పదబంధ పారిజాతము/గూబకండ్లు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

గృహకృత్యములు దీర్చు

 • ఇంటిపనులు నెఱవేర్చు.
 • "తనదు గృహకృత్యములు దీర్చుకొనుచు నుండె." హంస. 5. 365.

గృహచ్ఛిద్రాలు

 • ఇంటి యిబ్బందులు.
 • "ఈమధ్య చాలా గృహచ్ఛిద్రాలు వచ్చాయి. వాటితో నా మనస్సు ఏమీ బావుండ లేదు." వా.

గెంటస మాడు

 • హాస్య మాడు. న్యూనతపఱచుచు మాట లాడు.
 • "బ్రహ్మవారువముల, గెంటసం బాడు నడ గల్గుకిసలయోష్ఠి." పాండు. 3. 193.

గెంటు గుంటును లేక

 • గంటు గణుపు లేక.
 • అనగా నవురుగా సవురుగా. స్తంభాలకూ వానికీ ఉపయోగించే కఱ్ఱలో గంటూ గణుపులూ లేకుండా ఉన్నప్పుడే అది స్థిరంగా శాశ్వతంగా ఉంటుంది.
 • "భవనఘటనకు మొదలికంబమును బోలె....నెట్టుకొనియె గెంటు గుంటును లేక." పాండు. 2. 55.

గెంటు గొంటును లేక

 • నవురుగా సవురుగా.
 • "నిట్ట నిలుచున్కిచేఁ గాదె నెట్టు కొనియె, గెంటు గొంటును లేక లక్ష్మీ కళత్ర !" పాండు. 2. 55.
 • ఇదో పాఠాంతరం.

గెంటుపడు

 • తప్పిపోవు; వైతొలగు.
 • చూ. గెంటువడు.

గెంటువడు

 • తప్పించుకొను. గెంటినప్పుడు మనిషి ఆవలి వైపుకు పోవును కనుక గెంటువడుట అనగా తప్పించుకొనుటగా మారినది.
 • "గదాహతి నొకఁడున్, గెంటు వడకుండఁ బీనుఁగుఁ, బెంటలు గావించె." జైమి. 3. 105.

గెడకత్తియ

 • ఆటది; తోటిది.
 • దొమ్మరివాడు గెడకట్టి ఆడడం ప్రసిద్ధం. గెడసాని కూడా ఇలా వచ్చిందే.
 • "తమతోడ నాడు గెడకత్తియ కాఁ గయిసేసి రామనిన్." కుమా. 9. 108.
 • రూ. గెడకత్తె.

గెడగూడు

 • కలగూడు.
 • "గెడగూడ దీని నతని యొడలిపయిం బెట్టి కాల్చు టుచితంబు." భార. విరా. 3. 12.
 • 2. కలియు - రత్యర్థ మై.
 • "ఉష్ణ శీతాన్న కబళము లొకఁడు సూపఁ బవలొ రాత్రియొ గెడగూడ నవసర మని, దాని కుత్తర మొకలతా తన్వి యిచ్చె, నధరబింబము విఱిచి సంధ్యాగమ మని." నైష. 9. 187. గెడగూడి పాఱు
 • పరువెత్తు - జతగా - పందెం వేసుకొని...
 • "మిన్ను దలఁబాఱె ఖగపతి, యన్నదియును బాఱఁదొడఁగె నవని యద్రువ నే, మున్నో తా మున్నో యని, పన్నిదమునకు గెడగూడి పాఱినభంగిన్." భోజ. 7. 42.

గెడసేయు

 • కలుపు ; జత చేయు.
 • "గెడసేయుము నన్నుఁ గార్తికేయుని తోడన్." ఉత్త. హరి. 5. 15.

గెర గట్టుకొను

 • కుదురు కట్టుకొను.
 • "గెర గట్టుకొని పుట్టు నెర పూప చనులతో." రాధి. 1. 53.

గెఱగొను

 • రూపొందు.
 • "క్రీగంటిచూపున గెఱగొన్న సన్న గేదంగి, ఱేకుల కన్నదమ్ము లగుచు." ఉత్త. హరి. 1. 131.

గెలుపుకంబము

 • విజయ స్తంభము. వరాహ. 1. 20.

గెలుపుకాడు

 • విజేత.

గెలుపుకొను

 • జయించు. విక్ర. 6. 26.

గెలుపోటములు

 • జయాపజయములు. శృంగా. శాకుం. 1. 164.

గెల్లువడు

 • విజృంభించు. పద్మ. 7. 238.

గేదగితేనె నాకించు

 • నోరు తీపు చేయు, కాస్త తడి చేయు.
 • "సానితల్లికి తిక్క చనుదెంచి నపుడెల్ల, గేదఁగితేనె నాకించవలయు." చింతా. 5. 47.

గేనము లేక

 • ప్రజ్ఞ లేక, మై మఱచి.
 • "గాంగేయుఁడుఁ దారకాసురుఁడు గేనము లే కని సేసిరి." కుమా. 12. 144.
 • వాడుక - "వంటిమీద ప్రజ్ఞ లేకుండా గుంపులో జొర బడ్డాడు."
 • కేనము అంటే కన్నడంలో సంకోచము అని కూడా అర్థం. ఎట్టి సంకోచము లేక అని కూడా దీనికి అర్థం చెప్పవచ్చును; కానీ సుదూరార్ధం.

గేలికొట్టు

 • పరిహసించు. పరమ. 1. 15. పుట.

గేలిగొను

 • గేలి సేయు. భార. శల్య. 2. 215

గేలి చేయు

 • హాస్యము చేయు.

గేలి పెట్టు

 • గేలి చేయు. గేలి సేయు
 • గేలి చేయు.

గొంజెగొడుగు

 • ఆతపత్రము.
 • "గొంజెగొడుగులే కొం డెల్లా." తాళ్ల. సం. 11. 3 భా. 53.

గొండ్లికొను

 • నాట్య మాడు. సుద. 3. 34.

గొంతు ఆరిపోవు

 • అఱపువల్ల గొంతు తడి ఆరు.
 • "అరగంట మాట్లాడేసరికి నా గొంతు ఆరిపోయింది." వా.

గొంతుక తడుపుకొను

 • దప్పి తీర్చుకొను, కడుపు నించుకొను. గువ్వలచెన్న. 3.

గొంతుకు ఉరి యగు

 • బాధాకరముగా పరిణమించు.
 • "వీడు నాకు గొంతుకు ఉరి అయి కూర్చున్నాడు." వా.

గొంతు కూచుండు

 • పట్టు పట్టు.
 • "వాడు ఈపని చేస్తేకాని అన్నం తిన నంటూ గొంతు కూచున్నాడు." వా.

గొంతు కూర్చొను

 • మోకాళ్లపై గొంతు మోయునట్లుగా కూర్చుండు.
 • "భోజనందగ్గర గొంతు కూర్చుంటూ వేమిట్రా!" వా.

గొంతు కొను

 • గొంతు కూర్చుండు.

గొంతు కోయు

 • ద్రోహము చేయు. నా. మా. 28.

గొంతు కోసినా....

 • ఏమి చేసినా అనుట.
 • "వాడు గొంతు కోసినా నిజం చెప్పేనా?" వా.

గొంతు చించుకొను

 • అఱచు.
 • నిరసనగా మాట్లాడేటప్పుడు ఉపయోగించే పలుకుబడి.
 • "ఎందుకు అంత గొంతు చించుకుంటావు రా? పిల్లవాళ్లు అల్లరిఒ చేయక పోతే మనం చేస్తామా?" వా.

గొంతు చిదుము పని

 • మెడ నులిమి చంపుట.
 • "కుఱుచవగ చిక్కటారిం, బరికింపక గొంతు చిదుముపనిఁ దలఁచి..." శుక. 1. 318.
 • చూ. గొంతు పిసుకు, మెడనులుము, తల దఱుగు ఇత్యాదులు.

గొంతు చేసికొను

 • అఱచు.
 • "ఇంతీ! యెవ్వరు లే రని, గొంతేటికిఁ జేసె దెవరు గొనిపోయెదరే?' హంస. 3. 222.

గొంతున బడు

 • గొంతులో తగుల్కొను, (మింగునపుడు) మింగుడు పడక పోవు.
 • "వెన్నెలముద్ద భుజింపఁ బోయి గొం,తునఁ బడవేసికొన్న హిమతోయ మొసంగిరి." నిరంకు. 2. 104. గొంతు నొక్కు
 • నోరు నొక్కు. నా. మా. 12.

గొంతు పట్టుకొను

 • 1. గొంతుమీదికి వచ్చు.
 • "అప్పు డేదో అన్నాను. ఇప్పు డది గొంతు పట్టుకొంది." వా.
 • 2. గొంతున కడ్డము వచ్చు.
 • "గొంతు పాట్టుకొం దేమో! మంచినీళ్లు తాగ రా ! అంత యెక్కిళ్లు పెడుతున్నావు." వా.

గొంతు పెగలకుండు

 • నోట మాట రాకపోవు.
 • "వా డింట్లో తెగ వాగుతాడు గానీ నలుగురిలోకి వస్తే గొంతు పెగలదు." వా.

గొంతుపోక

 • గొంతుముడి.
 • చూ. గొంతుముడి.

గొంతు బొంగురు పోవు

 • 1. గద్గద మగు.
 • "వాళ్లమ్మ కనిపించగానే భావాతిరేకం పట్ట లేక పోయాడు. వాని గొంతు బొంగురు పోయింది." వా.
 • 2. గొంతు రాచి పోవు.
 • "పురాణం చదివి చదివి వాడిగొంతు బొంగురు పోయింది." వా.

గొంతుమీద కూర్చొను

 • ఏదైనా యిప్పుడే కావా లని నిర్బంధించుపట్ల ఉపయోగించే పలుకుబడి.
 • "ఇప్పుడే సొమ్మంతా కావా లని వాడు గొంతుమీద కూర్చున్నాడు." వా.

గొంతుమీదికి వచ్చు

 • ప్రమాదస్థితి ఏర్పడు; ప్రాణాలమీదికి వచ్చు.
 • "ఆ విషయం యిలా గొంతుమీదికి వస్తుందని నే ననుకో లేదు." వా.
 • "అక్కడా యిక్కడా అన్నమాటలే యీ రోజు గొంతుమీదికి వచ్చాయి. గమనించావా?" వా.
 • చూ. మెడమీదికి వచ్చు.

గొంతుముడి

 • గొంతుముందు కాయగా కనిపించే ఎముక.
 • చూ. గొంతుపోక.

గొంతు మూగవోవు

 • స్వరవిహీన మగు.
 • "నా గొంతు మూగవోయింది." వా.
 • రూ. గొంతుమూగపోవు.

గొంతులో గురక పుట్టు

 • అవసానదశ సమీపించు.
 • చనిపోవునప్పుడు గొంతులో కఫం క్రమ్ముకొని రావడంతో గురగుర మనుటపై వచ్చిన పలుకుబడి.
 • "ఆవిడకు గొంతులో గురక పుట్టింది. ఇక ఏం జరిగినా గంటలే." వా.

గొంతులో నీళ్లు దిగడం లేదు

 • చాలా జబ్బులో ఉన్నాడు. ఏమాత్రం త్రాణ లేదు అనుట.
 • "వాడికి రెండురోజులుగా గొంతులో నీళ్లు దిగడం లే దట." వా. గొంతులో నీళ్లు పోసే దిక్కు
 • దగ్గరివాళ్లు, ముఖ్యంగా రక్త బంధువులు.
 • "వాడికి గొంతులో నీళ్లు పోసే దిక్కు కూడా లేదు. పాపం! జబ్బుతో నానా బాధా పడుతున్నాడు." వా.

గొంతులో పచ్చి వెలగకాయ పడినట్ల గు

 • ఏమీ అనలేక పోయే చిక్కు పరిస్థితి యేర్పడు.
 • చూ. గొంతులో వెలగకాయ పడినట్లు.

గొంతులో ప్రాణ మున్నంత వఱకూ

 • ఎంతవఱ కైనా ఏ మైనా అనుట.
 • చూ. కంఠంలో ప్రాణం ఉన్నంత వఱకూ.

గొంతులో వెలగకాయ పడినట్లు అగు

 • ఎటూ తప్పుకొన వీలు లేని స్థితిలో పడు.
 • "వాడికీ వీడికీ తగాదాలు పెడుతూ వీడు తిరుగుతుండేవాడు. ఇద్దరూ ఎదట బడేసరికి వీడికి గొంతులో వెలగకాయ పడ్డట్టు అయింది." వా.

గొంతు విచ్చి

 • గొం తెత్తి.
 • "అతను గొంతు విచ్చి పాడితేనే బాగుంటుంది." వా.
 • చూ. గొంతెత్తి.

గొంతెత్తి

 • బిగ్గరగా.
 • "ఆవిడ గొంతెత్తి పిలిస్తే కానీ పలకదు." వా.

గొంతెమకోరికలు

 • ఏవేవో అసాధ్య మైన కోర్కెలు.
 • "చాలకుండిన నగుఁ జెట్టబాలుఁడితఁడు, కొసరి గొంతెమ కోరికల్ గోరెనేని, యిడక పోఁబోల దిడఁ బోలదు..." పాండు. 4. 166.
 • "వాడి వన్నీ వట్టి గొంతెమ్మ కోరికలు తీరేవా? పెట్టేవా?" వా.
 • రూ. గొంతెమ్మకోరిక.

గొందిపెట్టు

 • దాచు.

గొందులపెట్టు

 • దాచు. బ్రౌన్.

గొజ్జగనీరు

 • పన్నీరు.

గొజ్జగమంచు

 • పన్నీరు.

గొజ్జుబ్రాలు

 • ఒక ధాన్యం. హంస. 4. 128.

గొజ్జెగనీరు

 • పన్నీరు.

గొటగొట మను

 • ధ్వన్యనుకరణము.
 • "గొట గొట మని రొప్పు బలుసింగముల నైన." సారం. 1. 68.

గొట్టికంటి

 • ఒక రకం తినే గడ్డ. గొట్టు సేయు
 • 1. బాధ పెట్టు.
 • "ఇట్టు లారాచపట్టినిఁ బట్టి చాల, గొట్టు సేయుచు." సారం. 2. 108.
 • 2. బహిరంగ పఱచు.
 • "గొట్టు సేయక వీనిఁ జూపెట్టుకొనుచు, నిచ్చటికిఁ దెచ్చితిమి." శుక. 3. 586.

గొడవగొంట్లు

 • కలహశీలురు.
 • తిట్టుగా ప్రయుక్తం (స్త్రీల విషయంలో.) పండితా. ప్రథ. పురా. పుట. 343.

గొడుగుక్రింది రూపు

 • రాజు.
 • భూచక్రగొడుగు అనే రాజలాంఛన మైనఆతపత్రంక్రింద రాజే ఉంటాడు కదా.
 • "గొడుగు క్రింది రూపుఁ బొడిచి జయంబు నీ, కిత్తు నధిప నన్ను నింత నమ్ము." కుమా. 11. 37.

గొడుగు బల్ల

 • తలుపుమీది కుసుం తిరిగే పట్టె. శ. ర.

గొడుగు మెట్టెలు

 • ఉబ్బు మెట్టెలు.

గొడ్డలి పెట్టు

 • వ్యాఘాతము కలిగించునది.
 • "ఆనాడు ఉప్పుసత్యాగ్రహం బ్రిటిషు ప్రభుత్వానికి గొడ్డలిపెట్టుగా పని చేసింది." వా.

గొడ్డ వెట్టు

 • నిరోధించు, అడ్డగించు.
 • "గొడ్డ వెట్టకుఁ డంచుఁ గొఱ తేమి యంచు." పండితా. ద్వితీ. పర్వ. పుట. 289.

గొడ్డు

 • అజ్ఞాని; మూర్ఖుడు. తిట్టుగా, దూషణగా ఉపయోగించే మాట. గువ్వలచెన్న. 44. నా. మా. 35.

గొడ్డుకారం

 • వట్టి కారం.
 • "గొడ్డు కారంతోనే వాడు పావు బియ్యమన్నం తింటాడు." వా.

గొడ్డు పోయిందా? (కులం)

 • ఇం కెవరూ లేరా అనుట.
 • ఈ కులానికి బదులుగా ఊరు, దేశం, లోకం ఇత్యాదులు ఉపయోగించుట కలదు.
 • "ఆ పిల్లే కావా లని యేమిటి? కులం గొడ్డు పోయిందా?" వా.

గొడ్డు పోలేదు

 • నిస్సంతు కాలేదు.
 • మరొకరు ఎవరూ ఇలాంటి వారు లేరా అనుపట్టున ఉపయోగించు పలుకుబడి.
 • "వీడే నని యేమిటి? లోక మేమీ గొడ్డు పోలేదు." వా.
 • "ఈ పిల్లే నని యేమిటి? కులం గొడ్డు పోలేదు." వా. గొడ్డుబోతుకు కాయము కొట్టు
 • వ్యర్థప్రయత్నము చేయు.
 • బాలింతలకు పెట్టే కారాన్ని కాయం అంటారు. అలాంటిది గొడ్రాలి కెందుకు? అనుటపై వచ్చినది. మదన. శత. 6.

గొడ్డు వీగి కన్నబిడ్డ

 • ప్రథమసంతానము.
 • వానిమీద ప్రేమ యెక్కువ అనుట. లేక లేక కలిగిన కొడుకు. తొలి కడుపు పంట, గొడ్రాలి తనం పోగొట్టి కలిగిన కుమారుడు.
 • "గొడ్డు వీఁగి కన్నబిడ్డండు గావున." కాశీ. 4. 87.
 • "గొడ్డు వీఁగి కనిన కొడుకుగారాము." పండితా. ద్వితీ. మహి. పుట. 167.

గొడ్డు వీగు

 • సంతానవతి యగు.
 • "గొడ్డు వీఁగిన యట్టి కొమ్మల కెల్ల, బిడ్డలు లే రను పెనుచింత గాని." వర. రా. అయో. పు. 336. పంక్తి. 18.

గొడ్డు వోవు

 • వ్యర్థ మగు.
 • "కొంత కాలంబు శూన్య మై గొడ్డు వోయె." శివ. 1. 51.

గొడ్డే రగు

 • వ్యర్థ మగు./
 • గొడ్డు + ఏరు.
 • "ఏలా బిడ్డలు లేని యీబ్రదుకు గొడ్డే రయ్యెఁ జింతింపఁగన్." కవిక.

గొడ్డేరి తెచ్చు

 • ఒక నిర్దిష్టలక్ష్యముతో తెచ్చు.
 • "బొడ్డునఁ బుట్టినపాపనికే నిన్ను గొడ్డేరి తెస్తినే కోడలా!" తాళ్ల. సం. 12. 312.

గొడ్డేఱు

 • 1. గొడ్డువడు.
 • "ఒడ్డారించి విషంబున, కడ్డము చనుదెంచి కావ నధికులు లేమిన్, గొడ్డేఱి మ్రందిరి." భాగ. స్క. 8. 217.
 • 2. గుత్తకు తీసుకొను.
 • "బొడ్డుపల్లెను గొడ్డేఱి మోసపోతి." శ్రీనాథుని చాటువు.

గొడ్డేఱుగ

 • వ్యర్థముగా.
 • "నీ పడ్డపాటు గొడ్డేఱుగ జిడ్డు పఱుపం గలవారమె?" హర. 2. 132.

గొడ్రాలు

 • బిడ్డ పాప లేనిది. పాండు. 3. 128.
 • "గొడ్రాలి కేం తెలుసు బిడ్డకుట్లు?" సా.

గొద గొద

 • వైరము.
 • "ఆ రెంటి కేల గొదగొద వొడమెన్." వేం. పంచ. 3. 99.

గొద గొను

 • విజృంభించు, త్వరపడు ఇత్యాది భావచ్ఛాయలలో ప్రయుక్తం.

గొనకొను

 • నెలకొను.
 • వెడలు ఇత్యాదులలో ప్రయుక్తం. కొన్నిట ఉప స్కారకంగా వినవస్తుంది.
 • "గొనకొన్న ప్రేమమై కొలువు చాలించి." రంగ. రా. ఆర. 170. పు.
 • "గొనకొని వీఁడు నీకును శకుంతలకుం బ్రియనందనుండు." భార. ఆర. 4. 105.
 • "వేఁట నెపమున గొనకొని కణ్వాశ్రమమునకున్ వచ్చి." భార. ఆది. 4. 74.

గొనకొల్పు

 • పురికొల్పు.

గొణగొణ లాడు

 • గొణుగు. ధ్వన్యనుకరణము.

గొప్ప చేయు

 • 1. పెద్ద చేయు.
 • "వాళ్ల యింటికి వెళ్లినప్పుడు అతడు న న్నెంతో గొప్ప చేసి గౌరవించాడు." వా.
 • 2. పెంచు.
 • "కోయకు జీతంబు గొప్ప చేయు." పార్వ. 1. 62.

గొప్ప చేసుకొను

 • స్వోత్కర్ష చెప్పుకొను.
 • "వా డేమో మహా గొప్ప చేసుకొంటున్నాడు. వాడి సంగతి ఎవడికి తెలియదు?" వా.

గొప్ప మనసు చేసికొను

 • ఎక్కువ ఔదార్యమును చూపు.
 • "నేనూ అంత ఉన్నవాణ్ణి కాదు. నా చేత నయిన మర్యాద లన్నీ చేశాను. మీ రేదో గొప్ప మనసు చేసుకొని యీ మూడుముళ్లూ పడ నిస్తే జన్మ జన్మాలకూ మీ మేలు మరిచి పోను." వా.

గొప్పు తవ్వి గొయ్యి తవ్వి సంపాదించు

 • నానా బాధపడి సంపాదించు.
 • "వా డేదో గొప్పు తవ్వి గొయ్యి తవ్వి నాలుగురాళ్లు సంపాయించుకొంటే కొడుకు అది కాస్తా కాజేస్తున్నాడు." వా.

గొబ్బిపదములు

 • గొబ్బి తట్టుతూ పాడుకునే పాటలు. పండితా. ప్రథ. వాద. పుట. 513.
 • చూ. ప్రభాతపదములు.

గొర్లపాలు సేయు

 • పార ద్రోలు - గొఱ్ఱెలను వోలె తోలు.
 • "నిశితఖడ్గాయుధాన్వితహస్తుఁ డగుచుఁ, బశువరించుచు గొర్లపాలు సేయుచును." బస. 6. 155.

గొర్ల మంద

 • అమాయకులూ, అజ్ఞానులూ అనుట.
 • "ఆ ఊళ్లో వాడు చెప్పింది వేదం. ఆ జన మంతా గొర్లమంద కాబట్టి సరి పోయింది. లేకుంటే వీడి ఆట సాగేదా?" వా.

గొఱక వేయు

 • ధ్వని చేయు.
 • "ఒక్కఁ డడుగెత్తి గొఱక వేయుచును డాచిఁన ట్టరిగి టెంకిఁ గని..." మను. 4. 48.

గొఱగయ్య (డు)

 • ఈశ్వరుడు.
 • శైవులలో నేటికీ ఒక వర్గం గొఱగయ్య లని జంగాలవలెనే ఉంటారు. వారి వేషం చిత్రంగా ఉంటుంది. వీరు జంగాలవలెనే తిరుగుతూ భిక్ష చేస్తారు. కుమా. 7. 38.

గొఱిగించు

 • 1. ఖర్చు పెట్టించు.
 • "ఆ దత్తపుత్రుణ్ణి గొఱిగిస్తూ వీడు మహా అట్టహాసంగా వెలిగి పోతున్నాడు." వా.
 • 2. క్షౌరము చేయించు.
 • "తల గొఱిగింపఁ బంచె." కాళ. 1. 48.

గొఱుగులు వడు

 • గొఱగ బడు.
 • "గొఱుగులు వడ్డ వెండ్రుకలు..." పద్మ. 2. 191.

గొఱుపడము

 • నల్ల కంబళి.
 • గొఱ్ఱె చర్మముపై వచ్చి, నల్లకంబళి అన్న అర్థంలో నిలిచింది.
 • "నెఱ నెన్నిమాఱులు నీళ్ల లోపలను, గొఱుపడం బుదికిన మఱి తెల్ల నగునె?" బస. 7. 207.

గొఱ్ఱె

 • ఒక తిట్టు. చవట, అజ్ఞాని అనుట.
 • "వాడు ఒట్టి గొఱ్ఱె. వాడికి ఏం చెప్పి తే ఏం లాభం?" వా.

గొఱ్ఱెతోకగా ఉండు

 • ఎదగనిదిగా ఉండు.
 • 'గొఱ్ఱెతోక బెత్తెడే' అన్న సామెతపై వచ్చిన పలుకుబడి. ఎదుగుబొదుగులు లేనిది. గొఱ్ఱెతోక పుట్టినప్పు డెంతో తరువాత కూడా ఎదుగుబొదుగులు లేకుండా అలాగే ఉండి పోతుంది.
 • "ఎంత చేసిన ఆ పని గొఱ్ఱెతోకగానే ఉంది." వా.

గొఱ్ఱెదాటు

 • ఒకరిని గుడ్డిగా అనుసరించి పదిమంది పోవుట. ముందున్న గొఱ్ఱె ఎటు పోతే మిగత మందంతా అటే పోతుం దనుటపై వచ్చిన పలుకుబడి.
 • "రెడ్డికొడుకు తెల్లజుబ్బాలు వేయడం మొదలెట్టేసరికి ఊరంతా అదే మొదలు పెట్టారు. అంతా గొఱ్ఱెదాటు." వా.

గొఱ్ఱెవలె వెఱ్ఱికూతలు కూయు

 • అజ్ఞానభాషితము లాడు.
 • "ఓరి! నైరృత ! గొఱ్ఱెవలె యేల వెఱ్ఱి కూతలు కూశేవురా." హేమా. 29 పు. గొలగొల లాడు
 • గోల చేయు.
 • "చిలుకలు గొరవంకలు గో,యిల లరిచలు నెమలిగములు నెడపక యెపుడున్, గొల గొల లాడుచు విరహుల, నిలువఁగ నిచ్చునె వనంబు నీకుం గొఱయే." శివలీ. 2. 76.

గొలుసుకట్టు

 • విడివిడిగా కాక కలిసికట్టుగా వ్రాసే వ్రాత.
 • చూ. గొలుసుమోడి, గొలుసువ్రాత.

గొలుసు కొను

 • ఒకదానితో నొకటి అంటి యుండు. కావ్యా. 6. 21.

గొలుసు దప్పిన కోతి

 • పట్టుకొనుట కసాధ్య మయిన వాడు; కట్టు తప్పిన కోతివంటి వా డనుట.
 • "దక్కిపోయిన వెంటఁ దగుల నా వశ మె?.... గొలుసు దప్పిన యట్టి క్రోఁతిచందమున." గౌర. హరి. ద్వి. 1506.

గొలుసుమోడి

 • గొలుసుకట్టువ్రాత
 • చూ. గొలుసుకట్టు; గొలుసువ్రాత.

గొలుసువ్రాత

 • ఒక అక్షరంలో ఇంకొక అక్షరం కలిసిపోవునట్లుగా వ్రాయువ్రాత.
 • పాతకాలం పత్రా లన్నీ గొలుసువ్రాతతో ఉంటాయి. అలవాటున్నవారు కానీ చదవలేరు.
 • చూ. జిలుగురాత.

గొల్లభామ

 • ఆకులలో ఉండి ఎగిరిపడే పురుగు. ఆకులో మిడత.

గొల్లని సాహిత్యవిద్య

 • అసంభవం.
 • గొల్లలకు చదువు రాదు అను పాతకాలపు ప్రథపై వచ్చినమాట.
 • సాతానిసామవేదం వంటి పలుకుబడి.
 • "అల్లుని మంచితనంబును, గొల్లని సాహిత్యవిద్య....లేవు." సుమతి.

గొల్ల సివాలు

 • గొల్ల పాటలు.
 • "గొల్లసివాలు పాడుకొనుచు." కువల. 2. 115.

గొల్ల సుద్దులు

 • ఒక రకమైన పాటలు.
 • గొల్లవాళ్లు వారి వారి కుల పెద్దలను గురించి కీర్తించే పాటలు.
 • "గ్రుక్కలు మింగుచున్ వెడగు గొల్లలసుద్దుల నెంత పాడినన్." గుంటూ. ఉత్త. 12.

గొల్లున కూయు

 • ధ్వన్యనుకరణము.