంబు లధిగమించియుండు
ధరణి జగదాధారశక్తి వహించియుండు నీల తోయాదిరసరూపా
త్మికమై యుండు. నిమ్మూడువిధంబులు దానయై యప్పద్మ
వాసిని జగన్న్మాథుండగు హరి నాశ్రయించియుండు మఱియును.

118


శా.

స్త్రీరూపంబులు దానయై చెలఁగి[41]వర్తించున్ సమస్తైకవి
ద్యారూపంబులు దానయై నెగడు సౌందర్యైకసౌభాగ్యశీ
లారూఢు ల్దనరూపమై పఱఁగి నిత్యశ్రీలఁ బెంపొందు నా
పారావారతనూజ యెల్లయెడలం బంకేజప్రతేక్షణా!

119


మ.

కమలాపాంగవిలోకనం బయుతభాగంబందుఁ దన్మాత్రనా
ప్రమథేశాచ్యుత పుండరీక భవశక్రశ్రీల ధర్మానిలా
ర్యమచంద్రాదులు నిత్యవైభవములం బ్రాపించుచుం దేవతో
త్తములై యొప్పుదు రమ్మహామహిమ యేతన్మాత్రమే పార్వతీ!

120

సీ.

శ్రీదేవి కమల లక్ష్మీదేవి హరిపత్ని
         సకలభూతేశ్వరి సత్యమాత
సతి నిత్యశివ సర్వగత వుష్టి రమ లోక
        మాత మహాదేవి సీత దివ్య
సర్వసుఖప్రద శచి వేదవతి గౌరి
       రుక్మిణీదేవి క్షీరోదతనయ
యతులకారుణ్యవరారోహ నారాయ
       ణీ మనోశుభకాంతి నీలభూమి


తే.

యఖిలకల్యాణి స్వాహా స్వధాత్మ యనఁగ
హరికి నిత్యావపాయినియైన దేవి!
పుణ్యనామస్తవం బిది పొరిఁ బఠింప
భూరిసంపద లొనఁగూడు నేరికైన.

121


వ.

మఱియు వాక్సంహితాసూక్తంబుల స్తుతియింపంబడు బ్రహ్మాది
దేవతలకు నధికైశ్వర్యసుఖంబు లొసంగుచుఁ దన యపాంగం
బులా నఖిలస్థావరజంగమాత్మికం బగు జగంబు నాశ్రయించి
యుండు నమ్మహాలక్ష్మి [42](యగ్నియందు ప్రభయును)
చంద్రునియందుఁ గళయునుం బోలె నద్దేవుని వక్షంబున నన
పాయినియై విహరించుచుండు నద్దేవుండు.

122


సీ.

సర్వేశ్వరుఁడు [43]సర్వశక్తిసమేతుండు
        సదయుండు వాత్సల్యసాగరుండు
శ్రీమంతుఁ డధికసుశీలుండు సుభగుండు
        సంపూర్ణకాముఁడు సర్వసులభుఁ
డవ్యయాత్ముండు నారాయణుఁ డపవర్గ
        సుఖదుండు నిత్యుండు సఖుఁడు గురుఁడు
కరుణాకరుఁడు సర్వగతుఁ డనంతుఁడు పురు
        షోత్తముఁ డురుదయాచిత్తుఁ డనఘుఁ

తే.

డనఁగ బహునామములుగల యాదిపురుషు
శ్రీసమాయుక్తు జీవాత్ము సిద్ధిపొందె
ననుదినంబును దేశకాలాద్యవస్థ
లందు దాస్యంబు సేయుచునుందుఁ జువ్వె.

123


ఉ.

స్థావరజంగంబులగు సర్వము నచ్యుతు దానభూత మా
దేవుఁడు సర్వజీవుల కధీశుఁడు తల్లియుఁ దండ్రియుం గతిన్
దైవము తోడఁబుట్టువు ప్రధానము సర్వముఁ దానయై సుఖ
శ్రీ వెలయించుఁ దన్ను దరిసించి భజించిన దానకోటికిన్.

124


వ.

అదియునుం గాక.

125


తే.

అఖిలకల్యాణగుణయుక్తుఁడైన విష్ణు
నిర్గుణాత్మకుఁడని చెప్పు నిగమఫణితి
యతఁడు ప్రాకృతహేయగుణాళిఁ బాసి
తనరు నటుగాన గుణహీనుఁ డనఁగఁ బరఁగు.

126


క.

వేదాంతవాక్యములచే
నాదిమ మగు నీప్రపంచ మంతయు మిథ్యా
[44]వాదమగుఁ గానఁబడ్డది
యేదై నను బ్రకృతిచే నశించుట కతనన్.

127

మూలప్రకృతిస్వరూపము :

వ.

అట్లు గావున బ్రహ్మాండము మొదలుగాఁ గల ప్రపంచం బంతయుం
బ్రకృతియందు నుత్పత్తిస్థితిలయంబులందు నద్దేవదేవుండగు
నారాయణునకు లీలార్థంబగు ప్రకృతివలనం జతుర్దశలోకంబులును
సప్తద్వీపసాగరంబులును గ్రామజనపదపట్టణంబులును గలిగి
పరిపూర్ణంబగు బ్రహ్మాండం బుదయించె దానిం జుట్టివచ్చి శబ్ద
స్పర్శరూపరసగంధమహదహంకారంబులగు సప్తావరణంబు
లొండొంటికిం దశగుణాధికంబై యుండు కళాకాష్ఠాముహూర్తా

దులు పరివర్తించుకాలంబులం జేసి జగంబు లుత్పత్తిస్థితిలయం
బులం బొందుచుండు నక్కాలంబులు చతుర్యుగంబులును ద్వి
సహస్రపరివర్తనంబులం గమలగర్భున కొక్కదినంబగు. అట్టి
దినంబులు ముప్పది మాసంబగు. అట్టి మాసంబులు [45]పండ్రెండు
నొక్కసంవత్సరం బగు. అట్టి సంవత్సరంబులు నూఱు చనిన
బ్రహ్మకల్పం బగు. ఆసమయంబున సృష్టిసంహారం బగును.
అప్పుడు బ్రహ్మాండాంతర్గతంబులగు లోకంబు లన్నియుఁ గాలాగ్ని
చేత దహింపంబడి సర్వాత్మకుండగు విష్ణునందుఁ బ్రవేశించి
యావరణభూతంబునందు లీనంబగు. అట్టి సర్వజగదాధార
భూతంబగు మూలప్రకృతి హరి నాశ్రయించియుండ నమ్మాయ
చేత జగదుద్భవసంహారంబు లాహరి యొనరించుచుండు. మఱి
యవిద్య ప్రకృతి మాయ గుణత్రయ సృష్టి హేతుభూత సనాతన
యోగనిద్ర మహామాయ యనంబరఁగు నామంబులంగల ప్రకృతి
స్థానంబై నిబిడాంధకారంబై యవ్యయంబై విలసిల్లుచుండు.

128


సీ.

పాదవిభూతి నాఁ బరఁగు నా ప్రకృతికి
        విరజానదియ మీఁదఁ బరఁగు సీమ
క్రిందు నిస్సీమమై రెండు పక్కంబుల
        నింతింత యనరాక యెసక మెసఁగ
నల్పమై యధికమై యఖిలజగంబులు
        నంద యుద్భవ మొంద నంద[46]యడఁగఁ
గోరి వికాససంకోచకాలంబుల
       నుత్పత్తిలయముల నొందు జగము


తే.

దగిలి భూతము లెల్ల నంతర్గతంబు
లగుచు శూన్యంబులై తోఁచు నట్లు గానఁ
బ్రాకృతములగు రూపు లా ప్రకృతిరూప
కా నెఱుంగుము చెప్పెదఁ గమలనయన!

129

త్రిపాద్విభూతిమహత్త్వము :

వ.

మఱియుఁ ద్రిపాద్విభూతిప్రకారంబు సెప్పెద నాకర్ణింపుము.
బ్రహ్మాండపరమపదమధ్యంబున సీమాకారయై విరజయను నొక్క
నది గలదది యెట్టి దనిన.

130


శా.

వేదాంగుం డగు విష్ణుదేవుని తనుస్వేదాంబుపూరంబునం
బ్రాదుర్భావము నొంది తా విరజనాఁ బ్రఖ్యాతయై పెంపు సం
పాదించుం దగు నమ్మహానది లసత్పారంబునం దోరమై
శ్రీదేవేశుని పట్టణంబు వొలుచన్ శ్రీభోగభాగ్యోన్నతిన్.

131


వ.

అదియునుం బరమవ్యోమం బమృతంబు [47]శాశ్వతంబు [48]సత్యంబు
నిత్యంబు శుద్ధసత్త్వమయంబు దివ్యం బక్షరంబు విష్ణుమందిరంబు
వైకుంఠంబు నిత్యంబు సనాతనంబు సర్వలోకోత్కృష్టంబు బ్రహ్మ
పదం బవ్యయంబు నాఁ బర్యాయనామంబులు గలిగి యనేకకోటి
సూర్యాగ్నితుల్యతేజోవిరాజమానంబై సకలదేవతామయంబై
బ్రహ్మానందంబై సమానాధికరహితంబై యాద్యంతశూన్యంబై
యతులితాద్భుతరమ్యంబై విలసిల్లుచుండు.

132


సీ.

రవిచంద్ర[49]తారకప్రభలు వర్తిల్లక
        దివము రాత్రియు లేక తేజరిల్లు
హరచతుర్ముఖసురేంద్రాదులకై నను
       నప్రవిష్టద్వారమై వెలుంగు
నెట్టకేలకు నందు [50]కేగిన పుణ్యులు
       మరలి రాకుందురు మాననీయ
హరిపదాబ్జధ్యాతలగు మహాయోగీంద్ర
       విప్రాలయంబులు వెలయుఁ బెక్కు

తే.

లఖిలభోగాఢ్యమై నిత్యమై వెలుంగు
నట్టి వైకుంఠనిలయవిఖ్యాతిఁ బొగడ
వేదనిదులకు బ్రహ్మకు వేదములకు
నమరవరులకు నాకును నలవి యగునె?

133


క.

కల్పశతకోట్లయందు న
నల్పంబగు విష్ణుపదమహత్త్వము ఫణిరా
ట్తల్పుండును నెఱుఁగం డఁట
యల్పుల తరమే నుతింప నంబుజవదనా!

134


ఆ.

దీర్ఘశృంగములును దెలుపులునై వెండి
కొండ లట్లు పెక్కుకొమరు మిగిలి
యమృతవాహినులకు నాధారమై గోవు
ల ప్పురంబునందు నొప్పు మిగులు.

135


వ.

మఱియును సిద్ధసాధ్యులును విశ్వేదేవతలును బరమజ్ఞానపరా
యణులగు యోగిపుంగవులును మూర్తిమంతంబులగు ఋగ్యజు
స్సామాధర్వణంబులును దివ్యఋషిగణంబులును బరమభాగవతు
లును ననవరత[51]జాగ్రచ్చిత్తులై పరమానందంబునం గొల్చి
యుండఁ బరమపదనాథుండు నిత్యయౌవనుండును నిరవధికభోగ
పరాయణుండును నిఖిలచరాచరోత్పత్తిలయకారణుండును నై
సుఖంబుండు మఱియును.

136


శా.

నీలాభూము లపూర్వయౌవనముతో నిత్యంబు సేవింపఁగా
నీలాభ్రంబునఁ దోఁచు క్రొమ్మెఱుఁగునా నెక్కొన్న వక్షంబునన్
శ్రీ లీలారతి నుల్లసిల్లఁగ సదా శృంగారుఁడై విష్ణుఁ డు
త్తాలైశ్వర్యవిభూతిఁ బొల్పెసఁగుఁ దద్ధామంబునం దెప్పుడున్.

137


వ.

అని యిట్లు పరమధామమహత్త్వంబు గిరిరాజతనూభవ కానతిచ్చి
చంద్రశేఖరుండు మఱియు నిట్లనియె.

138

క.

శీతాద్రిజ వినుము! త్రిపా
ద్భూతిం బ్రసరించు లోకములు పెక్కులు వి
ఖ్యాతిం జెప్పుదు రెప్పుడు
నాతెఱఁ గెఱిఁగింతు నీకు నతివిస్తరతన్.

139


సీ.

అతిశుద్ధసత్త్వమయంబులు నిత్యంబు
        లవికారములు మహాహ్లాదకరము
లర్కకోటిప్రభాయత్తంబు లస్యయ
        ములు వేదమయములు మోక్షదములు
కనకమయంబులు మునిసేవితంబులు
       నక్రోధలోభమోహాదికములు
నతివిశేషములు బ్రహ్మానందకరములు
       హరిపదాంభోజరసావహములు


తే.

ననవరతసామగానసుఖాన్వితములు
నుపనిషద్వాక్యరూపసముజ్జ్వలములు
దివ్యపూరుషకామినీసేవ్యము లయి
గణుతి కెక్కిన పెక్కులోకములు గలవు.

140


ఉ.

వేదరసాంబువు ల్నదులు విశ్రుతశాస్త్రపురాణతత్త్వవి
ద్యాదులు సుస్థిరప్రకటమై పెనుపొందెడురూపులై సదా
హ్లాద మొనర్చు లోకములు లక్షలసంఖ్యలు గల్గు వాని బ్ర
హ్మాది మునీశ్వరప్రవరులైన నుతింపఁగలేరు పార్వతీ!

141

వైకుంఠపురమహత్త్వము :

క.

విరజానదికిని బరమాం
బరమునకును నడుమ సౌఖ్యఫలదంబై సు
స్థిరకైవల్యము గలదది
పరమంబగు నిర్గుణైకభవనము దలఁపన్.

142

వ.

అదియు నిశ్శ్రేయసంబు నిర్వాణంబు కైవల్యం బనంబడు నప్ప
దంబు కేవల సుఖదుఃఖవివర్జితులై శ్రీసతీశ్వరచరణారవింద
మకరందరసానుభవంబు లే కునికిం జేసి శూన్యంబగు నట్టి సుఖం
బల్పమతు లిచ్చగింతురు గాని మహాత్ములగు భగవద్దాసు లప్పదం
బొల్లక విష్ణుపదంబు ప్రాపింతు రది యెట్టి దనిన.

143


క.

నానాఘనవప్రముల వి
మానములం దోరణముల మణిసౌధముల
న్మానితమగు జనపదవృత
మై నెగడుం బరమధామ మతిరమ్యంబై.

144


ఆ.

అప్పదంబునడుమ నధికవిభూతితోఁ
దనరుఁదా నయోధ్య యను పురంబు
కనకకమలమధ్యకర్ణికాకారమై
యలరు దానిఁ బొగడ నలవి యగునె?

145


క.

సురచిరమణిఘృణియుతమై
గురుతరమగు నప్పురంబుకో టలరారున్
పరిణామవేళ భూసతి
కరకంకణ మూడ్చి యిడిన కైవడిఁ జూడన్.

146


తే.

చారుకురువిందమరకతచ్ఛాయ నిగిడి
దూరమునఁ గానఁబడు పురతోరణములు
మెఱయు నబ్జాక్షతమకాంతిమేఘపటలిఁ
దనరఁ బొడతెంచు సురరాజధనువు లనఁగ.

147


తే.

త్రవ్విచూచిన[52]నైన రత్నములె కాని
యన్యమగుఱాలు వొడగాన మప్పురమునఁ
దరువు లెల్లను సంతానతరులెకాని
మందునకు నైన నొండొకమ్రాను లేదు.

148

సీ.

వెలయ నమో విష్ణవే ప్రభవిష్ణవే
         యని చెలంగెడు శుకాధ్యయనములును
గోరి నమో నమో నారాయణా యని
         రాజిల్లు కలకంఠకూజితములు
కెరలి హరే కృష్ణ కృష్ణ మాధవ యని
        బోరున నెలుఁగించు శారికలును
ననిశంబుఁ బ్రణవార్థ మభ్యసించుచు సామ
       గానంబు సేయు భృంగముల యులివు


ఆ.

గలిగి సకలకాలఫలపుష్ప[53]భరితమై
కల్పవృక్షసమితిఁ గరము మిగిలి
హరివిహారయోగ్యమై సంతతశ్రీల
నొప్పు నప్పురంబు నుపవనములు.

149


వ.

మఱియు వివిధమణిఘృణినికరపరివృతవివిక్తవిహరమాణ
శిఖండితాండవమండితంబు లగు గోపురంబులును, కనత్కనక
దండమండనాయమానేందిందిరపుండరీకకృతసౌధహర్మ్య
సముత్తంగగంగాప్రవాహకల్లోలమాలాతిరస్కారిహారిసముద్దా
మాంశుకభర్మనిర్మితవైనతేయాంజనేయాంకితవివిధమణిమయ
విచిత్రపతాకావితానంబులును, లక్ష్మీపక్ష్మలదృగ్విలాసలక్ష్మీకృతా
ధోక్షజవక్షస్స్థలస్థూలవైజయంతీవనమాలికాసౌభాగ్యసహచర
సర్వలక్షణోపశోభితాంఘ్రిపల్లవాలంకృతతోరణవిరాజమానద్వార
ప్రదేశంబులును, దుర్వారగంధసింధురమదాంధపుష్పంధయ
ఘనఝాంకరణజేగీయమానకపోలోత్తాలనీలశుండాదండ
మండితప్రచండసముద్దండంబులగు వేదండంబులును, రవిరథ
తురగజవపరిహసనలసితశశిధవళకులకుధరనిభశుభతను
సత్త్వశాశ్వతంబులగు నశ్వంబులును గలిగి, మవ్వంబులగు జవ్వ
నంబులు ద్రవ్వి తండంబులై నివ్వటిల్ల పురుషోత్తమాయత్తంబు
లగు చిత్తంబులం దత్తరంబు లెడలి పొత్తుకత్తియలలో నత్తమిల్లి

మొత్తంబులగు నుత్తమమత్తకాశినీసహస్రంబులును, కందర్ప
సౌందర్యంబులు డిందుపఱిచి సుందరీజనసందర్శనానందమంది
రంబులై పెంపొంది డెందంబు లిందిరామందిరుండగు గోవిందు
పదారవిందమకరందరసాస్వాదనపరవశంబులై యుండ నిత్య
యౌవనంబునం గ్రీడించు దివ్యపురుషులును, సకలపదార్థశోభిత
విపణివీథికావిలసితంబును, నిరంతరపఠ్యమానశ్రుతిస్మృతిపురా
ణేతిహాసవేదాంతసిద్ధాంతంబులు గల దివ్యమునిసహస్రంబులుం
గలిగి రాజహంససంచారరహితం బయ్యును రాజహంసవిహార
స్థలంబై, పురుషోత్తమనివాసం బయ్యును బుణ్యజనవర్జితంబై,
క్రతుకర్మఫలానుభవస్థలంబు గాకుండియుఁ గ్రతుకర్మవిరాజ
మానంబై, అమృతార్ణవంబు గాకుండియు నమృతస్థలంబై, సకల
మంగళావాసంబై సౌఖ్యాస్పదంబై యొప్పారు నప్పురంబు చతు
ర్ద్వారవిలసితం బగు. అందుఁ బూర్వద్వారంబునఁ జండప్రచండు
లును దక్షిణపువాకిట భద్రసుభద్రులును పడమటిగవనియందు
జయవిజయులును నుత్తరంబున ధాతృవిధాతృలును జక్రముసల
ముద్గరభిండివాలశూలాద్యనేకశితాయుధపాణులగు భటసహ
స్రంబులతోఁ గాచుకొనియుండుదురు. కుముదకుముదాక్షపుండ
రీకవామన[54]శంకుకర్ణసర్పనేత్రసుముఖసుప్రతిష్ఠితప్రముఖు
లైన యారెకు లనేకు లనేకాయుధంబులతోఁ బురరక్షకులై యుండ
నభేద్యంబగు నన్నగరమధ్య ప్రదేశంబునందు.

150


శా.

ప్రాసాదంబులు సాలభంజికలు వప్రంబు ల్కనత్కుట్టిమ
వ్యాసక్తిం గలకుడ్యము ల్వివిధరమ్యస్తంభము ల్భద్రముల్
శ్రీసంపన్నమహామణిప్రభలతోఁ జెన్నొంద నేత్రోత్సవో
ల్లాసంబై హరిమందిరంబు వొలుచున్ లక్ష్మీసమారూఢమై.

151


వ.

అయ్యంతఃపురమధ్యంబునందు.

152

తే.

పద్మరాగపుసోపానపంక్తు లమర
వేయికంబంబు లురురత్నవితతి నొలయఁ
బుండరీకాక్షు కొలువుండు మండపంబు
చిత్రకౌశల మిట్లని చెప్పఁదరమె?

153


సీ.

అతులితధర్మబోధైశ్వర్య వైరాగ్య
        ములును దద్ఛక్తులు మొగిని నాల్గు
వేదచతుష్కంబు నాదిగా నాలుగు
        పాదంబులందును భక్తి నిలువ
సూర్యసోమాగ్నులు సొరిది మధ్యంబులఁ
        గమఠనాగాధిపగరుడముఖ్యు
లాదారమై క్రాల నఖిలమంత్రములతో
       సావిత్రి కర్ణిక నావహిల్ల


తే.

సతతనతదివ్యమకుటకీలితనవీన
రత్నరుచిజాలపరివృతరమ్య మగుచు
నఖిలయోగీంద్రహృద్ధ్యేయమై వెలుంగు
నంబుజోదరుదివ్యసింహాసనంబు.

154


వ.

అమ్మహాసింహాసనంబున వికసితేందీవరనీలనీరదశ్యామకోమల
శరీరంబును, తరుణపల్లవతామ్రతామరసదళారుణంబులగు కర
చరణంబులును, వజ్రోపలోపశోభింబులైన శశిదశకసదృశంబులగు
పదనఖంబులుం బద్మరాగప్రతిమంబులగు నంగుష్ఠంబులును,
గమఠయుగళరమ్యంబులగు పదోపరిస్థలంబులును, బ్రత్యగ్ర
జాగ్రత్సముదగ్రరుచిరరత్నపుంజమంజీరరంజితంబగు చరణ
యుగళంబును, లలితమరకతమణికాహళయుగళసహచరంబగు
జంఘాద్వయంబును, కరీంద్రశుండాదండసన్నిభంబులగు
నూరుకాండంబులును, దరలతటిల్లతోపమానజాంబూనదధగద్ధ
గాయమానపీతకౌశేయావృతమణిరశనాకలితంబగు నితంబం
బును, సకలజగదుత్పత్తినిమిత్తకమలభవభవనంబగు నాభి
కుహరంబును, విశాలవక్షస్స్థలవేదికాసమారోహణోద్యుక్తకమలా

నిరర్గళబ్రశస్తసోపానమార్గసంకాశంబగు త్రివళీవిలాసంబును,
గనత్కనకమణివిరాజమానవైజయంతీవనమాలికాపరిచిత
ప్రశస్తకౌస్తుభమణిఘృణిపరిష్కృతోరస్స్థలంబును, అనేకకన
త్కనకమణిఖచితకటకకేయూరాదినానాభూషణవిభూషితంబు
లగు చతుర్బాహుదండంబులును, నూతనప్రకీర్ణకర్ణాలంబితమకర
కుండలమండితగండస్థలంబులును, నిజకాంతివిశేషాధరీకృత
ప్రవాళంబగు నధరప్రవాళంబును, ముక్తాఫలసదృశదంతరేఖా
విలాసంబును, కనకచంపకప్రసూనసమాననాసికయును, గరుణా
రసతరంగితారుణారవిందసుందరవిపులాయతనేత్రంబులును,
మదనధనుర్విభ్రమభ్రూయుగళంబును, ఘుసృణితఘుసృణ
మృగమదామోదతిలకకలితంబగు నలికంబును, ఘటితాంచిత
రత్నకోటీవిరాజితంబగు కోటీరంబును, శారదేందుబింబశతకోటి
ప్రకాశనీకాశసుందరవదనారవిందంబును, వివిధదివ్యగంధమేదు
రాభిరామాంగంబును గలిగి యనవరతయౌవనంబున నివ్వటిల్లి
చక్రశంఖవరదాభయప్రశస్తహస్తంబులు విస్తరిల్ల ననేక
సహస్రకిరణతేజోవిరాజమానుండును, బరమయోగిజనభాగధే
యుండును, నప్రమేయప్రభావుండును, ననేకదివ్యనారీపరి
వృతుండును, దివ్యజనసంసేవ్యమానుండునునై దివ్యసింహాసనా
సీనుండై యున్న యప్పరమేశ్వరు వామాంకతలంబునందు.

155


సీ.

తరుణాబ్జపదతల వరవజ్రనఖయుత
        కనకకాహళజంఘ కరికరోరు
కుంభికుంభస్థలశుంభన్నితంబ స
        ద్వినుతవళిత్రయతనువిలగ్న
శ్యామకోమలతనురోమరాజీరమ్య
       కమలకోకస్తన కంబుకంఠి
బిసహస్త నవకుందరదనబింబాధర
       తిలపుష్పనాసిక లలితపాండు

తే.

గండమండితశ్రీకారకర్ణయుగళ
కమలదళనేత్ర చంద్రరేఖాలలాట
నీలకచఖారసౌభాగ్య నిత్యలక్ష్మి
యౌవనోల్లాససంప్రాప్తి నంద మొంది.

156


వ.

దివ్యప్రభాపటలదేదీప్యమాననూపురకాంచీహారగ్రైవేయకేయూర
కటకాంగుళీయకముక్తాఫలతాటంకావతంసాద్యనేకభూషణ
భూషితయును, దివ్యాంబరధారిణియును, మందారకుందకేతకీ
విలసితధమ్మిల్లయు, దివ్యచందనానులేపితాంగియును, కనక
విద్యుల్లతాప్రతిమానశరీరయష్టియునునై పాణిచతుష్టయంబు
నందు నూర్ధ్వబాహుయుగళంబునఁ గనకకమలంబులును నొక్క
కరంబున నొక్కకలధౌతఫలపూరంబును నభయహస్తం బొక్కటి
యునుంగాఁ గలిగి యుత్పత్తిస్థితిలయకారణంబై యమ్మహాత్ము
డగ్గఱి సుఖాసీనయై యుండ, వెండియు వివిధదివ్యమాలాంబరా
లంకృతలై నిత్యయౌవనంబు గలిగి నీలాభూము లుభయపార్శ్వం
బుల సుఖాసీనలై యుండ నత్యంతభోగభూతిం బొంపిరివోయి
యప్పరమేశ్వరుం డ[55](మ్మహాధామంబున న)మందానందం
బున నుండు, మఱియును.

157


సీ.

అమ్మహావీథియం దష్టదళంబులు
        విమలాదిశక్తులు వెలయుచుందు
రమరేంద్రుదిశ నుండ్రు విమలయుత్కర్షణి
       ప్రజ్ఞాక్రియాయోగప్రహ్విసత్య
యీశాన యనుపేళ్ల నెనిమిదిదిక్కుల
      రమణతో వింజామరంబు లిడుచు
న ద్దేవు సేవింతు రంతఃపురాంగన
      లేవురు విమలపూర్ణేందుముఖులు

తే.

కమలలాంఛనహస్తలై కమలనేత్రుఁ
గొలిచియుండుదు రెప్పుడు కొమరు మిగిలి
విహగనాయకశేషాహివిబుధవరులు
నిత్యముక్తులు గొలుతురు నియమ మెసఁగ.

158


ఆ.

అఖిలభోగలీల ననవరతంబును
గనులతోడఁ గూడి కంజనయనుఁ
డతివిశాలరమ్యమైన సింహాసనం
బునను వెలుఁగుచుండు వనజనయన!

159


క.

అని చెప్పి గిరితనూజకు
మనసిజహరుఁ డనియె నిట్లు మఱియును దద్వ్యూ
హనిరూఢిభేదముల న
య్యనుపమలోకములు విను నగాధిపతనయా!

160

విష్ణులోకావరణభేదనిరూపణము :

వ.

అఖిలవైభవారూఢం బగు నప్పరమపదంబునకుఁ బ్రథమావర
ణంబునందుఁ బూర్వభాగంబున వాసుదేవమందిరంబును నాగ్నే
యంబున లక్ష్మీలోకంబును యామ్యంబున సంకర్షణనివాసంబును
నైరృతంబున సరస్వతీస్థానంబును పడమట ప్రద్యుమ్న
సదనంబును (వాయవ్యంబున రతిసద్మంబును) నుత్తరం
బున ననిరుద్దగేహంబును నీశానభాగంబున నుషాసౌధంబును
గలిగియుండు. ద్వితీయావరణంబున [56]కేశవాదిచతుర్వింశతి
లోకంబులును, తృతీయావరణంబున మత్స్యకూర్మాద్యవతారంబు
లును, చతుర్థావరణంబున సత్యాచ్యుతానంతవిష్వక్సేనదుర్గా
గణపతిశంఖ[57]పద్మవిధిలోకంబులును, పంచమావరణంబున
ఋగ్యజుస్సామాధర్వణంబులును సావిత్రియు విహగేంద్రుండును
ధర్మంబులు వాఙ్మయములును, షష్ఠావరణంబున శంఖచక్రగదా
పద్మఖడ్గశార్జ్గహలముసలాద్యనేకాయుధంబులును మంత్రాక్షరం

బులును, సప్తమావరణంబున నింద్రాగ్నియమనిరృతివరుణ
వాయుకుబేరేశానాదులును, అష్టమావరణంబున సాధ్యమరు
ద్విశ్వేదేవతాగణంబులు గలవు. నిత్యు లందు విహరింతురు. తక్కిన
దేవతలు ప్రాకృతకాలంబున నిత్యులై నాకసుఖం బనుభవింతురు
గాని యిందుఁ బొందనేర రట్లు గావున.

161


మత్త.

నిత్యముక్తులు విష్ణుభక్తులు నిర్మలాత్ములు భోగసాం
గత్యులు న్వనితాజనంబులు గారవంబునఁ గొల్వఁగా
నత్యుదాత్తావిలాసలీలల నచ్యుతుండు మునీంద్రసం
స్తుత్యుఁడై చెలువొందు నిందిరతోడఁ దత్పుర మేలుచున్.

162


శా.

వేదంబుల్ పఠియించి యాగవితతుల్ విఖ్యాతిగాఁ జేసి యో
గాదిజ్ఞానవివేకియై సకలదానారూఢుఁడై [58]సర్వవి
ద్యాదక్షుండగునేనియున్ ద్వయసుమంత్రజ్ఞాని గాకున్న ద్వై
పాద్యైశ్వర్యపదంబు వేఱొకగతిం బ్రాపింపఁగా నేర్చునే.

163


ఆ.

అని శివుండు గిరిజ కానతి యిచ్చిన
విష్ణులోకమహిమ విని మనమున
విస్మయంబుఁ బొంది వినతయై యటమీఁది
కథ వినంగ వేడ్క గలదు నాకు.

164


వ.

అత్తెఱం గెఱింగింపు మని యడుగుటయు.

165


శా.

విద్వత్సంస్తుతవాగ్విలాస! త్రిజగద్విఖ్యాతచారిత్ర! రా
గద్వేషాదివికారదూర! రమణీకందర్ప! శ్రీవిష్ణుపా
దద్వంద్వస్థితహృత్సరోరుహ! మహాదానైకరాధేయ! స
ప్తద్వీపార్ణవచక్రవాళగిరిభాస్వద్వర్తికీర్తిప్రియా!

166


క.

చండరిపుమండలేశ్వర
దండాధిప[59]కమలషండదారుణమదవే
దండ! నృపనీతిమండన!
పండితహృత్పుండరీక పంకరుహాప్తా!

167

మాలిని.

హరిచరణసరోజధ్యానసంసక్తచేత
స్సరసిజ! సురభూజస్ఫారదానైకశీలా!
ఖరకరనిభతేజా! గౌరమాంబాతనూజా!
కరిరిపుసమశౌర్యా! కందనామాత్యవర్యా!

168


గద్య.

ఇది శ్రీనరసింహవరప్రసాదలబ్ధకవితావిలాస భారద్వాజగోత్ర
పవిత్రాయ్యలామాత్యపుత్త్ర సరసగుణధుర్య సింగనార్య ప్రణీతం
బైన పద్మపురాణోత్తరఖండంబునందు ద్వయమంత్రప్రభావం
బును, సుదర్శనధారణమహత్త్వంబును, ఊర్ధ్వపుండ్రధారణం
బును, శ్రీమదష్టాక్షరమంత్రప్రభావంబును, లక్ష్మీస్తవంబును,
మూలప్రకృతిస్వరూపంబును, త్రిపాద్విభూతిమహత్త్వంబును,
వైకుంఠపురమహత్త్వంబును, నారాయణదివ్యస్వరూపంబును,
విష్ణులోకావరణంబును నన్నది పంచమాశ్వాసము.


  1. విన్నవించితి (ము)
  2. పనుపంగ (తి-హై)
  3. జాతిధర్మంబులు సర్వంబులును నిత్య (హై)
  4. నతిశయంబగు (ము)
  5. ధర్మం (ము)
  6. అధికధర్మ (ము)
  7. మంత్రవిదులు (మ-తి-హై)
  8. వ్యాప్యవ్యాపక (ము)
  9. వ్రతి (ము)
  10. ప్రవరులైనను నాదుభక్తి గలిగి (హై)
  11. మోదగిల్లిరేని ముఖ్యులు వార లీ (హై)
  12. దృప్తజంతులైన (హై)
  13. తే. శాంతమానసుడై తన్ను సంతతమును
    తగిలి యెల్లప్పుడును మది దలచెనేని
    వారికెల్లను మోక్షము వరుసనిత్తు
    నమ్మ నేర్చిత యేనియు నలినగర్భ (హై)
  14. జూడవలయు (ము)
  15. అని చెప్పి నారదుండు (ము)
  16. నిలయు (తి-హై)
  17. విధుల (ము)
  18. గావే తలఁపన్ (ము-యతిభంగము)
  19. పూనిన (ము)
  20. ద్విజులకు (ము)
  21. రీక్రియము (ము-యతిభంగము)
  22. శ్రుతులఁ జెప్ప (ము)
  23. ధన్యుని గతికిన్ (ము)
  24. పాలఁ, బడుట నిక్క (ము)
  25. సుప్రసన్నకరము (ము-గణభంగము)
  26. హ్రస్వదంబును (ము)
  27. నాసికాకేశాంతంబు (ము)
  28. బాహుమూలమం, దలపడ (ము)
  29. గండ (ము)
  30. నదియు (హై)
  31. ప్రణవనై సర్గిక (ము)
  32. శుభదంబును (ము)
  33. సాకారంబు (ము)
  34. ధర్మంబు (ము)
  35. నాక్యంబున (ము)
  36. జరుండు (ము)
  37. యద్దేవి (ము-యతిభంగము)
  38. యుండి యందు (తి)
  39. సర్వజగముల విహరించు (తి-హై)
  40. తన (ము)
  41. వర్తింపన్ (ము)
  42. అధికపాఠము (మ-తి-హై)
  43. శక్తి సహజసమేతుండు (ము)
  44. వాదముగ (ము)
  45. ద్వాదశమాసంబులు సంవత్సరంబగు (ము)
  46. డిందఁ (తి-హై)
  47. శాశ్వతపదంబు (మ-తి-హై)
  48. సత్యం బనంతంబు పరమంబు (మ-తి-హై)
  49. పావక (హై)
  50. నరిగినవారలు, మగిడి రా రెన్నఁడు (ము-యతిభంగము)
  51. భాగ్యచిత్తులై (ము)
  52. మంచి (హై), నెచట (తి)
  53. ఫలితమై (ము)
  54. శంఖ (ము)
  55. అధికపాఠము (హై)
  56. మత్స్యలోకంబును (ము)
  57. పద్మాదిలోకంబులును (ము)
  58. తత్త్వ (తి-హై)
  59. విమల (ము)