పదబంధ పారిజాతము/క్రేగాలి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

క్రుళ్లుపోతు

 • కుళ్లుబోతు.
 • "వాడు వట్టి కుళ్లుబోతు వెధవ. ఎవరు పచ్చగా ఉన్నా చూడ లేడు." వా.

క్రేగాలి

 • చిఱుగాలి.

క్రేటుకొను

 • గొంతు సవరించుకొను.

క్రేడి సేయు

 • అపహసించు.

క్రేణి వట్టు

 • సంపాదించు. కాశీ. 3. 90.

క్రేణి సేయు

 • పరిహసించు.
 • "ఆ సమయం బభ్యర్ణ పూర్ణ చంద్రోదయ ఘూర్ణమానార్ణవంబునుం గ్రేణి సేయుచుండె." పారి. 5. 75.

క్రేదొట్టు

 • గట్టు లొరయు.

క్రేళ్లు చూచు

 • చిలిపిగా చూచు.

క్రేళ్లు చూపు

 • చిలిపి చూపు.

క్రేళ్లు త్రుళ్లు

 • ఎగిరి పడు. కువల. 4. 81.

క్రేళ్లు దాటు

 • గంతులు వేయు.
 • "అడ్డంబు నిడుపు నాపడ్డలగతి మనుఁ బీళ్లు డొంకలనుండి క్రేళ్లు దాఁట." మను. 2. 7.
 • 2. ఎగిరెగిరి పడు.
 • "చే వెడ దోఁపుచుం బలికెఁ జెందొవ చూపులు క్రేళ్లు దాఁటగన్." పారి. 4. 58.
 • "మెఱుఁగులు పైకిఁ గ్రేళ్లుఱికెడు గబ్బి గు,బ్బలమీఁద." విప్ర. 3. 3.
 • చూ. క్రేళ్లుఱుకు.

క్రేళ్లు దోలు

 • పరువు లెత్తించు.
 • "తేరు క్రేళ్ళు దోలి పాంచాలబలంబులపై నడరె." భార. భీష్మ. 3. 368.

క్రేళ్లు ద్రిప్పు

 • చూ. క్రేళ్ళు దోలు.

క్రేళ్లుబ్బు

 • ఉబుకు. నరస. 5. 102.

క్రేళ్లు మలగు

 • వెనుదీయు.

క్రేళ్లు మసలు

 • చలించు.

క్రేళ్లుఱుకు

 • ఎగిరి పడు.

క్రేళ్ళెగయు

 • క్రేళ్ళు సను.

క్రేళ్లు వాఱు

 • గంతులు వేయు.

క్రేళ్ళు సను

 • ఎగిరి పడు. క్రొత్త
 • వింత.
 • "క్రొత్త దాని వృత్తం బెల్లన్." పాండు. 2. 142.
 • వాడుకలో - 'ఆ విషయం నాకు కొత్త.' 'దాని ప్రవర్తన అంతా చాలా కొత్తగా ఉంటుంది.' 'ఏమిటోయ్! ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు.'
 • 'ఇన్నిరోజులు లేదు. ఈ రోజేదో నువ్వు కొత్తగా చెప్పొస్తున్నావు.
 • ఇలాంటి దగ్గరి భావచ్ఛాయలలో మరికొన్ని తావుల కూడా కనబడుతుంది.

క్రొత్త చేయు

 • నూతనత్వము కల్పించు.
 • "సత్యభామ మేనఁ గుసుమ శృంగారముల కెల్లఁ గ్రొత్త సేయ." ఉ. హరి. 1. 151.
 • 2. పునరుపస్థితము చేయు.
 • "సమంత్రక ముష్టిక స్థానక విజ్ఞానంబుగాఁ గ్రొత్త సేసికొనుట మేలు." భార. ద్రోణ. 2. 361.

క్రొత్తముట్టు

 • నూలిపోగు.

క్రొత్త వఱచు

 • మెఱు గెక్కించు. భార. భీష్మ. 1. 105.

క్రొ వ్వడగించు

 • పొగ రడగించు.
 • "నీదు క్రొ వ్వడఁగింతున్." కళా. 6. 23.

క్రొవ్వుగొను

 • కొవ్వెక్కు.
 • "పరువంపుఁ జినుకుల పస గ్రొవ్వుగొని తేల, గిలఁ బడువానకోయిలల యొప్పు." హరి. పూ. 9. 72.

క్రొవ్వు పట్టు

 • పొగ రెక్కు.

క్రొవ్వులు వలుకు

 • దుర్భాష లాడు.
 • "ఈ చపలకుత్సిత విప్రుఁడు వచ్చి నోరఁ గ్రొ,వ్వులు వలుకంగ మీరును చెవుల్ సొర వించు సహించి..." కుమా. 7. 55.

క్రొవ్వెక్కు

 • కొవ్వు పట్టు.
 • "క్రిక్కిఱి చన్నుదోయి యిరుక్రేవల కాంతియుఁ బంచబాణుఁ గ్రొ,వ్వెక్కఁగఁ జేయ." నైష. 7. 194.

క్రొవ్వెద

 • కొప్పు.
 • "చెం, గలువలు క్రొవ్వెదకు వేఱొకర్తు ఘటించెన్." ఆము. 6. 129.

క్లేశపడు

 • కష్టపడు.
 • "అత నా కరువులో పిల్లలతో చాలా క్లేశపడ్డాడు." వా.

క్షణభంగురము

 • అనిత్యము.
 • నీటిబుడగవంటి దను పలుకుబడి. 'ఈ దేహం క్షణభంగురము' అని నేటికీ వాడుక. పండితా. ప్రథ. వాద. పుట. 550.

క్షణ మే డగు

 • కాలము త్వరగా సాగక పోవు.
 • "రాఁ డయ్యెన్ హృదయేశుఁ డీ హృదయభారం బెట్లు సైతున్ క్షణం, బే డై యున్నది." ప్రభా. 4. 146.

క్షణియించు

 • పూజించు, అర్చించు.
 • "కల్లరి లోకుల క్షణియించఁ దగునె." బస. 7. 204.

క్షితిని నహి ప్రతిల్లె

 • లోకంలో లేదు. అపూర్వ మనుట.
 • "క్షితిని నహి ప్రతిల్లె యని చెప్పుదు రాతనిభాగ్య మెట్టిదో?" శ్రవ. 1. 75.

క్షీరోదకన్యాయము

 • పాలును నీళ్లును కలిసినట్లు కలగలసి పోయిన దనుట. పెరుగును వడ్లును కలిసినట్లనునది దీనికి వ్యతిరేకము. పండితా. ప్రథ. పురా. పుట. 278.

క్షుణ్ణంగా

 • కూలంకషంగా.
 • "వాడు భాష్యాంతం క్షుణ్ణంగా చదువుకొన్నాడు. వానితో తగాదా పడితే ఏం లాభం ?" వా.

క్షూణత పరచు

 • న్యూనపరచు, కించపరచు.
 • "చుట్టం చూపుల కని వాళ్లింటికి పోతే క్షూణతపరిచి పంపించాడు." వా.

క్షేత్రపాలుడు

 • క్షేత్రాధిదేవత. సింహా. 4. 35.

క్షేమతండులములు

 • ప్రయాణ మై పోతూ వట్టి చేతులతో పోక ఏవో యిన్ని బియ్యం కట్టుకొని పోవా లని ఆచారం. ఆ బియ్యం -
 • "శాలి చేమతండులములు." ఆము. 2. 97.

క్షేమలాభములు

 • జంటపదం.
 • దీనిమీద వచ్చినదే - క్షేమంగా పోయి లాభంగా రా - అన్న పలుకుబడి. ప్రయాణ మై పోవునప్పుడు పెద్దలు చేసే దీవన యిది.
 • "....నాకు శో,భనములు గోరఁగాఁ గద యపాయము చెందక క్షేమలాభముల్, గని యిలు చేరు టంచును...." శుక. 2. 234.
 • చూ. యోగ క్షేమములు.

క్షేమలాభా లడుగు

 • కుశల ప్రశ్న చేయు.

ఖంగు ఖంగు మను

 • శబ్దించు. ధ్వన్యనుకరణము. ఖంగురింగులు
 • ధ్వన్యనుకరణము.

ఖండితంగా

 • తప్పక.
 • "ఈ రోజు వాడు ఖండితంగా వస్తా నన్నాడు. మ రేమయిందో యేమో!" వా.

ఖండింపు చేయు

 • (బేరం) ఫైసలా చేయు.

ఖచిక్కున

 • కొఱుకుట వంటి వానిలో ధ్వన్యనుకరణము.
 • "ఖచిక్కున ముక్కునఁ బక్వదాడిమీ, ఫలయుగళంబు నొక్కు." శకుం. 2. 33.

ఖడ్గాఖడ్గి వాదించు

 • కత్తులతో పోరాడు.
 • "కలు ద్రావం బని పూని యాదవులు ఖడ్గాఖడ్గి వాదింతురే." ఉ. హరి. 4. 132.

ఖణీలున ఱంకె వేయు ధ్వన్యనుకరణము.

 • "ఖణీలున ఱంకె వేయ కెఱుఁగన్ సమకూడదు." కా. మా. 4. 153.

ఖతం చేయు

 • ముగించు, చంపు. మాటా. 85.

ఖరాఖండిగా

 • కుండ బద్దలు కొట్టినట్లుగా.
 • "వాడు చాలా ఖరాఖండిగా మాట్లాడే మనిషి." వా.

ఖరాబు చేయు

 • పాడు చేయు.
 • "కాగితాలు ఖరాబు చేయడం తప్పితే కొన్ని రాతలవల్ల యే మైనా లాభం ఉందా?" వా.

ఖరారు చేయు

 • ఏర్పాటు చేయు.
 • "నెలకు పదిరూపాయ లివ్వా లని ఖరారు చేసి పెద్దమనుష్యులు వెళ్ళారు." వా.

ఖరారునామా

 • ఒప్పందం.
 • "వా ళ్లిద్దరూ భాగపరిష్కారాలు చేసుకొని ఖరారునామా వ్రాసుకొన్నారు." వా.

ఖరారు మదారు

 • ఒడంబడిక. కాశీయా. 62.

ఖరీదు కట్టు

 • వెల కట్టు.
 • "ఘర్మజలానికి, ఖరీదు కట్టే షరాబు లేడోయ్." మహా. ప్ర.

ఖరీదు చేయు

 • కొను.
 • "ఆ ఊళ్లో నాలుగు పుట్ల ధాన్యం ఖరీదు చేసి వచ్చాను." వా.

ఖసూచిగాడు

 • ఎప్పు డేది అడిగినా ఆకాశం చూచేవాడు.
 • అంటే లౌక్యం, బుద్ధి లే దనుటను సూచించేమాట.
 • "వాడి కేం తెలుసు? వట్టి ఖసూచి గాడు." వా.

ఖాతరు చేయు

 • లెక్క చేయు.
 • "వాడు బ్రహ్మదేవుణ్ణి కూడా ఖాతరు చేసేవాడు కాదు." వా.

ఖాయ మగు

 • పర్మనెంటు లగు; నిశ్చయ మగు.
 • "వాని ఉద్యోగం ఖాయ మయింది." వా.
 • "వాడు వచ్చేది ఖాయ మయినట్లే." వా.

ఖాయిదా చేయు

 • కట్టుదిట్టము చేయు.
 • "అడవిలోకి పశువులు వెళ్లకూడ దని పంచాయతీ ప్రెసిడెంటు ఖాయిదా చేశాడు." వా.

ఖావ(మ)౦దు

 • యజమాని.

గంగడోలు

 • ఎద్దులకూ ఆవులకూ మెడ క్రింద వ్రేలేభాగం.

గంగనమ్మ

 • గ్రామ దేవత.

గంగనురుగులు

 • ఒక పిండివంట.

గంగపా లగు

 • నశించు.
 • "నేను చేసినమే లంతా గంగపా లయి పోయింది." వా.

గంగమయిలావు

 • నల్లనిది. బ్రౌన్.
 • నలుపు పసుపు కలిసిన రంగుది. శ. ర.

గంగ ముట్టు

 • నీరు త్రాగు.
 • "నీ విన్నిమాట లన్నావు. నీ యింట్లో ఇక గంగ ముట్టను? వా.

గంగలో కలుపు

 • వ్యర్థము చేయు, పాడు చేయు.
 • "అట్లు కావున నీ కార్య మనఁగ నెంత, నీదుప్రాపున నవ్విప్రు నియతి మాన్పి, దిటము దప్పించి యజ్జటి దేవు తపము, గంగలోఁ గల్పెదను నొక్క గడియలోన." వేంకటే. 2. 29.

గంగలో దిగు

 • నీ యిష్టం వచ్చినట్టు పో, నా కేమీ సంబంధం లేదు అని విసుగుతో అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
 • "వాణ్ణి వెళ్లి గంగలో దిగ మను. నా కక్కఱ లేదు. నాకు కొడుకు లే డను కొంటాను." వా.

గంగలో దోలు

 • వదలి వేయు.
 • "వాడు ఆచారం గీచారం ఎప్పుడో గంగలో దోలి వేశాడు." వా.

గంగవెఱ్ఱు లెత్తు.

 • అత్యావేశపూరితు డగు.
 • "అత డభూతకల్పన లన్నీ ఏవో చెప్తూంటే మన మే మైనా అన్నమా ఇక గంగ వెఱ్ఱు లెత్తి పోతాడు." వా.

గంగాధరుడు

 • నీళ్లు మోయువాడు.
 • నారాయణదాసు రుక్మిణీకళ్యాణము.

గంగాభాగీరథీ సమానురాలు

 • వితంతువులను ప్రస్తావించు పట్ల, వారికి ఉత్తరాలు వ్రాయుపట్ల పేరుకు ముందు ఉపయోగించే పలుకుబడి. గంగవలె పవిత్రురా లనుట.
 • "గంగా భాగీరథీసమానురా లయిన సుబ్బమ్మత్తగారికి మీ అల్లుడు..." వా.

గంగిగోవు

 • పవిత్ర మైన ఆవు; సాధువు.
 • "అతనా ! గంగిగోవు." వా.

గంగిగోవు వంటి సాదు.

 • గోవు సాధు వైన మృగముగా మన యెన్నిక.
 • "గంగిగోవు వంటి సాదుబాపనిన్ నినుం జనునె పలువ యనంగ." కళా. 7. 30.

గంగిరెద్దు

 • చూ. గంగెద్దు.

గంగిరెద్దు వేషము

 • ఆడంబర మైన వేషము.
 • "ఇదేమిటి? ఈ గంగిరెద్దు వేషం. కొత్త మనుషులు చూస్తే పల్లెటూరి గబ్బిళాయి అనుకుంటారు." వా.

గంగిరెద్దు సొమ్ములు

 • ఆడంబరసూచకములు. కుక్కు. 59.

గంగెద్దు

 • అన్నిటికీ తల ఊచేవాడు, పల్లెటూరిమనిషి, వట్టివేషాడంబరం కలవాడు.
 • "వాడు ఒట్టి గంగెద్దు. వాళ్లమామ చెప్పినదే వేదం." వా.
 • "వాడు ఒట్టి గంగెద్దు లాగా ఉన్నాడు. ఈ పట్ణంలో ఎలా నెట్టుకు వస్తాడు?" వా.
 • "ఏమిట్రా! ఆ గంగెద్దువేషం." వా.

గంజిగుల్ల

 • బొబ్బ.

గంజితరక

 • గంజిమీది మీగడవంటి పదార్థం. బ్రౌన్.

గంజి త్రాగేవాడికి మీసాలు ఎగ బెట్టేవా డొకడా !

 • ఈ చిన్న పనికి మరొకరిసాయం కూడా యెందుకు అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
 • "నువ్వు చేశే యీ ఘనకార్యానికి యింత మంది యెందుకురా? గంజి త్రాగేవానికి మీసాలు ఎగబెట్టేవా డొకడా?" వా.

గంజిలోకి ఉప్పు లేదు

 • నిరుపేద అనుట.
 • "వాడికి గంజిలోకి ఉప్పు లేదు. ఇక మీ కిచ్చే దే ముంది?" వా. గంజో అంబలో
 • "వేళకు ఏ దయితే నేం? గంజో అంబలో?" వా.
 • చూ. కలో అంబలో.

గంట కొట్టు

 • ముగియు.
 • చనిపోయినప్పుడు గంట కొట్టుట, శంఖం పూరించుట దక్షిణాదిలో నేటికీ అలవాటు. దానిపై వచ్చిన పలుకుబడి.
 • "వాడిపని గంట కొట్టినది. ఇక వాడు చేసే దే ముంది?" వా.

గంట వాయించు

 • గంట కొట్టు.
 • "పటుఫలాదులు వోయె బతిమాలువారి కే, మీయక గంట వాయించి రహహ." సింహాద్రి. నార. శ. 27.

గంట వ్రేయు

 • గంటలు కొట్టు.
 • "రెండవజాము గంట వ్రేయం బడె." కాశీ. 5. 307. కాశీ. 4. 102.

గంటిపడు

 • కాటుపడు.

గంటిపఱచు

 • గంటు పడునట్లు చేయు.
 • చూ. గంటివేయు.

గంటివెట్టు

 • చూ. గంటిపఱచు.

గంటి సేయు

 • కాటు పడునట్లు చేయు.
 • "నాథుని, యధరబింబము గంటి సేయంగ నెంచు." దశా. 3. 17.

గండం గడిచి పిండం బయట పడితే....

 • ఈ ఆపద తప్పితే అనుట.
 • పూర్వం కాన్పు అతి భయం కరంగానూ, ప్రాణాపాయ కరంగానూ ఉండినది. అందుపై వచ్చిన పలుకుబడి.
 • "ఈ గండం గడిచి పిండం బయట పడితే తరవాత చూద్దాం." వా.

గండకట్టెలు

 • వంట చెఱకులు. బ్రౌన్.

గండకత్తెర

 • గొంతుక నుత్తరించు ఆయుధ విశేషము.
 • "శీలము దొరఁగిన పిమ్మట, నేలా కాయంబు దీని నెడ సేయుటయే, మేలని హృదయాబ్జంబునఁ, గాలాంతకు నిల్పి గండకత్తెర గొనఁగాన్." చెన్న. 4. 217. కళా. 3. 10.
 • తద్వారా అడకొ త్తిలో చిక్కుకొన్నట్టు వలెనే గండ కత్తెరలో తగులు కొనుట సంకటావస్థాసూచక మయినది.
 • "వీ ళ్లిద్దరిమధ్యా పడ లేక నేను గండ కత్తెరలో చిక్కు కొన్నాను." వా.

గం డడగించు

 • పొగరు అణచు.
 • "....తోమరశక్తిప్రముఖంబు లగు వివిధాయుధంబుల నొండొరుల గండడం గించుసమయంబున." ఉ. హరి. 1. 27.

గండదీప మెత్తు

 • మ్రొక్కుబడి చెల్లించుటకై గోధుమపిండితో గానీ అన్నముతో గానీ దిమ్మవలె చేసి, అందులో గుంత చేసి, నెయ్యి పోసి, వత్తిని వెలిగించి, ఆ దీపము నెత్తుకొని దేవుని దగ్గఱకు పోతారు. దీనినే గండదీప మెత్తుట అంటారు.
 • "ఆ నాతిఁ జూచి తలవరు, లేనెలఁతయొ గండదీప మెత్తఁగ వచ్చెన్." శుక. 2. 496.
 • చూ. మూపుగండ లిచ్చు.

గండపాళిక కెంగేలు కదియ జేర్చు

 • చెక్కిట చేయి జేర్చు. చింతించు.
 • "గండపాళికఁ గెంగేలు గదియఁ జేర్చి." శివ. 2. 26.
 • చూ. చెక్కిట చేయి జేర్చు.

గండపెండరము

 • 1. వీరులు, కవులు, పండితులు మొదలగువారు కాలిలో వేసుకునే బిరుదు టందె.
 • "డాకాల గండపెండర మమర్చి." అచ్చ. యు. 203.
 • 2. ఒక ఆభరణము.
 • పై దానినే ఆభరణంగానూ ధరించేవారు కావచ్చును.
 • "పెద్ద పీతాంబరము గండపెండరంపుఁ గటక కటినూత్ర కేయూర కంకణాది, దివ్యభూషణజాలంబు...." దశా. 7. అవ. 1. 248.

గండ పెండారము

 • చూ. గండ పెండరము.

గండ పెండెము

 • చూ. గండ పెండరము.

గండ పెండెరము

 • చూ. గండపెండరము.

గండ పెండేరము

 • చూ. గండ పెండరము.

గండబేటము

 • ప్రేమ.
 • పురుషునికి పురుషునిపై గల్గు మోహము అని టిప్పణి కారు లన్నారు. కాని ఎందుకో చెప్ప లేదు.
 • "మగలు గరము ప్రీతి దగిలి గండ బేటంచుగొని...." కుమా. 4. 36.

గండమాల

 • గొంతు చుట్టూ గడ్డలు లేచే రోగము.
 • "మును గండమాలమీఁదను, మొన కుఱుపుం బుట్టె నన్న మోసం బాయెన్." ద్వా. 10. 54.
 • రూ. గండమాలము.

గండమృగము

 • ఖడ్గమృగము.
 • గండామృగం అని తమిళులు నేటికీ అంటారు.
 • "గండ మృగములు భేరుండతండములు." బస. 3. 83. పుట.

గండము గడుచు

 • తాత్కాలిక మైన ఆపద తొలగిపోవు.
 • "ఇప్పటికి ఈ గండం గడిస్తే తరవాత చూచుకో వచ్చు." వా.

గండము దప్పు

 • ప్రాణాపాయము తప్పు.
 • "అప్పటప్పటికి మ మ్మరసి గండములు, దప్పించి రక్షించె దానవారాతి." ద్విప. మధు. పు. 32.

గండముపై పిండకము

 • ముందే గండం, అందులో ప్రసవసమయం.
 • అనగా అతి ప్రమాదకారి అనుట. ముద్రా. 79.
 • జనంలో 'గండంలో పిండం' అని వినవస్తుంది.

గండర గండడు

 • ఒక బిరుదు.
 • గొప్ప వీరుడు.
 • రాజులకు బిరుదుగా శాసనాదుల్లో కానవస్తుంది. కన్నడంలో గండ అనగా మగడు. మగటిమి కలవాడు. గండలకు గండడు = మేటి మగడు అనుట.

గండరించు

 • మలుచు; రాయివంటి వానిలో రూపమును చెక్కు.
 • "పండితలోచనాబ్జంబులయంద, గండరించిన యట్టి గతి..." పండితా. ప్రథ. దీక్షా. పుట. 174.

గండాగొండి చేయు

 • తగాదా పెట్టు; మొండి తగాదా పెట్టు.
 • "గండాగొండి యొనర్తు నేమొ యని." వ్యస. నాట. 13.

గండాగొండితనము

 • మొండితనము.
 • రూ. గండాగుండితనము.
 • చూ. గండాగొండి చేయు.

గండాడు

 • కలియు, సంగమించు.
 • "చండాలితో ద్విజుం డొగి, గండాడిన వక్షమున భగము వ్రాసి తగన్, దండువు గొని దేశంబున, నుండక యుండంగ నడచు టుచితము పతికిన్." విజ్ఞా. ప్రా. 126.

గండాన వచ్చు

 • ప్రమాదకర మగు.
 • "వాడిఁక సుగ్రీవుమేలు వాలికి గండాన వచ్చు." తాళ్ల. 6. 8.

గండారపు బొమ్మ

 • రాతిలో చెక్కిన బొమ్మ; గండరించిన బొమ్మ అనుట.
 • "అ,చ్చేరువకంబముం గదిసి చిత్తరువో కరువో యనంగ గం,డారపు బొమ్మ వోలె నచటం గద లించుక లేక యుండఁగన్." ఉత్త. హరి. 1. 6.