పదబంధ పారిజాతము/డొంకతిరుగుడు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

డేగపదనుగ

 • అరకొరగా; మితముగా.
 • "డేగపదనుగ భోజనము సేసి." సారం. 1. 78.

డేగాట

 • పెండ్లిలో అయిదవనాడు వధూవరులను ఎత్తుకొని ఆడే ఆట.
 • "జంపతుల కైన డేగాట సమయమందు." బుద్ధ. 3. 102.

డేరా ఎత్తివేయు

 • ఆ యూరినుండి వలసపోవు.
 • "వా డెప్పుడో యీ ఊరినుండి డేరా యెత్తేశాడు." వా.
 • చూ. గుడార మెత్తివేయు.

డొంకతిరుగుడు

 • సూటిగా చెప్పక అటూ యిటూ తిప్పి తిప్పి మాట్లాడు పట్లా, సూటికాని దారీ మొదలగువాని పట్లా విశేషంగా ఉపయోగిస్తారు.
 • "వాడు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం ఛస్తే చెప్పడు. ఆ డొంక తిరుగుడు మాటల్లో వా డేం చెప్తున్నాడో కూడా తెలియదు." వా.
 • "గుంతకల్లునుంచి బొంబాయి మెయిలెక్కి నేరుగా మదరాసు చేరక పాకాలమీద ఎందుకు పోవడం? డొంక తిరుగుడు దారిలో చేరడానికి మూడు నాళ్లు పట్టుతుంది." వా.

డొంకలు దూరు

 • అల్పకార్యములకు పూను. జగన్నా. 17.

డొంగియాడు

 • దోగాడు. సారం. 1. 49.

డొంగులువాఱు

 • తొఱ్ఱ లేర్పడు.

డొకారము చొచ్చు

 • శరణు చొచ్చు.
 • "కరుణను బ్రోవ మం చని డొకారము సొచ్చెను నాఁగ." పార్వ. 5. 207.
 • "గరగరి మాని యొక్కట డొకారము సొచ్చు మహాద్రులో యనన్." చంద్రా. 1. 13.
 • వావిళ్ల ని. లో లోపల ప్రకాశించు అనే అర్థ మొకటి యిచ్చి ఇందలి తొలి ప్రయోగ మిచ్చారు. శరణు సొచ్చు అనుటే సరి.

డొక్క చీల్చి డోలు కట్టు

 • తిట్టు. కొట్లాటల్లో ఉపయోగించే మాట.
 • "నీ వీ వీధిలో ఇంకోసారి కనబడ్డా వంటే డొక్క చీల్చి డోలు కడతాను జాగ్రత్త వెధవా!" వా. డొక్క జేనెడు గాదే
 • కడుపు చిన్నది కాదు కదా! అనుట.
 • ఇంత కడుపు పెట్టుకొని ఊరక కూర్చున్న ఎట్లు అనసందర్భములోని పలుకుబడి.
 • కడుపు చిన్న దే కదా - ఇందు కోసం ఇన్ని పాపాలా? అనీ అవుతుంది.
 • "అకటా!, బగ్గున మండెడు నీకును, ని గ్గించుక లేదు డొక్క జేసెడు గాదే!" శుక. 3. 277.

డొక్కబుఱ్ఱ

 • తేగ పాఱి వీడిన తాటివిత్తు. శ. ర.

డొక్కలో పెట్టుకొను

 • చూ. కడుపులో పెట్టుకొను.

డొక్కలో మెదలు

 • మరచిపోని దురుసుమాటలు అనినప్పుడు అవి మరచిపో లేకున్నాను అనుపట్ల ఉపయోగించే మాట.
 • "వా డా రోజు అన్న మాటలు డొక్క లో మెదులుతున్నాయి. చచ్చినా మరిచిపోలేను." వా.

డొక్కశుద్ధి ఉన్న....

 • చదువుకొన్న...
 • "వాడు కాస్త డొక్కశుద్ధి ఉన్న వాడు. ఏం చెప్పినా గ్రహిస్తాడు." వా.

డొక్కుపడు

 • సంకోచము కలుగు. కొత్త. 438.

డొల్ల నడుచు

 • చంపు. భార. విరా. 3. 204.

డొల్లపొట్ట

 • బొఱ్ఱకడుపు.

డొల్లి డొల్లి

 • దొర్లుకుంటూ దొర్లుకుంటూ.
 • "నీ విప్పుడ పొమ్ము, వడి డొల్లి డొల్లి శ్రీ వారణాసికిని." పండితా. ప్రథ. దీక్షా. పు. 113.

డొల్లుపుచ్చకాయ

 • అస్థిరుడు.
 • "వాడు ఒట్టి డొల్లు పుచ్చకాయ. ఎక్కడా నాలుగురోజులు ఉండడు." వా.

డొల్లుపుఱ్ఱెలు

 • లొత్త తలలు, లోన ఏమీ లేనివి. ఆము. 6. 17.

డొల్లుపోగులు

 • బోలుగా ఉన్న పోగులు.

డోకు వచ్చు

 • అసహ్యము కలుగు.
 • "వానిరూపం చూస్తే డోకు వస్తుంది." వా. అసహ్యదృశ్యం చూస్తే వాంతి వచ్చుటపై వచ్చిన పలుకుబడి.

డోగాడు

 • దోగాడు.

డోగి యాడు

 • దోగాడు.

డోలు కట్టు

 • అపహాస్యము చేయు.

ఢంకామీద దెబ్బ కొట్టి

 • బాహాటంగా, గట్టిగా.
 • "వాడికి ఒక అక్షరం రా దని ఢంకా మీద దెబ్బ కొట్టి చెప్పగలను." వా.

ఢకాఢకి

 • ధ్వన్యనుకరణము.

ఢకీలు ఢకీలున

 • ధ్వన్యనుకరణము.

ఢక్కా మొక్కీలు తిను

 • జీవితంలో కష్టనష్టాలను అనుభవించు - ఎగుడు దిగుళ్ళను చూచు.
 • "వాడు ఎంతయినా ఢక్కా మొక్కీలు తిన్నవాడు. కాస్త వస్తే కళ్లు తిరిగి పోవడం, కాస్త పోతే దిగులుపడడం అసంభవం." వా.

ఢిమఢిమ

 • ప్రేలుటలో ధ్వన్యనుకరణము. కృష్ణ. 3. 29.

ఢిల్లికి ఢిల్లి, పల్లికి పల్లి

 • పెద్దది పెద్దదే, చిన్నది చిన్నదే. కాని దేనిలో అందం దానికి ఉండనే ఉంటుంది. దేని కదే అనుట.
 • "ఢిల్లికి ఢిల్లే పల్లికి, పల్లే యని చెప్పునట్టి పలుకులు వినరే." శ్రీనివా. 1. 57.
 • ఢిల్లి మహానగరం, పల్లె చిన్నగ్రామం.

ఢోకా లేదు

 • లోటు లేదు.
 • "ఆ పొలం పండుతున్న దాకా వాడి కేం ఢోకా లేదు." వా.