పదబంధ పారిజాతము/గొల్లెనబండి

వికీసోర్స్ నుండి

గొల్లున నవ్వు

  • గట్టిగా నవ్వు.
  • ధ్వన్యనుకరణము.

గొల్లు మను

  • దు:ఖించు; ఏడ్చు.
  • ధ్వన్యనుకరణము.
  • మాటా. 127.

గొల్లెనబండి

  • గూటిబండి. వావిళ్ల. ని.

గొవరువోవు

  • కమిలి పోవు.
  • "కొన్ని దేశంబు లెండచే గొవరు వోయె." కాశీ. 1. 177.

గొహారు చేయు

  • తపింప జేయు.
  • "మంట మాని శంబరారిఁ గూడినన్, గోహారు సేయ నేల సారెకుం జలంబునన్." పాండు. 2. 180.

గోండ్రలు పెట్టు

  • గర్జించు. చాటు. 2. భా.

గోండ్రు పెట్టు

  • గర్జించు, ఱంకె వేయు. బ్రౌన్.

గోకుడుపాఱ

  • దోకుడుపార.

గోచారము

  • గ్రహసంచార ఫలితము. తత్ఫలితంగా జీవితంలో ఫలితం చెప్పుట జ్యోతిశ్శాస్త్ర ప్రక్రియ. ఫలితానికే పేరయినది.
  • "గోచారం బాగు లేదు - జాతకం ప్రకారం బాగుందే అనుకో." వా.

గోచికట్టు

  • బ్రహ్మచారి. పాండు. 5. 238.

గోచికా డగు

  • ఉన్న దంతా పోగొట్టుకొను.
  • "గోఁచికాఁ డై దానిఁ గొనుచు నేతెంచి." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 1050.

గోచికాడు

  • బ్రహ్మచారి.

గోచి గట్టిన నాటగోలె

  • చిన్నప్పటినుండి.
  • "గోఁచి గట్టిననాఁటఁ గోలెఁ బీనుఁగుల, మోచి గడించినమూలధనంబు." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 886-87.

గోచిగాని చేయు

  • గోచి మిగులునట్లు చేయు.
  • "పాయక పై నున్న బట్టఁ బోఁజేసి, గారించి యిల గోచిగానిఁ గావించి." నలచ. ద్వి. 2.693 పం.
  • చూ. గోచి చేతి కిచ్చు.

గోచి చేతి కిచ్చు

  • నిరుపేదనుగా చేయు. చిప్ప చేతి కిచ్చు వంటిది.
  • "నీ చేతి రాజ్యంబు నీదు పట్టంబు, గోఁచి చేతికి నిచ్చి కోరి కైకొనియె." వర. రా. అయో. పు. 373. పంక్తి. 14.
  • "ఏచి వల్లము దోఁచి గోచి చేతికి నిచ్చి, చిఱుతసన్యాసిఁ జేసినపిసాళి." (తె. జా.)

గోచిపాతరాయడు

  • సన్యాసి, దరిద్రుడు. చింతా. 2. 13.
  • "వాని కే ముంది? వట్టి గోచిపాతరాయడు." వా.

గోచిపాతరాయడు దొంగల మిండ డనుమాట

  • లేనివాడు దొంగలకు భయపడవలసిన పని లే దను మాట.
  • "రమణి గోచిపాఁతరాయఁడు దొంగల, మిండఁ డనెడుమాట మేలు దెలిసి." కుచే. 3. 47.

గోచి పెట్టక ముందునుంచే

  • చాలా చిన్నతనంనుంచే అనుట.
  • "వాడు సరీగా గోచి పెట్టక ముందు నుంచే నాకు తెలుసు."

గోచి పెట్టిన నాటినుంచీ

  • చిన్నతనంనుంచీ, బాల్యం నుంచీ.
  • "వాణ్ణి గోచి పెట్టిన నాటినుంచీ నాకు తెలుసు. నా కేం అతడు కొత్త గనకనా?" వా.
  • రూ. గోచి పెట్టడం రాకు ముందు నుంచే.

గోజాడు

  • పీడించి అడుగు. బ్రౌన్.

గోజులాడు

  • చూ. గోజాడు.

గోటితో పోవుపనికి గొడ్డలి యెందుకు?

  • సులువుగా నెరవేరుపనికి విశ్వప్రయత్న మెందుకు? ముందే జాగర్త పడితే సులువుగా అయ్యేపనికి ఆలస్యం చేస్తే మహాప్రయత్నం కావలసి వస్తుంది - అని కూడ.
  • ఏ చిన్న మొక్కగానో ఉండగా గోటితో తుంచి వేస్తే పోతుంది. అప్పుడు ఆపని చేయక మానుగా పెరగనిస్తే, గొడ్డలితో గానీ నరకడానికి వీ లుండదు. ఈ సత్యాన్ని తెలిపే పలుకుబడి.
  • "గొనకొన గోట నౌపనికి గొడ్డలి యేటి కటంచుఁ బల్కె." తారా. 4. 160.

గోడకాలు

  • కరగోడ.
  • "కమ్మతేనియ నీళ్ళు గట్టి పుప్పొడి మట్టి, గోడ కా ల్దీర్చినప్రోడతనము." రా. వి. 3. 81.

గోడకు చెవు లుంటాయి.

  • ఎవరైనా వినగలరు జాగ్రత్త అనుపట్ల ఉపయోగించే మాట.
  • "కాస్త మెల్లిగా మాట్లాడు. గోడకు చెవు లుంటాయి." వా. గోడకుర్చీ వేయించు
  • బడిలో పిల్ల వానిని గోడ కానుకొని కుర్చీలో కార్చున్నట్టుగా అడుగున ఏ ఆధారం లేకుండగా కూర్చుండ బెట్టి ఉపాధ్యాయుడు శిక్షించు.
  • పూర్వం వీధిబళ్లలో యిది అనుదినం కనిపించేది.

గోడ గడుగ పోతే కొనదాకా రొంపే

  • అసులుతోనే కట్టినగోడను ఎంత కడిగినా అసులే అవుతుంది.
  • గొంగడిలో వెండ్రుకలు ఏరినట్టు వంటి మాట. తాళ్ల. సం. 9. 279.

గోడగించు

  • 1. పాట పాడు.
  • "మగతుమ్మెద ప్రోడలు గోడగించు ఝుం,కారము కార మయ్యె." కవిక. 3. 87.
  • 2. మించు, పోటీపడు.
  • "మండు వేసవినాఁటి మార్తాండ బింబంబు, గోడగించు పసిండి గుబ్బ తోడ." కాశీ. 4. 294.

గోడచేర్పు

  • ఎప్పుడూ గోడకు చేర్లబడి ఉండేవాడు - సోమరి అనుట.
  • "మొండరి చల్లచప్పుడు గోడచేర్పు, చండిపో తనునట్టి జాడ నున్నాడు." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 1497-98.

గోడచేర్పు ప్రతిమ

  • పనికి రానివాడు. ఉత్సవవిగ్రహం వంటివా డనుట. తాళ్ల. సం. 3. 640.

గోడ దుమికే వయసు

  • యౌవనము.
  • గోడ దుముకుట వ్యభిచార సూచకము. దానిపై వచ్చిన పలుకుబడి.
  • "వా డిప్పుడు గోడ దుమికే వయస్సులో ఉన్నాడు. అలా చేయక ఎలా చేస్తాడు?" వా.
  • చూ. గోడలు దుముకు.

గో డనబోవు

  • మొఱబెట్టుకొన బోవు.
  • "కుబేరుఁ డేఁగె న,ద్దనుజుల నింత చేసిన విధాతకు గోడనఁ బోవుచాడ్పునన్." ఉ. హరి. 1. 42.

గోడ నిక్కి చూచు

  • కుతూహలంతో దారిని పోవు వారిని దొంగ చూపులు చూచు.
  • "గోడ నిక్కి చూచుఁ గొప్పు దీర్చు....బంధకీవధూటి." జైమి. 3. 29.

గోడపురువు

  • నల్లి.

గోడపెట్టు, చెంపపెట్టు

  • రెండువైపులా దెబ్బ తగులు.
  • "తలఁప నెదురుఁ దమ్ము దెలియని వానికిఁ జేరి గోడపెట్టు చెంపపెట్టు." హరిశ్చం. (వీర) 3. 76. పే.

గోడపై సున్నము

  • అశాశ్వతము. తాళ్ల. సం. 3. 546.

గోడబారు

  • అందుబాటులోనిది.
  • గోడకు చేరగిలబడుటకై పొడవుగా గుండ్రముగా కుట్టి యుంచిన దిండు.
  • "ముష్కరత్వము వాని ముంగొంగు బంగారు, కూహకత్వము వాని గోడబారు." రామలిం. 12.

గోడమీద పిల్లి

  • ఎటు గాలి వీచితే అటుతిరిగే రకం.
  • "వాడు గోడమీది పిల్లి. ఏ వైపు ఎప్పుడు మొగ్గుతాడో నమ్మడానికి వీలు లేదు." వా.

గోడమీది సున్నము

  • ఉపయోగించుకొన వీలు లేనిది. తాళ్ల. సం. 7. 34.
  • చూ. గోడపై సున్నము.

గోడలు దుముకు

  • వ్యభిచరించు, కట్టు తప్పి ప్రవర్తించు.
  • "మావాడి పెండ్లి ఏం తొందర వచ్చిందయ్యా ! అప్పుడే. గోడలు దుముకుతున్నాడా? తడకలు తోస్తున్నాడా?" వా.

గోడలు పైడి సేయు

  • ఎంతైనా సంపాదించ గలుగు. గోడలు కూడా బంగారువి కట్టించగలం అనుట.
  • ఇప్పటికీ వాడుకలో 'నేనూ ఆవిధంగానే సంపాదించి ఉంటే యీపాటికి బంగారు గోడలు కట్టించి ఉండనా?' - అని అనడం కలదు.
  • "ఊర నీవు నే, నును గడియింపఁ జొచ్చినఁ దనూభవ! గోడలు పైఁడి సేయమే?" శుక. 3. 76.
  • "నీవూ నేనూ సంపాదిస్తే బంగారు గోడలు కట్టించ లేమా?" వా.

గోడా గొట్టా లేకుండా మాట్లాడు

  • యథేచ్ఛగా మాట్లాడు.

గోడాడు

  • బాధ పడు, విలపించు.
  • "తలపోఁత బ్రాఁతె తలఁపులకుఁ దమ కొలఁ దెఱుంగని మతి గోడాడఁగా." తాళ్ల. సం. 5. 41.
  • "ఆడపిల్ల నిట్లా గోడాడించడం మంచిది కాదు." వా.

గోడిపట్టెలు

  • ఒక పిల్లల ఆట.
  • "గుళ్లు దాగిలిముచ్చులు గోడి పట్టెలు..." వి. పు. 7. 202.

గోడివడు

  • ఒరగడ్డంగా వాలు.
  • "గోగణము ముంగలిగ నేల గోడి వడఁగ, నడచు కౌరవరాజసైన్యంబుఁ గనియె." భార. విరా. 4. 250. గోడి వెట్టు
  • ఏటవాలుగా పెట్టు. శ. ర.

గోడు కుడుచు

  • గోడు పెట్టుకొను.
  • "జళుకు పుట్టించి నీ సకలరాజ్యంబు, గోడు గుడువఁ బుచ్చుకొని." గౌ. హరి. ప్రథ. పంక్తి. 1774-75.
  • "క్రేపునిదల్లు, లాస్థఁ దన్నంగ నమ్మహావస్థ చేత, గోడి గై పుట్టియును గోడు కుడువ వలసె." హంస. 4. 32.
  • చూ. గోడు పెట్టుకొను.
  • రూ. గోడు గుడుచు.

గోడు కుడుపు

  • కష్టపెట్టు. కాశీ. 7. 95.

గోడు గోడున నేడ్చు

  • ఎక్కువగా ఏడ్చు.
  • ధ్వన్యనుకరణము.
  • "ఆ మాయలాడి యపు డా, కోమలి మొగడు గని గోడుగోడున నేడ్వంఁగా మఱియు వెరవు దోఁపఁగ గ..." శుక. 2. 42.
  • రూ. గోలు గోలున నేడ్చు.

గోడు పెట్టుకొను

  • వేధించు. బాధించు.
  • "వాడు నా గోడు పెట్టుకొంటున్నాడు." వా.
  • చూ. గోడు పోసుకొను.

గోడు పోసుకొను

  • బాధించు, వేధించు.
  • "వా డెప్పుడూ ఊళ్లోవాళ్ల గోడు పోసుకొంటూ ఉంటాడు." వా.
  • చూ. గోడు పెట్టుకొను.

గోడు సేయు

  • ఓడగొట్టు.
  • "కోటిచంద్రుల డాలు గోడు సేయఁగఁ జాలు, మొగము కుంకుమచుక్క సొగసు గుల్క." వీధి. 9.

గోడ్రెప్ప కన్ను

  • ఱెప్పలు వాచిన కన్ను. పండితా. ద్వితీ. మహి. పు. 108.

గోతులు తీయు

  • 1. ద్రోహము తలచు.
  • "వాని కెప్పుడూ ఒకరిక్రింద గోతులు తీయడం అలవాటు." వా.
  • 2. శాస్తి చేయుటకు సిద్ధముగా ఉండు.
  • "తీసియె యుంచినార లటఁ వాని గోతులు." గీర. లోకా. 17.
  • "మీకోసం గోతులు తీసే ఉంచారు. వెళ్లండి." వా.

గోదావరి గలుపు

  • పరిత్యజించు, పాడు చేయు.
  • 'గంగలో గలుపు' వంటిది.
  • "కులము గోదావరిఁ గలిపి వేశ్యాసంగ, మాసచేఁ గావించితే సుపుత్ర." నిరంకు. 2. 83.
  • చూ. గంగ కలుపు.

గోనె బట్టిన బంక

  • వదలనిది. తాళ్ల. సం. 11. 3. భా. 125.

గోపాల మెత్తు

  • భిక్ష మెత్తు.
  • 'అమ్మా గోపాలం' 'తాయీ కవఖం' అంటూ బిచ్చ మెత్తు టపై వచ్చినది. మాదాకవళ మన్నట్లే సందగోపాల మనుటా అలవాటు.
  • "గోపాల మనుచు, వీధి నెవ్వారు నుడివిన వెక్కిరించు." విప్ర. 3. 15.

గోపిచందనం

  • ఒకజాతి సుద్దమన్ను. పచ్చగా ఉంటుంది. వైష్ణవులు బొట్టుగా ఉపయోగిస్తారు.

గోప్రవేశము

  • సాయం వేళ, గోధూళివేళ.

గోముఖవ్యాఘ్రము

  • పైకి మంచిగా ఉంటూ లోపల చెడుగుణము కలవాడు.
  • "తనకు నేల యమృతధామాఖ్య గోముఖ, వ్యాఘ్ర మనఁగ నిట్టివాఁడె సుమ్ము." కళా. 6. 268.

గోరం గడుతేరుపనికి గొడ్డలి యేల?

  • చిన్నదానికి పెద్ద ప్రయత్న మెందుకు?
  • "నేరుపు లేటికిఁ జూపను, గోరం గడతేరుపనికి గొడ్డలి యేలా?" రుక్మాం. 2. 127.
  • చూ. గోటితో పోవుపనికి గొడ్డలి...

గోరంత

  • కాసంత.
  • "వాడికి గోరం తైనా కనికరం లేదు." వా.

గోరంత ప్రొద్దు

  • 1. కాసేపు.
  • "వారును దాను నవారితశక్తి, గోరంత ప్రొద్దు మేకొని కట్టు బిగిచి." బసవ. 3. 65.
  • 2. కొద్దిగా ప్రొద్దున్న దనుట.
  • "గోరంత పొద్దైనా లేదు. మనం పోవలసినదూరం చాలా ఉంది." వా.

గోరంతలాట

  • ఒక బాలక్రీడ. పండితా. ప్రథ. పురా. పుట. 460.

గోరం జీరు

  • గోటితో గీరి సైగ చేయు.
  • "కంటికిం బ్రియం బైనవానిం గామించియు గోరం జీరియుఁ గొంత యాస తీర్చుకొని." శుక. 2. 10.

గోరంతలు కొండంతలు చేయు

  • చిన్న దానిని పెద్దగా చేయు.
  • "ఎంతకుఁ దెచ్చెనే సరసిజేక్షణ చెయ్దము లిందుమీఁద జ,న్మాంతరవర్తనంబు హృదయంబున కిత్తఱి నెచ్చరించి గో,రంతలు కొండ లంత లగునట్లుగఁ జేసితి మంచుఁ జేటికా,వాంత సతాళవృంత మృదువాతహిమాంబుకణాళిఁ జేర్చినన్." ఆము. 5. 77.
  • "వాని కెప్పుడూ గోరంతలు కొండంతలు చేసి చెప్పడం అలవాటు. వాడేదో మాటవరసకు పలకరిస్తే త నేదో మిత్రు డంటున్నా డేమిటి?" వా.

గోర దివియగా నే ఱై పాఱు

  • కొంచెము కల్పించుకొను టతో విపరీతముగా పరిణమించు.
  • గోటితో గీఱినంత మాత్రాన ఏ ఱై పాఱునంతటి ప్రవాహము వచ్చిన దనుట వాచ్యార్థము.
  • "ఇల నిట్టలి గోరఁ దివియ నేఱై పాఱున్." కళా. 5. 63.

గోరపడు

  • ఆశపడు.
  • "గోరపడి గడించేవి కోట్లకొలఁదులు, తారి తూరి నోటికిఁ దగ్గంత గాదు." తాళ్ల. సం. 9. 249.

గోర బోవుటకు గొడ్డలి తాళ్ల. సం. 9. 285.

  • చూ. గోటితో పోవుపనికి గొడ్డలి యెందుకు?

గోర బోవుపనికి గొడ్డలి యేల?

  • స్వల్పశ్రమతో సరిపడు దానికై పెద్ద ప్రయత్నము చేయు టెందుకు? కళా. 7. 267.
  • చూ. గోటితో పోవుపనికి గొడ్డలి యెందుకు?

గోరవోవు

  • మొక్క పోవు.
  • "నోరిమాటకుఁ దన కేమి గోర వోయె." భాగ. స్క. 4. 42.
  • వాడుకలో మొక్క పోవు అనుటే నేటి అలవాటు.
  • "ఏ మయిందే అదామాటంటే నీ కేం మొక్క పోయిందా?" వా.

గోరింపు బంతులు

  • ఒక పిల్లల ఆట.

గోరింపు లాడు

  • గోరాడు - కొట్టి కోరాడు.
  • "తొలి వేలుపుల మూక దురములో గోరింపు, లాడి తాండవ మాడునట్లు గాదు." నిరం. 3. 9.

గోరిడు

  • గిల్లు.
  • "మడిచి యందిచ్చునపుడు గో రిడుదుఁ గేల." నైష. 8. 84.

గోరీ కట్టించు

  • రూపు మాపు.
  • "గోరీ కట్టింపమె కాకవిప్రతతి కర్థిన్ నేఁడు హేలాపురిన్." నానా. 148.

గోరు గల్లు

  • గోళ్ళు తీసే మంగలిసాధనం.
  • "పదను గోరుగండ్లఁ బదరక కొందఱ, కండ్లు వెఱికి." సానందో. 3. 108.
  • రూ. గోరుగోలు.

గోరు గాలము

  • గోరులాంటి కొనగల గాలము.

గోరుగొండి

  • మొన వాడిగా పలుచగా తట్టి చేసిన ఇనుప కడ్డీ. నేడీ మాట గోళ్లు తీయుట కుపయోగించే మంగలి కొఱముట్టునకే ఉపయుక్త మవుతున్నది.
  • "గోరుగొండ్లును యామికులు కొని తేర." పండితా. ద్వితీ. మహి. పుట. 22.
  • రూ. గోరుగోలు.

గోరుచిక్కుడు

  • ఒకొక ప్రాంతంలో ఒకొక పేర పిలువబడు చిక్కుడులో ఒక జాతి.
  • మొటిక్కాయ, గోరు చిక్కుడు, సౌళేకాయ అని దీనికే పేళ్ళు,

గోరు చీరణము

  • ఒక రకమైన ఉలి. శ. ర.

గోరుచుట్టు

  • గోటి క్రింద వ్రేలికొసన లేచే కుఱుపు.

గోరుచుట్టుపై రోకటిపోటువలె

  • ముందే బాధ భరింప లేక ఉండగా దానిపై మరింత బాధ యేర్పడుపట్ల ఉపయోగించే సామ్యం. వలెకు బదులు ఉపమావాచకా లన్నీ ప్రయుక్త మవుతాయి.
  • "కాఁక నెదిర్చి సంగరముఖంబున హెచ్చిన రాజవంశమున్, గూఁకటి వ్రేళ్లతోఁ బెఱికి గోత్రవధంబును జేసి నట్టి యా,వ్రేఁకపుఁగీడు గాక ప్రజ వేచఁ దలంచిన గోరుచుట్టుపై, రోఁకటి పోటుచందముగ రోసి జనుల్ ననుఁ జూచి తిట్టరే?" జైమి. 1. 64.
  • చూ. గోరుచుట్టుమీద....

గోరుచుట్టుమీద రోకటిపోటు

  • రాధా. 2. 175.
  • చూ. గోరుచుట్టుపై....

గోరుపడము

  • నల్ల కంబళి.

గోరుపు లాడు

  • బంతి యాడు.
  • "గురుకుచ గుబ్బచన్నుఁగవ గోరుపు లాడును బుట్టచెండ్ల..." చంద్రా. 2. 122.

గోరుముద్దలు

  • చిన్నపిల్లలను మరిపించి తినిపించు ముద్దలు, తల్లి పిల్లనికి పెట్టే ముద్దలు.

గోరుముష్టి

  • గోజాడి అడుగుకొని తినుట. గోరు మునిగేదాకా పెట్ట మని పిల్లలు తోడిపిల్లలవద్ద ఉన్న తినుబండారాలను కొసరి కొసరి తీసికొనుటపై వచ్చినది.
  • చూ. గోర్ముష్టి.

గోరు మోపేంత స్థలం కూడా

  • చాలా కొద్ది స్థల మైనా (లేదు).
  • "వాళ్లింట్లో గోరు మోపేంత స్థలం కూడా లేదు. బంధుబలగం అంతా వచ్చి వాలింది." వా.

గోరు రాజనాలు

  • ఒక రకమైన ధాన్యం.

గోరువెచ్చ

  • నులివెచ్చ.
  • గోటికి వెచ్చగా కనిపించేంత అనుట.
  • కవోష్ణం.
  • "గోరువెచ్చ నీళ్లల్లో స్నానం చేయడం మంచిది." వా.

గోరొత్తులు

  • నఖక్షతములు.
  • "నెమ్మోవి పీడఁ జింతిలు పరాకునఁ బోలె, గోరొత్తులకుఁ జనుగుబ్బ లొసఁగి." కళా. 7. 166.

గోర్గొండి

  • గోరుగల్లు.
  • "వాడి గోర్గొండిఁ గన్నులు దోడియైన." భీమ. 6. 100.
  • చూ. గోరుగొండి.

గోర్పిళ్ళార్చు

  • చెండువలె ఎగుర జేయు. రామా. 6. 206.

గోర్ముష్టి

  • గోరుముష్టి.
  • "ధీ, యుతు లౌవారికి సైతమున్ గట కటా! యూరూర గోర్ముష్టి యే, గతి." నానా. 75.
  • చూ. గోరుముష్టి.

గోలతనము

  • అమాయకత్వము.
  • "పెన్, గోలతనంబునన్ మగఁడు కొట్టిన." పాండు. 4. 144.

గోవతనము

  • దుర్మార్గము.
  • "మీవీటిమ్రుచ్చు లేవురు, మావీటం గన్న పెట్టి మణిభూషణముల్, గోవతనంబునఁ దెచ్చిరి, నీ విటు సేయించు టెల్ల నేరమ కాదే." దశ. 4. 24.

గోవ మొలత్రాడు

  • మొలతాడు.
  • మగవాని మొలత్రా డని శ. ర. ఆడవాళ్ళకు మొలతాడు వేసుకునే ఆచారం అరుదు మఱి!

గోవాళ్ళు (ళులు)

  • యువకులు, విటులు.
  • "తిమిరంపు వయసు గుబ్బల, కొమరాలవు నీకుఁ దగినగోవాళ్ళ మహిన్, నెమకి గనరాదె ముఱిసిన, మముఁ జెనకిన నేమి గలదు మద మేమిటికిన్?" మను. 4. 83.

గోవావుల కోడెలు

  • పోట్లమారి కోడెదూడలు. గోవావు లనగా దుష్ట మగు గోవు లని వావిళ్ల. ని.
  • "తలపోఁతల్ దల లెత్తెఁ దాల్మి సడలెం దాపంబు దీపించె జేఁ,తలు డిందెన్ ధృతి వీడుకోలు గొనియెన్ దైవాఱెఁ కన్నీరు కో,ర్కులు గోవావుల కోడె లై నిగిడె సిగ్గుల్ దూర మై పోయె." విక్ర. 4. 154.

గోవింద కొట్టు

  • నిరసనగా చనిపోయె ననుపట్ల ఉపయోగించే మాట.
  • "తన మామ తన కేదో యిస్తా డని వీడు ఆదరా బాదరా పరిగెత్తాడు. ఈ లోగా వాడు గోవిందా కొట్టాడు. సరి పోయింది." వా.
  • "వాడు గోవింద కొట్టా డట. నీకు తెలుసా?" వా.

గోవిందా అనిపించు

  • ఇక చాలు రా అనిపించు.
  • "గో,విందా యనిపించుకవులు వేవేలు సుమీ." గీర. గురు. 20.

గోవువెంట తగులు కోడెభంగి

  • ఎప్పుడూ విడువక - వెన్నంటి అనుట.
  • కాస్త విద్యావంతులు సంభాషించుకొనునప్పుడు ఉపయోగించే పలుకుబడి.
  • ఇది భాఫవతంలోని ఒకా నొక పద్య భాగం.
  • "వా డెప్పుడూ ఆ అమ్మాయి చెరుగు వదిలేట్టు లేడు. గోవువెంట దగులుకోడె భంగి అన్నట్లుగా ఉంది వీడి వ్యవహారం." వా.

గోసడచు

  • నిందించు.
  • "మనలన్ ధూర్జటితోడ గోసడఁచి కామధ్వంసి పట్టీక పొం,డని చక్రాం కునిఁ జూపి..." నిర్వ. 2. 93.

గోసన వుచ్చు

  • చాటించు, ఘోషణ చేయించు, ఘోషించు.
  • "గోసనంబులు వుచ్చి సర్వస్వదాను లగుచుండిరి." కుమా. 11. 59.
  • "దాసియున్, గొఱగొఱ వీట నెల్లెడల గోసన పుచ్చిన." దశ. 10. 126.
  • "తనదుర్వారతరప్రతాపమునఁ జిత్త స్నేహముల్ గట్టి సే,యు నితం డెట్టి విదగ్ధుఁడో దలఁప నోహో యంచు లోకంబు గో,సనపుచ్చన్." దశ. 1. 7.
  • రూ. గోసన పుచ్చు.

గోస నాస ఉదయించు

  • ఘోషణ బయలుదేరు. ఊరంతా గుప్పు మను.
  • "శాఖోపశాఖల సాఁగుచున్నది రట్టు, గుఱి లేక యుదయించె గోస నాస." శివ. 3. 71.

గోళ్ల కుతికంటు

  • ఒకనగ.
  • "....గోళ్ల కుతికంటు నునిచె నొకతె." రాధి. 1. 93.

గోళ్లు గిల్లుకొను

  • ఏ పని పాటా లేక ఉండు.
  • "వాడు పొద్దస్తమానం గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటే ఆవిడ మాత్రం ఏం చేస్తుంది?" వా.

గోళ్లు మీటు

  • గోళ్లు గిల్లుకొను. నిర్వ్యాపారిగా ఉండు.
  • "పనుల కొడ ల్వంగక కా,మిను లిద్దఱుఁ గూడి గోళ్లు మీటుచు దాదుల్...." శుక. 2. 333.
  • "వాడు పని లేక గోళ్లు గిల్లుకొంటూ కూర్చున్నాడు." వా.

గోళ్లు రాచు

  • కలబడు, రాపాడు.
  • "ఆ యెల ప్రాయమున్ భవదుదంచిత కీర్తియు గోళ్లు రాచఁగాఁ, గాయజుఁ డాకెపై నలిగి కత్తులు నూఱుచు..." కళా. 7. 35.