పదబంధ పారిజాతము/ఇల్లు ఇరకటం ఇల్లాలు మర్కటం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఇల్లా_____ఇల్లు 171 ఇల్లు_____ఇల్లు

ఇల్లాలు

 • గృహిణి.

ఇల్లిగ్గులు

 • సంకోచములు.
 • "ఇల్లిగ్గులు గానవచ్చి హృదయములో నన్." ఉ. హరి. 5. 166.
 • శై. ర. లోనూ - దాని ననుసరించి కావచ్చు వావిళ్లని. లోనూ ఉన్న 'వెనుక కొఱగుంటలు' అన్న అర్థం ఇక్కడ కుదురుట లేదు.

ఇల్లి ముక్కు

 • ముక్కులో నెత్తురు కారే ఒక రోగము.

ఇల్లు ఇరకటం ఇల్లాలు మర్కటం

 • అన్నీ యిబ్బందులే అన్న అర్థంలో ఉపయోగిస్తారు. ఒక సామెతపై వచ్చిన పలుకుబడి.
 • "నా దంతా మహాయిబ్బందిగా ఉంది. ఇల్లు యిరకటం ఇల్లాలు మర్కటం." సా.

ఇల్లు కట్టుకొను

 • శాశ్వతంగా ఉండు.
 • "నిరతమును నిల్లు గట్టుకొ మ్మరుగు మింక." సుకన్య. 39.

ఇల్లు కశలం

 • ఇల్లు ఇరకట మనుట.
 • "ఇల్లు కశలంగా ఉంది." వా.

ఇల్లు కాలా

 • ఒక తిట్టు.
 • 'దాని, వాని' ఇలా కలిపే వాడుక.
 • "వా నిల్లు కాలా." వా.
 • "దానిల్లు కాలా. ఏమిరంపు చేస్తుందమ్మా." వా.

ఇల్లు గట్టుకొను

 • స్థావర మేర్పరచుకొను, నివసించు.
 • "కొడుకులును దోడ రా న,ట్టడవిని నిలు గట్టికొంటి వటరా." పాండవాశ్వ. 33.

ఇల్లు గడచు

 • జీవనము జరగు.
 • "ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఇంక ఒకరికి ఏం పెడతాం?" వా.

ఇల్లు గుల్ల చేయు

 • కొంప పాడు చేసుకొను.
 • "ఇల్లు గుల్లగ జేసి యిల్లాలి నెగ రోసి వేశ్యకై యూరూరు వెడలువారు." చింతా. 4. 37.

ఇల్లు చాలదు

 • చాలినంత వసతి లే దనుట.
 • "పిల్ల లందరు వస్తే ఈ యిల్లు చాలదు." వా.

ఇల్లు చెఱచు

 • కులనాశనము చేయు.
 • "బాలికాగ్రగణ్య లీలావతీకన్య, యిల్లు చెఱప బొడమె నేమొ యనుచు." శుక. 1. 459.

ఇల్లు చేరుకొను

 • ఎక్కడి కైనా వెళ్లి తిరిగీ యింటికి వచ్చు. ఇల్లు____ఇల్లు 172 ఇల్లు____ఇల్లు
 • "అతను పొద్దున్నుంచీ ఎక్కడ తిరిగినా సాయంత్రానికి తప్పకుండా ఇల్లు చేరుకుంటాడు." వా.

ఇల్లుటాలు

 • ఇల్లాలు.
 • "నందుని యిల్లుటా లగుయశోద." నీలా. 1. 77.

ఇల్లు దోచిపెట్టు

 • ఇంట నున్న దానిని యితరులకు పెట్టు.
 • ఇది తగ దనేభావం ఇందులో ఇమిడి ఉన్నది.
 • "చూచి చూడక యిల్లు దోచిపెట్టితిమి." అలుగురాజు. 67 పు.
 • "ఆపిల్ల కాపరానికి వచ్చిన మూడోరోజునుండే వాళ్ల వాళ్లకు యిల్లు దోచి పెట్టడం ప్రారంభించింది." వా.

ఇల్లు నడపు

 • సంసారము నడపు.

          "గొల్లడు వ్యాధుడు రజకుడు
           కల్ల మ్మెడువాడు లోనుగా గొందఱు
           దా, రిల్లాలప్పరుపం దగు, నిల్లు నడపు
           చనవు దాని కిచ్చినకతనన్."
                                          విజ్ఞా. వ్యవ. 80.

ఇల్లు నిలుపుకొను

 • వంశము నిలుపుకొను.
 • "వలదు సీత నిచ్చి నలినాప్తకులనాథు కొలువు వట్టి యిల్లు నిలుపుకొనుము." రామా. 7. 74.

ఇల్లు నిల్పు

 • సంసారము పాడు గాకుండా నిలబెట్టు.
 • "శాపంబు తడకట్టు దీర్చి గౌతము నిల్లు నిల్పి." వర. రా. బా. పు. 156. పంక్తి 17.

ఇల్లు బావురు మను

 • ఎక్కువమంది ఉండి వెళ్లి పోగా శూన్యముగా తోచు.
 • "రెండురోజులు తిరునాళ్లలా ఉండినదా? పిల్లలంతా వెళ్లి పోయేసరికి యిల్లు బావురు మంటూ ఉంది." వా.

ఇల్లును ముంగిలి జీవితమ్ముగా

 • సంకుచితంగా, కూపస్థ మండూకం వలె. శరభాంక. 59.

ఇల్లును వాకిలి చూచికొను

 • కుటుంబ యాజమాన్యము వహించు.big>

            "......సంపల్లాభంబున వేగ వత్తు
             నిపు డాత్మన్ భేదముం జెందకే
             యిల్లున్ వాకిలి జూచికొమ్మ మద
             మత్తేభేంద్రకుంభస్తనీ!"
                       తారా. 2. 125 తారా. 2. 125.

 • వాడుకలో ఇల్లూ వాకిలీ చూచుకొను అని వినవస్తుంది.

ఇల్లు నెత్తి గట్టుకొని పోవు

 • చూ. ఇలు నెత్తి గట్టుకొని పోగల్గుదురే.

ఇల్లు పట్టక తిరుగు

 • ఇంటిపట్టున ఉండక తిరుగు.
 • ఇల్లు చాలనట్లు లేదా ఇల్లు సరిపడనట్లు అన్న అర్థంలో ఆరంభ మైనా, కడ కిది ఇంటి పట్టున ఉండక ఊరిలో తిరుగు ఇల్లు____ఇల్లు 173 ఇల్లు____ఇల్లూ

అన్న అర్థంలోనే నిలిచి పోయినది.

 • "తానె తొత్తులకాంక్ష మదంబుకతన నిల్లు పట్టక తిరిగెడు నివ్విధమున." శుక. 2. 138.

ఇల్లు పట్టిన

 • మగడు చనిపోగా పుట్టింటికి తిరిగి వచ్చి వేసిన.
 • "ఇల్లుపట్టిన వెధ వాడపడుచు కని మా నాన్న కొంతపొలం రాసి పోయాడు." వా.

ఇల్లుపట్టు విడుచు

 • ఇంటిపట్టు వదలు.
 • ఇంటిపాటున అన్న రీతిగా ఈ ఇంటిపట్టు రాయలసీమలో నేటికీ వినబడుతుంది.
 • "బాంధవుల బాసి తమ యిల్లుపట్టు విడిచి." ఉ. హరి. 4. 47.

ఇల్లు పెఱికి పందిరి వేయు

 • 1. ఉన్న దానిని పడగొట్టి అంతకంటె దుర్బల మైన దానిని కట్టు.
 • "ఇలా యిల్లు పెరికి పందిరి వేసుకుంటారా? ఎవ రైనా?" వా.
 • 2. కేకలు వేయు.
 • "వాళ్ల నాయన యింటికి వచ్చి చూచాడంటే యిల్లు పెఱికి పందిరి వేస్తాడు." వా.

ఇల్లు పెళ్లు

 • ఇల్లంతా అనుట. జం.
 • పెళ్లు అనగా పెరడు. రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు ప్రాంతంలో ఈమాట నేటికీ బాగా అలవాటులో ఉంది.
 • "పీకును గా జెడి నే డిల్లుపెళ్ళు." గౌర. హరి. ద్వి. 18. 94.
 • రూ. ఇల్లూ పెళ్ళూ.

ఇల్లు-పొల్లు

 • ఇల్లూ వాకిలీ వంటిది. జం.
 • ఇల్లు పెళ్లు కావచ్చు నేమో! పెళ్లు అనగా పెరడు, లోగిలి అని రాయలసీమలో వాడుక.
 • "లోలత్వంబున మత్తకాశినుల కిల్లుం బొల్లునుం జెల్లగా, నేలా వెచ్చము సేయ నెవ్వలన మన్నీ లాఢ్యులుం జాలరే." పాండు. 3. 42.

ఇల్లు బంగార మగు

 • భాగ్యము కలిసి వచ్చు.
 • "కరుణ గల్గిన నిల్లు బంగార మౌను." శ్రవ. 1. 108.

ఇల్లు వాడ యెఱుగని

 • అమాయకురా లయిన.
 • "తత్ప్రియభామయు బుద్ధిహీన యిలు వాడ యెఱుంగదు." భోజ. 2.1.

ఇల్లు వెయ్యిమొదళ్లు వర్ధిల్లు

 • తామరతంపరగా వృద్ధి చెందు.

ఇల్లూ ఇల్లాలూ

 • సంసారం. జం.
 • "వా డీమధ్యే స్థిమితపడ్డాడు. ఇల్లూ, ఇల్లాలూ, అదీ..." వా.

ఇల్లూ పెళ్లూ

 • ఇల్లూ వాకిలీవంటి పలుకుబడి. జం. ఇల్లూ____ఇల్వ 174 ఇల్వ_____ఇవ
 • "నువ్వు ఊరంతా చక్క బెట్ట నక్కఱ లేదు. నీ యిల్లూ పెళ్లూ చూచుకుంటే చాలు. వా.
 • చూ. ఇల్లు పెళ్ళు.

ఇల్లూరు

 • ఇతరులది./
 • అర్థంలోనూ రూపం లోనూ ఇల్లడ కిది దగ్గఱగా ఉన్నది.
 • "ఇల్లూ రనుసంభావనతో నిల గాచితి." భాస్క. యుద్ధ. 2596.
 • "ఇల్లూరు సొమ్మును నేమఱు చొప్పు లేద." భాస్క. యుద్ధ. 2600.

ఇల్లూ లేదు వాకిలీ లేదు

 • వాడి కేమీ లే దనుట.
 • "వాడి కే ముంది? ఇల్లూ లేదు వాకిలీ లేదు." వా.

ఇల్లూ వాకిలీ చూచుకొమ్ము

 • నీ గృహకృత్యం నిర్వర్తించుకో.
 • బయటి వ్యవహారాలు నీ కెందుకు అనుట.
 • "ఇల్లున్ వాకిలి చూచుకొమ్మ మద మత్తేభేంద్రకుంభస్తనీ!" శశాం. 2. 187.

ఇల్లెపు జేప

 • చేపలలో ఒకరకము. హంస. 4. 187.

ఇల్వడి

 • ఇలువరుస, కులీనత.

           "రాముడు పెద్దకాల మటు రావణు
            నింట వసించియున్న యా, కోమలి సీత
            దెచ్చుకొని కూరిమి నొండు దలంపకున్న వా,
            డేమిటిమర్లొ రాసుతుల కెక్కడి ఇల్వడి యంచు." పద్మ. 9. 8.

 • అభిమానము అని వావిళ్ల నిఘంటువు. అది సరి కాదు.
 • చూ. ఇలువడి.

ఇల్వరుస

 • కులీనత.
 • ఇల్వరిసై (తమిళం)
 • "ఇల్వరుస లాఱడి వోవగ." భాగ. 10. పూ. 992.
 • "వాళ్ల యిల్లువరు సేమీ మంచిది కాదు." వా.

ఇవతళించు

 • చల్ల నగు.
 • "ఇగ్రుచు కోర్కుల దన డెంద మివ తళింప."
 • చూ. ఇవతాళించు.

ఇవతాళించు

 • చల్ల నగు, గడ్డకట్టు.
 • "ఇవతాళించె సుగంధగంధవహము!" దశా. 7. 174.
 • "శిశిరకాలంబునం దివతాళించు కొలకుల-" హర. 4. 14.

           "నవనీ హారపయో మి ళన్మలయజస్నా
            నార్ద్ర పర్యంత మై, యివతాళించు విదర్భ
            రాజతనయా హృద్యస్తనద్వంద్వమున్." శృం. నైష. 34.

ఇవముకొను

 • చల్ల బడు.
 • "మంచున నివముకొంటి-" కాశి. 6. 44.

ఇవముగొను

 • చల్లబడు.
 • ఇవము = మంచు. ఇవి_____ఇష్ట 175 ఇష్ట_____ఇష్టా
 • "మరందవృష్టిచే నివము గొనంగ." కళా. 4. 80.
 • "ఎడలూని చీకట్లు నివము గొనుచు-" యయాతి. 1. 116. పాండు. 4. 5.

ఇవి చేతులు కావు కాళ్లు

 • ఎలా గైనా మీరు సాయపడాలి అని బ్రతిమాలుటలో పెద్దవారు చిన్న వారితో అనుమాట.
 • "ఇవి చేతులు కావు కాళ్ళు.. నన్నెలాగో రక్షించాలి." వా.
 • చూ. చేతులు కావు కాళ్లు.

ఇవురబారు

 • ఇగిరి పోవు. ఇంకి పోవు.కవిక. 2. 60.
 • "ఈసారి యెండ లధిక మై ఆచెఱువంతా యిగరబాఱి పోయింది." వా.

ఇవురొత్తు

 • పుట్టు, పొడసూపు.
 • "సిగ్గు మోమున నివురొత్తె." వెంక. పంచ. 3. 39.

ఇవుర్వంటకము

 • అత్తెసరు పెట్టి దించిన అన్నము.
 • "వండి దించినయివుర్వంటకంబు." కాశీ. 3. 121.
 • చూ. ఇగురువంటకము.

ఇష్టగోష్ఠి

 • ఇష్టాగోష్ఠి,
 • ఏదో ఒక కార్యసరణిగా కాక అవీ ఇవీ మాటలాడు కొనుట.
 • నలుగురు కలిసి పిచ్చాపాటి మాట్లాడుకోవడం.
 • "మనుజేశుడు కొలిచిన పరి, జనములతో నిష్టగోష్ఠి సలిపెడిచో." మను. 6. 71.
 • చూ. ఇష్టాగోష్ఠి.

ఇష్టదేవత

 • అభిమాన దైవము, ఇలు వేల్పు.
 • "అని యి ట్లిష్ట దేవతాప్రార్థనం బొనరించి-"
 • ఇత్యాదిగా తెలుగుప్రబంధములలో వాడుక.

ఇష్ట పూర్తి

 • ఇష్టము నెఱవేరుట.

ఇష్టప్రకారముగా

 • తలచిన ట్లెల్ల, స్వేచ్ఛగా.
 • "వాడు తన కూతురు పెండ్లిలో ఇష్ట ప్రకారంగా ఖర్చు పెట్టాడు." వా.

ఇష్టభోగములు

 • "ను వ్వీ దేవాలయనిర్మాణానికి సహాయం చేశావంటే నీ కిష్టభోగాలు సమకూరుతా యని దేవుడు స్వప్నంలో వచ్చి వెప్పాడట." వా.

ఇష్టలింగం

 • ఇష్ట దేవత.

ఇష్టాగోష్ఠి

 • "ఆదివారం అలా రండి, కాసేపు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోవచ్చు." వా.
 • చూ. ఇష్టగోష్ఠి.

ఇష్టాపత్తి

 • కోరిక తీరుట. ఇస_____ఇసు 176 ఇసు_____ఇసు

ఇసడిలక

 • విసు గొందక.
 • "ఇసడిలక మఱియు జని." భా. రామా. అర. 2. 6.

ఇసిఱింతచూపులు

 • కులుకు చూపులు. చిలుకరించు చూపులు.
 • "ఏ పువ్వుబోడుల యిసిఱింత చూపుల ఋషులగట్టిమనంబు లిగురు వెట్టు." కాశీ. 3. 169.
 • "మాపిన్నది యిసిఱింతల, చూపుల నరగంట వెదకుచు న్నిను జూచున్." నైష. 8. 61.

ఇసిఱింతలువాఱు

 • చిలుకరించు.
 • "చిఱునగవు లిసిఱింతలు వాఱ." హర. 5. 152.
 • "మంతనములు బెదవుల నిసిఱింతలు వాఱంగ." విక్ర. 8. 87. హర. 5. 51.

ఇసిళ్ల పుట్టలు పెట్టు

 • విపరీతముగా సంతానం కను.
 • "పొదలిన పుత్రుల యిసిళ్ల పుట్టలు పెట్టెదము." తాళ్ల. సం. 9. 51.

ఇసుక గరుములు

 • అటు యిసుక నేలా కాక, యిటు గరుగు నేలా కాక మధ్యస్థంగా ఉన్న భూమీ-పొలమూ.

ఇసుక చల్లిన రాలనంత

 • అత్యధికంగా, చాలమంది. కాశీ. 1. 98.
 • "ఆ తిరునాళ్లకు ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు." వా.

ఇసుక జల్లిన రాలని

 • దట్టముగా నున్న.
 • "మొల్లదీ గెలనంటి ముడువడి యిసుకం, జల్లిన రాలక చల్లగా బ్రబలు, నాకు జప్పరములయందు."
 • గౌ. హరి. ప్రథ. పంక్తి. 493-95.

ఇసుకతక్కెడ - పేడతక్కెడ

 • ఒకరిని మించిన మోసగాడు మఱొక డనుట.
 • జానపదకథపై వచ్చినపలుకుబడి.
 • "వాళ్లిద్దరూ చేరితే బాగానే ఉంటుంది. ఒకరు ఇసకతక్కెడ, మరొకరు పేడ తక్కెడ." వా.

ఇసుక త్రాడు పేనగల

 • ఇసుకతో తాడు పేనగల.
 • అసాధ్యకార్యములను చేయగల నేర్పరి అని నిరసనద్యోతకంగా అనుటలో వచ్చిన పలుకుబడి.
 • పండితా. ప్రథ. పురా. పుట. 359.

ఇసుకతిన్నె

 • ఇసుకదిబ్బ, సైకతస్థలి.

ఇసుక పాతఱ

 • తఱుగు లేనిది.
 • "అనఘ! వేశ్యావిడంబవర్తనము లెన్న నిసుకపాతఱ యాజోలి యేల త్రవ్వ?" వైజ. విలా.

ఇసుక రాజనములు

 • ఒక రక మైనవడ్లు. ఇసు____ఇసు 177 ఇసు____ఇహ

ఇసుకలో నూనె

 • వట్టిది. బాల. నీతి. 5.

ఇసుక వేసిన రాలని

 • అతిదట్టముగానున్న, క్రిక్కిసిరి ఉన్న.
 • "చాల దోయిట నెత్తి చల్లిన నిసుము రాలని యట్టి యరణ్యాంతరమున." బసవ. 5. 137 పు.
 • "అబ్బబ్బ! ఏంజనం. ఇసుక వేస్తే రాలదు." వా.
 • "ఇసుక వేస్తే రాలనంత జనం.-" వా.
 • రూ. ఇసుక వేస్తే రాలని.

ఇసుమంత

 • కొంచెము.
 • "ఇసుమంత దాన మీ గలిగిన." రుక్మాం. 2. 61.

ఇసుమంత ఠింగాణావు

 • ఇంత లేవు!
 • "సంగతియె యోయి! యిసుమంత ఠింగణావు." ఆము. 4. 60.
 • "ఇంత లేవు! నీవూ ఆక్షేపించే వాడివే." వా.

ఇసుము దాగిననీ రగు

 • అనుభవమునకు దూర మగు.
 • "ఊహల నా భోగ మెల్ల ఒళ్ల బట్టె నంటా మంటె, దాహముతోడ నిసుము దాగిననీ రాయగా." తాళ్ల. సం. 8. 41.

ఇసుమున గట్టు దాల్పగల

 • ఇసుకతో ఏటికి గట్టు కట్టగల. అసాధ్య కార్యములను చేయగల జాణ అను నిరసన ద్యోతక మైనపలుకుబడి.కుమా. 8. 135.

ఇసుర్రాయి గాలికి పోయినట్లు

 • తిరిగి రాకుండా అనుట. విసురు రాయి గాలికిపోదు. పోతే యిక రాదు. ఇది రాయలసీమలో నేటికీ వాడుకలో నున్న పలుకుబడి. విసురు రాయి, ఇసురురాయి అంటే తిరగలి.
 • "వాడు ఇసుర్రాయి గాలికి పోయినట్లు పోయినాడు. అంతూ పొంతూ లేదు. ఆరునె ల్లయింది." వా.

ఇసుళ్ళ పుట్టవంటి

 • విపరీతంగా జనం ఉన్న.
 • "తిరునాళ్లకు విపరీతంగా జనం వచ్చారు. ఆప్రదేశ మంతా యిసుళ్ల పుట్ట లాగా ఉంది." వా.

ఇస్కూలుచీలలు

 • మర చీలలు. కాశీయా. 30.

ఇహపరములు

 • ఈలోకము, పైలోకము. చనిపోయిన తరువాత పుణ్య లోకాలకు వెళతా రని ఒక నమ్మకం.
 • "వారల కెగ్గు సేసినం, జెడు నిహముం బరంబు..." భార. ఆది. 1. 139.
 • "ఈ పని చేస్తే యిహపరసాధకంగా ఉంటుంది." వా.
 • చూ. ఇహమా? పరమా ?