పదబంధ పారిజాతము/జుణిగింత వెట్టు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

జుట్టుపట్లు సిగపట్లు

 • జగడములు.
 • "వాళ్లింట్లో పొద్దున్నుంచి సాయంత్రం వరకూ జుట్టుపట్లూ - సిగపట్లూ." వా.

జుట్టులు ముడిపెట్టు

 • వాళ్లకూ వీళ్లకూ తగాదాలు పెట్టి తమాషా చూచు.
 • "వాడి కా ఊళ్లో ఏం పని? వాళ్ల వీళ్ల జుట్లు ముడిపెడుతూ కడుపు నించుకొంటూ ఉంటాడు. " వా.
 • రూ. జుట్లు ముడి వేయు.

జుణిగింత వెట్టు

 • వెనుకకు లాగు. పార్వ. 4. 118.

జుణిగి పోవ నిచ్చు

 • తప్పించుకొని పోనిచ్చు, వెనుదీయు.
 • "పోకలఁ బోయినఁ బోని,మ్మీకరణిం జుణిఁగి పోవ నిత్తునె యింకన్." కళా. 2. 86.
 • "నీ మన సింక లెస్స, చూచుక మాటాడు జుణిగి పోరాదు." వర. రా. సుం. పు. 167. పంక్తి. 13.

జునుగుటీత

 • మునిగి ఈదే ఈత.

జున్నుగడ్డ

 • జున్ను పాలు కాచిన గడ్డ.

జున్ను దిన్న యొట్టియవలె

 • అపూర్వ మైన దానిని అనుభవించినవెనుక సామాన్యమైన వానిపై మనసు పో దనుపట్ల వాడేమాట.
 • తేనె తాగిన ఒంటెవలె అని వాచ్యార్థం.
 • బహుశా జున్ను (తేనె) తిన్న తర్వాత ఇక ఒంటె గడ్డీ గాదం మేయ నుంకించదేమో! ఇ దలా ఒంటె అలవాటుపై వచ్చినది.
 • "ఒరుఁ గవయదు జున్ను దిన్నయొట్టియ వోలన్." కుమా. 8. 160.

జున్నుపాలు

 • గేదె గానీ ఆవుగానీ యీనిన వెంటనే కొన్ని రోజులవరకూ వచ్చు పాలు. కాచితే యిది గడ్డ కట్టుతుంది. అందులో చక్కెరో బెల్లమో కలుపుకొని తింటారు.
 • చూ. జున్నుబాలు.

జున్నుబాలు

 • ఆవు ఈనిన తర్వాత అయిదాఱు దినముల పాలు. దీనిని కాచితే గడ్డ కడుతుంది. చక్కెరో బెల్ల మో వేసి కాచి తింటారు.
 • చూ. జున్ను పాలు.

జున్నుబిళ్ళ

 • చూ. జున్ను గడ్డ.

జున్నుబ్రాలు

 • ధాన్యవిశేషం.

జున్ను రేచిన రీతి

 • తేనెతెట్టెను కదల్చినప్పుడు తేనెటీగలు లేచినట్లుగా అనుట. జుమ్మని గుంపులు గుంపులుగా బయలు వెడలుపట్ల ఉపయోగించే సామ్యం.
 • "జున్ను రేచినరీతి సుర లెల్ల బెదరి, కన్నవా రేఁగిరి కన్న త్రోవలకు." గౌర. హరి. ప్ర. 319-320.

జుబురుకొను

 • గుబురుకొను, గుంపు గట్టు.
 • రూ. జుజురుకొను.

జుమ్మికాడు

 • విటుడు.
 • రూ. జుమ్మ కాడు.

జుఱ్ఱుపదనుగా

 • జుఱ్ఱుకొనుటకు వీ లగునట్లు ద్రవముగా.
 • "పరిపాటి మై జుఱ్ఱుపదను వండి." హర. 2. 121.

జుఱ్ఱు పదను చేయు

 • జుఱ్ఱుటకు వీ లగునట్లు ద్రవభూతముగా చేయు.
 • "చంద్రకాంతపు నీట జాలైన వెన్నెల, ముదురు వెన్నెల జుఱ్ఱు పదను చేసి." పారి. 2. 49.

జుఱ్ఱుకొను

 • జుఱ్ఱున త్రావు, చేతితో జుఱ్ఱుకొను.

జుఱ్ఱున గ్రోలు.

 • ధ్వన్యనుకరణము.
 • "పెక్కు వాసనల సొంపున నింపు జనింప జుఱ్ఱునన్, గ్రుక్కెఁడు గ్రుక్కెఁడే మధువు." కళా. 6. 128.

జులుము చేయు

 • అధికారము చేయు, పెత్తనము చేయు.

జూటకాడు

 • నేర్పరి.
 • "పందె మాడినభంగిఁ బందుల నొప్పించ, జూటకాం డ్రగునట్టివేటకాండ్రు." ద్వాద. 8. 22.

జూటాడు

 • మోసగించు. రా. వి. 3. 52.

జూటామాట

 • అబద్ధము.
 • "...జూటామాట లనుచు నెంచితిరి గదా!" శ్రవ. 2. 49.

జూటుకత్తె

 • వంచకురాలు, అబద్ధీకురాలు.

జూటుడు

 • అసత్యవాది. వేంకటేశ. 9.

జూదకత్తె

 • వంచకురాలు, జూద మాడునది.

జూదకాడు

 • జూదరి.

జూదరికత్తియ

 • జూద మాడునది. జూదరిధర్మము
 • నమ్మరానిది.
 • జూదగాని ధర్మప్రవచనము. వా డెంత చెప్పినా మోసమే చేస్తాడు. రాధి. 4. 79.

జెండా పీకుకొని పోవు

 • కాపుర మెత్తివేయు. కొత్త. 148.

జెండా పీక్కుని వెళ్లు

 • సంసారము నెత్తి వేయు.
 • "వాడు ఆ ఊళ్ళో జండా పీక్కుని వెళ్లాడు." వా.

జెట్టానజెట్లు

 • జగ జెట్లు. భార. ఉద్యో. 4. 425.

జెట్టిగవీరులు

 • జెట్టీలు, గట్టి వీరులు, మొనగాండ్లు. కుమా. 11. 151.

జెట్టివాడు

 • మల్లుడు.

జెల్లకాయ

 • చెంపకాయ, లెంపకాయ.

జెల్ల కొడితే దమ్మిడీ లేదు

 • ఏ మాత్రం డబ్బు లే దనుట.
 • "నా దగ్గర జెల్ల కొడితే దమ్మిడీ లేదు. నన్ను పట్టుకొని ఏం చేస్తావు?" వా.

జెష్టవెధవ

 • ఒక తిట్టు. దరిద్రపుగొట్టు అనుట.

జేగంట

 • 1. చేతితో కొట్టు గంట. ఒక త్రాటికి ఒక కంచు పళ్లెం వంటిది కట్టి, ఒక కఱ్ఱ సుత్తెతో దానిని కొట్టి కాలమానాన్ని తెలియజేసే వారు. అది జేగంట.
 • "మును గడియారంబునం గట్టిన పెను జేగంటరవము ఠే యనునెడ." సింహా. 2. 5.
 • 2. జయఘంట.

జేగురుపురువు

 • ఆరుద్రపురుగు.

జేగుఱించు

 • ఎఱ్ఱ నగు.

జేజే వెట్టు

 • జయజయధ్వనులు చేయు.
 • "రాజీవాక్షి కుమారుఁ గాంచె సుమనో రాజన్యమాన్యున్ జనుల్, జేజే వెట్టఁ బ్రసూనవర్ష మమరశ్రేణుల్ ప్రవర్షింపఁగన్." మను. 4. 5.

జే నెంట

 • ప్రతి జేనెడు నేలకూ (జేన+వెంట.) పండితా. ద్వితీ. పర్వ. పుట. 480.

జే పరమేశా అను

 • పారిపోవు.
 • "దు,ర్భర పాండిత్యముఁ జూచి దీనదశకున్ దాఁ బోలు నీయయ్య జే, పరమేశా! యనిపింపఁగా వలదె విప్రస్వామి నంచున్ మదిన్." నిరం. 2. 125.
 • చూ. జా పరమేశ్వరా అను. జే పెట్టు
 • స్తుతించు. ఉత్త. రా. 1. 144.

జేబుదొంగ

 • జేబులలో ఉన్న వాటిని తెలియకుండా కొట్టివేసేవాడు.
 • "పట్ణంలో జేబుదొంగ లెక్కువ. కాస్త జాగ్రత్తగా లేకపోతే జేబు ఖాళీ అవుతుంది." వా.

జేబులు కత్తిరించు

 • జేబులో ఉన్నవాటిని దొంగిలించు.

జేబులు ఖాళీ అగు

 • ఉన్న డబ్బంతా అయిపోవు.
 • "పట్ణం వెళ్లి వచ్చేసరికి జేబులు ఖాళీ అయిపోయాయి." వా.

జేబులు నింపుకొను

 • డబ్బు సంపాదించుకొను. ఆ సంపాదన అన్యాయార్జితం అన్న సూచన కూడా ఇందులో ఉంది.
 • "వా డాకంపెనీ పేరు చెప్పి జేబులు నింపుకోవడం తప్పితే చేస్తున్న పనేమిటి?" వా.

జేబులో వేసుకొను

 • వశము చేసుకొను. ఆ వశము చేసుకొనుట క్రమము కా దన్న ధ్వని గూడా యిందులో ఉంది.
 • "ఆ కుర్రాణ్ణి కాస్తా జేబులో వేసుకొని, వీడు స్వేచ్ఛగా ఆ ఆస్తి నంతా కరగ దింటున్నాడు." వా.

జేరుగళ్లు

 • కోటలో ఫిరంగులు కాల్చుటకై చేసిన కుడ్యరంధ్రములు.

జేరుబందు

 • చబుకు.

జేవుఱుగండ్లు

 • చూ. జేరుగళ్లు.

జేవుఱుజఱపు

 • చూ. జేగురుపురువు.

జేష్టరయితు

 • పెద్దరైతు. కాశీయా. 229.

జైత్రయాత్ర వెడలు

 • విజయయాత్ర వెళ్లు. దిగ్విజయానికి బయలుదేరు.

జొటజొట (వడియు)

 • ధ్వన్యనుకరణము.
 • "అగ్గి కాఁక యించుక యిడినన్, జెడుగఱ్ఱల గ్రుచ్చిన నం,జుడు మంటలఁ దగిలి నెయ్యి జొటజొట వడియున్." మను. 4. 19.

జొత్తుకొను

 • దట్ట మగు, గట్టి పడు. పద్మ. 9. 187.

జొత్తుపాప

 • నెత్తురుకందు.
 • అప్పుడే పుట్టినబిడ్డ నెత్తురు ముద్ద అనుట అలవాటు కూడ.
 • "నెత్తుటం దడిసి జొత్తుపాపలవిధంబున నొత్తొత్తుల నలసి." జైమి. 2. 75.
 • "జొత్తుపాప యనఁ బొల్పగుదేహము." సారం. 3. 115.
 • "వడిసినకన్నీరు వడియు నెత్తురులఁ, దడిసిన ఱవికలుఁ దాము చూపఱకు, జొత్తుపాపలఁబోలె శోకంబు నిగుడ." గౌర. హరి. ప్ర. 1043-1046.

జొత్తు లెగయు

 • జుట్లు రేగు.
 • "నడితలల జొత్తు లెగయ మొత్తిన..." భాస్క. అర. 2. 135.

జొత్తు వెట్టు

 • నఱకు, ఖండించు. మైరా. 1. 86.

జొన్న బడు గుడ్డియెద్దువలె

 • ముందూ వెనుకా చూడకుండా, స్వేచ్ఛగా. కుక్కు. 35.
 • చూ. గుడ్డియెద్దు చేలో బడ్డట్టు.

జొన్నలు గొన్న ఋణము

 • పోషితు డయినందువలన కలిగిన ఋణము. ఉప్పు తిన్న ఋణం వంటి మాట.
 • "కేల్గలన జొన్నలు గొన్న ఋణంబు నీఁగుదున్." కుమా. 11. 42.
 • చూ. ఉప్పు తిన్న ఋణము.

జొఱజొఱ రాలు

 • మిణుగురులు లాంటివి రాలుటలో... ధ్వన్యనుకరణము.

జొఱ్ఱీగ<.big>

 • జోఱీగ.

జోక చేయు

 • 1. సన్నద్ధము చేయు.
 • "మహారథుండు పైనంబు జోక చేసుక." వర. రా. బా. పు. 208. పంక్తి. 24.
 • 2. సాగు చేయు, బాగు చేయు.
 • "ఆ యెకరా నేలా సరిగా జోక చేసుకుంటే మా కుటుంబాని కేం ఢోకా లేదు." వా.
 • 3. పోల్చు.
 • 4. సమకూర్చు.
 • "నీ వేవిధంబున మా విత్తము జోక చేసెదవు." హరిశ్చ. 3. 30.

జోకపడు

 • జతపడు. శ. ర.

జోకపఱుచు

 • జత చేయు, కలిగించు, కావించు.

జోకలు గట్టు

 • మొత్తము లగు, గుంపు కట్టు.

జోకొట్టు

 • 1. చిన్న పిల్లలను పడుకొన బెట్టి చేతితో తడుతూ నిద్రపుచ్చు.
 • "లోకములు నిదుర వోవఁగ, జోకొట్టుచు నిదుర వోనిసుభగుఁడు రమణుల్, జోకొట్టి పాడ నిదురం, గైకొను క్రియ నూరకుండెఁ గను దెఱవకయున్." భాగ. పూ. 10. 193.
 • 2. గెలుచు. కాశీ. 7. 95.
 • 3. మోసగించు. కవిక. 4. 77.

జోగపట్టియ

 • యోగపట్టము.

జోగరగండ

 • స్త్రీపురుషులను కూర్చువాడు. చిత్తైకాగ్రతను చెఱచువాడు.

జోజో

 • జోకొట్టుటలో అనుమాట.

జోటిపని

 • మిథునకర్మ.

జోడుకోడె

 • 1. సరికోడె, జతకాడు.
 • "అమరుల బోన పుట్టిక సహస్ర మయూఖుని జోడుకోడె సం,తమసము వేరు విత్తు కుముదంబుల చక్కిలిగింత పుంశ్చలీ, సమితికిఁ జుక్కవాలు." పారి. 2. 41.
 • 2. సమానుడు.
 • అతనికి ఇతడు జోడుకోడె. బండికి కానీ, కాడికి కానీ కట్టే ఎద్దులు రెండూ సమానంగా ఉండుట పై వచ్చిన పలుకుబడి.
 • "వాళ్లిద్దరూ జోడుకోడెల్లా పోట్లాడుకొన్నారు." వా.

జోడు గట్టు

 • జతకట్టు. నిరం. 3. 20.

జోడు గూడు

 • జత కలియు.

జోడు గూర్చు

 • జత కలుపు.

జోడు దఱియు

 • కలియు.
 • "తనరు మాతంగ కుంభ సుస్తనుల జోడు, దఱియఁ జాల దురాగతత్వమునఁజేసి." హ. న. 261.

జోడుఱాలు

 • ఒక ఆట. హంస. 3. 146.

జోడు వుచ్చినవాడు

 • కవచహీనుడు.
 • "జోడు వుచ్చినవానిని గైదువుఁ బెట్టిన వానిని." భార. భీష్మ. 3. 303.

జోపాన మగు

 • అలసిపోవు.
 • "తేరుఁ ద్రిప్పెదను, జోపాన మయ్యె దేజులు." వర. రా. యు. పు. 436. పంక్తి. 10.

జోపాప లగు

 • చంటిపిల్లలవంటి వగు.
 • "గేలికి హరి వైవఁ గేలఁ దాలిచిన సం, పఁగి బంతికొనల జోపాప లగుచు." ఉ. హరి. 1. 151.

జోబిళ్లు

 • నమస్కారం. హంస. 4. 213.

జోఱీగ

 • ఒకరక మైన యీగ, పశు మక్షిక. జోఱుటీగ
 • చూ. జోఱీగ.

జోలపాట

 • పిల్ల లను ఊచుతూ పాడే పాట.

జోల పాడు

 • జోలపాట పాడు.

జోలికూడు

 • శిక్షాన్నము. పాండవో. 11.

జోలి త్రవ్వు

 • అనవసర మైన విషయాలలో జోక్యము కలిగించుకొను.
 • వాడుకలో - ఒకరి జోలి నీ కెందుకు? - వాని జోలి నీ కెందుకు? నీ సంగతి నీవు చూచుకో - వాడు ఒకరి జోలికి రాడు - అనురీతిగా వ్యవహారం. ఇది జంటపదంగా కూడా 'జోలి-శొంఠి' అని వ్యవహరిస్తారు.
 • "ఆయివారములకై డాయువారలతోడ, జోలి ద్రవ్వుచుఁ బెక్కు సుద్దు లాడు." శుక. 2. 172.
 • "అనఘ! వేశ్యావిడంబ వర్తనము లెన్న, నిసుకపాతఱ యాజోలి యేల త్రవ్వ." (తె. జా.)

జోలి యెఱిగించు

 • సంగతి చెప్పు.
 • "తొల్వేలుపు వేలిమి సెఱిచిన, జోలి యెఱింగించి." అచ్చ. యుద్ధ. 458.

జోలెకాడు

 • భిక్షకుడు.

జో సఱచు

 • జోకొట్టు, చిన్న పిల్లలను పడుకొనబెట్టి చేతితో తడుతూ నిద్రపుచ్చు.
 • "జో సఱచుచు సన్నుతిఁ బాడు." బస. 3. 59.
 • చూ. జోకొట్టు.

జోస్యము చెప్పు

 • భవిష్యత్తును జ్యోతిశ్శాస్త్ర రీత్యా చెప్పు.

జౌజవ్వు

 • ధ్వన్యనుకరణము.

జౌరుకొను

 • జవురుకొను, చేతులతో తీసుకొను.
 • రూ. జవురుకొను.

జ్ఞాతివైరము

 • దాయాదుల పగ.
 • చూ. దాయాదిపోరు.

జ్వరము కాయు

 • జ్వరము వచ్చు.
 • "రెండు రోజులుగా వాడికి జ్వరం కాస్తూ ఉంది." వా.

జ్వరము వచ్చు

 • జ్వరము కాయు.
 • "పది రోజులనుంచీ జ్వరం వస్తూ ఉంది. అందువలన ఎక్కడికీ రాలేదు." వా.

ఝంఝామారుతంగా సాగు

 • నిరర్గళంగా, జగన్మోహనంగా.
 • "వాని మాట కేం? ఝంఝూమారుతంగా సాగుతూ ఉంది." వా.

ఝణఝణత్కారము

 • ధ్వన్యనుకరణము.

ఝణఝణ మ్రోయు

 • కంకణాదుల ధ్వని చేయు.
 • ధ్వన్యనుకరణము.

ఝణత్కారము

 • ధ్వన్యనుకరణము.

ఝమ్ము ఝమ్మను

 • ధ్వన్యనుకరణము.
 • కుమా. 11. 155.

ఝల్లను

 • (ప్రాణములో, గుండెలో) దిగులుపడు.
 • ధ్వన్యనుకరణము.

ఝళంఝళ

 • ఝణఝణవంటి మాట.
 • ధ్వన్యనుకరణము.

ఝళజళ

 • ధ్వన్యనుకరణము.

ఝళఝళ

 • ధ్వన్యనుకరణము.

ఝాడించి నిలుచు

 • నిక్కబొడుచుకొను
 • "ఝాడించి నిలిచిన స్తబ్ధరోమములచే, బ్రహ్మాండములు తూంట్ల బానలుగను." రాజగో. 5. 36.

ఝాడించు

 • తిట్టు.
 • "వాడు కనిపిస్తే నాలుగు ఝాడించి పంపుదా మని ఉంది." వా.

ఝాళి సేయు

 • జాడించి వేయు. ఝాడించి అని కూడా నొక్కి చెప్పుటలో అంటారు.
 • "కడిది మావంతుని బడ ఝాళి సేసి." బస. 4. 93. పుట.

ఝోరు ఝోరున

 • ధ్వన్యనుకరణము.
 • "ఝోరుఝోరున దారుణాసార మడరె." హంస. 5. 50.

ఞ ఞ ఞ అను

 • నంగినంగిగా మాట్లాడు.
 • "అలా ఞ ఞ ఞ అంటా వేరా. అదేదో సరిగా ఏడ్చు." వా.

టంకపుపొడిలా అతుకు

 • పొందికగా కుదురు. బంగారు వెండి వస్తువులను టంకం పొడితో అతుకుట అలవాటు. దానిపై వచ్చిన పలుకుబడి.
 • "వా డేమి మాట్లాడినా టంకపు పొడిలా అతుకుతుంది." వా.

టంకముపుల్ల

 • కంచరి సాధనము.

టంకవాటు

 • అలనాటి ఒక నాణెము.

టంకసాల

 • నాణెములు ముద్రించే చోటు.

టంకసాల వాటు

 • అలనాటి బంగారునాణెము. టంగు (లు) తెగు
 • పని అయిపోవు.
 • "ఆ కొండ యెక్కే సరికి నా టంగులు తెగిపోయాయి." వా.

టంగున కొడదా మంటే దమ్మిడీ లేదు

 • బొత్తిగా డబ్బు లే దనుట.

టంగువారు

 • జీనుకు కట్టే పట్టెడ.

టకటక

 • 1. కటకట, దైన్యము. భాస్కర. 96.
 • 2. నడచుటలో ధ్వన్యనుకరణము.
 • "టాకటకా నడచి వస్తున్న ఆవి డెవరు?" వా.

టకటొంకులు

 • మోసములు. గీర. 18.
 • రూ. టకటంకులు.

టక్కరి పూటతాటలు చేయు

 • అబద్ధపుపూటలు పెట్టు.
 • "టక్కరి పూఁట తాటలు చేసి ధనము, చక్కనఁ గైకొని." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 64. 42.
 • చూ. పూటపడు.

టక్కు టమారము చేయు

 • మోసము చేయు.
 • "వా డేదో టక్కుటమారం చేసి ఒక గారమిద్దె కట్టించాడు." వా.

టక్కు పెట్టు

 • మాయ చేయు.
 • "మబ్బునఁ డక్కు పెట్టి తుచ్ఛాంగన రథ్య వేఁగ..." వేం. పంచ. 1. 246.

టక్కులాడు

 • దుర్మార్గుడు, అబద్ధీకుడు.

టముకు వేయు

 • దండోర వేయు, చాటించు.

టలాయించు

 • ఏదో ఒకటి చెప్పి తప్పించుకొను.
 • "ఇదిగో యిస్తాను అదిగో యిస్తాను అని చెప్పి నాలుగురోజులనుంచీ టలాయిస్తున్నాడు." వా.

టస్సా దించి వేయు

 • తిష్ఠ వేయు.

టకాలు తెగు

 • లా వగు.

టాటాలు గుణించు

 • కోతలు కోయు.
 • "కోటికిఁ బడగెత్తి టాటాలు గుణియింప, నే నేర్తు మఱియును నేనె నేర్తు." విప్రనా. 1. 29.
 • "....బళా మంచివాఁ,డవె పో వేఱొకచోటు గానవెకదా టాటాల్ గుణించంగ నీ...." ప్రబంధరా. 748.
 • రూ. టాటాలు గుణియించు.

టాటోటుకాడు

 • మోసగాడు. శ. ర.

టాలాటోలీమాటలు

 • మోసపు మాటలు, అబద్ధములు.
 • "వాడి వన్నీ టాలాటోలీమాటలు. వాణ్ణి నమ్మితే ముంచేస్తాడు." వా.

టింగున మీటు

 • ధ్వన్యనుకరణము.
 • దశా. 4. 119.

టింగు రంగా అని

 • స్వేచ్ఛగా, తన కేమి అన్న ధీమాతో.
 • "దిటము మదిలోన నూని యచ్చటుల నేత్ర,టింగు రంగా యటంచు నింటికిని జనియె." శ్రవ. 4. 107.

టెంకాయపాలు

 • టెంకాయనీళ్లు.

టెంకాయ పిచ్చికొండ అను

 • భయభ్రాంతుడగు. సభాకంపంతో ఒక పండితుడు రాజు దగ్గరకు టెంకాయ తీసుకొని పోయి, భయపడి మాటలు తడబడి టెంకాయ పిచ్చికొండ అన్నా డని ఒక కథ.
 • "టెంకాయ పిచ్చి కొం డనఁగవలయి." గీర. 30.

టెంకి పెట్టుకొను

 • ఉనికిపట్టు కావించుకొను
 • "వేంకటాచలంబు వంకం డెంకి వెట్టుకొని." కా. మా. 3. 46.

టెక్కులకత్తె

 • విలాసవతి. ఇందులో నిరసన కలదు.

టెక్కులాడి

 • చూ. టెక్కులకత్తె.

టెక్కులాడు

 • టెక్కులు పోవువాడు.

టెక్కులుపోవు

 • జంభాలకు పోవు.

టెక్కె మెగురగొట్టు

 • మరణించు. వెంక. మాన. 56.

టొకాయించి మాటలాడు

 • తురుగ బడు, ఎదిరించు.

టోకరా వేయు

 • మోసగించు.
 • "ఇదిగో యిస్తా నని పది రూపాయలు తీసుక పోయి టోకరా వేశాడు." వా.

టో కిచ్చు

 • మల్లుర భుజాలు తాకించు. చంద్రా. 4. 211.

టోకువ్యాపారం

 • పెద్ద ఎత్తున జరిపే వ్యాపారం - చిల్లరది కాదు.

టోపీదాసు

 • మోసగాడు.

టోపీ పడు

 • మోసపోవు.
 • "వాడి మాటలు విని టోపీ పడ్డాను. వెయ్యి రూపాయలు గంగలో కలిసి పోయాయి." వా.

టోపీ పెట్టు

 • మోసగించు. మాటా. 65.

టోపీ వేయు

 • మోసగించు.
 • "అవీ యివీ చెప్పి వాణ్ణి యెలాగో టోపీ వేశాడు." వా.
 • "వాడికి ఎలాగో టోపీవేసి అతడి ఆస్తి అంతా కాజేసినాడు." వా.

టోపీ వ్యవహారం

 • దగుల్బాజీ వ్యవహారం.
 • "వీడు బంగారు చేస్తా ననడం, శిష్యులను చేర్చడం యిదంతా చూస్తే ఇదేదో టోపీవ్యవహారంగా ఉంది." వా.

ఠంగు ఠంగను

 • ధ్వన్యనుకరణము.
 • కళా. 8. 109.

ఠంచనగా

 • సరిగ్గా. </ big> కొత్త. 280.

ఠవఠవ పడు

 • చింతపడు.
 • "ఠవఠవపడ నేటికి మది, శివగోచర నీకు నన్నుఁ జెం చొకఁడు శ్రుతి, వ్యవహారే తరమతమునఁ దవిలి మహాభక్తిఁ గొలువ దయ పుట్టుటయున్." కాళ. 3. 107.

ఠవఠవ లేక

 • 1. శ్రమ లేక.
 • "ఠవఠవ లే కరుగుదుము హుటాహుటి నడలన్." మను. 1. 76.
 • 2. జంకుకొంకు లేక.
 • "ఠవఠవ క్రొత్త క్రొత్త యగుటం జనియించెను నీకు నేఁడు." వేం. పంచ. 4. 576.

ఠస్సా చెప్పు

 • తిష్ఠ వేయు.

ఠావుకొను

 • నెలకొను.
 • "పావనిముందర మశకము, రావణుఁ డన నెంత పట్టి రాచఁగ లేఁడే, దేవుని కీర్తి జగత్త్రయి, ఠావు కొనఁగ నూర కుండుటయు కాక యనిన్." సమీర. 4. 34.

ఠేవిణీ వేయు

 • తిష్ఠ వేయు.
 • "ఆస్వాములవారు పక్క ఊళ్లో ఠేవిణీ వేశా రని తెలిసింది." వా.

డంగయి పోవు

 • విభ్రాంతు డగు, బిత్తరపోవు.
 • "ఆ బంగళా, నిలువెత్తు సోఫాలూ అవీ చూచేసరికి మనవాడు డంగయి పోయాడు." వా.

డంగుబ్రాలు

 • తెల్లగా నలిగిన బియ్యము. దంపుడు బియ్యము. శ. ర.

డంగోరా వేయు

 • దండోరా వేయు.
 • "ఆవిడకు ఏం తెలిసినా ఊరంతా డంగోరా వేసి వస్తుంది." వా.

డంబు సూపు

 • దర్పము చూపు.
 • "మనుజకోటి కరోటి మాలికాభసిత చ,ర్మాంబరంబులు మేన డంబు సూప." శుక. 1. 330.

డక్కించుకొను

 • కాపాడుకొను. అచ్చ. సుం. 146. డగ్గుత్తిక పడు
 • గద్గదస్వరము కలుగు.
 • "కూఁతు నెడఁబాయు వగల డగ్గుత్తి వడఁగ." కాళిందీ. 3. 205.

డగ్గుత్తిక వెట్టు

 • గద్గదస్వను డగు.
 • "నిట్టూర్పు నిగుడించి డగ్గుత్తిక వెట్టి." భార. కర్ణ. 1. 8.

డగ్గుత్తిక వెట్టుకొను

 • గద్గదిక యేర్పరుచుకొను.
 • "అని డగ్గుత్తిక వెట్టుకొంచు ఘన పక్ష్మాంతర్నిరుద్ధాశ్రుఁ డై." కళా. 7. 97.

డగ్గుపడు

 • గాద్గద్యము నొందు.
 • "డగ్గుపడుకుత్తుకలన్." శ్రీరం. 2. 251.

డచ్చీలు కొట్టు

 • డంబాచారములు పలుకు.
 • "వాడు పొద్దున్నుంచీ సాయంత్రం వరకూ డచ్చీలు కొట్టడంతో సరిపోతుంది." వా.

డప్పిగొను

 • 1. డస్సిపోవు. భార. ఆర. 7. 240.
 • 2. దాహము చెందు. నైష. 8. 177.

డప్పి చెందు

 • తగ్గిపోవు, క్షీణించు. భార. శాం. 1. 52.

డప్పులు కొట్టు

 • డంబాచారములు పలుకు.

డబ్బా డవాల్ బిగించు

 • సన్నద్ధు డగు. శ్రీరంగే. శ. 22.

డబ్బా వాయించు

 • విపరీతంగా పొగడు.
 • "నాఁకూ డబ్బా వాయించేవాళ్లు ఉంటే ఈ పాటికి నేనూ గొప్పవాణ్ని కాకా పోయానా?" వా.

డబ్బుకసాల

 • డబ్బు ఇబ్బంది. రాయలసీమలో ఇది యెక్కువగా వాడుకలో ఉన్నది.
 • "ఈ మధ్య డబ్బు కసాలా ఎక్కువయింది." వా.

డబ్బు డుబ్బు

 • ధ్వన్యనుకరణము.

డబ్బూ దసకం

 • ధనము. జం.
 • "డబ్బూ దసకం యేమైనా తెచ్చావా? వట్టి మాటలేనా?" వా.

డయ్యక క్రుయ్యక

 • అలపూ సొలపూ లేక.
 • ".....కేతు దండఖం,డన మొనరించుచుం బెనఁగె డయ్యక క్రుయ్య కతండు గండునన్." భార. కర్ణ. 3. 169.

డయ్యబాఱు

 • అలసిపోవు. విక్ర. 5. 139.

డవులుకాడు

 • మహా డంబాచారపు మనిషి. అందగాడు. డస్సి దట్ట మగు
 • చచ్చినంత పని యగు. బాగా అలసిపోయా ననుట.
 • "డప్పిఁ గుందితి డస్సి దట్టంబు నైతి." కాశీ. 6. 44.
 • దట్టం అంటే కళేబరం. ముఖ్యంగా ఎద్దులూ, ఆవులూ, గేదెలూ విషయంలో నేటికీ, ఆ చర్మం ఒలిచి శుభ్రపరిచే జాతుల వారు ఉపయోగించడం బాగా వినిపిస్తుంది - ముఖ్యం గా రాయలసీమలో.
 • "ఒరే! రామిగా ! పోలిరెడ్డిగారింట్లో దట్టం మోసుక రావాలి రా.: వా.

డాకలు

 • బండిచక్రం.

డాకొను

 • డాగు. సిద్ధపడు, తగులుకొను ఇత్యాది భావచ్ఛాయలలో వినవచ్చే మాట.

డాకొలువు

 • దగ్గఱకు రప్పించు.

డాగనమ్రుచ్చిళ్ళు

 • దాగుడుమూతలు - ఆట.

డాగనమ్రుచ్చులు

 • చూ. డాగనమ్రుచ్చిళ్ళు.

డాగికొను

 • దాగు.

డాగిలిమూతలు

 • చూ. డాగనమ్రుచ్చిళ్ళు.

డాగిలిమ్రుచ్చు లాడు

 • దాగిలిమూత లాడు.
 • "ఏనుఁగు పీనుఁగుల డొక్కలలోఁ జిక్కి డాఁగిలిమ్రుచ్చు లాడదయ్యం పుఁ దొయ్యలుల..." కా. మా. 2. 63.

డాగిలిమ్రుచ్చులు

 • చూ. డాగిలిమూతలు.

డాగి సేయు

 • కాలయాపనము చేయు.

'*"చనునే పెండిలి డాఁగి సేయ." శ్రీరాధా. 3. 109. డాగుడుమూతలు

 • చూ. డాగిలిమూతలు.

డాగురుమూతలు

 • చూ. డాగుడుమూతలు.

డాచిన ట్టరుగు

 • ఏదైనా తప్పక తనకు అక్కడే దొరుకును అన్న ధైర్యంతో వెళ్లునప్పుడు ఉపయోగించే పలుకుబడి.
 • "ఒక్కఁ డడుగెత్తి గొఱక వేయుచును డాఁచి,నట్టరిగి టెంకిఁ గని వీఁకఁ బట్టుటయును." మను. 4. 48.
 • పూర్వం ధనాదులను గోతిలో పూడ్చి పెట్టడం అలవాటు. ఆ పూడ్చి పెట్టినవాడు దాని దగ్గఱకు వెళ్లినరీతిగా అనుట.
 • "నీ అబ్బగంటు నాదగ్గర దాచిపెట్టినట్టుగా వచ్చి అడుగుతున్నా వేం?" వా. డాచేయి
 • ఎడమచేయి, దాపలచేయి.
 • "అలరారు డాచేత నజుకపాలంబు." పండితా. ప్రథ. వాద. పుట. 617.

డా చేయు

 • ఊనుకొను.
 • "లచ్చి నిట్టలపుంజన్గవఁ బోలు మున్నొరుగు మున్ డాచేసి..." పాండు. 3. 160

డాబు చేయు

 • 1. దర్పము చూపు.
 • 2. మోసగించు. వేమన.

డింక వేయు

 • మునక వేయు, చచ్చు. నేడు డింకీకొట్టు అనేరూపం లోనే యిది కానవస్తుంది. ఆంధ్రభాషార్ణవము.

డింకా కొట్టు శ. ర.

 • చూ. డింక వేయు.

డింకీ కొట్టు

 • తలక్రిందు లగు, చచ్చు.
 • "వాడు ఆ చట్టా వ్యాపారంలో దిగి డింకీ కొట్టాడు." వా.
 • "వాడు దేశంమీద పోయి అప్పుడే యిరవై యేళ్లయింది. అక్కడే యెక్కడో డింకీ కొట్టి ఉంటాడు." వా.

డించి పోవు

 • దిగవిడిచి పోవు.
 • "అతి దు:ఖాన్విత డించి పోవఁ దగవా?" హర. 3. 86.

డిందబడు

 • క్రిందు వడు, మునుగు.
 • "దు:ఖాబ్ధి నంగన డిందంబడి వంది." కుమా. 11. 58.

డిందుపడు

 • 1. దిగులుపడు.
 • 2. తగ్గు.
 • "దిక్పాలకాదుల డెందంబులు దిండుపడి." భాగ. స్క. 6. 282.

డిందు పఱచుకొను

 • తగ్గించుకొను.
 • "సంతాపంబు డిందు పఱచుకొని." భీమ. 3. 4.

డిందుపాటు

 • మనస్థ్సిమితం. విక్ర. 3. 106.

డిగద్రావు

 • 1. అణచి వేయు.
 • 2. విడిచిపెట్టు.

డిగబడు

 • వ్రేలాడు, కూలు.

డిగువడు

 • తగ్గు; శాంతించు.
 • "అనేకవిధంబుల నతని యాగ్రహంబు డిగువడఁ జెప్పి." భాస్క. అర. 259.

డిగ్గ జాఱు

 • దిగజాఱు.

డిగ్గ దాటు

 • కిందికి దుముకు. డిగ్గ ద్రావు
 • చూ. డిగద్రావు.

డిగ్గన

 • తటాలున.

డిగ్గున

 • చూ. డిగ్గన.

డిగ్గుపడు

 • న్యూన మగు.
 • "చుక్కల సోయగంబు ముత్యాల బెడంగు డిగ్గు పడునట్లుగఁ జేసిన బాగ పుంబలీ." యయా. 4. 163.

డిప్పకాయ

 • 1. అల్లరివాడు, శుంఠ.
 • 2. ఊరగాయ.

డిప్పకాయ కొట్టు

 • తలపై కొట్టు.

డిబ్బు డిబ్బను

 • ధ్వన్యనుకరణము.
 • కుమా. 11. 155.

డిల్ల గుడుచు

 • భయపడు.
 • "అయిన నిట్టి మాట యావెలందుక యొద్ద, ననిన డిల్ల గుడుచు నట్లు గాన." కాళిందీ. 2. 120.

డిల్ల చెడు

 • అధైర్యపడు.
 • "కుంభిని పణ మూఁదికొని డిల్ల చెడినట్లు, పరవశు గతి రుగ్ణుకరణి నుండ." ఇందు. 4. 37.

డిల్లపడు

 • డీలాపడు.
 • "మనో,జున కెర యిచ్చి డిల్లపడ." కవిక. 3. 99.

డిల్లపాటు

 • అధైర్యము.

డిల్ల పోవు

 • అధైర్యపడు.
 • "ఉరుకుచాద్రుల నంట నూహించు నూహించి, క్రేళ్లు మలంగిన డిల్లపోవు." సాంబో. 1. 70.

డివుడివ్వులు లిఖించు

 • అనుకరించు.
 • "వృధా, డివుడివ్వుల్ లిఖియింప నేల?" కల. 36.

డీకొను

 • పూనుకొను, ఎదుర్కొను.

డీకొలుపు

 • ప్రేరేపించు, కలుపు.
 • రూ. డీకొల్పు.

డీ డిక్కులాడు

 • 1. ఒకదానితో ఒకటి కొట్టుకొను.
 • 2. పిల్లలు ఆడే ఆట - తలకు తల డీ కొడతారు.

డిలాపడు

 • నష్టపడి చితికిపోవు.
 • "వాడు వ్యాపారంలో నష్టం వచ్చి డీలా పడిపోయాడు పాపం!" వా.

డీలు పడు

 • బలహీన పడు, వ్యర్థ మగు, బాధపడు. డీలు పఱుచు
 • తక్కువపఱచు.

డీలుపాటు

 • బలహీనత.

డీలు సేయు

 • తగ్గించు.

డుబుడక్కవాడు

 • బుడబుడక్కలవాడు.

డుఱ్ఱుచ్చి

 • యుద్ధానికి పిలుచుటలో పశువుల నదిలించుటలో - మాట.

డులడుల

 • రాలుటలో ధ్వన్యనుకరణము.

డూడూ బసవన్న

 • అన్నిటికీ తల ఊపువాడు.
 • "పత్తిగింజలు తింటావా బసవన్నా అంటే డూడూ అన్నా డట." సా.
 • "వాడు వట్టి డూడూ బసవన్న. వాళ్ల నాన్న నడిగితేనే పోతుంది." వా.

డెందము కంద జేయు

 • మనసు నొప్పించు.
 • "ఆత్మబోధ ని,ష్ఠం దప మాచరించు ముని సంహతి డెందము గందఁజేయుచున్." కా. మా. 2. 27.

డెందము కరగు

 • 1. హృదయము ద్రవించు.
 • "బిగియూరం గౌఁగిలించుకొని కరంగిన డెందంబుల రెంటి నొక్కటిగ నత్తించుపోలిక." పారి. 2. 53.
 • 2. మనసు వచ్చు - ఇష్టపడు.
 • "ఊ,డిగ మిటు నటు చేయ నతని డెందము గరఁగున్." కళా. 4. 69.

డెందము డిందుపఱచుకొను

 • మనసు దిటవు చేసుకొను.
 • "తదనంతరంబ డెందంబు డిందు పఱచుకొని ధైర్యబలంబునఁ గంఠగద్గదిక వారించుచు..." కళా. 3. 102.

డెందముముల్లు

 • హృదయశల్యము.
 • "ముల్లోకములకు డెందము, ము ల్లగు దశకంఠుతోడి మ్రుచ్చుల రగుటన్." భాస్క. యుద్ధ. 313.
 • చూ. గుండెగాలము.

డెందములోని కొఱ్ఱు

 • భాస్క. యుద్ధ. 246.
 • చూ. డెందముముల్లు.

డెందాన చేయిడి నిద్రపోవు

 • నిశ్చింతగా నిద్రపోవు.
 • "నృపతి డెందానఁ జేయిడి నిద్రపోవు." ఆము. 4. 261.
 • చూ. రొమ్మున చేయిడి నిద్రపోవు.

డెబ్బదిపదకొండు

 • అనేకం.
 • "పుటకు డెబ్బది పదకొండు తొటుకు లుండు." శ్రవ. 1. 11.

డెబ్బై పదకొండు

 • చూ. డెబ్బది పదకొండు.

డేగకళ్లు

 • నిశితదృష్టి. జగ. 111.