Jump to content

పదబంధ పారిజాతము/ఇ

వికీసోర్స్ నుండి

ఆసు____ఆస్తీ 134 ఆస్థా____ఇంక

ఆసువోసిన కండె అటూ ఇటూ ఆగకుండా తిరుగుతూ ఉంటుంది. ఆసు వోసెడుదాని హస్తంబురీతి

  • ఒకచోట నిలువక.
  • నేతపనిలో ఆసు పోయునప్పుడు చేయి అటూ ఇటూ గబ గబా తిరుగుతుంది.
  • "ఆసు వోసెడుదాని హస్తంబురీతిని, గుంచె దీసెడుదాని కొమరు మిగుల." హంస. 1. 220.
  • చూ. ఆసు వోసినకండెవలె.

ఆసేతుశీతనగం

  • చూ. ఆసేతుహిమాచలం.

ఆసేతుహిమాచలం

  • సేతువు మొదలుకొని హిమవత్పర్వతంవరకూ, యావద్భారతదేశంలోను అనుట.
  • ఇదే పలుకుబడి ఆయా పదాల పర్యాయపదాలతో కూడా మన కావ్యాలలో ప్రయోగిస్తారు.
  • చూ. ఆసేతుశీతనగం. జం.

ఆస్తిపాస్తులు

  • "వానికి ఆస్తిపాస్తు లేమీ లేవు. ఆ ఉద్యోగం ఉంది. వాడున్నాడు." వా.
  • చూ. ఆస్తి పాస్తీ.

ఆస్తీ పాస్తీ

  • ఆస్తి. జం.
  • "వాడికి ఆస్తా పాస్తా? ఏమీ లేదు."
  • "వాడి కింత ఆస్తీపాస్తీ ఉంది. తాను తినగలడు. ఒకరి కింత పెట్టగలడు." వా.

ఆస్థాన మగు

  • ఉండు; కొలు వుండు
  • "సువర్ణ కుంభయుతసౌధంబందు నాస్థాన మై." పాండు. 1. 21.

ఆహా పుట్ట జేయు

  • ఆశ్చర్యము కలిగించు.
  • "ఆహా పుట్టెడు లాతి చూపఱకు హాహా పుట్టు మీవారికిన్." భార. శల్య. 2. 248.

ఆహావుట్టిపడు

  • ఆశ్చర్యపడు.
  • "పౌరకమలేక్షణ లాహా వుట్టి పడిన యట్లన్, దేవుని గన మఱచి యిట్లనిరి తమలోనన్." శుక. 2. 16.

ఆహివెట్టు

  • కుదువపెట్టు ; తాకట్టు పెట్టు. తాళ్ల. సం. 10. 142.

ఇంక ఎక్కడ?

  • ఇంక వాని ప్రస్తావనకే ఆస్కారం లేదు అనుపట్ల ఉపయోగిస్తారు.
  • "కటాకటా ఇంక నెక్కడ చోడనృపతి, కటకటా యింక నెక్కడి వెల నాడు."
  • పండితా. ద్వితీ. మహి. పుట. 51.
  • "వాన రాలేదు. ఇం కెక్కడిపంటలు." వా.
  • చూ. ఇంకేమి? ఇంక_____ఇంగి 135 ఇంగి_____ఇంచు

ఇంక నా చేత గాదు

  • ఇకమీద నాకసాధ్య మనుట.
  • "నా చేత నింక గా దిది యోచెలువుడ యనగ." కళా. 1. 201.
  • "ఇంతదాకా ఏదో చేస్తూ వచ్చాను గాని యింక నాచేత కాదు." వా.

ఇంకబాఱు

  • ఇంకిపోవు.
  • "పారావారమ్ము లింక బాఱిన." భాగ. 8. 595.

ఇం కేమి?....

  • ఇం కెక్కడ?
  • ఇక అది అసంభవ మనుట.
  • "సాయంత్ర మయింది. వా డిం కేం వస్తాడు?" వా.
  • "మబ్బు పట్టింది. ఇం కేం వెడతాం." వా.
  • "కరువు వచ్చింది. ఇంకేం నిభాయిస్తాం?" వా.
  • చూ. ఇంక ఎక్కడ?

ఇం కేమైన ఉందా?

  • చాలా ప్రమాద మనుపట్ల ఉపయోగించేపలుకుబడి.
  • "వీడు నోటికి వచ్చినట్లు వాగుతున్నాడే? ఇది ఆయనకే తెలుస్తుందనుకో. ఇం కేమైనా ఉందా?" వా.

ఇంగితజ్ఞుడు

  • ఎదిరి మనసు నెఱుగగల వాడు.
  • "వాడు ఏమైనా ఇంగితజ్ఞుడు. మన వాడికే ఇంగితజ్ఞానం లేదు. వా.

ఇంగిలాయ

  • శుంఠ, తిట్టు.
  • "ఇంగిలాయలు కొంటె కోణంగులైన." ప్రభా. నాట. 5.

ఇంగిలాయి

  • చేపలలో ఒక భేదము.

ఇంగువకట్టిన గుడ్డ

  • ఏమీ లేక పోయినా వెనుక బాగా బతికినవారిలో ఎంతో కొంత ఔదార్యం, ఉత్తమత ఉంటుందని అనేపట్ల ఉపయోగించేపలుకుబడి.
  • ఇప్పు డందులో ఇంగువ లేక పోయినా, యింగువ కట్టినగుడ్డ కా వాసన ఉంటుం దనుటపై యేర్పడినపలుకుబడి.
  • "వాళ్ళ సంసారం ఎంత చితికిపోయినా యిప్పటికీ అతిథూ అభ్యాగతీ అంటూ వస్తే పొమ్మనరు. ఎం తైనా ఇంగువ కట్టినగుడ్డ వాళ్ళకుటుంబం." వా.

ఇంచి మంచి పెట్టు

  • అవీ యివీ యిచ్చు (మంచి చేసుకొను)
  • ఇంచిమంచి-ఒక తినుబండము అని వావిళ్ల.
  • "దాసితోడ మాలిమి యొనర్చుకొని యించిమంచి పెట్టి." శుక. 3. 295.

ఇంచుకంత

  • కొంచెము.
  • "ఇంచుకంత నిక్కిన." ఆము. 5. 116.

ఇంచుక వడి

  • కొంచెము సేపు. ఇంచు____ఇంట 136 ఇంట____ఇంట

ఇంచుటలుక

  • ప్రణయకలహము. కవిక. 1. 21.

ఇంచుమించుగా

  • రమారమిగా, కొంచెము హెచ్చుతక్కువగా.
  • "వానికి ఇంచుమించుగా పదేళ్లు ఉంటాయి." వా.
  • "ఆవూరికీ యీవూరికీ యించుమించుగా పదిమైళ్లదూరం ఉంటుంది." వా.

ఇంచుమించు లాడు

  • హెచ్చు తక్కువగా మాట్లాడు. లక్షణయా తిరస్కరించు.
  • "ఇంచుమించు లాడు నించుమించు." విజయ. 1. 36.

ఇంచులాడి

  • కులుకులాడి.
  • "ఏమి కన్నీరు నించెదే ఇంచులాడి." కాశీ. ద. 2. 66.

ఇంట దయ్యమువలె నుండగ

  • ఇంత మనిషిని ఇంట ఎదుట ఉండగా నాకన్నే కప్పి ఇంత పని చేస్తావా? - అన్న భావంలో ఉపయోగించే పలుకుబడి.
  • "ఇయ్యెడ గలిగిన రోవెల, యియ్యక నా కెఱుక లేక యి~తు నే నింటం, దయ్యమువలె నుండగ మా, తొయ్యలితో....." శుక. 3. 35.
  • "దయ్యంలాగ అత్త యింట్లో ఉంటే దానిష్టంగా అది చేస్తున్నది." వా.
  • "దయ్యంలాగ నే నింట్లో ఉన్నాను గదా. నాతో ఒక మాట అనవద్దా." వా.

ఇంట గుడిచి యింటి వాసాలు లెక్కించు

  • ఉపకారికే అపకారము చేయు.
  • ఒకకథపై వచ్చినపలుకుబడి. ఎవరో ఒకణ్ణి ఆదరించి అన్నం పెట్టి యింటిలో ఉంచుకోగా, వాడా యిల్లు నాదే అన్నా డట. దానికి సాక్ష్యం యేమి టంటే యీ యింట్లో ఎన్ని వాసా లున్నాయో నాకు తెలుసు అన్నా డట.
  • "రాక రాక వచ్చె రాజు శిష్యుడు నని, గారవింప సపరివారు డగుచు, నింట దిని గణించె నింటివాసము లిట్టు, లేటి శిష్యు లింక నేటి గురులు?"
  • త్రిశంకుస్వర్గం. అం. 2. పే. 15.

ఇంట నెన్నడు లేని

  • వంశములో లేని.
  • "ఇంట నెన్నడు లేని యీ హీనవిద్య, యెన్న డభ్యాస మాయెరా కన్న తండ్రి!" నిరం. 2.83.
  • "ఇలాంటిది మాయింట్లో ఎన్నడూ లేదు.:
  • చూ. ఇంటా వంటా లేదు.

ఇంట పొయి రాజదు

  • తిండికి లేదు, ఉండి పొయ్యి రాజితేనే గదా తిండి.
  • "దినదినము ననక యే వన, మున కేగక యున్న నింట బ్రొయి రాజదు గా." శుక. 3. 251. ఇంటా_____ఇంటి 137 ఇంటి_____ఇంటి

ఇంటాతడు

  • మగడు.
  • "మా యింటాత డెపు డైన గలసిన నాతని గా దలంతు." అహల్యా. 3. 58.
  • చూ. ఇంటియాతడు; ఇంటాయన.

ఇంటాయన

  • మగడు.
  • "మా యింటాయన ఊళ్లో లేరు." వా.
  • చూ. ఇంటాతడు.

ఇంటావిడ

  • ఇల్లాలు.
  • ఇది కోస్తాప్రాంతంలో వినిపించేమాట.
  • "మా యింటావిడకు కాస్త సుస్తీ చేసింది." వా.

ఇంటా వంటా లేదు

  • ఈ వంశంలో యిలాంటి అలవాటు లేదు, ఇలాటి దుర్గుణాలు వీరికి బొత్తిగా లేవు అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "సైచు టెట్టు లిక నింటన్ వంట లే విప్పనుల్." పాణి. 5. 3.
  • "ఇలాంటి వెధవపనులు మా యింటా వంటా లేవు. వీడు మాయింట్లో చెడబుట్టాడు." వా.
  • రూ. ఇంట నెన్నడు లేని.

ఇంటికంటే గుడి భద్రము

  • సొంతం దానికన్నా తిరెపెంగా వచ్చినదే హాయి-అని సూచించేపలుకుబడి.
  • "వానికి అత్తారిల్లే బాగుందిట. ఇంటి కంటే గుడి భద్రం అన్నారు." వా.

ఇంటికన్న గుడి పదిలము

  • సింహా. నార. 2.
  • చూ. ఇంటికంటే గుడి భద్రము.

ఇంటికాపు

  • గృహస్థు.

ఇంటికి కాక పోవు

  • ఇంటిపట్టున ఉండక పోవు. ఇంటికి పనికి రాక పోవు.
  • సాంబనిఘంటువులో ఇంటికి కాకపోవుట అనగా ముట్టగుట అని ఉన్నది. ఇది నేడు ఇలా వాడుకలో ఉన్నట్టు కనబడదు.
  • "ఉన్న ఒక్కకొడుకూ యింటికి కాకుండా పోయాడు." వా.
  • "ముగ్గురు కొడుకు లుంటే ముగ్గురూ మూడు ఊళ్లల్లో ఉద్యోగాలు చేస్తూ ఒక్కడూ యింటికి కాకుండా పోయాడు." వా.

ఇంటికి నిల్లు గట్టుకొని యేగు

  • ఇంటిల్లి పాదీ పోవు.
  • కుటుంబపరివార సమేతముగా ననుట.
  • "ఇంటికి నిల్లు గట్టుకొని యేగగ వచ్చు మురారివెంట నా, యింటికి వచ్చి పూజగొని యేగుట నన్ను గృతార్థు జేత." కకుత్థ్స. 2. 4.

ఇంటికుక్కలు

  • దాసులు, బానిసలు, ఆశ్రితులు.