Jump to content

పదబంధ పారిజాతము/గౌతముని గోవు

వికీసోర్స్ నుండి

గౌడుగీతములు

  • ఒక విధ మైన జానపదగీతములు.
  • నా డివి వానిలో ఒకవిధ మైన నిర్దిష్టవిభేదం కావచ్చును.
  • "గౌడుగీతములు వాడుచు." కుమా. 6. 45.

గౌతముని గోవు

  • తగిలితే చాలు పడి చచ్చి పాపము చుట్టుకొనునట్లు చేయునది. ఒక కథపై వచ్చిన పలుకుబడి.
  • "ఒండొకఁడ వైన నిపుడు నీపిండి యిడమె, బ్రాహ్మణుఁడ వౌట మా చేత బ్రదుకుఁ గంటి, తడవఁ బని లేదు నిన్ను గౌతముని గోవ, వనుచు వాదించి విడిచిన నాగ్రహించి." మను. 4. 90.

గౌదకట్టు

  • అట్లు కట్టిన కట్టు. ఆము. 6. 81.

గౌరి కుంకుమలు

  • ఒక రకమైన ధాన్యం. హంస. 4. 128.

గౌరుకాకి

  • బొంతకాకి. బ్రౌన్.

గౌళి పలుకు

  • బల్లి శకునం.
  • ఫలానా వారం ఫలానా దిక్కున పలికితే ఫలానా ఫల మని చెప్పే ఒక శకున శాస్త్రం.

గ్రక్కదలు

  • కదలి పోవు.

గ్రక్కిలువడు

  • సడలి పోవు.

గ్రక్కుమి క్కనక

  • కి మ్మనకుండా - ధ్వన్యనుకరణ మై ఉంటుంది. ఇలాంటి వింకా - కయ్ కుయ్ అనకుండా - కిమ్మనకుండా - ఆ ఊ అనకుండా - కిక్కురు మనకుండా...
  • "కదలక మెదలక గ్రక్కుమిక్కనక." పండితా. ప్రథ. పురా. పుట. 303.

గ్రక్కు మిక్కన లేక

  • ఏమీ అన లేక, కిక్కురు మనకుండా. ధ్వన్యనుకరణము.
  • "అక్కిళ్ళు వడి గ్రక్కు మిక్కన లేక, యున్న వారలఁ జూచి." బస. 6. 179.

గ్రగ్గులకా డగు

  • ఛిన్నా భిన్నత నొందినవారగు.
  • "తలలు వీడంగ విద్యాధరుల్ పఱచిరి, గ్రగ్గులకాం డ్రైరి ఖచరవరులు." పారి. 5. 37.

గ్రచ్చ కదిలినట్లు

  • గ్రచ్చపొద కదిలించినట్లు గలగల మని. గ్రచ్చపొద కదిలించినప్పుడు గలగల మని గచ్చ కాయలు రాలును. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "పుణ్యవాహిని నిటు వా,క్రుచ్చితి వని వడి నందఱు, గ్రచ్చ కదలినట్లు గువ్వ కరిగొని తిట్టన్." జైమి. 4. 72.

గ్రచ్చపొద కదలించినట్లు

  • గలగల మని.
  • "కుచ్చితురా లైన యచ్చపలలోచనం జూచి పౌరు లందఱు గచ్చుకొని గ్రచ్చపొద గదిలించినకైవడి విచ్చలవిడి నోరికి వచ్చినట్లు వెచ్చానికి వచ్చు వారును." సారం. 3. 217.
  • చూ. గ్రచ్చ కదలినట్లు.

గ్రద్దగోరు

  • దొంగల పనిముట్లలో ఒకటి.

గ్రహచారము

  • దురదృష్టము.
  • గ్రహబలము సరిగా లే దనుట.
  • గ్రహసంచారం బట్టి జీవితంలోని ఎగుడుదిగుడు లుంటాయన్న జ్యోతిశ్శాస్త్రం పై ఏర్పడినది. కాని చెడుగా ఉన్న దన్న అర్థంలోనే గ్రహచారం ఉపయుక్తం కావడం విశేషం.
  • "వాడి గ్రహచారం అలా ఉంది.అందుకే పా డయి పోయాడు." వా.

గ్రహచారము చాలని

  • గ్రహబలము చక్కగా లేని. దురదృష్టపుదినా లనుట. జ్యోతిశ్శాస్త్ర రీత్యా వచ్చిన పలుకుబడి. వీరనారాయణ శత. 20.
  • "గ్రచారం చాలనప్పుడు ఏం చేసినా వ్యతిరిక్తమే అవుతుంది." వా.

గ్రామాశ్వము

  • గాడిద.

గ్రామ్యకర్మము

  • మైథునము.

గ్రామ్యధర్మము

  • మైథునము.
  • "....ప్రాయంపు టింతులకును గ్రామ్య ధర్మంబు లేకున్నఁ గలుగు దు:ఖ మెం తని వచింప వచ్చునో." హంస. 3. 206.
  • చూ. గ్రామ్యసుఖము.

గ్రామ్యసుఖము

  • మైథునము.
  • చూ. గ్రామ్యధర్మము.

గ్రాసవాసములు

  • తిండీ, బట్టా.
  • "వచ్చు నాదాయములు గ్రాసవాసములకుఁ, గాఁగ దినములు గడపె..." హంస. 2. 152.

గ్రాసవాసోదైన్యం

  • తిండికీ బట్టకూ లేక పోవుట.

గ్రుక్కగొను

  • త్రాగి వేయు.
  • "అక్కజంబుగ నబ్ధి నాపోశనముగ, గ్రుక్క గొన్నట్టి యా కుంభజుఁ డుండ." హరిశ్చ. పూర్వ. 302. పం.

గ్రుక్కలు పెట్టు

  • త్రాగు.
  • "కిక్కరు మన కమృతంబును, గ్రుక్కలు పెట్టుదురు సురలు." హర. 6. 122.

గ్రుక్కలు మ్రింగు

  • గ్రుక్కిళ్లు మ్రింగు.
  • "గ్రుక్కలు మ్రింగుచున్ వెడగు గొల్లల సుద్దుల నెంత పాడినన్." గుంటూ. ఉత్త. 12.

గ్రుక్కి ళ్ల వియు

  • ఊపిరి యాడక పోవు.
  • "గ్రుక్కి ళ్లవియంగఁ జొచ్చెరవికిన్." కవిక. 2. 150.

గ్రుక్కిళ్లు మ్రింగు

  • 1. గుటకలు మ్రింగు.
  • "గ్రుక్కిళ్‌ మ్రింగఁగఁ గ్రొత్త నెత్తురుల వాగు ల్పాఱఁ గ్రవ్యాదులున్." కా. మా. 2. 52.
  • "గ్రుక్కిళ్లు మ్రింగుచు." రాధా. 4. 105.
  • 2. ఆశతో - గుటకలు వేయు.
  • "నాకబలి సంవిధానంబు లాచరించు వారలఁ గనుంగొని గ్రుక్కిళ్లు మ్రింగియు..." శుక. 2. 160.
  • "కోకిలవ్రాతంబు గ్రుక్కిళ్లు మ్రింగించు." హర. 3. 38.

గ్రుక్కుమి క్కనక

  • ఒక్క మాట పలుకక.
  • "నిర్ఝీవులుం బోలె గ్రుక్కు మిక్కనక పక్కెరలు పైఁ ద్రోచుకొనియును." పారి. 5. 13.

గ్రుక్కుమిక్కు రనక

  • ఒక్క మాట అనకుండ.
  • "గుండియలు గ్రుళ్లఁ దన్నిన గ్రుక్కు మిక్కు, రనక యాతని కినుక చల్లాఱ నిచ్చి." శుక. 3. 627.

గ్రుచ్చి కౌగిలించుకొను

  • గట్టిగా కౌగిలించుకొను.
  • "నీకంటె మోహంపుదేవు లెవ్వ రంచు సతిని గ్రుచ్చి కౌఁగొలించుకొని యెత్తి యక్కున...." కళా. 7. 235.

గ్రుచ్చి గ్రుచ్చి యడుగు

  • చెప్పు చెప్పు మని బలవంతము చేసి అడుగు
  • "....ఇంతకు మున్నిది యెన్నండును విన్న యది గా దిప్పు డెప్పగిది నొదవెఁ జెప్పు మని గ్రుచ్చి గ్రుచ్చి యడుగ..." కళా. 1. 202.

గ్రుచ్చెత్తు

  • అద్ది యెత్తు, ముంచు.
  • "గొజ్జంగినీరున గ్రుచ్చెత్తి కపురాన, రంగు మీఱ లోన రంగు వైచి." చమ. 1. 88.

గ్రుడ్డింగిలాయి

  • ఒక రకమైన చేప. శ. ర.

గ్రుడ్డికన్ను పాదుసా

  • కుబేరుడు.

గ్రుడ్డికామంచి

  • గొడుగుగడ్డి. శ.ర. గ్రుడ్డికాసు
  • మారనికాసు. చిల్లి గవ్వ వంటిమాట. మల్లభూ. వైరా. 3.

గ్రుడ్డి కొక్కిరాయి

  • గుడ్డికొంగ.

గ్రుడ్డిగవ్వ

  • గుడ్డికాసు.

గ్రుడ్డిదీపము

  • వెలుగు లేని చిన్నదీపము.

గ్రుడ్డిదొరతనము

  • గుడ్డిదర్బారు.
  • చూ. గుడ్డిదర్బారు.

గ్రుడ్డిబేరము

  • తెలివితక్కువ బేరము. బ్రౌన్.

గ్రుడ్డివడు

  • చీకటిపడు.
  • "కొన్ని దేశంబు లిరులచే గ్రుడ్డివడియె." కాశీ. 1. 137.

గ్రుడ్డివాటుగా

  • కాకతాళీయంగా.
  • గుడ్డివాని చేతిరాయివలె ఏదో తగిలిన దనుపట్ల అను సామ్యం.

గ్రుడ్డివెన్నెల

  • మసక వెన్నెల.

గ్రుడ్డులోపలి చిన్నకూన.

  • పసిపాప.
  • "అడ్డపట్టులపాప యవు నఁటే లేక, గ్రుడ్డు లోపలి చిన్ని కూనయో యమ్మ!" సారం. 2. 305.

గ్రుడ్డెఱ్ఱ

  • కన్నెఱ్ఱ. కోపము.
  • కోపము వచ్చినప్పుడు కను గ్రుడ్డు ఎఱ్ఱవడును కావున వచ్చిన పలుకుబడి.
  • "అకట! గ్రుడ్డెఱ్ఱ బాదరాయణుని మీఁద." భీమ. 4. 12.

గ్రుడ్లకొలదిగ కన్నీరు గ్రుక్కి కొను

  • కండ్లనిండా నీళ్లు పెట్టుకొను.
  • "లెస్స తెఱుపాటు గొట్టితి లెమ్మటంచు, గ్రుడ్లకొలఁదిగఁ గన్నీరు గ్రుక్కి కొనుచు." శుక. 3. 197.
  • చూ. గ్రుడ్లనిండా నీళ్లు పెట్టుకొను. కళ్లనిండా నీళ్లు పెట్టుకొను.

గ్రుడ్లు తినుటయె గాక గూ డెక్కి కూయు

  • చెడ్డపని చేసి దానిని బాహాటముగా చెప్పుకొను.
  • "ఏమేమీ! గ్రుడ్లు దింటయుం గాక గూ డెక్కి కూసెద వీవేశ్యయుం దాసియు నీ కన్నుల కెంత ప్రియ మైన నయిరి గాక నీకు సరతుగా నిట్లు పలుక నెట్లు నోరాడె." భోజ. 7. 171.

గ్రుడ్లు మిడికించు

  • గుడ్లు మిటమిట లాడించు. క్రీడా. పు. 73.

గ్రుడ్లు మెఱము

  • గ్రుడ్లుఱిమి చూచు.
  • "గవిలో బెబ్బులి డాఁగి గ్రుడ్లు మెఱమంగాఁ గాంచి రా జేసె నే,య వడిన్ బాణమువెంటనే." మను. 4. 46.

గ్రుడ్లు వెలి కుఱుక నొక్కు

  • బాగుగా నొక్కు.
  • "మెడ యొడిసి పట్టి గ్రుడ్డు వెలి కుఱక నొక్కుచు..." కళా. 3. 278.
  • "గుడ్లు బయటికి వచ్చేటట్టుగా మెడ నొక్కినాడు." వా.

గ్రుడ్లు వెల్కుఱకు

  • గ్రుడ్లు బయటికి వచ్చు.
  • గొంతు బిగుసుకొన్నప్పుడూ, ప్రాణాపాయ స్థితిలో ఉన్నదని చెప్పుటకున్నూ వాడుకలో గుడ్లు బయటికి వచ్చినవి అంటారు.
  • "గుంతలోఁ బడ గ్రుడ్లు వెల్కుఱక నాల్క, నడుము గఱుచక నఱచుచు బెడసి మడిసె." హంస. 1. 193.

గ్రుద్దులాడు

  • కొట్లాడు.
  • పశ్చిమాంధ్రంలో అతిప్రచురంగా వాడుకలో ఉన్నది.

గ్రొచ్చి కోరాడు

  • త్రవ్వు.
  • "ప్రాభవంబున దోర్దండబలము మెఱసి, గ్రొచ్చి కోరాడి త్రవ్విరి కుతల మెల్ల." భాగ. 9. 205.

ఘంటాపథము

  • 1. రాజమార్గము.
  • "కలువడంబులు గట్టి ఘంటాపథములందుఁ, బొడవుగా నునుఁబట్టుపడగ లెత్తి." రుక్మాం. 1. 118.
  • 2. రాచబాట వంటిది. కొట్టినపిండి అనుట.
  • "వేదశాస్త్ర పురాణాది విద్య లెల్లఁ, దరుణి నీయాన ఘంటాపథంబు మాకు." నైష. 2. 49.

ఘంటాపథముగా

  • నిశ్చయముగా.
  • ముక్తకంఠంతో అనుట. రాచబాటలో నడచినట్లు నిరాఘాటముగా అనుటపై మాఱిమాఱి వచ్చిన పలుకుబడి.
  • "నిదురమబ్బున నున్న నెన్నెఱిని నెఱను, బొరడుఁబోక ఘంటాపథమ్ముగ నిగమములు." వ్యాఖ్యా. చాటు. తె. జా.

ఘటదాసుని చేయు

  • నౌకరుగా చేయు.
  • "....నే మనంబునం, దలఁచిన రుద్రు నైన ఘటదాసునిఁ జేయుదుఁ గామునింటికిన్." మార్కం. 1. 21.

ఘటన

  • దైవఘటన.
  • చూ. దైవఘటన.

ఘటన చేయు

  • సంఘటిల్ల జేయు.
  • "కలిమి యంగంబు లెల్లను ఘటన చేసి." పార్వ. 6. 93.

ఘటనపడు

  • సంఘటిల్లు.
  • "సకలలక్షణగ్రంథవిస్తారసార, పటిమలన్నియు నొకటిగా ఘటనపఱచి, లక్షణగ్రంథ మొనరింతు." ఆనంద. 1. 2.

ఘటాఘటీలు

  • హేమా హేమీలు
  • "ఓహో! భేధము లేదు నిండుసభలో నొక్కింతమాత్రంబు హే,మా హేమీలు ఘటాఘటీ లతిరథుల్ మాంధాళు లీసాము లే, లా? హీనాధికభావముల్...." వరాహ. 10. 8.

ఘట్టకుటీప్రభాతము

  • దేనినుండి తప్పించుకొన వలె నని అంత అవస్థపడ్డాడో దానివాతే పడవలసి వచ్చినది అనుపట్ల అనే ఒక న్యాయము.
  • సుంకము చెల్లించు పాకను తప్పించుకొనవలె నని ఒక బండివాడు రాత్రంతా ప్రయాణం చేశాడు. కాని తుదకేమో తెల్ల వారు నప్పటికి ఎదుట ఆతావే కనిపించినట్లు తెలుసుకున్నాడు.
  • "ఘట్టకుటీప్రభాత మనఁగా నిదివో పరికించి చూడఁగన్." కళా. 6. 249.

ఘణంఘణలు

  • ఘణఘణలు.
  • ధ్వన్యనుకరణము.

ఘణిల్లున రంకె వైచు

  • ధ్వన్యనుకరణము.
  • "ఘణి ఘణిల్లున వైచు ఘన మైన రంకెల." వీర. 3. 105.

ఘనం పఱచు

  • ఉగ్గడించు, గొప్ప సేయు, కొండాడు.
  • "అని నెనరు ముట్టం బూనిన కుసుమాయుధు పూనికి వజ్రాయుధుండు ఘనం పఱచి." కుమా. 4. 47.

ఘనము చేయు

  • గొప్ప చేయు.
  • "నెఱిగొప్పు కొనగోర నివిరి చూచెద నన్నఁ, జెలి నీ వది ఘనంబు చేసి కొనెదు." సారంగ. 2. 226.

ఘనాంతస్వాధ్యాయి

  • చూ. ఘనాపాఠీ.

ఘనాపాఠీ

  • ఘనాంతం వేదం చదువు కొన్నవాడు.
  • వేదంలో ప్రతి మంత్రానికీ పదము, జట, ఘనము అనేవి ఉంటాయి. ఘనం ఆఖరుది కనుక కూలంకషంగా చదువుకొన్నవాడు అనుట.

ఘమ్మను

  • గుమ్మని వాసించు.

ఘల్లుఘ ల్లను

  • ధ్వన్యనుకరణము.
  • రాధి. 1. 99.

ఘల్లు రను

  • ధ్వన్యనుకరణము.
  • సారం. 3. 28. ఘళుకు ఘళుకు మను
  • శబ్దించు. ధ్వన్యనుకరణము.

ఘుటిక మ్రింగిన సిద్ధునివలె

  • రససిద్ధుడు రసఘుటికను మ్రింగినట్లు - మౌనంగా; కిమ్మనకుండా. సారం. 3. 164.

ఘుణాక్షరన్యాయముగా

  • బుద్ధిపూర్వకంగా కాక యాదృచ్ఛికంగా యేర్పడినది. ఒక పురుగు కర్రను తొలిచినప్పుడు అందులో అక్షరాకారసామ్యం యేర్పడినట్లు అనుట.
  • "ప్రతిపద్యముఁ జోద్యముగాఁ, గృతిఁ జెప్పిన నొప్పుఁ గాక కృతి నొకపద్యం, బతిమూఢుఁ డైనఁ జిత్రతఁ బ్రతిపాదింపఁడె ఘుణాక్షరన్యాయమునన్." విక్ర. 1. 17.
  • గ్రుడ్డివాటుగా అనుట.

ఘుమ ఘుమ మ్రోయు

  • 1. శబ్దించు. ధ్వన్యనుకరణము.
  • "ఖగేశ్వర పక్ష జనితవాతాం,కుర పూర్తిని శంఖ మపుడు ఘుమఘుమ మ్రోసెన్." పారి. 2. 78.
  • 2. పరిమళించు.
  • "మల్లెపూలు ఘుమఘుమ లాడు తున్నవి." వా.

ఘుమ్మను

  • పరిమళించు, శబ్దించు.
  • "ఘుమ్మను కపురంపు జగతి మూర్చుండి తగన్." వాల్మీ. 3. 101.
  • "ఆపిమ్మట వియచ్చరీపాణి వల్లకీగుంఫ స్వరమ్ములు ఘుమ్ము రనియె." వసు. 5. 3.

ఘోటకబ్రహ్మచర్యము

  • వీలు చిక్కక బ్రహ్మచర్యం నెఱపుట.
  • గుఱ్ఱము ఆడుగుఱ్ఱం కనబడే దాకా బ్రహ్మచర్యం అవలంబిస్తుంది. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "కదిసి చూడ ఘోటక బ్రహ్మచర్యంబు, పింగళాజపంబు పిల్లిశీల, మజగరోపవాస మల బకధ్యానంబు, నక్కవినయ మిట్టి నయము లెల్ల." వైజ. 2. 19.

చంక కఱ్ఱలు

  • కుంటివారు నడచుటకు చంకల క్రింద ఆధారంగా పెట్టుకునే కఱ్ఱలు.

చంకకాళ్ళు

  • చూ. చంకకఱ్ఱలు.

చంక కెక్కు

  • ఎక్కువచనవు తీసుకొను. నిరసనగా అనుమాట.
  • "రెండు సార్లు పలకరిస్తే చాలు. వాడు చంక కెక్కి కూర్చుంటాడు." వా.

చంక చేతులు కట్టుకొని

  • చేతులు కట్టుకొని వినయముతో.
  • "వాళ్లన్నయ్య దగ్గర ఎప్పుడూ వాడు చంక చేతులు కట్టుకొని నిలబడతాడు." వా.

చంక జేతులు వెట్టుక

  • చేతులు కట్టుకొని.
  • "నిలుచుండి చంకఁ జేతులు వెట్టుక కిరీట,ములు గలరాజులు కొలువు సేయ."

చంక జేతులు వెట్టుకొని

  • వినయముతో. సారం. 1. 62.
  • "నిలుచుండి చంకఁ జేతులు కట్టుకొను వాఁడె, కొలువ రా రే మంచుఁ గెలియ సాఁగె." కువల. 24.

చంకటివాడు

  • చంటివాడు, చంకలోని బిడ్డ.
  • "వాపోవు చంకటివానిఁ బో వైచి." గౌర. హరి. ద్వి. 1055.

చంకతాళి

  • చంకలో తగిలించుకొను మూట. శ. ర.

చంక దుడ్డు, శరణార్థి

  • అననురూపప్రవర్తన.
  • పై కేమో అభయం కోరుతూ వచ్చినట్టు నటిస్తున్నా, కొట్టుటకు కర్ర తీసుకొని వచ్చినట్లు.
  • "శరచాపధారణంబున్, బరమ మనశ్శాంతి దాంతి పరిపాకంబున్, బరికింపఁ జంక దుడ్డును, శరణార్థియు ననెడునట్టి చందము దోఁచెన్." హరవి. 7. 17.
  • "ధరణీశ ! చంక దుడ్డును, శరణార్థియు ననెడు మాట సరి వచ్చె మునీ, శ్వర బాధక మగు నీదు, శ్చరితము పరికింప మిగుల సాహసి వరయన్." హరి. 2. 149.

చంక నాకి పోవు

  • చెడిపోవు.
  • "ఆ కేసు కొత్తవకీలుకు ఇచ్చాను. అది కాస్తా చంక నాకి పోయింది." వా.
  • "నామాట వినక పోతే నీవే చంక నాకి పోతావు." వా.

చంక బిడ్డ లూడిపడునట్లు మాట లాడు

  • చమత్కారముగా, హాస్యముగా, గడుసరిగా మాట లాడు.
  • ".......మన మాదట వేఁడిన మాఱు వల్కఁగాఁ, గొంకెడు నంచు మీ రిపుడు గో లని చూడకు రమ్మ నేర్చుఁ బో,చంకల బిడ్డ లూడిపడ సారసలోచన మాటలాడఁగన్." విజ. 3. 34.

చంకలబంటిగా మెసవు

  • కుత్తుకబంటిగా తిను.
  • "చంకల బంటిగా మెసవి." క్రీడా. పు. 56.

చంకలు ఎగుర వేయు

  • సంతోషించు, సంబరపడు.
  • "పరీక్షలో ప్యా సయ్యా నని వాడు చంకలు ఎగర వేసుకొంటూ వచ్చాడు." వా.
  • రూ. చంక లెగుర వేయు. చంకలు కొట్టుకొను
  • సంబరపడు.
  • "ఆఁ. మనపిల్ల నిస్తా మంటే వాడు చంకలు కొట్టుకొంటూ వస్తాడు." వా.
  • చూ. చంకలు ఎగుర వేయు.

చంకలు గుద్దుకొను

  • చూ. చంకలు కొట్టుకొను.

చంకలు గొట్టుకొను

  • సంతోషించు.
  • "కలిగొట్టు చూచి చంకలు గొట్టు కొనుదమే, పొలఁతి గైకొను మల్ల పొన్న రెల్ల." నలచ. 3. 230.
  • "వాని కా ఆస్తి వస్తుందని తెలియగానే భార్య చంకలు గొట్టుకొన్నది." వా.
  • చూ. చంకలు తట్టుకొను.

చంకలు తట్టుకొను

  • సంబరపడు.
  • "తన దత్తుతల్లికి జబ్బు చేసిం దనే సరికి వాడు చంకలు తట్టుకొంటూ బయలుదేరాడు." వా.
  • చూ. చంకలు కొట్టుకొను.

చంకలు తాటించు

  • సంతోషించు.
  • చంకలు కొట్టుకొను అని వాడుకలో ఇది కనబడుతుంది.
  • "బళిరా తేరకుఁ దేరఁ దక్కె నిఁక నీ బంగారకుం డంచుఁ జం,కలు దాటించుచు..." పాండు. 3. 67.
  • "వాళ్ల తాత చచ్చిపోయా డని నిన్న ఉత్తరం వచ్చింది. వాడు చంకలు కొట్టుకొంటూ వెంటనే బయలుదేరి పొయ్యాడు. ఎలాగూ ఆ ఆస్తి వీడికి దక్కవలసిందే గా." వా.
  • రూ. చంకలు కొట్టుకొను.

చంకలు వైచుకొను

  • చంకలు కొట్టుకొను, సంబరపడు.
  • "కానున్న పనికి చంకలు వైచుకొన రాదు, గడచిన వెత దు:ఖపడఁగ రాదు...." రామలిం.

చంకలో పెట్టుకొని పోవు

  • సంగ్రహించుకొని పోవు.
  • "కాస్త అజాగ్రత్తగా ఉన్నా మంటే వాడు దొరికిందాన్ని చంకలో పెట్టుకొని పోతాడు." వా.
  • రూ. చంకను పెట్టుకొని పోవు.

చంక వైచుకొను

  • చంకలు కొట్టుకొను.
  • ఇది సంతోషసూచకము.
  • "సంతసము నాపఁజాలక చంక వైచు, కొనుచు నొకదాఁటు గొని." ప్రభా. 3. 134.

చంగున.....

  • దుముకు ఇత్యాదులలో. ధ్వన్యనుకరణము.
  • కళా. 8. 89.

చంటిక్రిం దిఱికి

  • కొంగుచాటున నుంచి.
  • అనగా వెంట వెంట తిరుగునట్లుచేసి అనుట.
  • "ఈరీతిఁ జంటిక్రిం దిఱికి నాతొత్తు." గౌ. హరి. ద్వితీ. పంక్తి?

చంటిపాప

  • పసిపాప.