Jump to content

పదబంధ పారిజాతము/ఈ

వికీసోర్స్ నుండి

ఇహ____ఈకం 178 ఈక____ఈకో

ఇహమా పరమా ?

  • ఈ పని బొత్తిగా నిష్ప్రయోజనం అనుపట్ల ఉపయోగిస్తారు.
  • ఇటు ఈలోకంలో వచ్చే లాభం లేదు. కనీసం అటు పుణ్యం వస్తుం దనడానికీ వీలు లే దనుట.
  • "అట్లాంటి చండాలునికి సహాయం చేస్తే ఇహమా పరమా ?" వా.
  • చూ. ఇహపరములు.

ఇహాముత్రఫలము

  • ఇహపర సౌఖ్యము. ఇహాముత్రఫలములను విసర్జించిన యతడే నిజ మైనసన్యాసి కాగలడు. - అని వేదాంతం.

ఇహాముత్రఫలభోగవిచారం

  • ఇహపరసుఖావా ప్తిని గుఱించినవిచారము.
  • ఇది మోక్ష సాధన మని వేదాంతుల నమ్మకం. వేదాంతపరిభాష.

ఇహాముత్రసౌఖ్యములు

  • ఇహపరసౌఖ్యములు.

ఈండ్రము సేయు

  • నిర్బంధించు.
  • "ఎన్నడు నిను బెట్టు మనుచు నీండ్రము సేయన్." భాగ. 8. 565.

ఈకంటికి ఈరెప్పలు దూరం కావు

  • అవి రెండూ సన్నిహిత మైనవే అనుపట్ల ఉపయోగిస్తారు.
  • "ఈ కంటికి ఈ రెప్పలు దూరం కావు నాయనా ! మీ అన్న నిన్ను చూచుకొంటూనే ఉంటాడు." వా.

ఈకకు ఈక, తోకకు తోకగా

  • దేని కదిగా ; విమర్శించిచూస్తే సూక్ష్మపరీక్ష కిది నిలువ దను పట్ల అనేమాట.
  • కోడిపెట్టలలో బల మైనదానికి ఈకా, తోకా తీసివేసినా తగినంత మాంసం ఉంటుంది. దుర్బల మైనదానికి బొచ్చు తీసి వేస్తే మిగిలేది తక్కవ. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "ఈకకు ఈక తోకకు తోక తీసివేస్తే ఇందులో మిగిలేది నా కేమీ కనిపించడం లేదు." వా.

ఈక తోక లేని

  • తలా తోకా లేని ; అందని పొందని.
  • "ఈక తోక లేని యీ కృష్ణుమాటలు పొలతి నమ్మి నానబోసి కొనియె." రాధి. 3. 23.

ఈకొను

  • అంగీకరించు.
  • "మదీయవాక్యముల కీకొనవొ." రాధా. 1. 91.
  • చూ. ఇయ్యకొను.

ఈకోలు

  • అంగీ కారము.
  • చూ. ఇయ్యకోలు. ఈగ____ఈగ 179 ఈగ____ఈగ

ఈగకంట నైన పడకుండ

  • ఎవరికీ తెలియకుండా.
  • "ఈగకంట నైన బడకుండు నంత రహస్యముగ దీసికొని వచ్చితిని." చింతా. 4.44.

ఈగకు ఇలి పాముకు బలి పెట్టని

  • అతిలోభి యైన.
  • "ఈగకు ఇలి పాముకు బలి పెట్టనివా డతను." వా.
  • చూ. ఈగకు కాటు పాముకు బలి ఇవ్వని.

ఈగకు కాటు పాముకు బలి ఇవ్వని

  • అతిలోభి యైన.
  • "ఈ భువి బాముకుం బలియు నీగకు గాటును నీక యెంతయున్, లోభపరాయణాత్మకులలోన బ్రసిద్ధు డితం డనంగ..." హరి. 4. 100.
  • "ముంచి యీగకు గాటు పామునకు బలియు, నొసగ డని భర్తకై పొక్కు నువిద మదిని." పాండు. 4. 149.
  • చూ. ఈగకు నిసురు పాముకుబలిపెట్టని ; ఈగకు ఇలి పాముకు బలిపెట్టని.

ఈగకు తవుడు లేదు

  • ఏమాత్రం ధాన్యం లేదు అనుపట్ల అనేమాట.
  • "కటకటా యింత లింగ సమర్థుడయ్యు, నిట యీగకును దవు డింటిలో లేదు." బసవ. 4. 97.

ఈగకు నిసురు పాముకు బలి పెట్టని

  • మిక్కిలి లోభి యైన.
  • "సామీ ! పలుమఱు దేవర, కేమని విని పింతు నింక నీగకు నిసురుం, బామునకు బలియు బెట్టక, యా ముసలిగ రాసు పిసిడి యై వర్తించున్." విప్రనా. 3. 16.
  • చూ. ఈగకు ఇలి పాముకు బలిపెట్టని.

ఈగకు పోక పెట్టినట్టు

  • ఆసక్తి లేక ఉండు.
  • ఈగముందు బెల్లం పెడితే అది ఆసక్తి కనబరుస్తుంది. పోక పెడితే అది తన కేమీ కాబట్టనట్లు ఉంటుంది. అందుపై వచ్చినపలుకుబడి.
  • "మిన్న కున్నార లిది యేమి మీరు ముగుర, యీగకును బోక వెట్టిన యిట్టి భంగి, హెచ్చుగుం దింతమాత్ర మిందేని గల్దె, మిగుల గోపంబు మీకు లేమియును దోచె." క్రీడాభి. 1. 246.

ఈగడ

  • జాడ, పోవడి.
  • "హంసి యీగడ యొక కొంత దొరకునొ యంచు." ప్రభా. 4. 3.

ఈగపులి

  • ఒకరక మైనసాలెపురుగు.
  • వాడుకలో కూడ దీనికి ఈగపులి అనేపేరు. ఇది ఈగలను పట్టుకుంటూ ఉంటుంది.

ఈగలు మూగుచుండు

  • అపరిశుభ్రముగా ఉండు.
  • "వాళ్లిల్లు ఎప్పుడూ ఈగలు మూగుతూ ఉంటుంది." వా.

ఈగ వాలితే జాఱు

  • మిక్కిలి నును పైన. ఈగ_____ఈచ 180 ఈచ____ఈచె
  • "ఈగ పైబడజాఱు నీ యిందువదన బా గైనపాపట పై జీఱువాఱె." గౌర. హరి. ప్ర. 1601-1602.
  • "ఆ గోడలమీద ఈగ వాలితే జాఱిపోతుం దంటే నమ్ము. అంతా పింగాణి పూతే." వా.

ఈగ వాలనీయకుండు

  • ఏమాత్రమూ నొప్పి తగల నీయకుండా చూచుకొను; ఒక్క రొక్క మాట అనినా ఓర్చుకొనక పోవు.
  • ఇది ఏ ఒకరిమీదనో "ఈగ...." అనే ఉంటుంది.
  • "ఆ ఊళ్లో అత నంటే మహాగౌరవం అతనిమీద ఈగ వాల నీయరు." వా.

ఈగిచేయి

  • దానము చేయుచేయి; ఎముక లేనిచేయి.
  • "ఈగిచేయి మాటికొన డేని." వసు. 1. 34.

ఈగిమ్రాను

  • కల్పవృక్షము.

ఈగుల కెంఫు

  • చింతామణి.

ఈచవడు

  • కృశించు, నిస్సార మగు, ఈడిగిలబడు.
  • "కా లీచవడ జరింపుదు, నీలోకము నందు." పాండు. 2. 204.
  • "కా లీచవడ నిండ్లకడ కేగి." పాండు. 4. 210.

ఈచ వోవు

  • 1.సన్న వడు.
  • "ఈచవోయిన చేతులు." ఉ. హరి. 2. 122.
  • 2. బీటువోవు, పంట పండక పోవు.
  • "తఱితోడ విత్తిన దఱచుగా బండుచే, నెపు డైన విత్తిన నీచవోవు." నీతిసీస. 83.
  • చూ. ఈచుకపోవు.

ఈచుక పోవు

  • సన్న వోవు.
  • చూ. ఈచవోవు.

ఈచెవిగాడు పాచెవి బోవు

  • చాలా ఎండగా ఉండు. వేడిగాడ్పుల విషయంలో ఉపయోగించేపలుకుబడి.
  • "ఏచి యీచెవి గాడు పాచెవి బోవంగ నుబ్బి లింగమువోలె నుండు నెండ." పాండు. 2. 29.
  • "ఈ అగ్గిలో బయట కెలా పోతాం. ఈ చెవిలో గాడుపు ఆ చెవిలో దూరి పోతూంది. రోహిణీకార్తి వచ్చింది మఱి." వా.

ఈ చెవిలో గాలి ఆచెవిలో దూరు

  • గాలి చాలా విపరీతంగా వీచు.
  • "అబ్బబ్బ! ఈ చెవిలో గాలి ఆ చెవిలో దూరుతోంది. ఎలా వెళ్లగలం?" వా.

ఈ చెవిలో మాట ఆ చెవిలో దూరిపోవు

  • ఏ మంచిమాట చెప్పినా వినక పోవు. మనసులో ఉంచుకొనక మఱచు. ఈచే___ఈటె 181 ఈడ___ఈడా
  • "వాడి కేం చెప్పి ఏం లాభం? ఈ చెవిలో మాట ఆచెవిలో దూరి పోతుంది." వా.

ఈ చేతితో చేసి ఆ చేతితో అనుభవించు

  • చేసినదానికి వెంటనే ఫలితం అనుభవించు.
  • "వాడు ఈ చేత్తో చేసి ఆ చేత్తో అనుభవిస్తూ ఉన్నాడు. ఇంకా తెలివి రాలేదు." వా.

ఈటారు

  • తడియారు, గంజి యింకు.
  • "జలము లూటలు గ్రమ్ము శశికాంత పాషాణ, నికరమ్ము లీటాఱి నీరుదివియ." శాకుం. 3. 202.
  • "అన్నం యింకాస్త యీటారితే బాగుంటుంది." వా.

ఈటార్చు

  • వెండ్రుకలు తడి యార్చు.
  • "వేణి నీటార్చి సురపొన్నవిరులు ముడిచి." హరవి. 2. 107.

ఈటు లేని

  • ఈడు లేని; అసమాన మైన.
  • "ఈటు లేనిశ్రీ వెంకటేశు డితడు." తాళ్ల. సం. 9. 120.
  • చూ. ఈడు లేని.

ఈటు వోవు

  • పంట ఒడుపుకొని వదలిపెట్టి వేయబడు.
  • "ఆ చేను ఈటు వోయింది." వా.

ఈటెకాడు

  • సైన్యంలో ఈటె ధరించే సైనికుడు.
  • "కొని మిట్టిపడవైచు కొంతంబుకాని బి,ట్టెడు లిచ్చి పోవైచునీటెకాని." కుమా. 11. 40.
  • చూ. కొంతమువాడు.

ఈడబడు

  • వెనుకపడు, పాతబడు.
  • "ఏల ఎన్నోతరంబుల నీడబడ్డ, పెద్ద వావులు శోధించి గుద్దలింప." హర. 7. 128.

ఈడబోవు

  • వెనుదీయు.
  • "ఈడం బోక పెనంగిన." భార. విరా. 3. 133; 5. 63.
  • "అప్పటి పటుభల్లఖండితకృపాణుని జేసిన నీడబోక." భార. కర్ణ. 1. 150.
  • "రాక్షసు డీడ బోక...వ్రేసె." నిర్వ. 4. 52.

ఈడవిడుచు

  • దిగవిడుచు; ఈటు విడుచు. చేను ఈటు వోయినది, చేను ఈటు విడిచినారు అంటారు. అంటే పంట వడుపుకొని వదలి వేసి రనుట. పశువులకూ వానికీ వదిలిపెట్టుట. లక్షణయా గాలికి వదలివేయుట. అదే ఈడవిడుచుట కూడా.
  • "దనుజు జేకొని దయతో, నెప్పుడు వర, మిచ్చితి నీ వప్పుడ మది నీడవిడిచి తమరుల నెల్లన్." కుమా. 4. 19.
  • "త్రివర్గేచ్ఛ యెవ్వనిచేత నీడ విడువబడు." భార. అశ్వ. 1. 203.

ఈడాడు

  • పోటీపడు, కలియబడు, పోరాడు. ఈడి_____ఈడు 182 ఈడు_____ఈడు
  • "వీరభద్రుండు....ఏడు జిహ్వలు వెర్కి యీడాడినట్లు." పండితా. ద్వితీ. మహి. పుట. 9.
  • "ఓడ కోడకు దేవి యుగ్రరాక్షసుని నీడాడి నీచెఱ నే విడిపింతు." రంగ. రా. ఆర. 181. పుట.

ఈడిగిలబడు

  • వెనుకకు కూలబడు.
  • "వాడు అంతదూరం నడవ లేక ఈడిగిల బడుతూ ఈడిగిలబడుతూ వచ్చాడు." వా.
  • చూ. ఈడిగలు.

ఈడిగిలు

  • "ఆపెనసరి వ----రాలు మొఱవెట్టుచు నీడిగిలన్." జైమి. 2. 111.
  • చూ. ఈడిగిలబడు.

ఈడిగిల్లు

  • చూ. ఈడిగిలు.

ఈడు కాదు

  • సమ ఉజ్జీ కాదు.
  • "చూచెదరు గాని సభికులు, నీ చిన్ని కుమారకులకు నీ మల్లురకున్, ఓ చెల్ల! యీడు కా దని, సూచింపరు..." భాగ. పూర్వ. 10. 1351.
  • ఇది నేటివాడుకలో వివాహ విషయంలోనే మిగిలినది - ఆ పిల్ల వీడికి ఈడు కాదు అను రీతిగా.
  • "అంత దృఢంగా వున్న పిల్లకు ఈ జేనెడువెధవ ఎలా ఈ డవుతాడు." వా.

ఈడు చాలదు

  • తగినంత వయసు లే దనుట.
  • "వాని కివ్వడానికి మాపిల్ల ఈడు కాదే అనే నా ఆలోచన." వా.

ఈడు జో డాడు

  • ఒకటి నొకటి అతిశయించు; ఒకరిని మరొకరు మించు.
  • "అట్లు మామయు నల్లుండు నఖిల బంధు, సమితియును మీడు జోడాడి సంభ్రమింప...." రాజశే. 3. 190.
  • "దరస్మిత క్రీడాభరంబు లీడు జోడాడ." శుక. 1. 133.

ఈడుజోడు

  • 1. సమానము. జం.
  • "నీకు లోకములయందు నీడుజోడును లేదు." దశా. 2. 80.
  • "వసుధ బుట్టెడు పెరి గెడువారిలోనం, గని విని యెఱుంగ మంతటి ఘనుని నౌర, యీడుజోడును సరిసాటి యెందు లేద, తం డమర్త్యుండు గాక మర్త్యుండె తలప?" సారం. 155.
  • పాండు. 1. 46.
  • 2. వివాహానికి వధూవరుల అనురూపత.
  • "వీ ళ్లిద్దరికీ పెళ్ళి చేస్తే చక్కని ఈడుజోడు." వా.

ఈడుపడు

  • సమానమగు, సరిపడు-కుదురు. పాండు. 1. 46.
  • దక్షిణాంధ్రంలో నేటికీ విన వస్తుంది.
  • "ఆ ఊరికి పోయి చాలా ప్రయత్నం చేశాను. కానీ ఆపని యీడుపడ లేదు." వా.
  • చూ. ఈడ్వడు.

ఈడుబండాడు

  • పరుగెత్తు.
  • "కుందేళ్ల గన్నట్టి కుక్కలభాతి, ఈడు____ఈడు 183 ఈడు_____ఈడే

నెందును నిలువక నీడుబండాడు, నింద్రియంబుల గెల్వ నెవ్వరివశము." ప్రభులిం. 18. 106. ఈడు మీఱు

  • రజస్వల యగు.
  • "ఈ డెఱుంగనిచేడియ యీడు మీఱె." రాధికా. 1. 69.

ఈడుముంత

  • పాలముంత. గొల్లవాళ్లు దీనిని ఉపయోగిస్తారు.
  • ఈడువచ్చు
  • 1. సమాన మగు; పోలు.
  • "దాడిమీఫల బీజాదులు నద్రిజావ యవసౌభాగ్యంబుతో నీడు రాగలవో లేవొ." కాళ. 1. 100.
  • 2. వయసు వచ్చు.
  • "ఈడు వచ్చినపిల్లను ఇంట్లో ఎన్నాళ్లు పెట్టుకొంటాము." వా.

ఈడువారు

  • 1. సమానులు.
  • "నా యీడువారు కారు." వరాహ. 6.33.
  • సమవయస్కులు.
  • "రాగమంజరియన నొప్పు రాజసుతయు దాను నొక యీడు కాగ." విక్ర. 1. 116.
  • "వా ళ్లిద్దరూ ఒక యీడువారు." వా.

ఈడు వెట్టు

  • సమానము చేయు; పోల్చు.
  • "చక్కని కన్నుల సూర్యచంద్రులుగా గలవాడు, ఎక్కుడుగా కిందఱిలో నీడు వెట్టేదా?" తాళ్ల. సం. 9. 56.

ఈడుసేయు

  • పోల్చు.
  • "దోసము గాదె యియ్యతివతో బెఱ తొయ్యలి నీడుసేసినన్." కవిక. 3. 28.

ఈడేరి మొనకు వచ్చు

  • పెరిగి పెద్ద యగు.

           "పుట్టినప్పుడు నిన్ను భూసురు లెల్ల
            బట్టభద్రుం డని పలికిరి గాని
            ముందర నీడేరి మొనకు రా వనుచు
            నెందుకోసము నిర్ణయింపలే రైరి."
                                        సారం. ద్వి. 2. 517.

ఈడేఱించు

  • సఫల మగునట్లు చేయు.
  • "సోమతీర్థ మహేశ్వరు డిట, నా ప్రయాస మీడేఱించెన్." శకుం. 4. 24.

ఈడేఱు

  • 1. రజస్వల యగు.
  • "ఇ, ట్లీడేఱి కట్టుదప్పిన, చేడియ కిక నైన బెండ్లి సేయం దగదే." యయాతి. 3. 100.
  • 2. సఫల మగు, కృతార్థుడగు.
  • "నీ కథలు విని విని మే మీడేరితిమి." తాళ్ల. సం. 6. 161.

ఈడేఱుచు

  • కడతేర్చు.
  • "మమ్ము నొక చొప్పున దు:స్థితి నొందకుండ నీడేఱుపు మయ్య." వేంక. పంచ. 1. 304.

ఈడేర్చు

  • 1. సఫలము చేయు.
  • "కోర్కు లీడేర్చు."
  • 2. కడతేర్చు. ఈడే____ఈత 184 ఈత____ఈత
  • "నన్ను నీడేర్ప దలంచి మానవుని ఠేవను వచ్చినశంకరుండవో." సారంగ. 3. 185.

ఈడేర్చుకొను

  • సిద్ధింపజేసికొను.
  • "ఇంత లావుచేసి, ఈడేర్చుకొని రాగ దొల్లి యేరి, కైన జెల్లెనయ్య." రామా. 7. 7.

ఈడ్వడు

  • సరివచ్చు.
  • "పనసలం బోలుచుం గలుగుండ్లతోడ నీడ్వడు పెనుబండ్లు." ఆముక్త. 1. 68.
  • చూ. ఈడుపడు.

ఈడ్వబడు

  • లాగబడు.
  • "తలవట్టి యీడ్వంబడి." విరా. 1. 313.

ఈడ్గిలబడు

  • చూ. ఈడిగిలబడు.

ఈడ్గిలు

  • చూ. ఈడిగిలు.

ఈతకాయ

  • ఈదుకాయ.
  • నీళ్లలో తేలుటకై సొరకాయ, మునగబెండ్లు మొదలయిన వానిని వీపునకు, నడుముకు కట్టుకొంటారు. వానిలోదే ఈతకాయ.
  • "తేల్ప వె యీతకాయరూ పై." పాండు. 2. 57.

ఈతకు గానిలోతు లేదు

  • సమర్థునకు అసాధ్యము లే దనుట.
  • ఈతకు మించిన లోతు లేదని వాచ్యార్థం. ఈత వచ్చిన వానికి ఎంత లోతుంటే నేమి అనుట.
  • "వీడనాడకు మాకు విత్త మిం తనిన, లోగి యీతకు గాని లో తని జట్టి, వీగక...." గౌర. హరి. ద్వి.

ఈతకు మించిన లోతు లేదు

  • దాట రాని కష్టా లుండ వనుట.
  • చూ. ఈతకు మిక్కిలి లోతు కల్గునే?

ఈతకు మిక్కిలి లోతు కల్గునే

  • 1. కష్టాలకు తల ఒగ్గినతరువాత, అవి ఎన్ని అయితే నేమిటి? అనుట. ఈదడానికి సిద్ధ పడ్డ తర్వాత ఇక ఎంత లో తుంటే నేమి? అని వాచ్యార్థము.
  • "ఈతకు మిక్కిలి లోతు గల్గునే." రుక్మాం 4. 22.
  • 2. చేతనైనవానికి అసాధ్యము లే దనుట. విజయ. 1. 167.
  • "ఎంతపని అయితే నేమి? చేస్తున్నాం గదా? కానే అవుతుంది. ఈతకు మించినలోతు ఉంటుందా?" వా.
  • చూ. ఈతకు గాని లోతు లేదు.

ఈతకు లోతు కలదా ?

  • చూ. ఈతకు మిక్కిలి లోతు కల్గునే.

ఈతగింజ యిచ్చి తాటిగింజ లాగు

  • కొంచె మిచ్చి ఎక్కువ లాగి కొను. ఈత_____ఈత 185 ఈత_____ఈత
  • "వాడు మంచినీ ళ్లిచ్చాడంటే సంతోషించకు. వాడు ఈతగింజ యిచ్చి తాటిగింజ లా గేరకం. రేపే వచ్చి మీ యింట్లో కాఫీ తాగి వెడతాడు." వా.

ఈతబంటి

  • తలమున్క లగునది; దుస్తర మైనది.
  • దాట శక్యము కాని దనుట. ఏటికి వరద వచ్చిం దనడానికి పెన్న ఈతలకు పారుతూందని రాయలసీమలో నేటికీ అంటారు.
  • "... నాచే బడినజంతువుం గృతాంతు నంతవాని కైన బలవంతంబున విడిపింప నీతబంటి..." జైమి. 7. 211.

              "అట్టి భవదీయ చటుల బాహాప్రతాప,
                విక్రమాటోపమున కంగవించి నిలువ,
                బద్మగర్భాదులకు నీతబంటి యనినం,
                జెక్కు మీటిన వసవల్చు శిశువు లెదురె."
                                                  జైమి. 6. 245.

ఈత ముల్లు విరుగదొక్కే కాలం

  • మాంఛి వయసు.
  • ఈతముల్లును కూడా విరిగి పోవునట్లు తొక్కే వయస్సు అంటే ఏవిధ మైనఆటంకాన్నీ లెక్కింపని వయ స్సనుట. ఈతముల్లు తొక్కినా విరగదు. అది కాలిలో దిగితే విపరీత మైననొప్పి.
  • "వాని కేం కన్నూ మిన్నూ తెలుస్తుందా? ఈతముల్లు విరుగ దొక్కే కాలం." వా.

ఈతల

  • ఈవల, ఇవతల.
  • "ఈతల యుగమున." కాళ. 2. 93.
  • "ఆతల నీతల దేశములు." కాళిందీ. 6. 223.

ఈతలకు పారు

  • నిండుగా ప్రవహించు. ఈదుటకు మించి అనుట.
  • "పెన్న యీతలకు పారుతున్నది." వా.
  • చూ. ఈతలకు వచ్చు.

ఈతలకు వచ్చు

  • నిండుగా ప్రవహించు. ఈదుటకు మించి అనుట.
  • "ఏరు ఈతలకు వచ్చింది." వా.
  • చూ. ఈతలకు పారు.

ఈతలాతల

  • ఇటూ అటూగా.
  • "ఒక నిమిష మీతలాతల వస్తాను." వా.

ఈతలాత లగు

  • 1. అట్టిట్టగు, తారుమారగు.
  • ఇటూ అటూ అగు.
  • "దర్పకబాణంబు నీతలాత లైనన్." వరాహ. 11. 55.
  • "రావడం కాస్త యీతలాత లవుతుంది. నాకోసం కనిపెట్టుకొని ఉండవద్దు." వా.

ఈతలు పోతలు నగు

  • అత్యధిక మగు, పొంగారు.
  • "లోన నీతలుం బోతలు నైనయట్టి తలపోతలు." శకుం. 3. 58.

ఈతలు మోతలు చేయు

  • నానాబాధలు పెట్టు. ఈత____ఈదా 186 ఈదా____ఈదు
  • "కొంచగా డని యెంచకుడు దశాననుని ముంచి మీ కీతలు మోతలు చేయు."
  • వర. రా. కిష్కి. 512 పు. పంక్తి. 5.

ఈతలు మోతలు నగు

  • ఛిన్నా భిన్న మగు, దుర్భర మై పోవు.
  • "ప్రాత యగుమంత్రి తనకుం, జేతఱికము జేసె ననుచు శిక్షించి యొరున్, లాతిం బెట్టిన నీతలు, మ్రోతలు నై రాజు విడుచు బొందక మూకల్." పంచ. (నారా) (మి. భే) 290.

ఈత విడుచు

  • ఏ సంస్కారమూ లేక వదలి వేయు, గాలికి వదలిపెట్టు. ఈదురు గాలి అని కూడా ఉంది గనుక ఈ అర్థమే ఇక్కడ. ఇదే అర్థంలో ఈటు విడుచు కూడా ఉన్నది.
  • "ఈత విడిచిన మేదీగె యింత నయము, కలిగి యున్నది వాడుక కలిగె నేని, నెంత వరక మై యుండునొ." కుమా. 7. 7.

ఈదా డన్న కోదా డను

  • ఎతి అంటే ప్రతి అను, ప్రతి మాటకూ వ్యతిరేకించు.

            "మీదన్ వియోగసాగర, మీదం
             గలవా లతాంగి! యే మెఱుగ వయో!,
             యీదా డన్నను మదనుడు, గోదా
            డనువాడు బిగువు కొనసాగు నొకో!"
                                                 విజ. 2. 192.

  • "వానితో ఏపని చేయించుకో లేము. ఈ దాడంటే కోదా డ నేరకం." వా.

ఈదాడు

  • నిమగ్న మగు.
  • "ఇల నాచిత్తము యోగసాధనలయం దీ దాడగా." సర్వేశ. 93.

ఈదాఱు

  • తడియాఱు.
  • "నులివాయం గుంజి యీదాఱ జె, నారన్ వైచినజాలమో." కాళ. 4. 96.

ఈదుకొంటూ

  • కొంత ప్రయాసపై జీవనము చేస్తూ.
  • "ఈ పిల్లల నందరినీ యెదాన వేసుకొని ఏదో సంసారం యీదుకొంటూ వస్తున్నాను." వా.

ఈదుగాయ హంస. 4. 182.

  • చూ. ఈతకాయ.

ఈదుగొయ్య హంస. 4. 182.

  • చూ. ఈదుగాయ.

ఈదురుగాలి

  • చలిగాలి.
  • "ఈదురుగాలిలో తిరిగితే జబ్బు చేస్తుంది." వా.

ఈదురో మను

  • ఎందుకు పుట్టామురా భగవంతుడా అన్న ట్లుండు.
  • "ఏమిట్రా అలా ఈదు రోమని ఉన్నావు." వా.
  • చూ. ఈసురో మను.

ఈదులాడు

  • 1. వ్రేలాడు. ఈన____ఈనా 187 ఈని____ఈనె
  • "ఈటెపోటుల బడి ప్రేవు లీదు లాడ." మను. 4. 42.
  • 2. ఈతకొట్టు.
  • "తడబడ నోలలాడుచు హళాహళిగా బడి నీదులాడెడిన్." జైమి. 1. 28.
  • "పిల్లలు బావిలో ఈదులాడుతుండగా చూచి వాళ్ల నాన్న కోప్పడ్డాడు." వా.

ఈన గాచి కుక్కలపాలు చేయు యామున. విజ. 4. 96.

  • చూ. ఈనగాచి నక్కల పాల్జేసినట్లు.

ఈనగాచి నక్కల పాల్జేసినట్లు

  • సఫల మగునంతదాకా ప్రయత్నించి, ఫలితం కడపట ఎవరికో వదలివేయు.
  • "వ్యాపారం బాగా స్థిరపడేదాకా పనిచేసి ఇప్పుడు వదిలి వేయడ మేమిట్రా? ఈన గాచి నక్కలపాలు చేసినట్లుగా?" వా.

ఈనరాసి

  • తక్కువరకం వడ్లు. బ్రౌను.
  • హీనరాశికి వికృతరూపము కావచ్చును. రాశిని తరము, రకము అనే అర్థంలో ఉపయోగించడం కలదు.

ఈనా డయ్యెడుకార్యము కానేరదె ఱేపు

  • తొందరపడుట యెందుకు? అనేసందర్భంలో ప్రయుక్త మయ్యే పలుకుబడి. ఈ రోజయ్యేది రే పవుతుంది అని రాయలసీమలో విరివిగా వాడుక.
  • "ఈ నా డయ్యెడుకార్యము గా నేరదె ఱే పటంచు గడు నెమ్మది న మ్మానధురంధరుడు-" శుక. 1. 216.
  • చూ. ఈరోజయ్యేది రేపవుతుంది.

ఈనినకడుపు ఇల్లాటదు

  • బాలింతకు ఆకలి యెక్కువ అనుట.
  • "ఈమధ్య కోడలికి తెగ ఆకలేస్తున్నట్టుందిరా. ఈనిన కడుపు ఇల్లాట దంటార్లే." వా.

ఈనినపులివలె

  • మహాక్రోధముతో అనుట. ఈనిన పులి మహాకోపంగా ఉంటుంది-ఆ పిల్లల నెవ రెత్తుకొని పోతారో అని. ఆ సమయంలో కనిపిస్తే ఎవరి నైనా చంపుతుంది.
  • "ఏణాక్షి యది విని యీనిన పులిబోలె బదరి భగ్గున మండిపడియె నొక్కొ." రాధి. 3.

ఈనెగట్టు

  • వరుసగట్టు.
  • "ఱేని పల్లొత్తులు బట్టబైట నిడ నోపుచు వా తెఱ నీనె గట్టగా." శుక. 1. 514.

ఈనెగాజులు

  • ఒక పిల్లల ఆట. శుక. 1. 513. హంస. 3. 146.

ఈనెగుఱ్ఱము

  • పిల్లల ఆట. హంస. ఈనే_____ఈమా 188 ఈమా_____ఈరి

ఈ నేటికాలము

  • ఇప్పటి కాలము. కాశీ. 1. 13.
  • ఇదే అర్థంలో నేడు 'ఈరోజులలో' అని వాడటం అలవాటు.
  • "ఈరోజుల్లో పెద్దలమాట వినేవా రెవరు?" వా.

ఈ పిల్లి ఈ పాలు తాగుతుందా అన్నట్టు ఉండు.

  • అతి అమాయకంగా కనిపించు.
  • "ఆయన యింట్లో ఉన్నంతసేపూ వీడు ఈపిల్లి ఈపాలు తాగుతుందా అన్నట్టు ఉంటాడు. ఇల్లు దాటీదాటడంతోనే ఒకటే అల్లరి." వా.

ఈపాటి చదువుకో లేదా?

  • ఈమాత్రం తెలియదా?

             "అరయ గూతుం గవయుట
               వారల కది యొప్పవచ్చు వసుమతి నినజుం
               డీరీతి జేసె బూర్వము, శారద యీ
               పాటిచదువు చదువదె చెపుమా?"
                                          నలచ. 4. 122.

  • చూ. ఈమాత్రం చదువు చదువుకో లేదా?

ఈబరిగొట్టు

  • నిష్ప్రయోజకుడు.

ఈమాత్రం ఆమాత్రం మనిషి

  • ఇంతటంతటివాడు; సుమారైనవాడు.
  • "ఈమాత్రం ఆమాత్రం మనిషి వాడి కంటి కాగడం లేదు." వా.

ఈమాత్రం ఆమాత్రానికే

  • అతి స్వల్పవిషయానికే.
  • "ఈమాత్రం ఆమాత్రానికే మొహం ముడుచుకొని కూర్చుంటే కాపురాలు ఎట్లా అవుతా యమ్మా?" వా.

ఈమాత్రం చదువు చదువుకో లేదా?

  • చూ. ఈపాటి చదువుకోలేదా?

ఈయకోలు

  • అంగీకారము.
  • చూ. ఇయ్యకోలు.

ఈరములు గొట్టు

  • దారులు గొట్టు.
  • ఈరము = పొద. పొదల చాటున దాగి ఉండి దారులు కొట్టుటపై వచ్చినపలుకుబడి.
  • "బంధుల దిట్టి సజ్జనుల బాధలు వెట్టి... ఈరములు గొట్టి." భాగ. 6. 107.

ఈరసపడు

  • అసూయపడు, ఈర్ష్యపొందు.
  • "నా రూపమునకు మదిలో, నీరసపడు చున్నవాడు." కాశీ. 4. 152.

ఈరస మాడు

  • తిరస్కరించు.

                 "కుందనపు గాహళంబులు, పొందెఱు
                  గక యెన్ని బిరుదములు పలికిన ద,
                  మ్మందదుకు లనుచు నాలిక, నిందీవర
                  నయనజంఘ లీరస మాడున్."
                                                  వరాహ. 11. 49.

ఈరస మెత్తు

  • అ సూయపడు; ఈర్ష్య వహించు. ఈర_____ఈరు 189 ఈరెం_____ఈర్పె
  • "వారు మ మ్మీరస మెత్తి కీడ్పఱచి." భార. ఉద్యో. 3. 74.
  • "నీ వీరస మెత్తి నోబలికి తేనియు జెప్పుదు సూతనందనా!" భార. కర్ణ. 2. 52.

ఈరసించు

  • ఈర్ష్యపడు. వేం. పంచ. 1. 488.

ఈరాఱు

  • పన్నెండు.
  • (ఇరు + ఆఱు.)

ఈరిక లీను

  • అంకురించు.

ఈరిక లెత్తిన కోరికలు సారికలు గొను

  • పొడమిన కోరికలు చాయలు గట్టు. కోరికలు విపరీతంగా చెలరేగు.
  • "అర్థి జనంబులు మనంబుల ఘనంబులుగ, నీరిక లెత్తినకోరికలు సారికలు గొన." భాగ. స్క. 3. 507.

ఈరిక లెత్తు

  • మొలకెత్తు.
  • "మనంబున మక్కువ లీరిక లెత్త." రుక్మాం. 3. 126.
  • చూ. ఈరిక లీను.

ఈరు దివ్వ పేను వచ్చు

  • కొంచెము కదపగా పూర్తిగా కదలు.
  • తీగ కదిపితే డొంక కదలు అనుట వంటిది.
  • "మీర లూరకుండ రీరు దివ్వగ బేను, వచ్చు ననుట వినమె వనితలార!, యాన వెట్టి యడుగ మానరా దిక జెప్ప, వల సె మీ రహస్యవర్తనములు." ప్రభా. 5. 78.
  • "ఇడక పో బోల దిడ బోల దీరు దివియం, బేను రాకున్నె తైర్థికుల్ పెళుచు లండ్రు." పాండు. 4. 166.

ఈరెండ

  • లేతయెండ. శివ. 4. 27. హర. 7. 139. ఆము. 6. 97.

ఈరెలుగు

  • హీనస్వరము.

ఈరెలుగుపడు

  • డగ్గు త్తికపడు.
  • "తల వడకంగ నొయ్య నీరెలుగు వడుచు." హర. 2. 48.

ఈరేడులోకాలు

  • పదునాలుగు లోకములు.
  • క్రింద యేడు, పైన యేడు లోకాలున్న వని మన పురాణాలు. ఆ లోకా లివి.
  • భూలోకము - అతలము
  • భువర్లోకము - వితలము
  • సువర్లోకము - సుతలము
  • మహర్లోకము - రసాతలము
  • తపోలోకము - తలాతలము
  • తేజోలోకము - మహాతలము
  • సత్యలోకము - పాతాళము

ఈర్పెన

  • ఈరు తీయుదువ్వెన. పొడవుగా ఉండి దువ్వెనపండ్ల వలె గాక - పొడవుగా కోసిన పండ్లు కలిగిన ఈ ర్పెనలు ఈర్పే____ఈఱ 190 ఈఱ____ఈల

నేటికీ ఉపయోగిస్తారు. వీనిని దువ్వెనవలె వెండ్రుకల పైన పెట్టి కాక, క్రిందినుండీ వెండ్రుకలలో దూర్చి లాగుతారు. ఈర్పేన

  • చూ. ఈర్పెన.

ఈర్వేను

  • చూ. ఈర్పెన.

ఈరోజయ్యేది రేపవుతుంది

  • అయ్యే దెలాగా అవుతుంది తొంద రెందుకు?
  • చూ. ఈనా డయ్యెడి కార్యము కా నేరదె రేపు.

ఈఱతాఱ చూపు

  • కొంటెచూపు, వక్రదృష్టి.
  • "మోఱకుని చందమున నీఱ తాఱ చూపు, పాండవేయునిపై దార్చి." హర. 7. 14.

ఈఱతాఱ తలపులు

  • వంకర ఆలోచనలు.
  • "ఈఱతాఱతలంపులు చీఱువాఱ." భార. అశ్వ. 1. 108.

ఈఱతాఱయదలుపులు

  • వట్టి అదలింపులు. భార. ద్రోణ. 3. 48.

ఈఱతాఱల నడలు

  • అటూ ఇటూ ఊగిసలాడు నడకలు.
  • "దనుజురథము దిరిగె నీఱతాఱల నడలన్." భాస్కరా. అర. 2. 124.

ఈఱతాఱ లాడు

  • పరుషవాక్యము లాడు.
  • "ఈఱతాఱ లాడ నెట్లు నో రాడెనో రామ రామ నిరపరాధ సుమ్ము." (కృష్ణ.) శకుం. 3. 24.

ఈఱతాఱ లిచ్చు

  • వక్రముగా జవా బిచ్చు.
  • "ఈఱతాఱ మఱు మాట లిచ్చి యపహ సించె." భార. ఉద్యో. 4. 76.

ఈలకఱచు

  • గట్టిగా పట్టుకొను.
  • "వాడు పండ్లు ఈలకఱచుకొని ఉన్నాడు." వా.
  • చూ. ఇలకఱచు.

ఈల కఱచుకొని యుండు

  • దేనికోసమో ఎదురు చూస్తూ పడి ఉండు.
  • "వీడు నొప్పించి నిలువం దగునెల వగుట, నసము డింపక యీల గఱచు కొని యున్న వాడు."
  • భార. ద్రోణ. 2. 104.
  • చూ. ఇలకఱచుకొని యుండు.

ఈలకూతలు

  • ఒక ఆట.
  • "ఈలకూత లాదిగా శైశవక్రీడ లా డి రచట." వి. పు. 7. 203.

ఈలకూర

  • ఉప్పని ఒక కూరాకు.
  • "ఆలి నొల్లనివాడు దా నీలకూర, కుప్పు చాల లే ఫన్నట్లు." వరాహ. 7. 47.

ఈలకూరలో ఉప్పు లే దన్నట్లు

  • అనవసరముగా తప్పు పట్టేపట్ల ఉపయోగించేపలుకుబడి.
  • అసలు ఈలకూరలోనే ఉప్పుం ఈల____ఈలు 191 ఈలు____ఈవు

టుంది. అది చాలక పోవడమంటూ ఉండదు.

  • "ఆలి నొల్లనివాడు దా నీలకూర, కుప్పుచాల లే దన్నట్లు." వరాహ. 7.47.
  • "ఆలి నొల్లనివాడు ఈలకూరలో ఉప్పు లే దన్నాడట." సా.

ఈలకొను

  • ఈలకఱచు.
  • "ఈలకొన్న యెముకల యింటిలో కాపుర మింతే." తాళ్ల. సం. 9. 45.

ఈలగ్రద్ద

  • ఒక జాతి డేగ; లుబ్ధుడు.
  • "ఏము నలుపురందు నెవ్వాడు గాజాలు నిచ్చిపుచ్చుకొన్న యీలగ్రద్ద."
  • శృం. నైష. 7. 107.
  • చూ. ఇచ్చిపుచ్చుకొన్న ఈలగ్రద్ద.

ఈలపురుగు

  • ఇలకోడి, చిమ్మట. శ. ర.

ఈలవెట్టు

  • ఈల వేయు.
  • "పోవ వా డిందు రం డని త్రోవ యడవి, బెట్టి యొకవాగు డిగ నీల వెట్టుటయును." ఆము. 7. 9.

ఈలవేయు

  • ఈల పెట్టు.
  • "వాడు ఈల వేసేసరికి వందమంది చేరుతారు." వా.

ఈలువుగొను

  • మానభంగము చేయు. శుక. 2. 10.

ఈలువుటాలు

  • ఇల్లాలు.
  • "అసురుల యీలువుటాండ్రను జెఱ వట్టితి." భార. ఆది. 7. 61.

ఈలువుడుగు

  • కులాచారమును వదలు, ఇలు వరుసను పాటించక పోవు.
  • "ఈ విధంబున సుకుమారు డీలు వుడిగి మా ల చిగురాకు బో డితో దునుపు మనగ."
  • శివరా. 3. 117.

ఈల్కఱచు

  • చూ. ఈలకఱచు.

ఈవరితనము

  • నదాన్యత. యయా. 5. 1.

ఈవలతగులు

  • వెట్ట చేయు.

ఈవ లవల సేయు

  • తలక్రిందులు చేయు.
  • "అఖిలదిక్కుల నీవలవల సేసి." భార. రా. యు. 263.

ఈవలావ లగు

  • తలక్రిందు లగు.
  • "లంకయు నీవ లావలై కదలినభంగి." భా. రా. యు. 1319.

ఈవికాడు

  • వదాన్యుడు.

ఈవిమ్రాను

  • కల్పవృక్షము.
  • చూ. ఈగమ్రాను.

ఈవులకెంపు

  • చింతామణి.
  • చూ. ఈగుల కెంపు. ఈవు____ఈను 192 ఈసొ___ఉంకు

ఈవులరతనము

  • చింతామణి.

ఈశ్వరివేరు

  • వశీకరణౌషధము, పొగరడచునది.
  • ఈశ్వరివేరును కట్టుకుంటే పాములు తలవంచి వశ మగునన్న నమ్మకంపై వచ్చిన పలుకుబడి. లక్షణయా వశము చేసుకొనునది.
  • "నాదగ్గర వేరే ఊశ్వరివేరు ఉందిలే. దాంతో వాడు లొంగిపోతాడు." వా.

ఈషణత్రయము

  • దారేషణ, ధనేషణ, పుత్రేషణ: భార్యాపుత్ర ధనాలపై ఆశ.

ఈసడ చేయు

  • ఈసడించు.

ఈస పిట్ట

  • ఒక జాతిచేప.

ఈసురో మను

  • కళాకాంతి విహీనముగా నుండు. బలహీనముగా నుండు.
  • "ఈసురో మని మనుషు లుంటే, దేశమేగతి బాగుపడునోయ్." గురజాడ.
  • "లంకంత యింట్లో చాలినంత మనుషులు లేక యీసురో మని ఉంది." వా.
  • చూ. ఈదురో మను.

ఈసువడు

  • నింద పొందు.
  • "మోసపోయితి గులమునం దీసు వడితి." శివరా. 3. 129.

ఈ సొనరించు

  • ఈర్ష్యపడు.
  • "ఇంక వీరితో నీ సొనరించువీరవరు నెవ్వని గాన." భాస్క. యుద్ధ. 1063.

ఈళ్ళు క్రుక్కు

  • ఈరు = చిన్న పేలు; వానిని చంపు. పేలను రెండు బొటనవ్రేళ్ళ సందులో నుంచి చిటుక్కు మని పొడుచుటయే పేలు క్రుక్కుట. ఈలు క్రుక్కుటా అంతే.
  • "ఈళ్ళు క్రుక్కి." పాండు. 3. 30.

ఉంకుచెండువిధంబున

  • విసరి వేసిన చెండువలె. చెండు వేసినప్పుడు నేల తగిలి మరొకతూరి పైకి వెళ్లి కిందికి పడి మరీ యెగురును. అనగా మకానులు కమానులుగా వెళ్లు ననుట. ఇట్టియెగురుటతో ఇచట సామ్యము.
  • "ఉంకుచెండువిధంబున, నుత్తరించు తములపాకు నిక్కెడుక్రియ దాటు నిఱ్ఱి." ఉ. హరి. 4. 28.

ఉంకుటుంగరము

  • వివాహనిశ్చయ సూచకంగా వధూవరులు మార్చుకొనే ఉంగరము.
  • హంస; శ. ర.