పద్మపురాణము
ఉత్తరఖండము - చతుర్థాశ్వాసము
క. |
శ్రీనారాయణచరణ
ధ్యానాంతఃకరణ! సకలధర్మాచరణా!
భానుసుతసదృశవితరణ!
మానితగుణధామ! కందమంత్రిలలామా!
| 1
|
వ. |
పరమయోగవిద్యాగరిష్ఠుండగు వసిష్ఠుండు దిలీపున కిట్లనియె. అ
ట్ల డిగిన వేదనిధిం గనుంగొని రోమశమహామునీంద్రుండు దత్తావ
ధానుండవై వినుమని యిట్లనియె.
| 2
|
క. |
ఈక్షితి సరస్వతీనది
కక్షీణోదయనివాసమై సంతతమున్
వీక్షింప నొప్పుచుండును
యక్షప్రస్రవణ మనఁగ నచలం బనఘా!
| 3
|
వ. |
అప్పర్వతంబు సమీపంబున సాలరసాలతాల తమాల హింతాల సం
తానక పాటల నింబ జంబీర జాంబూ కదంబ బిల్వ చిరిబిల్వ వకుళ
తిలక తిందుక మాకంద పిచుమంద బదరి కాశ్వత్థ కపిత్థ ప్లక్షశిరీష
ఖర్జూరార్జున కేతక క్రముక పారిభద్ర తక్కోలనారికేళ [1]తాళికాది
మహీజరాజవిరాజితంబును, మధురమల్లికాకుందవనమాలికా
మాధవీపుష్పలతాకుంజరంజితంబును, వికచకమలకల్హారపరిమళ
మిళితసరోవరపరికలితంబును, నానాద్విజగణసంసేవితంబును,
కిసలయరసోత్కంఠకలకంఠకూజితముఖరితంబును, మధుర
ఫలరసాస్వాదమోదమానరసికరాజకీరవాచాలంబును, ప్రత్యగ్ర
ప్రసూననిర్యన్మకరందమత్తపుష్పంధయగణఝంకారసంకులం
బును, మునికుమారనిరంతరాధ్యయనబధిరీకృతదిగంతరంబును
నైన యొక్కపుణ్యాశ్రమంబు చైత్రరథనందనవనంబుల నతిశ
యించి నిరుపద్రవంబై యుండు నెప్పుడు.
| 4
|
క. |
అందు సుమిత్రుండను ముని
నందనుఁ డత్యంతశుచిసనాతనమతి గో
విందపదపద్మసేవా
నందితమానసుఁడు సజ్జనస్తుతుఁ డెలమిన్.
| 5
|
వ. |
దేవద్యుతి నామంబు గలిగి వర్తించుచుండె నమ్మహాత్ముండు.
| 6
|
సీ. |
దావపావకతీవ్రతరమైన వేసవి
రమణఁ బంచాగ్నిమధ్యమున నిల్చి
నీలనీరద[2]గణాభీలకాలంబున
నెఱయ వృక్షంబులనీడ నిల్చి
[3]హిమవాతదారుణహేమంతదినముల
నిష్ఠఁ బుక్కిటిబంటి నీరనుండి
పవనాంబుఫలమూలపల్లవాహారుఁడై
దినదినం బాఁకలి దీర్చికొనుచు
|
|
తే. |
విష్ణుపూజాసమేతుఁడై విపులనియతిఁ
బితృసమర్చనతర్పణవితతి సల్పి
తగిలి చాంద్రాయణాదివర్తనలఁ దపము
సేయుచును బుచ్చెఁ గాలంబు శిష్టనుతుఁడు.
| 7
|
ఆ. |
వేదవేత్త యయిన విప్రుఁ డిబ్భంగుల
వ్రతము సలుపఁ జలుప వాని దేహ
మస్థిచయము దక్క నబ్భంగిఁ బదివేలు
వత్సరములు చనియె వరమునీంద్ర!
| 8
|
చ. |
అతని తపఃప్రభావజసమంచితతేజము పేర్చి విష్టప
త్రితయమున న్వెలింగి కడుదీప్తి వహింపఁగ భూతకోటి య
ద్భుతము వహింప వహ్నియునుబోలె వెలింగెడు నమ్మునీద్రుంనిన్
సతతముఁ జూచి దేవమునిసంఘము [4]లెంతయు భీతిఁ బొందఁగన్.
| 9
|
దేవద్యుతికిఁ బుండరీకాక్షుండు ప్రత్యక్షం బగుట :
వ. |
ఇవ్విధంబున నధికశాంతచిత్తుఁడై తపంబు సేయుచు, నిత్యం
బును వికచసుగంధికుసుమంబుల శ్రీమన్నారాయణుం బూజిం
చుచుఁ బురుషసూక్తవిధానంబున షోడశోపచారంబుల నర్చిం
చుచు[5]నప్పరమవైష్ణవుం డొక్కనాఁడు వై శాఖశుద్ధైకాదశియందు
నియమాచారుండై వేదోక్తంబైన వైచిత్రస్తవంబుఁ బఠియించు
చున్నంత.
| 10
|
చ. |
సరసిజచక్రఖడ్గఘనశంఖము లొక్కట నాల్గుచేతులన్
బరువడిఁ గ్రాల నీలతనుభాసురకాంతి వెలుంగ లీలమై
నురమున లక్ష్మి పెంపొలయ [6]నుత్తమరత్నవిభూషితాంగుఁడై
హరి వెస నేగుదెంచె విహగాధిపు నెక్కి మునీంద్రు పాలికిన్.
| 11
|
వ. |
ఇట్లు ప్రత్యక్షంబైన [7]పద్మాయతేక్షణు నిరీక్షించి యవ్విప్రుండు
సమ్మదాశ్రుకణకలితలోచనుండును బులకితశరీరుండును నై
సాష్టాంగదండప్రణామంబు లాచరించి లేచి నిలిచి నిటలతటఘటి
తాంజలియై యానందరసప్రవాహంబునం దేలి తన్నుం దా
నెఱుంగక యాడుచున్న నద్దేవుండు డాయం జనుదెంచి కరుణార్ద్ర
కటాక్షంబుల [8]నీక్షించి దరహసితవదనుం డగుచు గంభీరమధుర
వాక్యంబుల నతని కిట్లనియె.
| 12
|
సీ. |
దేవద్యుతిద్విజ ధీయుక్తసన్యస్త
కర్మబంధుండవై పేర్మితోడ
మన్మనస్కుండవై మదుపాశ్రయమున నన్
గొలిచితి గావున నలఘుచరిత !
|
|
|
మద్భక్తుఁగా నిన్ను మన్నింప వచ్చితి
భవదీయసన్నుతి ఫణితికేను
మెచ్చితి వరము నీ కిచ్చెద వేఁడు నా
నత్తపోనిధి ముదితాత్ముఁ డగుచు
|
|
తే. |
దేవ! పరమాత్మ! గోవింద! దేవదేవ!
జలజనిభకాయ! యుత్ఫుల్లజలజనేత్ర!
బ్రహ్మరుద్రాదులకుఁ గానఁబడని నిన్నుఁ
గంటిఁ గాలంబు కడఁగంటి మంటిఁ గృష్ణ!
| 13
|
వ. |
దేవా! మోహమూలకంబగు నహంకార[9]మమకారంబులకు హేతు
కంబులైన కర్మంబులు భవద్దర్శనమాత్రంబున భస్మంబులయ్యెం;
గృతార్థుండనైతి; నింతకంటె నభీష్టం బెయ్యది యని [10]పలికి
మఱియును.
| 14
|
క. |
నా మనమున నీ యడుగులు
నేమంబునఁ గొల్చునట్టి నిశ్చలభక్తిన్
శ్రీ మిగుల నిమ్ము నా కిది
కామించిన యట్టి వరము కరుణాభరణా!
| 15
|
చ. |
అనవుడు విప్రుఁ జూచి కమలాధిపుఁ డిట్ల ను నీవు గోరిన
ట్లనయము నీకుఁ గావుత మహాత్మ! ప్రసన్నుఁడనైతి నీ తపం
బున కొకయంతరాయమును బొందకయుండెడు; భక్తితోడ నీ
యొనరిచినట్టి సన్నుతి మహోత్తమసంస్తవనీయ [11]మెయ్యెడన్.
| 16
|
వ. |
కావున నీస్తోత్రంబు పఠియించినవారికిం బరమజ్ఞానోదయంబును
సకలధర్మఫలంబును సంతానాభివృద్ధియును బరమభక్తియు
సిద్ధించుం గావుతమని వరంబిచ్చి యచ్యుతుం డంతర్హితుండయ్యె;
నది యాదిగా దేవద్యుతి నారాయణభక్తితత్పరుం డయ్యెనని
రోమశుండు చెప్పిన విని యచ్చెరువంది వేదనిధి యిట్ల నియె.
| 17
|
రోమశుండు వేదనిధికి యోగసారస్తోత్రంబు సెప్పుట :
సీ. |
విష్ణుసంబంధమై వెలసిన యీ కథ
గంగాప్రవాహంబు గతి [12]వచింప
విని కృతార్థుఁడ నైతి వెండియు; విను వేడ్క
మిగుల నచ్యుతుఁ డాత్మ మెచ్చునట్టి
దేవద్యుతిస్తోత్ర మే విధం బది నాకు
నానతీవలయు సౌహార్దలీలఁ;
బుణ్యాత్మసంగమంబున నెట్టివారును
బుణ్యాత్ము లనుమాట పొల్లుగాదు
|
|
ఆ. |
సత్యనిరతి నీదు సద్గోష్ఠి నీ పుణ్య
కథలు వినఁగ నేఁడు గలిగె నాకు
ననిన నా స్తవంబు వినుము చెప్పెద నని
ప్రేమ మెసఁగఁ జెప్పె రోమశుండు.
| 18
|
వ. |
ఇమ్మహాస్తవంబు తొల్లి వైనతేయుం డధిగమించె; నమ్మహాత్ము
వలన నే నభ్యసించితి; నధ్యాత్మగర్భసారంబును నఖిలసుఖాస్ప
దంబును నఖిలపాపహరంబును నగు నిది యెట్టి దనిన.
| 19
|
తే. |
వాసుదేవ! మురాంతక! వనజనాభ!
భక్తవత్సల! కృష్ణ! కృపాసముద్ర!
హరి! జగన్మయ! కేశవ! పరమపురుష!
నీకు మ్రొక్కెదఁ గరుణింపు లోకవినుత!
| 20
|
సీ. |
స్తోతయు నీవ సంస్తుత్యుండవును నివ
శ్రుతియును నీవ విశ్రుతము గాఁగ
వెలయు సర్వంబును విష్ణుమయం బను
వచనంబు గల్గుట వనజనాభ!
|
|
|
నిగమము లెల్ల నీ నిశ్వాసములు గాన
నేది భవత్ప్రీతిహేతు వరయ
నటుగాన నెబ్భంగి నభినుతిసేయుదు
భక్తిభావంబునఁ బద్మనాభ!
|
|
ఆ. |
యధికభక్తిఁ గోరి యాత్మలో వర్ణింప
నుత్సహించినాఁడ నుచితవృత్తిఁ
భక్తిమంతుఁ డెట్లు పలికినఁ దప్పుగా
నవధరింప వలవ దంబుజాక్ష!
| 21
|
క. |
వేదము నిను వినుతింపఁగ
లేదఁట; వాఙ్మానసములు లేవఁట పొగడం;
గాదనక యెట్టు వొగడెద;
నాదరమున నన్నుఁ బ్రోవు మంబుజనాభా!
| 22
|
ఉ. |
బ్రహ్మ యనంగ నిజ్జగము పన్నుగఁ బుట్టు వొనర్తు శుద్ధస
ద్భ్రహ్మ [13]నివాసభూతమగు బ్రహ్మము నారయ నీవె కావునన్
బ్రహ్మకు బ్రహ్మవైన నినుఁ బ్రస్తుతి చేసెద నన్నుఁ బ్రోవు మీ
బ్రహ్మ పురోగమామరవరస్తుతవర్తన! పుణ్యకీర్తనా!
| 23
|
ఆ. |
నీవు నిద్రవొంద నిఖిలంబు నిద్రించు
నీవు మేలుకొనిన నిఖిలమెల్ల
దెలివిఁ బొందుఁ గానఁ దలపంగ నింతకుఁ
గారణంబు నీవ కమలనాభ!
| 24
|
ఉత్సాహ. |
దేహసంగతుండవయ్యు దేహదోష మేమియున్
దేహమందుఁ బొంద వీవు దేవవంద్యపాద! సం
దేహ మింతలేదు చూడ దేవ! జీవకోటి కు
త్సాహమున్ సృజించియుండి తనరు దాత్మమూర్తివై.
| 25
|
ఆ. |
పరమతత్త్వవిదులు పరతత్త్వ మీవని
యాత్మఁ దలఁపు [14]చునికి ననుదినంబు
నిర్మలస్వరూప! నిఖిలాండనాయక!
సత్త్వగుణగరిష్ఠ! జలజనేత్ర!
| 26
|
తే. |
హరిహరాంబుజభవులు నా నలరు దీవ
[15]పుత్త్రమిత్రాదిమూర్తులఁ బొందు వీవ
యొక్కఁడవె పెక్కురూపులై యునికిఁ దలఁప
మూఢజనకల్పితము గాదు రూఢచరిత!
| 27
|
క. |
[16]గణనీయచరిత! సాత్త్విక
గుణసాగర! శ్రీసమేత! గొనకొని నిను ని
ర్గుణమూర్తిగాఁ దలంతురు
ప్రణుత జగద్రక్ష! కృష్ణ! పంకజనయనా!
| 28
|
తే. |
శుద్ధబుద్ధాత్మ! యత్యంతసుప్రసన్న!
సర్వతత్త్వజ్ఞ! శాశ్వత! సర్వసులభ!
సర్వభూతేశ! చిన్మయ! [17]సత్త్వసార!
నిన్ను భజియింతు నే ప్రొద్దు నియమ మెసఁగ.
| 29
|
క. |
ప్రియముననైనను నిను న
ప్రియమునైనను జెలంగి పేర్కొనువారిన్
బ్రియబంధుఁడవై నీ న
వ్యయపదముల నిలుపుచుండు దంబుజనాభా!
| 30
|
సీ. |
నీ నామ జలదంబు [18]నీట దేలక మోహ
చటులానల మ్మెట్లు చల్లనాఱుఁ?
దనరు నీ నామౌషధమ్ము సేవింపక
దురితరోగము లెట్లు తొలఁగిపోవుఁ?
బొలుపార నీ భక్తిపోతంబు లేకున్న
నే రీతి భవవార్ధి నీఁదవచ్చుఁ?
జెలఁగి నీ పాదాబ్జముల [19]చొప్పుఁ దలఁపక
కైవల్యగతి యెట్లు గానవచ్చు?
|
|
తే. |
వెలయ నీ దానవరుల సేవింపకున్న
జన్మసంసారదుఃఖంబు సడలు టెట్లు?
గాన నే నిన్నెకాని యొక్కరు నెఱుంగ
సర్వధర్మంబులును నీవ జలజనేత్ర!
| 31
|
తరల. |
నినుఁ దలంచిన దోషసంఘమ నీఱగున్; నరకాపదల్
మొనయ నేరవు; [20]ఘోరదుఃఖసమూహముల్ దలచూప లే;
వనయముం బరలోకసౌఖ్యము లందుచుండెడు వేడుకన్
వనజలోచన! కృష్ణ! వాసవవంద్య! నిన్ భజియించెదన్.
| 32
|
సీ. |
భూతయోగజమైన చైతన్యమని నిన్నుఁ
[21]గూర్మితోఁ జార్వాకు గొలుచు నెపుడు;
నానందసత్త్వవిధాద్వైతమగు బ్రహ్మ
మని నిన్ను నద్వైతుఁ డాశ్రయించు;
సేవ్యసేవకభావభవ్యవర్తనమున
నిను వేదవాది వర్ణించుచుండు;
పరఁగ నహింసయ పరమధర్మంబని
జైనుండు నినుఁ జేరి సన్నుతించు.
|
|
తే. |
నట్టినీయందు నాబుద్ధి యనుదినంబు
తరుణులందును రమియించు తరుణు భంగి
నలమి రమియించుచుండెడు నట్లు గాఁగ
వరముఁ గృప సేయు దేవేంద్రవంద్యచరణ!
| 33
|
క. |
జాతియు శరీరధర్మము
నాతతమగు గుణము[22]నింద్రియార్థములు నొగిన్
బాఁతిగ నెవ్వనిఁ బొంద వ
నాతురమతి నట్టి నిన్ను నభివర్ణింతున్.
| 34
|
వ. |
అని భక్తియుక్తిం బ్రశంసించు దేవద్యుతికి మెచ్చి యచ్యుతుం
డిచ్చఁ బిచ్చలించు కరుణారసంబుతోఁ బ్రత్యక్షంబై కోరిన వరం
బిచ్చె నతండును నారాయణపరాయణుండై శిష్యనివహంబుతో
నిజకృతస్తోత్రంబు పఠియించుచుఁ దపోవనంబున సుఖంబుండె
నని రోమశుం డిట్లనియె.
| 35
|
సీ. |
ఈ స్తోత్ర మతిభక్తి నెవ్వఁడు వినుచుండు
నెవ్వఁడు పఠియించు నిద్ధబుద్ధి
నతఁ డశ్వమేధసహస్రఫలం బొందు
నధ్యాత్మవిద్యామహత్త్వ మొందు
నాలుగు చదువులు నోలి ముమ్మాటును
బఠియించు నట్టి తత్ఫలముఁ జెందు
వాంచితార్థముఁ బొందు వరపుత్రపౌత్రసం
పన్నసంతానుఁడై చెన్ను మీరు
|
|
తే. |
నతులదీర్ఘాయురైశ్వర్య మతిశయింపఁ
బావసంఘాతదూరుఁడై భవ్యకీర్తిఁ
జెంది విలసిల్లు నెప్పుడు సృష్టిలోన
విష్ణుపదసౌఖ్యమును గల్గి వెలయుమీఁద.
| 36
|
వ. |
అని యి ట్లతిరహస్యంబగు [23]యోగస్తోత్రంబు రోమశుండు చెప్పిన
వేదనిధి యిట్లనియె.
| 37
|
క. |
మునినాథ! నీ ప్రసాదం
బున దేవద్యుతి రచించు పుణ్యస్తవమున్
వినఁ గంటి మంటి వెండియు
వినఁగ వలయు నతనిచరిత వినిపింపు తగన్.
| 38
|
వ. |
అమ్మహీదేవుం డేమి కతంబునం బిశాచంబునకు మోక్షం బొసంగె
నవ్విధం బానతిమ్మని యడిగిన రోమశుం డతని కిట్లనియె.
| 39
|
రోమశుండు వేదనిధికి చిత్రసేనుని చరిత్రంబు సెప్పుట :
సీ. |
చిత్రసేనుండును ధాత్రీశ్వరుఁడు తొల్లి
కలఁడు సోమాన్వయకరుఁ డతండు
ద్రవిళేశ్వరుఁడు మహోద్దామతేజోనిధి
ప్రధనశూరుఁడు శస్త్రపారగుండు
దర్పితతురగమాతంగాదిచతురంగ
బలసమేతుఁడు మహాబాహుబలుఁడు
బహువస్తుపూరితభాండాలయుఁడు రూప
ధనయౌవనంబులఁ దనరి వేడ్కఁ
|
|
తే. |
గూడి లలనాసహస్రంబు గొలిచిరాఁగ
సంతతంబును గ్రీడించు సంతసమున
రాజధర్మంబు దలఁపక రాజసమునఁ
గ్రూరవర్తనుఁడై [24]యుండి గుణము లుడిగి.
| 40
|
చ. |
సచివులు నీతి చెప్పినను సైఁపక వారి నదల్చి వై చుఁ దాఁ
బ్రచురము గాఁగ వైష్ణవుల భర్జన సేయు విరోధవర్తియై
యచలితమూర్తియైన హరి నాద్యుని నెప్పుడు నిందసేయుచున్
గుచరితుఁడై ధరిత్రిఁ బ్రజకుం గడుభీతి యొనర్చు నెప్పుడున్.
| 41
|
ఆ. |
విష్ణుఁ డెవ్వఁ డతఁడు విశ్వంబులోపల
నెచట నుండు నాతఁ డెట్టిదైన
మనుచు విష్ణునింద యనుదినంబును జేయు
నతఁడు దైవమోహితాత్ముఁ డగుచు.
| 42
|
క. |
వైదికకృత్యము లొల్లఁడు
వేదంబులు[25]తడవిరేని వేరము గొనుఁ దా
నే దానంబులుఁ జేయక
వాదడుచుచునుండు విప్రవర్గముతోడన్.
| 43
|
శా. |
పాషండాదుల[26]తోడఁ గూడుకొని పాపవ్యాప్తి గావించుచున్
వైషమ్యంబున దండనీతిపరుఁడై వైరంబునన్ భూప్రజన్
దోషాపాదనపీడ సేయుచు దయన్ దూలించి యుద్వృత్తుఁడై
రోషించున్ దగువారిఁ జూచిన మహాక్రూరైకసంచారుఁడై.
| 44
|
వ. |
ఇవ్విధంబున నాచారదూరుండును, నగ్నిహోత్రవిముఖుండును
నై [27]యకాలయముండునుంబోలె జనంబుల శిక్షించుచు బహు
కాలంబు నేలఁ బాలించి యబ్భూపాలుండు కాలగోచరుం డగుటయు.
| 45
|
ఉ. |
కాలుని కింకరుల్ వికృతకర్ములు నిష్ఠురరోషమూర్తులై
యోలి ననేకదండముల నుక్కఱ మోఁదుచుఁ జుట్టుముట్టి యా
భీలతఁ గ్రూరపాశములఁ బెంపఱఁగాఁ బెడకేలు గట్టి భూ
పాలుని నీడ్చికొంచు బహుభంగుల హుంకృతితో నదల్చుచున్.
| 46
|
వ. |
అ ట్లత్యంతదారుణంబుగాఁ భాశంబులం గట్టుకొని చిత్రసేనుం
బట్టుకొని యతికఠినవిషమోపలంబునుం బ్రచండకిరణతప్తసికతా
మయంబును దరుచ్ఛాయావివర్జితంబును నంగారనదీప్రవాహ
సంకులంబును లోహతుండవాయసాక్రాంతంబును ఘోరశునక
వృకాదిక్షుద్రజంతువ్రజదంతురంబునగు కుటిలమార్గంబున నీడ్చి
కొనుచుం జని చని.
| 47
|
క. |
[28]కింకరవర్గం బపుడు భ
యంకర మగులోకమున కహంకృతితోడన్
హుంకారగర్జనలతో
శంకింపక పట్టి తెచ్చి జముకట్టెదురన్.
| 48
|
వ. |
అమ్మనుజుని నిలువంబెట్టి యిట్లనిరి.
| 49
|
ఆ. |
ద్రవిళవిభుఁడు వీఁడె దారుణపాతకుఁ
[29]దెచ్చినార మేమి తెఱుఁగు వీని
కనిన యముఁడు చూచి యతిరోషియై వాని
వరుస నరకములను వైవుఁ డనియె.
| 50
|
చ. |
అనవుఁడుఁ గింకరప్రతతు లంతకు నానతి రాజుఁ గొంచుఁ జ
య్యనఁ జని ఘోరదుర్గతుల నప్పుడు ద్రోచి యనేకభంగులన్
మునుకొని బాధపెట్టుచును ముందటిపాపము లెన్ని తిట్టుచున్
గనుఁగొని ఘోరపాశములఁ గట్టఁగఁ గొట్టఁగ నార్తమూర్తియై.
| 51
|
వ. |
అనేకనరకానుభవంబు చేయుచుండె నవ్విధం బెట్లన్నఁ దొలుత
తామిస్రనరకంబునం బడి వెడలి యనంతరంబ మహారౌరవ రౌరవ
కాలసూత్ర తాపన సంప్రతాపన కాకోల కశ్మల పూరిత మృత్తికా
లోహసంకుల మహాభీమ దుర్దమాసిపత్రవనాది బహువిధనరకంబుల
బహుక్లేశంబుల ననేకకాలం బనుభవించి యా [30]వివిధసంతాపన
నరకంబులం దీవ్రవేదనాపీడితుండయి విష్ణుద్వేషదోషంబున
నిబ్భంగిని డెబ్బదియొక్క యుగంబులు యమబాధలం బొరలి
యచ్చోటు వెలువడి వచ్చి.
| 52
|
క. |
భూపాలుండు పిశాచం
బై పర్వతవిపినములను నత్యంతబుభు
క్షాపరవశుఁడై తిరుగుచు
నాపోవక కుంది కుంది యార్తధ్వనితోన్.
| 53
|
క. |
మిట మిటని యెండ గాయఁగఁ
దట తట మని గుండె లదరఁ దల్లడపడియాఁ
కటఁ గటకటఁ బడి తిరుగుచు
నిట నటఁ జూచుచుఁ బిశాచ మెంతయు వగలన్.
| 54
|
వ. |
ఆక్రందనంబు సేయుచు వచ్చి వచ్చి యక్షప్రస్రవణారణ్యంబు
ప్రవేశించి యం దొక్కతాడిమ్రానినీడ నిలిచి యంగలార్చుచుఁ
దనలోన నక్కటా యట్లు సర్వభూతద్రోహసంచారంబున వర్తిం
చిన నాకు నిట్టి దురవస్థ వాటిల్లె నిం కెవ్వరు ది క్కేమి గతిం జరి
యింతు నీ యాఁకటి కేమి సేయుదునని యున్నంత.
| 55
|
పిశాచరూపంబున దుఃఖించుచున్న చిత్రసేనుని దేవద్యుతి యనుగ్రహించుట :
క. |
విని యా దేవద్యుతి త
[31]న్నినాదజాతాద్భుతంబు నిర్భరమై నె
మ్మనమున నిండఁగ నచటికిఁ
జని యేడ్చుచు నున్న యప్పిశాచముఁ గనియెన్.
| 56
|
సీ. |
క్రూరాననంబును గుఱుచవెండ్రుకలును
బింగాళాక్షులును నుత్తంగనీల
తనువును నతిదీర్ఘతరపాదజంఘలు
నంటుఁబ్రక్కలును సర్వాంగకములఁ
బొడచూపునరములుఁ గడుభీకరంబగు
నప్పిశాచముఁ జూచి యాత్మలోనఁ
గరుణయు దుఃఖంబు బెరయ నమ్మునినాథుఁ
డల్లన నిట్లను నతనితోడ
|
|
తే. |
నెవ్వఁడవు నీవు[32]నీకేడ్వ నేల యిట్టి
దుఃఖకారణమేమి యీ దుష్టజన్మ
మెట్లు ప్రాపించె నింతయు నెఱుఁగఁ జెప్పు
నాకు వగవయ్యె నినుఁ జూచి భీకరాంగ!
| 58
|
చ. |
అనుడుఁ బిశాచ మిట్లనియె నమ్మునివాక్యము లాలకించి తా
వినయకృతోత్తమాంగమయి వేగమె రోదనమెల్ల మాని సం
జనితమనఃప్రమోదరససాగర ముబ్బుచు నిట్టగ్రమ్మఁగా
ననుపమసత్వసంగతనయాన్వితవాక్యవిశేషపద్ధతిన్.
| 59
|
వ. |
అయ్యా! భవద్దర్శనంబున నాచిత్తంబు సంతసంబందె మేఘంబు
చేత శైలదావదహనతాపం బాఱినట్టు లమృతసమానంబులగు
నీ వాక్యంబుల నా శరీరతాపం బణంగె నని యమ్మునీంద్రునికి
నమస్కరించి తన పూర్వజన్మప్రకారంబుఁ జెప్పి మఱియు
నిట్లనియె.
| 60
|
క. |
ఎవ్వని నామము పేర్కొని
మవ్వంబగు పుణ్యలోక[33]మందు నరుం డే
నవ్విష్ణుని దూషించిన
క్రొవ్వున దుర్గతులయందుఁ గూలితిఁ బెలుచన్.
| 61
|
తే. |
[34]అఖిలజగముల ధర్మంబు లరయు నెవ్వఁ
డొసఁగుఁ గర్మఫలంబుల నోపి యెవ్వఁ
డట్టి విష్ణుని[35]తో వైర మావహించి
యధికదుఃఖంబుఁ బొందెద ననఘచరిత!
| 62
|
సీ. |
బ్రహ్మాదిదేవతాప్రతతికి సనకాది
యతిముఖ్యులకు నెవ్వఁ డర్చనీయుఁ
డంచితవేదవేదాంతార్థములచేత
నెవ్వఁడు వినతుఁడై యెసక మెసఁగు
నాదిమధ్యాంతంబు లవి లేక యేప్రొద్దు
నెవ్వఁడు విహరించు నెల్లయెడల
నెవ్వని యురమున నిందిరాసుందరి
యింపొంది వర్తించు నెల్లనాఁడు
|
|
ఆ. |
నట్టి విష్ణుదేవు నెట్టన దూషించి
వివిధదుఃఖవహ్ని వేఁగి వేఁగి
క్షుత్పిపాస లొదవ సొగసి యిట్లేడ్చెద
నిద్ధచరిత! దీని కేది తుదయొ.
| 63
|
వ. |
ఇట్టి దోషంబున ననేకనరకంబులు డెబ్బదియొక్కయుగంబు లను
భవించితిఁ బాపశేషంబునం బిశాచంబనై సకలదిగంతంబులం
దిరిగి నాపుణ్యవశంబున నీ యాశ్రమంబునకు వచ్చి భవచ్చరణం
బులు పొడగాంచితి నిట్టి దురవస్థ దలంగు నుపాయం బానతిచ్చి
న న్నుద్ధరింపుమని దయపుట్టం[36]బలికి పిశాచంబు మఱియు
నిట్లనియె.
| 64
|
క. |
ఎక్కడ సుఖమును మరణము
నెక్కడ బంధనము సిరియు నేరికిఁ బ్రాప్తం
బక్కడకు వారి కర్మము
గ్రక్కునఁ గొనిపోవు నియతిఁ గడువఁగ వశమే.
| 65
|
చ. |
అనవుడు నప్పిశాచమున కమ్ముని యిట్లను నెట్టివారలన్
వినుము ముకుందుమాయ కడువెఱ్ఱులఁ జేయ మదాంధబుద్ధులై
యనిశము దేవదూషణము లప్పటి కేమని చేసి మీఁదటన్
ఘనతరవారకాగ్నిఁ బడి కాలుచునుండుదు రెల్లకాలమున్.
| 66
|
తే. |
సర్వభూతాంతరాత్మయు సర్వకర్మ
ఫలదుఁడును సర్వగురుఁడునై పఱఁగునట్టి
విష్ణు నిందించు దుర్మతి వేయునేల
దుర్గతులఁ బొందు నత్యంతదుఃఖి యగుచు.
| 67
|
వ. |
మఱియుం గుమార్గగమనంబును, వేదవిరుద్ధశాస్త్రశ్రవణంబును,
స్వబుద్దిరచితశాస్త్రాభ్యాసంబును, దేవబ్రాహ్మణతపోధనవేదాగ్ని
నిందలును, నారాయణదర్శనదూషణంబును నరకకారణంబు
లగుం గావున దుర్మదంబు విడువవలయునని చెప్పి యప్పిశాచంబు
నకు హితోపదేశంబు సేయంబూని దేవద్యుతి యిట్లనియె.
| 68
|
ఆ. |
విను పిశాచ! నీవు ఘనకల్మషముఁ బాసి
దివ్యతనువు దాల్చు తెఱఁగు గలదు
చేయనోపితేనిఁ జేయు ప్రయాగంబు
లోన మాఘతిథుల స్నాన మెలమి.
| 69
|
సీ. |
తనరఁ బ్రయాగ సుస్నాతుఁ డయ్యెడివాఁడు
పాపసంఘములెల్లఁ బాఱఁ దోలి
సురలోకనిలయుఁడై తిరిగి రాఁ డెన్నఁడు
నను వేదవచనంబు వినవె తొల్లి
యాగతపోదానయోగాదిఫలముల
కతిశయంబగు మోక్ష మాక్షణంబ
కలుగుఁ బ్రయాగమాఘస్నాన మొనరించు
నట్టి పుణ్యాత్ముల కనుదినంబు
|
|
తే. |
జహ్నుకన్యార్కకన్యకాసంగమంబు
సూర్యపావకవిష్ణుతేజోమయంబు
నిఖిలకల్మషనిర్ముక్త మఖిలపుణ్య
ఫలదమై యొప్పు నెప్పుడుఁ బ్రకటచరిత!
| 70
|
క. |
శరదాగమమున మలినతఁ
బొరయక వెలుఁగొందు చంద్రుపోలిక వేణీ
సరిదంబు మజ్జనంబున
నరుఁ డఘములఁ బాసి పొందు నాకసుఖంబున్.
| 71
|
తే. |
తజ్జలస్పర్శమాత్రాన ధరణిఁ దొల్లి
కేరళద్విజుఁ డఘముల గీటణంచి
ముక్తుఁడై పోయెఁ గావున మొగిఁ బ్రయాగ
మహిమ వాక్రుచ్చి చెప్ప బ్రహ్మకు వశంబె!
| 72
|
వ. |
అనిన విని పిశాచంబు తనుతాపంబు నశియించి సంతుష్టాంతరం
గంబై మునీంద్రా! కేరళవిప్రుం డెవ్విధంబునఁ బాపవిముక్తుం
డై దివ్యలోకంబు ప్రాపించెనని యడిగిన నతనికి దేవద్యుతి యి
ట్లనియె.
| 73
|
కేరళబ్రాహ్మణుని కథ దేవద్యుతి పిశాచంబునకుఁ జెప్పుట :
సీ. |
కేరళదేశీయుఁ డారూఢవేదపా
రగుఁడు ధనాఢ్యతారాజితుండు
కలఁడు విప్రుఁడు వాని కలధనంబంతయుఁ
బోరి దాయాదులు పుచ్చుకొనిన
నిర్ధనుండై బంధునికరంబు నెడఁబాసి
వడి జన్మదేశంబు విడిచిపోయి
పరదేశములవెంటఁ దిరుగుచు నొక్కఁడు
నధికచాపలమున నడవి చొచ్చి
|
|
తే. |
తీర్థమున కేగుచును డస్సి[37]తెవులు వట్టి
ఘనబుభుక్షార్తుఁడై వింధ్యకాననమున
నరయు వారలు లేక కూ డబ్బ కునికిఁ
జచ్చె నట్టిట్టు వోలేక ముచ్చ ముణిఁగి.
| 74
|
వ. |
ఇట్లు కేరళవిప్రుండు దహనాదిపారలౌకికక్రియారహితత్వంబు
నం బ్రేతంబై తిరుగుచు నిర్జనంబగు వింధ్యగిరిగహ్వరంబున
వసియించి దిగంబరుండును, శుష్కశరీరుండును, శీతాతప
[38]క్లిష్టుండును, జలాన్నవివర్జితుండునునై శరణంబులేక దుఃఖి
తుండై తిరుగుచుండెనని చెప్పి విప్రుండు పిశాచంబునకు వెండియు
నిట్లనియె.
| 75
|
ఆ. |
ఏమియైన దాన మిడనివారికిఁ దమ
కర్మఫలము లొందుఁ గాలగతులఁ
గడపరాదు గాన కర్మంబు గుడువక
తీఱ నేర దెట్టివారికైన.
| 76
|
సీ. |
అగ్నిముఖంబున నలమి వేల్వనివారు
హరిపూజ సేయని యట్టివారు
నాత్మవిద్యాహీను లగువారుఁ[39]గుహకులుఁ
బరపీడకులును [40]బాపవ్యసనులు
బాలవృద్ధార్తవిప్రస్త్రీల యందుల
దయలేనివారును [41]దహనవిధులుఁ
గూటసాక్షులుఁ గాలకూటదాయకులును
గ్రామయాజకులును గంటకులును
|
|
తే. |
దల్లిదండ్రులఁ బత్నులఁ[42]దనరు ప్రజల
విడిచి పోయెడువారును వేదవిక్ర
యమున మెలఁగెడువారును నశన మొరున
కమ్ముకొనియెడువారును నవని మఱియు.
| 78
|
వ. |
పరాన్నభక్షకులును, లుబ్ధులును, స్వామిపరిత్యాగులును, గో
భూమిహర్తలును, [43]రత్నదూషకులును, పుణ్యక్షేత్రంబులం బ్రతి
గ్రహించువారును, బ్రాణిహింసకులును, దేవగురునిందకులును,
సువర్ణవస్త్రతాంబూలాన్నఫలజలంబు లర్థుల కొసంగనివారును,
బ్రాహ్మణస్త్రీధనాపహారులును, ప్రేతరాక్షసపిశాచతిర్యగ్జాతు
లై పుట్టి యుభయలోకవివర్జితులునై యుండుదురు గావునఁ
జతుర్వర్ణంబులవారు నిషిద్ధకర్మంబు లుడిగి యజ్ఞదానతపస్తీర్థ
మంత్రసేవాధర్మంబు లనుష్ఠింపవలయునని పిశాచంబునకు
ధర్మోపదేశంబు చేసి దేవద్యుతి వెండియు నిట్లనియె.
| 79
|
తే. |
అట్లు ప్రేతయై తిరుగు నయ్యవనిదేవుఁ
డేమి చెప్పుదు వింధ్యమహీధరమున
ఘోరదుఃఖంబు గుడుచుచుఁ గుటిలమైన
పాపఫలమునఁ బైశాచరూప మొందె.
| 80
|
వ. |
ఇవ్విధంబున నప్పర్వతంబునందు బహుసంవత్సరంబులు గడపి
యంత నొక్కనాడు.
| 81
|
చ. |
అతులితదివ్యతేజు సుగుణాన్వితు నధ్వపరిశ్రమార్తు సం
తతబహుతీర్థపూతు సుజనప్రియభూషణు విష్ణుపూజన
వ్రతు జనసంగవర్జితు నిరంతరదుఃఖవివర్జితుం గృపా
[44]యతు నొకవిప్రునిం గనియె నగ్గిరిమార్గమునందు బోవగన్.
| 82
|
వ. |
ఇట్లు కనుంగొని డాయంబోయి యతనిభుజంబునం దున్న గంగా
జలపూరిత[45]కమండలుభారంబు పొడగాంచి మార్గంబున కడ్డంబు
వచ్చి వికృతాకారంబగు తనరూపు చూపి యప్పిశాచంబు పథికు
నకు[46]శాంతస్వరంబున నిట్లనియె.
| 83
|
క. |
అన్నన్న కుత్తు[47]కెండెడుఁ
గన్నులు మై దిమ్మ దిరిగెఁ గంఠగతంబై
యున్నది ప్రాణము నాకున్
గ్రన్నన నన్నీరు పోసి రక్షింపఁ గదే.
| 84
|
వ. |
అనుచు గద్గదకంఠంబును, గృశశరీరంబును, ధూమవర్ణంబును,
నిర్మాంసకుక్షివివరంబునునై పాదంబులు నేల మోపకయున్న
యతివికృతాకారంబగు పిశాచంబుఁ గనుంగొని యప్పథికుం
డిట్లనియె.
| 85
|
క. |
నీ వెవ్వ రివ్విధంబున
నీవనముల నేల తిరిగె దీరూపము నీ
కేవిధమున బాటిల్లెను
వేవేగమె యత్తెఱంగు వివరింపు తగన్.
| 86
|
వ. |
అట్లుంగాక ఫలపుష్పభరితతరువనంబులును, నిర్మలజలపూర్ణ
తటాకంబులునుం బెక్కులు గల యిప్పర్వతంబున నుండి క్షుత్పి
పాసల నింత డయ్య నేల యని యడిగిన నప్పిశాచం బతని
కిట్లనియె.
| 87
|
ఊ. |
కేరళదేశభూసురుఁడఁ గేవల లోభి నదత్తదానవి
స్ఫారుఁడ ధర్మహీనుఁడ గృపారహితుండఁ బరాన్నభక్షణో
దారుఁడ బాతకాఢ్యుఁడను దారుణవర్తనుఁడ న్మహోగ్రహిం
సారసికాంతరంగుఁడ నసంగతవాక్యుఁడ భక్తిహీనుఁడన్.
| 88
|
తే. |
బిచ్చమేనియు నొరులకుఁ బెట్టియెఱుఁగ
వినుము గలలోననైనను [48]వేల్పుఁ గాన
దీనులగువారిఁ బోషించు తెఱఁగుఁ దలఁప
నెన్నఁడును దేవతాసేవ యెఱుఁగ నేను.
| 89
|
వ. |
మఱియు జలపాత్ర తిలపాత్ర తాంబూలంబులు వర్షాతపనివార
ణంబులగు ఛత్రోపానద్ద్రవ్యంబులు నొసంగమియు, నతిథిసత్కా
రంబులు సేయమియు, అంధవృద్ధబాలదీనానాథులం బోషింప
మియు, [49]గోగ్రాసం బిడమియు, వ్యతీపాతసంక్రమణారుణోప
రాగంబులను యుగాదిమన్వంతరతిథులయందును బైతృకంబు
సేయమియు, కార్తికంబున దీపంబు పెట్టమియు, మాఘస్నాన
తులసీతీర్థంబునకై యగ్ని ప్రజ్వలింపంజేయమియు, జెఱలు విడి
పింపమియు, శరణు వొందినవారి రక్షింపమియు, విష్ణుదేవునిం
పూజింపమియు, నిదాఘకాలంబుల శీతజలంబులు వోయమియు,
అశ్వత్థవటాదివృక్షంబు లారోపింపమియు, కృచ్ర్ఛాతికృచ్ర్ఛ
|
|
|
పారాకచాంద్రాయణంబులు సలుపమియుం జేసి పూర్వజన్మంబు
[50]నిరర్థకం బగుట నిట్టి యంధమతిం బొంది పాపంబు [51]ననుభ
వించుచున్నవాఁడ నట్లుం గాక.
| 90
|
క. |
నిండిన చెఱువులుఁ గొలఁకులు
బండిన తరువులునుఁ బెక్కుపక్షులుగల వీ
కొండ నది నాదు చూడ్కికి
నెండినగతి [52]దోఁచుఁ బాప మేమని చెప్పన్.
| 91
|
ఆ. |
గాలి ద్రావు పాముకైవడి బ్రతుకుచు
నున్నవాఁడ భూతయోనిఁ బుట్టి
పెద్దకాలమయ్యె పెంపేది యీ పాప
మనుభవించుచుంటి ననఘచరిత!
| 92
|
తే. |
బ్రతుకు సుఖదుఃఖములును[53]లాభం బలాభ
మును నసౌఖ్యంబు మరణంబు భోగయోగ
ములు వియోగంబుఁ బుడమిలోఁ బుణ్యచరిత!
దైవహేతువులై యుండుఁ దరతరంబ.
| 93
|
ఆ. |
దైవ మిచ్చెనేనిఁ దలఁపఁ గురూపులు
[54]ననఁగ బధిరమూకులైనవారు
నింద్యవర్తనులును నిర్గతశౌర్యులు
నధికులై చరింతు రనఘచరిత!
| 94
|
ఆ. |
కన్ను గాలులేని కష్టచరిత్రులు
నడిగి కుడుచువారు ననద లగుచు
ధర నపుంసకులును దైవకృతంబున
వగల నొగులఁ గానవచ్చుఁ గాదె!
| 95
|
ఆ. |
దానవంతులైన ధన్యులఁ దత్ఫలం
బెన్నిగతులఁ బొందు నెచటనున్న
నొల్ల మనిన మాన దుఱక పాపాత్ములఁ
గీడునట్ల పొందుఁ [55]గీడుపఱచి.
| 96
|
వ. |
అట్లు గాన నిగ్గిరియం దనేకబ్రహ్మరాక్షసపిశాచంబులు దిరుగు
చుండు వానికి నొక్కొక్కయెడం గ్రాసంబు గలుగుంగాని పాపా
త్ముండనైన నాకు నాహారంబు సంభవించనేరదని చెప్పి యప్పిశా
చంబు వెండియు ని ట్లనియె.
| 97
|
ఆ. |
నీవు వెఱవవలదు నిఖిలభూతప్రేత
తతులవలన నిచట ధర్మచరిత!
విష్ణుభక్తి కలిమి వెలసిన నీ దిక్కుఁ
దేఱిచూడ వెఱచు నూఱడిల్లు.
| 98
|
వ. |
మఱియును భూతప్రేతపిశాచరాక్షసయక్షగంధర్వకృత్యా
కూశ్మాండవినాయకాదిగ్రహంబులు విష్ణుభక్తుండును శుచియు
నగు బ్రాహ్మణునిం గని దూరంబునఁ దొలంగిపోవు గ్రహనక్షత్ర
దేవత లతని రక్షింతు రట్లు గావున.
| 99
|
క. |
హరినామము నీనాలుకఁ
దిరముగ వర్తించు వేదతీర్థమయుఁడ వీ
వరయఁగ నటు గావున సు
స్థిరమతి వర్తించు మిచట ధీరవిచారా!
| 100
|
వ. |
అని చెప్పి యప్పిశాచంబు మఱియు నిట్లనియె. నాతొంటిజన్మ
ప్రకారంబు దలంచుకొని దుఃఖితుండనై తిరుగుచుండి యొక్కనాఁ
డొక్కనదీతీరంబున నొక్కసారసవాక్యంబు [56]వింటి నాట
నుండియుం గొంత యూఱడిల్లి యున్నవాఁడ నని చెప్పిన విని
విప్రుం డవ్విధం బెఱింగింపు మనిన నతం డిట్లనియె.
| 101
|
చ. |
వినుము మహీసురప్రవర! వింధ్యనగంబున [57]మూహరాఖ్యమై
చను నొకయేఱు పక్షిమృగసంఘముకెల్లను బ్రాణహేతువై
యనుపమకూలవృక్ష లతికాంచితపుష్పపరాగపుంజఫే
ననిచయరమ్యమై మునిమనఃప్రమదం బొనరించు నెప్పుడున్.
| 102
|
క. |
ఆ తటినీతటమున న
త్యాతురమతిఁ దిరిగి తిరిగి యలయికమై నే
నేతెంచుచుండ నచటికి
శీతలజల మానునట్టి చిత్తముతోడన్.
| 103
|
వ. |
ఒక్కసారసమిథునం [58]బయ్యేటిలోనికిం దిగి జలం బాని విగత
పరిశ్రాంతంబై యప్పులినతలంబున.
| 104
|
క. |
సురతశ్రమమున బెగ్గురు
లిరవుగ నొకటొకటిఁ గదిసి యిమ్ముల వామ
స్ఫురదురుపక్షాంతరముల
[59]నురములు శిరములును జేర్చి యొగి నిద్రించెన్.
| 105
|
క. |
అప్పుడు వానర మొక్కఁడు
చప్పుడు గాకుండ నల్లఁ జని సౌఖ్యమునం
దెప్పిరి నిద్రలు వోయెడి
యప్పులుఁగులఁ బట్టుకొనియె నతినిష్ఠురతన్.
| 106
|
వ. |
ఇట్లు పట్టువడిన విహంగం బగచరంబున కిట్లనియె.
| 107
|
క. |
ఓ యన్న వానరోత్తమ!
యే యపరాధమును జేయ [60]మెన్నఁడు నీకున్
[61]మాయట్టివారిఁ బొడగని
యీయెడ నీ కుచిత మగునె యిటు రోషింపన్.
| 108
|
సీ. |
పరవృత్తివిముఖుల సరసాంబుశైవాల
భక్షులఁ బరదారపరిహరణుల
నిజదారనిరతుల నిర్మలచరితుల
దుర్జనసంసర్గదూరమతుల
పరివారశూన్యుల పరిజనసేవావి
హీనుల నత్యంతహితులగుణుల
నొరుల వేఁడనివారి నుత్తమద్విజులగు
మముబోంట్లఁ గని కృప మాననేల?
|
|
ఆ. |
నిరపరాధిఁ గాన నీ కెఱింగించితి
నన్ను [62]విడువుమయ్య నగచరేంద్ర!
నీదు జన్మమెల్ల నిజముగా నెఱుఁగుదు
తెలియ[63]వలసితేనిఁ దేటపఱతు
| 109
|
చ. |
అనవుడు బెగ్గురు న్విడిచి యక్కపి యచ్చెరువంది చూచి యి
ట్లనియె మహాత్మ! నీవు మది నారయఁ బక్షివి బోధహీనతన్
వనమున సంచరిం తెఱుకవచ్చిన కారణమేమి నా పురా
తనజననంబు నీ వెటులు తప్పక కాంచితి నాకుఁ జెప్పుమా!
| 110
|
సారస వానరుల పూర్వజన్మ కథనము :
క. |
అనవుడు విహగం బగచరుఁ
గనుఁగొని వినవయ్య తొంటికథ నాపుణ్యం
బున జాతిస్మరణత్వము
[64]నను నీ గతి నెఱుకగలిగె నగచరనాథా!
| 111
|
వ. |
అత్తెఱంగు వివరించెదఁ జిత్తగింపుము.
| 112
|
సీ. |
పూర్వజన్మంబునఁ బర్వతేశ్వరనామ
విఖ్యాతివాఁడవు వింధ్యపతివి
యేను నీకులపురోహితుఁడ నుత్తమకుల
జాతుండ బహువేదశాస్త్రవిదుఁడ
నటుగాన నీజన్మ మంతయు నెఱుఁగుదు
ధరణి యేలుచు నత్యుదగ్రవృత్తి
ధనలోభమునఁ జేసి దయమాలి భూప్రజఁ
బీడించి యెంతయుఁ బేర్చి నీవు
|
|
ఆ. |
తత్పురాకృతోరుతాపానలంబుచేఁ
గులముతోడఁ గూడి పొలిసిపోయి
యమునికింకరులకు నగ్గమై బహువిధ
ఘోరబాధ నట్లు గుందికుంది.
| 113
|
వ. |
యాతనాశరీరంబు నొంది కుంభీపాకంబునం బడి యప్పటప్పటికి
దగ్ధం బగుచుం బుట్టుచు ఘోరాక్రందనంబు సేయుచు ముప్పది
వేలేండ్లు దుఃఖం బనుభవించి వెలువడియుం దొల్లి యొక్కవిప్రు
నారామంబున బదరీఫలంబులు బలాత్కారంబునం గొనుటం జేసి
యివ్విధంబున వానరంబ వైతివని చెప్పి.
| 114
|
ఆ. |
పూర్వజన్మకర్మమున విహితంబులౌ
తమ శుభాశుభములు తరుచరేంద్ర!
యనుభవింపవలయు నమరులకైనను
[65]దలఁగఁద్రోచుకొనఁగ నలవిగాదు.
| 115
|
వ. |
అనిన విని ప్లవంగంబు విహంగంబున కిట్లనియె.
| 116
|
చ. |
ఎఱుఁగుదు తథ్యమింతయు మహీసురవర్య! మతిప్రకాశతన్
గఱదలు మాని చెప్పుము ఖగత్వము నేమి నిమిత్త మొంది తీ
వెఱిఁగినచంద మె ట్లనుచు నేర్పడ వేఁడిన సారసాఢ్యుఁ డ
త్తెఱఁ గెఱిఁగించె వీనులకుఁ దియ్యమెలర్ప ననూనపద్ధతిన్.
| 117
|
సీ. |
నర్మదాతటమున నర్మిలి నీ వొక
నలినమిత్రగ్రహణంబునాఁడు
ధారుణీసురులకు దానంబు లిడుమని
నెమ్మి నాచేతికి నిష్కశతక
మిచ్చిన నేఁ బురోహితుఁడనై చనవున
మదమునఁ జేసి ధర్మంబు దప్పి
యమ్మహీసురులకు నల్పధనం బిచ్చి
యంతయుఁ గైకొంటిఁ జింతలేక
|
|
ఆ. |
యిట్లు [66]బ్రహ్మవిత్తమెల్ల విచ్ఛేదించి
పుచ్చుకొనిన యట్టి భూరిపాత
కమునఁ జేసి వడితి కాలసూత్రంబున
నందులోని దుఃఖ మవధరింపు.
| 118
|
వ. |
రక్తపల్వలంబును దుర్గంధపూయఫేనంబును క్రిమిసంకులంబు
నగు నతిఘోరనరకంబున నధోముఖుండనై నాభీపర్యంతంబు
మునింగి నిరుచ్ఛ్వాసుండనై క్రిములు దొలుచుచుండ నూర్ధ్వ
భాగంబు తీవ్రతుండంబులగు గృధ్రవాయసంబులు పొడుచు
|
|
|
చుండ నొక్కముహూర్తంబు కల్పశతంబై తోఁచునట్టివేదనం బడి
ముప్పదివేలేం డ్లానరకం బనుభవించి దైవాధీనంబున నచ్చోటు
వెలువడి సారసంబనై జన్మించితిఁ దన్మూలంబు చెప్పెద నాకర్ణిం
పుము.
| 119
|
క. |
చెలియలిగృహమున కంచము
[67]గలుషంబున నపహరించి గర్వంబున నా
చెలికాని కిడితి నాయమ
యలమటఁ ద్రెక్కొనఁగఁ బక్షి నైతి[68]నరేంద్రా !
| 120
|
క. |
ఇది నాదు భార్య మును నీ
సదనంబునఁ బళ్లెరంబు చౌర్యంబున ను
న్మదవృత్తిఁ గొనిన దోషము
గదిరిన నిటఁ బుట్టి నన్నుఁ గదిసి చరించున్.
| 121
|
వ. |
అని యిరువుర జన్మప్రకారంబునుం జెప్పి సారసంబు భావివృత్తాం
తంబు వినిపింపం దలంచి యిట్లనియె. నరేంద్రా! మన మిరువు
రము నీ యింతియును రాయంచలమై పుట్టి యటమీఁదఁ గామ
రూప[69]దేశంబునఁ [70]గుయోనులం జన్మించి మఱియును
మనుష్యులమై జన్మింపఁగలవారమని మఱియు నిట్లనియె.
| 122
|
క. |
తన తన పుణ్యము పాపము
ననుగతమై తోడునీడ యట్లై వెంటన్
జనుదేరఁగ సుఖదుఃఖము
లనుభవయోగ్యములు నరుల కవి[71]యెవ్వరికిన్.
| 123
|
క. |
ఇత్తెఱఁ గెఱిఁగియు నిశ్చల
చిత్తులు దుర్దశలచేతఁ జిక్కరు వివిధా
యత్తులు కార్యవివేకగు
ణోత్తరులై యునికిఁ జేసి యుత్తమచరితా!
| 124
|
వ. |
అట్లగుటం జేసి నీవునుం గాలంబు వేచుకొనియుండు మేను నీ
వనంబున జన్మంబు గడపెద ననిన సారసంబునకు వానరం బి
ట్లనియె.
| 125
|
తే. |
సారసోత్తమ! నీవు సుజ్ఞానబుద్దిఁ
దెలిసి నా పూర్వభవమెల్లఁ దెలియఁ జెప్పి
తట్లు గావున నా దుఃఖ మణఁగె [72]నీవు
[73]నింతియును నిచ్చ భోగింపుఁ డెలమితోడ.
| 126
|
వ. |
అని దీవించి వానరంబును సారసంబును నిజేచ్ఛం జనియె నట్టి
యెడ.
| 127
|
తే. |
ఇట్లు తమలోనఁ బలుకు కపీశపక్షి
పుణ్యసంవాదమే [74]విని బోధపుట్టి
విగతశోకుఁడ నైతి నో విప్రవర్య!
యమ్మహానదితటమున నప్పు డునికి.
| 128
|
వ. |
అని చెప్పి పిశాచంబు పథికున కిట్లనియె. నయ్యా! నా కంత
కంతకుం దప్పి గదిరెడు నీచేతి జాహ్నవీజలపానంబునం జేసి
|
|
|
నాకుం బిపాసాపహరణంబై తజ్జలప్రభావంబునం బిశాచత్వం
బుడుగు నని పలికి మఱియు నొక్కకథ చెప్పెద నాకర్ణింపుమని
యిట్లనియె.
| 129
|
సీ. |
పారియాత్రమునందు బ్రాహ్మణుం డొక్కఁడు
గ్రామ[75]యాజకుఁడు ధరామరేంద్ర!
[76]యాతతసంపూర్ణయాచకత్వంబున
బ్రహ్మరాక్షసశరీరంబు దాల్చి
యివ్వింధ్యగిరి నుండ నేను నాతండును
గూడి దుఃఖంబులు గుడుచుచుండ
నాతనినందనుఁ డతిభక్తి జాహ్నవి
కరిగి సుస్నాతుఁడై యతఁడు తండ్రి
|
|
తే. |
యస్థి యన్నదిఁ బెట్టిన యంతఁజేసి
ధన్యుఁడై బ్రహ్మరాక్షసతనువు విడిచి
మహితభాగీరథీతోయమహిమఁ జేసి
యేను జూడంగ నవ్విప్రుఁ డేగె దివికి.
| 130
|
వ. |
అట్లు గావునం బ్రత్యక్షప్రభావంబులగు గంగాజలంబులు వోసి
న న్ననుగ్రహింపుము.
| 131
|
మ. |
ప్రతితీర్థంబున[77]దానసంగ్రహముచేఁ బాపంబునుం గొట్టి త
త్ప్రతికారంబులుగాఁ దపో[78]నియమతీర్థస్నానముల్ భక్తి సు
స్థితిఁ [79]గావింపక యీపిశాచతనువుం జేకొంటి నట్లౌట నా
కతిదూరీకృతతోయ [80]భూజనుఁడనై యా పోవకే నీ యెడన్.
| 132
|
వ. |
ఇట్టి దురవస్థ లనుభవించుచు ముప్పదివేలేండ్లు [81]గోలె నున్న
వాఁడ నా తెఱంగెల్ల దాఁచక చెప్పితి జలదానంబు చేసి ప్రాణంబు
గావు మే దానంబులుం బ్రాణదానంబునకు [82]సరిగా వనిన పథి
కుండు కరుణాయత్తచిత్తుండై తన మనంబున.
| 133
|
క. |
న్యాయార్జితవిత్తంబులు
పాయక సత్పాత్రమునను బహుదానంబుల్
సేయుచు సుఖులగు ధన్యుల
కాయతమతి నిహపరంబు లఱచేతివగున్.
| 134
|
వ. |
మఱియు నుభయలోకజిగీషులగువారు గోభూహిరణ్యరత్న
ధాన్యగృహమాల్యంబులును, రథాశ్వవస్త్రవారణంబులును, సం
పూర్ణాన్నఫలజలంబులును, ఛత్రచామరాందోళికావ్యజనోపానత్త
ల్పకాసనవారాంగనా[83]మహిష్యాదులును, కన్యామంత్రవిద్యా
[84]వనంబులును, గంధకర్పూరతాంబూలంబులును దానంబు
లొసంగి యక్షయభోగలోకసౌఖ్యంబు లనుభవింతురు.
| 135
|
క. |
ఆరోగ్యాయుశ్శ్రీవి
ద్యారూఢులు దానఫలములని పురుషుఁడు పెం
పార నిడవలయుఁ జేయని
వారికి లే కునికి తథ్యవాక్యం బగుటన్.
| 136
|
వ. |
అని విచారించుచున్న పథికునకు పిశాచం బిట్లనియె.
| 137
|
సీ. |
జలదంబు దెసఁ జూచు చాతకం బెట్లట్ల
ని న్నాసపడి చూచుచున్నచోటఁ
బ్రాణరక్షణయెడ బ్రాహ్మణోత్తమ! నీవు
తడయకు మనుడు నాతఁడు మనమున
|
|
|
భృగుకచ్ఛ మనుచోటఁ బ్రీతి మత్పితరులు
వసియించియున్నారు వారికొఱకు
జలము సితాసితసంగమంబున నుండి
కొనిపోవుచున్నాఁడఁ గోర్కితోడ
|
|
తే. |
నట్టి పుణ్యాంబువులు నన్ను నడిగె నితఁడు
పోయ ననరాదు వీనికిఁ బోయరాదు
గాన సందియమయ్యె నిక్కార్య మింక
నేమి సేయుదు [85]ననుచును నిచ్చఁ దలఁచి.
| 138
|
తే. |
అశ్వమేధాదిఫలముల కధికఫలము
ప్రాణిరక్షణ మని ధాత్రిఁ బ్రకటలీల
నాగమోక్తులఁ జెప్పుదు రాదిమునులు
సకలధర్మోత్తరంబని చాటి చాటి.
| 139
|
ఉ. |
ఈ వరతీర్థపూతజల మిప్పుడు ద్రావగఁ బోసి యీతనిన్
బావనుఁ జేసి యిట్టిగతిఁ బాపెదఁ గ్రమ్మఱ గంగ కేగి పు
ణ్యావృతమైన వారిఁ బ్రియమారఁగఁ దండ్రికిఁ దెచ్చియిచ్చెదన్
భూవలయంబులో నిదియపో పరమంబగు ధర్మ మారయన్.
| 140
|
క. |
వర పురుషార్థముకంటెను
ధరలోఁ దలపోయ వేఱె ధర్మము గలదే
పరపురుషార్థము దొరకినఁ
గర మరుదుగఁ బ్రాణమిచ్చి కాచుట యరుదే.
| 141
|
తే. |
ఉదక మిచ్చిన నిప్పిశాచోపకార
మొదవుచున్నది గావున నుర్వి నాకు
నింతకంటెను మఱి పుణ్యమెద్ది[86]మున్ను
[87]గలదు గాదె దధీచి వాక్యముల సరణి.
| 142
|
క. |
తనప్రాణ మిచ్చియైనను
ఘను లెల్లప్పుడుఁ బరోపకారము సేయన్
జనుఁ బరపురుషార్థముతో
నెనయవు పదివేలక్రతువు లెవ్వియు నైనన్.
| 143
|
వ. |
అని నిశ్చయించి తనచేతి గంగాయమునాసంగమజలంబు
లతనికిం బోయుటయుఁ దజ్జలపానంబునం జేసి తృష్ణ దీర్చు
కొని యన్నీరంబు[88]శరీరంబునం జల్లుకొని యతండు తత్క్షణంబ.
| 144
|
ఉ. |
ప్రీతిఁ బిశాచ [89]రూప మఱి పెంపెసలార సురల్ నుతింపఁగా
నాతతపద్మపత్రరుచిరాయతనేత్రయుగంబుఁ దప్తహే
మాతిమనోహరాంగకము నాయతబాహులు నీలకేశసం
ఘాతముఁ జారుభూషణసుగంధిదుకూలములున్ వెలుంగఁగన్.
| 145
|
వ. |
ఇట్లు కేరళవిప్రుండు దివ్యరూపధరుండై పథికున కిట్లనియె.
| 146
|
క. |
గంగాజలము మహత్త్వము
భంగి ప్రశంసింపలేఁడు బ్రహ్మయు నని తా
నంగీకరించి యౌదల
నంగజహరుఁ డునుచుకొనఁడె యఖిలము నెఱుఁగన్.
| 147
|
క. |
తిలమాత్రమైన గంగా
జలపానము సేయునేని జనుఁ డప్పుడ యు
జ్జ్వలదివ్యదేహుఁడగు మఱిఁ
గలనైనను జొరఁడు తల్లి గర్భము నెపుడున్.
| 148
|
తే. |
జ్ఞాతిబంధులలో నొక్కజనుఁడు ప్రీతి
నిం బ్రయాగకుఁ జని తర్పణంబు సేయ
నతనిగోత్రంబువారు పాపాత్ములైన
నరక మొందక పోదురు నాకమునకు.
| 149
|
వ. |
అని చెప్పి కేరళుండు పథికున కిట్లనియె. నయ్యా నాకుఁ బరమ
పావనంబగు జాహ్నవీజలం బొసంగి పిశాచత్వంబువలన నుద్ధ
రించితివి గావున భవదీయచిత్తంబున ధర్మంబు వదలక చిర
కాలంబు సుఖియింపుమని దీవించి దివ్యవిమానారూఢుండయి
దివంబున కరిగె. విప్రుండునుం దన మనంబున నచ్చెరువందుచు
మరలి ప్రయాగకుం జని సుస్నాతుండయి తజ్జలంబులు గొని
వచ్చి తన పితరుల కిచ్చి వారల సంతుష్టులం జేసి సుఖంబుండె.
| 150
|
సీ. |
అని యిట్లు గంగామహత్త్వంబు ద్రావిడ
పతికి దేవద్యుతి యతిశయముగఁ
జెప్పిన విని యాతఁ డప్పుణ్యమూర్తికిఁ
బ్రణమిల్లి వీడ్కొని భక్తితోడఁ
దగఁ బ్రయాగకు నేగి తజ్జలస్నాతుఁడై
కల్మషపంకంబు గడిగిపుచ్చి
విను పిశాచత్వంబు విడిచి దివ్యాంగుఁడై
మానితదివ్యవిమాన మెక్కి
|
|
తే. |
సిద్ధగంధర్వకన్యలు చేరి కొలువ
దివ్యగానంబు లులియంగఁ దేజరిలుచు
నధికపుణ్యాత్ములకుఁ గాని యందరాని
దేవలోకంబునందు సుస్థితి వహించె.
| 151
|
వ. |
అని చెప్పి మఱియును రోమశుం డిట్లనియె.
| 152
|
క. |
ఈ యాఖ్యానము వినినను
[90]నాయుశ్శ్రీకీర్తు లొదవి యనివారణమై
శ్రేయోయుతులై [91]సుఖదో
పాయంబున మోక్షసిద్ధిఁ బడయుదు రెపుడున్.
| 153
|
తే. |
అట్లు గావున నిక్కన్నియలు నితండు
నీవు నేనుఁ బ్రయాగకుఁ బోవవలయు
నచట సుస్నాతులై రేని నా క్షణంబ
వీరి శాపంబు లన్నియు విడిచిపోవు.
| 154
|
క. |
నిజ[92]పుణ్య[93]మూర్తి తనువులు
భజియింతురు తత్ప్రయాగభాసురసుస్నా
నజమగు పుణ్యఫలంబున
నజహరులకు సేవనీయ మన్నది యనఘా!
| 155
|
క. |
అని రోమశముని చెప్పిన
వినుతకథామృతరసంబు వీనులనిండన్
దనివి సనఁ గ్రోలి పాతక
వనరాశిఁ దరించునట్టి వాంఛ యెలర్పన్.
| 156
|
వేదనిధి పుత్త్రుని గంధర్వకన్యలను రోమశుండు ప్రయాగస్నానంబునఁ బునీతులం జేయుట :
వ. |
అప్పుడు వేదనిధి యక్కన్నియలం దన పుత్త్రుని నచ్చోటఁ
దీర్థస్నానంబు [94]సేయింప రోమశసహితుండై గగనగమనంబు
నం బ్రయాగకుం జనుదెంచినఁ దత్తీరంబున నిల్చి పుణ్యస్థలం
బులు చూపుచు రోమశుండు వేదనిధి కిట్లనియె.
| 157
|
సీ. |
ఈ వేదిమీఁద వాణీశుండు యజమానుఁ
డై తొల్లి యాగంబుఁ బ్రీతిఁ జేసి
కరితుండసన్నిభాఖండాజ్యధారచే
విప్రు లేప్రొద్దును వేల్చుచుండ
|
|
|
నిండారు నీ మూఁడు గుండంబులందును
ద్రేతాగ్ను లెప్పుడుఁ దేజరిల్ల
నింద్రాదిదేవత లేతెంచి యజ్ఞభా
గము లొంది సోమపానములు సేయఁ
|
|
ఆ. |
గేల శూల మమర ఫాలనేత్రాంశులు
దిక్కులెల్ల నిండ నక్కజముగ
నద్రిజాధినాథుఁ డావిర్భవము నొందె
నింద్రసేవ్యుఁ డగుచు నిచటఁ దొల్లి.
| 158
|
క. |
ఇది యసితతోయవేణీ
సదుపాశ్రయ వినుము దీని జలపానమునన్
ద్రిదశేంద్ర లోక[95]సఖ్యం
బొదవు నరోత్తముల కెపుడు నుత్తమచరితా!
| 159
|
సీ. |
అవిముక్తమునఁ దారకాహ్వయ సుజ్ఞాన
మునఁ గాని నరులకు ముక్తిలేదు
జ్ఞానహీనుల కైనఁ బూని సితాసిత
స్నానమాత్రమున మోక్షంబు గలుగు
సృష్ట్యాది క్రతువులు చేసి ప్రజాపతి
యిచ్చట సృజియించె నెల్ల జగము
రాజాస్యకై యీనదీజ స్నాతుఁడై
యంబుజాక్షుఁడు లక్ష్మి నధిగమించె
|
|
ఆ. |
జయము గోరి తొల్లి షణ్మాసములు శూలి
యీ జలావగాహ మెలమిఁ జేసి
తత్ప్రభావమునను దానవపురములు
కూలనేసె నొక్కకోల దొడగి.
| 160
|
ఆ. |
అమరలోక[96]హీనయై వచ్చి యూర్వశి
యిచటఁ దనువుఁ [97]దోఁచి యెలమితోడఁ
బుణ్యలోకమునకుఁ బోయె[98]నిర్దోషయై
మహితపుణ్యతీర్థమహిమఁ జేసి.
| 161
|
సీ. |
మహిఁ బుత్రకాముఁడై నహుషాఖ్యుఁ డీతీర్థ
మాడి సత్పుత్త్రు యయాతిఁ గాంచె
ధనకాంక్షియై యక్షుఁ డనుపమం బైన యీ
నదిఁ గ్రుంకి నవ[99]నిధానములు గనియె
[100]మాయాబలంబును నాయతంబుగ నొందె
నారాయణుఁడు దొల్లి; నరుఁడు గూడ
[101]నశనంబు గుడువక యైదువత్సరము లిం
దుండి మహాబలయుక్తుఁ డయ్యెఁ
|
|
తే. |
గశ్యపుఁడు దొల్లి తాను శంకరునిఁ [102]గూర్చి
తపము గావించె నా భరద్వాజుఁ డిందు
రూఢి వర్తించి క్షేత్రజ్ఞురూప మొందె
ననఘ! యిన్నదిఁ గొనియాడ నలవి యగునె.
| 162
|
వ. |
మఱియు సనకాదియోగీంద్రులు నీతీర్థస్నానఫలంబునం జేసి
యోగసిద్దులు వడసి రిందు మాఘమాసస్నానంబు జేయువారలు
నక్షత్రరూపంబులై దివంబున వెలుఁగుదు రిందు మోక్షార్థులకు
|
|
|
మోక్షంబును, గామ్యశీలురకుఁ గామితార్థంబులును, సాధకులకు
సిద్ధియును సంభవించునని చెప్పి రోమశుండు మఱియు నిట్ల
నియె.
| 163
|
సీ. |
[103]రుచిరాస్యుఁ డను ముని యచలితచిత్తుఁడై
తపము సేయంగ నాతనికి నొక్క
గంధర్వుఁ డవినయకరుఁడైన గోపించి
వాయసం బగు మని వాని నపుడు
శపియించుటకు వాఁడు సంచలించుచు మ్రొక్కి
శాపంబు పెడఁబాయుచంద మెల్ల
విని ప్రయాగస్నాన మొనరించి క్రమ్మఱఁ
దనపూర్వరూపంబుఁ దాల్చి యరిగెఁ
|
|
ఆ. |
గాన నప్పిశాచకన్యకలును నీదు
సుతుఁడు నస్మదీయసూక్తిఁ జేసి
మాఘమునఁ బ్రయాగమజ్జనం బొనరించి
శాపముక్తులగుట సత్య మనఘ!
| 164
|
క. |
అని రోమశముని చెప్పిన
యనుపమసత్యోక్తి విని మహాహ్లాదముతో
మునితనయుఁడు గన్నియలును
దనువులు పులకింప ధర్మతత్పరబుద్ధిన్.
| 165
|
వ. |
తదనుజ్ఞాతులై వారలు తదవగాహం బాచరించుటయుం దత్క్షణంబ.
| 166
|
తే. |
పరుసమునఁ బొందు లోహంపుఁబ్రతిమ లపుడు
కనకమయమయి కనుపట్టుకరణిఁ దోఁప
వీఁక నప్పుణ్యనదినీరు సోఁకఁ దడవ
దివ్యతనువులు దాల్చి రత్తెఱవ లెల్ల.
| 167
|
ఆ. |
వేదనిధిసుతుండు విద్యాపయోనిధి
కల్మషంబు వాసి కాంతిఁ దనరె
మంచు దలఁగి పోవ మార్తాండబింబంబు
వెలుఁగు నట్లు భూపకులలలామ!
| 169
|
క. |
తన పువ్వుఁదూఁపు లేనును
దనువులు ధరియించి చేరి తను గొలువంగాఁ
దనరిన మదనునికైవడి
మునితనయుఁడు నిలిచె నపుడు ముదము దలిర్పన్.
| 170
|
వ. |
అపుడు వేదనిధి పుత్రుం గనుంగొని యశ్రుకణకలితనేత్రుండును,
కంటకితతనూరుహగాత్రుండును, గద్గదకంఠుండునునై యిట్ల
నియె.
| 171
|
క. |
ఇన్నిదినంబులు నడవుల
[104]నిన్నీచపుఁదనువుఁ దాల్చి యిడుమలఁ బడఁగా
నిన్నుఁ గని పొక్కుచుండుదు
నన్నా! యిటు మరలఁ బుట్టితయ్య కుమారా!
| 172
|
క. |
అని దివ్యరూపధరుఁడగు
తనయునిఁ దగఁ గౌఁగిలించి తల మూర్కొని యా
తనిఁ దగిలి వచ్చు లలనలఁ
గని రోమశమునికి ననియెఁ గౌతుక మెసఁగన్.
| 173
|
చ. |
మునివర నీప్రభావమున మున్కొని శాపమహార్ణవంబు గ్ర
క్కునఁ దరియించి దొంటిగతిఁ గోమలరూపము లోలిఁ దాల్చి పెం
పెనయఁగ నున్న వీరలకు నెయ్యవి కృత్యము లానతిచ్చి నీ
పనిగొని ధన్యుఁ జేయుము శుభంబగు నీదగు పంపు చేసినన్.
| 174
|
క. |
అనవుడు రోమశుఁ డిట్లను
విను! నీతనయుండు విదితవేదుఁడు నియతుం
డును గావున నితనికి నీ
వనితలఁ దగఁ బెండ్లిసేయవలయుం జుమ్మీ!
| 175
|
వ. |
అని యానతిచ్చిన విని వేదనిధి యటమున్న సంతుష్టాంతరం
గులై యున్న తత్కన్యకాజననీజనకులతో విచారించి వివాహ
ముహూర్తంబు నిశ్చయించి మునిజనానుమతంబున విధ్యుక్త
ప్రకారంబుగా వివాహంబు సేయం గంధర్వకన్యకలు నమ్ముని
కుమారుండును నొండొరులచిత్తంబులు కలఁకలు దేఱి పరిపూర్ణ
మనోరథులై మనోభవుం జరితార్థుం జేయ నుమ్మలించుచు నువ్వి
ళ్లూరుచుండి రట్టియెడ.
| 176
|
తే. |
కొడుకుఁ గోడండ్రఁ దోడ్కొని కోర్కి నిగుడ
వేదనిధి రోమశుని జేరి వినయ మెసఁగ
వారి మ్రొక్కించి తా నభివందనంబు
చేసి యిట్లనె నామునిసింహుతోడ.
| 177
|
క. |
భూరిగుణాఢ్యుఁడ వగు నీ
కారుణ్యము కలిమిఁ జేసి గతకల్మషులై
వీరు సుఖోన్నతి నీపద
వారిజములు గొల్చువేడ్క వచ్చిరి గణఁకన్.
| 178
|
తే. |
నీదు సామర్థ్య మెవ్వఁడు నేర్చుఁ బొగడ
[105]నవదరింపుము నామాట లవధరించి
మమ్ము నందఱఁ గృపఁ జూడు నెమ్మితోడ
నెల్లకాలము రక్షింపు మిద్ధచరిత!
| 179
|
క. |
అనవుడు రోమశుఁ డిట్లను
మనలో నెడమడుఁగు గలదె మాటికి నీ వి
ట్లననేల మమ్ము మఱవక
యునికిది [106]సంతసముగాక యొండొక టగునే!
| 180
|
వ. |
అని పలికి వారల కనేకప్రకారంబుల నాశీర్వాదంబు లిచ్చి వీడ్కొని
రోమశుండు మేరుమహీధరంబునకుం జనియె. వేదనిధియును
సంతుష్టాంతరంగుండై తన కోడండ్రను కొడుకునుం దోడ్కొని
యలకాపురంబునకుం జనియె. గంధర్వదంపతులును తమనివా
సంబులకుం జని సుఖం బుండిరని మాఘమాసమాహాత్మ్యంబు
సవిస్తరంబుగాఁ జెప్పి దత్తాత్రేయుండు.
| 181
|
మ. |
పరమప్రీతి యొనర్చు నీకథ జగత్ప్రఖ్యాతమై [107]పూతమై
[108]దురితవ్రాతము త్రుళ్లణంచుఁ దమమున్ దూలించు నిష్టార్థముల్
కరపద్మంబున నుండఁజేయు సురలోకప్రాప్తి [109]గావించు సు
స్థిరభక్తిన్ బఠియించినన్ వినిన వాక్ఛ్రీ లిచ్చు నెల్లప్పుడున్.
| 182
|
క. |
అని కృతవీర్యాత్మజునకు
మనునిభునకు మాఘమాసమహాత్మ్యం బె
ల్లను నత్రిపుత్త్రుఁ డేర్పడ
వినిపించెను సరసవాక్యవిస్తరసరణిన్.
| 183
|
వ. |
ఇట్లు చెప్పుటయు విని కృతాంజలియై యవ్విభుండు మునీంద్రు
వీడ్కొని చని మాఘస్నానంబునుం జేసి కృతకృత్యుండునుం
జక్రవర్తియునై సకలలోకంబులు దాన యేలుచుండె. దత్తాత్రే
యుండు నిజేచ్ఛం జనియె.
| 184
|
క. |
కావున నీ మహితత్త్వం
బీ వడిగిన యర్థమెల్ల నితిహాసవిధం
బై వెలయ నీకుఁ జెప్పితి
నే విన్నవిధంబుఁ దెలియ నిద్ధచరిత్రా!
| 185
|
క. |
ఇది సర్వధర్మమూలము
మది వదలక యెఱిఁగి మాఘమాసస్నానం
బొదవఁగఁ జేయుము నీ క
భ్యుదయం బగు నాకసౌఖ్య మొందు నరేంద్రా!
| 186
|
వ. |
అని యిట్లు మాఘమాహాత్మ్యంబు సవిస్తరంబుగాఁ జెప్పిన వసిష్ఠ
మునీంద్రునకు సాష్టాంగదండనమస్కారం బాచరించి దిలీప
భూపాలుం డయ్యా! నీ ప్రసాదంబునఁ గృతార్థుండ నై తినని
కృతాంజలియై యమ్మహాత్ముని వీడ్కొని రథం బెక్కి సపరివారం
బుగా నయోధ్యానగరంబునకు వచ్చి సుదక్షిణాసహితుండై పురో
హితపురస్పరంబుగాఁ బ్రయాగకుం జని విధివంతంబుగా మాఘ
మాసంబునం బ్రతిదివసంబునుం గృతస్నానుండై విప్రవరులకు
యథోచితదానంబు లొసంగి నిత్యవ్రతంబు లాచరించి కృతకృ
త్యుండై పురంబునకుం జని సుఖంబుండె నంత నొక్కనాడు.
| 187
|
చ. |
పరమవివేకసాగరుఁడు పంకజసంభవసన్నిభుండు ధూ
మరహితవహ్నితుల్యుఁ డసమానతపోనిధి విష్ణుభక్తిత
త్పరుఁ డఘసంఘదూరుఁడు గృపారసచిత్తుఁడు దివ్యబోధసు
స్థిరుఁడగు నవ్వసిష్ఠుఁ డరుదెంచె దిలీపనృపాలుపాలికిన్.
| 188
|
తే. |
ఇట్లు వచ్చిన యమ్ముని కెదురు నడచి
భక్తిఁ బ్రణమిల్లి దోడ్తెచ్చి భద్రపీఠి
యందుఁ గూర్చుండ నియమించి యర్ఘ్యపాద్య
విధులఁ బూజించి యా రాజవిభుఁడు ప్రీతి.
| 189
|
వ. |
వెండియు నమస్కారంబు చేసి కుశలం బడిగిన యనంతరంబ
దిలీపునకు మునికుంజరుం డి ట్లనియె.
| 190
|
సీ. |
క్షేమంబె నీకు! విశిష్టధర్మంబులు
జరుగునే నీదు రాష్ట్రంబునందు
వర్ణాశ్రమంబులు వరుసలు దప్పక
వర్తించుచున్నవే వసుధనెల్ల
జనులును సంతతసంతుష్ట[110]చిత్తులే
యధ్వరకృత్యంబు లవనిసురులు
చేయుదురే శత్రుశేషంబు ధాత్రిలో
లేకుండ నరయుదే లోకు లెపుడు
|
|
తే. |
నిన్నుఁ గొనియాడ వర్తింతె నెమ్మితోడ
రాజకృత్యంబులెల్ల సంరక్షితములె
యర్థ మార్జించుచో ధర్మ మరసి నీవు
నీతి తప్పక యేప్రొద్దు నెగడుదయ్య.
| 191
|
వ. |
అనిన విని దిలీపుండు కృతాంజలియై మహాత్మా! నీప్రసాదం
బున నన్నియుం గుశలంబ భవద్దర్శనంబునఁ గృతార్థుండ నైతి
నని పలికి యమ్మహాముని వలన నత్యంతపుణ్యకథలు [111]విను
వేడ్క తన్ముఖకమలంబునం జూడ్కి నిలిపి.
| 192
|
క. |
మునినాథ! నీ యనుగ్రహ
మున మాఘవిశేషమెల్ల మును విని నీ చె
చెప్పిన భంగి నాచరించితి
ననఘా! యిఁక నెద్ది కృత్యమని యడుగుటయున్.
| 193
|
తురంగవృత్తము. |
సకలకవిజనవినుత! విలసితసౌమ్యకీర్తివిభూషణా!
ప్రకటవితరణవిభవ! సతతకృపారసాయతలోచనా!
వికచసరసిజసదృశవదన! నవీనకార్యవిశారదా!
సుకృతమయనయవినయగుణగణ! సూరిమానసరంజనా!
| 194
|
క. |
[112]మేరుమహీధర మందర
ధీరగుణాభరణ! సతతధీనుతకీర్తి
శ్రీరమణ! సూరిమందిర
దారిద్ర్యతమఃప్రదీప! దర్పకరూపా!
| 195
|
మాలిని. |
చతురగుణకలాపా! సౌమ్యసౌభాగ్యరూపా!
వితరణరవిపుత్త్రా! విప్రసంస్తోత్రపాత్రా!
మతివిజితసురేజ్యా! మాన్యలోకైకపూజ్యా!
యతులితగుణబృందా! యౌభళామాత్యకందా!
| 196
|
గద్య : |
ఇది శ్రీనృసింహవరప్రసాదలబ్ధకవితావిలాస భారద్వాజగోత్ర
పవిత్ర యయ్యలామాత్యపుత్త్ర సరసగుణధుర్య సింగనార్య
ప్రణీతం బయిన పద్మపురాణోత్తరఖండంబునందు దేవద్యుతి
తపోమాహాత్మ్యంబును, పుండరీకాక్షుం డతనికిఁ బ్రత్యక్షం బగు
టయు, యోగసారస్తోత్రకథనంబును, వీరసేనుచరిత్రంబును,
కేరళవిప్ర[113]సంవాదంబును, మర్కటసారసకథనంబును,
ప్రయాగజలపానంబును, కేరళుండు ప్రేతత్వంబువలన విముక్తుం
డయి దివ్యలోకంబునకుం జనుటయు, మాఘస్నానంబున గంధర్వ
కన్యకలును మునికుమారుండును శాపవిముక్తులయి దివ్యశరీరం
బులు దాల్చుటయు, ప్రయాగతీర్థమహిమంబు నన్నది చతుర్థా
శ్వాసము
|
|