పదబంధ పారిజాతము/ఇంద

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఇంత_____ఇంతా 145 ఇంతి_____ఇంతి

 • వాడుకలో చాలా రకాలుగా వినవస్తుంది.
 • 'ఇంత మొగము చేసు కొన్నాడు.' 'ఇంత తింటాడు,' వీనిలో ఆ యింత తోపాటు చేయితో పరిమాణం చూపే వారు కావచ్చును. అందుకే ఆ యింత ఒకప్పుడు వైశాల్యాన్నీ, ఆధిక్యాన్నీ. మరొకప్ప్పుడు తద్విరుద్ధ రూపాన్నీ తెల్పుతుంది.

ఇంతలేసి

 • "ఋషుల పాలింటనే యింతలేసి పనులు." కాశీ. 2. 104.
 • "తలపం గూడునె యింతలేసి దొరలన్ దైన్యంబు..." భార. ఉద్యో. 2. 302.
 • చూ. ఇం తేసి.

ఇంత సేయు

 • ఇంతవరకూ తెచ్చు. ఈస్థితికి తెచ్చు.
 • "కుబేరు డేగె నద్దనుజుల నింత చేసిన విధాతకు గో డనబోవు చాడ్పునన్." ఉ. హరి. 1. 42.

ఇంతా అంతా

 • ఇంతా అంతా, ఎం తని చెప్పగలము అను పలుకుబడిలో వలె-కొంచెము కాదు, అధికము అని చెప్పుటకు ఉపయోగిస్తారు.
 • "ధన్యత్వము.... ఇంతంత యన నా వశంబె?" పండితా. ప్రథ. పురా. పుట. 272.

ఇంతింత గాని

 • ఎక్కు వయిన, కొలదికి మీఱిన అనుట.
 • "ఇంతింత గాని తమి." సారం. 2. 39.

ఇంతిం తన రాక

 • అపరిమితముగా, ఇంత అంత అని చెప్ప లేనంత.
 • "అంతంతకు వైరాగ్యం, బింతిం తన రాక యెలమి నిగురొత్త." విప్ర. 1.83.

ఇంతింత యగు

 • కొంతకొంత క్రమక్రమంగా పెరుగు.
 • "ఇంతిం తై వటు డింత యై." భాగ.

ఇంతింతలు

 • మిక్కిలి చిన్నవి, స్వల్పములు.
 • "ఇంతింతలు దునియలు సేసె." భార. విరా. 5. 153.
 • "నా తపము పెంపుల్ సూడ నింతింతలే..." ప్రబోధ. 2. 22.

ఇంతింతవారలు

 • గొప్పవారు.
 • ఇంతలేసి పనులు, ఇంతలు కన్నులు - మొద. వానిలో వలె హస్తాది విక్రియలతో ఇంతంతవా రనుటలో వచ్చినది. ఇంతె_____ఇంద 146 ఇంద______ఇందు
 • "ఇంతింతవారల కీశ్వరావసర, మింత దుర్ఘట మన్న నితం దెంతవాడు."
 • పండితా. ప్రథ. పురా. పుట. 379.

ఇం తెందుకు

 • ఇది అంతా దేనికి?
 • సారాంశం చెబుతాను అను పట్ల ఉపయోగించేపలుకుబడి.
 • "ఇం తెందుకు? నే రాలేను. రాను." వా.

ఇంతేసి

 • ఇంత పెద్ద వైన అనుట.
 • "ఇంతేసి బలు మ్రాకు లెవ్వడు వేయించె." శృం. సా. 2. 97.
 • "వాళ్ళింటి పెండ్లిలో ఇం తేసి లడ్లు వేశారు." వా.
 • చూ. ఇంతలేసి.

ఇంద

 • "రా యింద కో తమ్మరతి నొల్ల వేని." పండితా 297.
 • "కరముల్ సాచిత మింద యింద మని." సారంగ. 1. 50.
 • "యిందమనుచునిచ్చె."రామా. 6. 198.
 • "ఇంద, ఇది తీసుకో." వా.
 • చూ. ఇందము.

ఇంద కో

 • ఇంద, తీసుకో.
 • "రా యింద కో తమ్మరతి నొల్ల వేని." పండితా. 297.

ఇందడవు

 • ఇంత సేపు.
 • "ఇందడవు నెందుల నుండితి." మల్హ. 2. 72.

ఇందనుక

 • ఇంతదాకా, ఇప్పటివరకూ.
 • "ఇందనుక బాదులు ద్రవ్వియు." విప్ర. 3. 84.

ఇందము

 • ఇదిగో తీసికొనుము.
 • "బొమ్మ పొత్తిక లడిగితి కొమ్మ యింద, మనుచు నిచ్చె." భార. విరా. 5. 30.
 • "కరముల్ సాచి తమిం చ యిందమని." సారంగ. 1. 50.

ఇందాక

 • ఇంతవరకు, ఇంతకుమునుపు.
 • "ఇందాక విశ్రమించితిమి." భార. శల్య. 2. 66.
 • "ఇందాక నే వెళ్లాను." వా.
 • "ఇందాక వెళితే వాడు లేడు." వా.

ఇందు

 • హిత వగు, రుచించు.
 • "కుక్కకు నాజ్య మిందునే." వేంక. పంచ. 2. 247.
 • "ఇందని యాముచే." యయాతి. 4. 155.
 • "జిహ్వకున్ వంటక మిందునే." కాశీ. 1. 108.
 • "నాకు పొద్దున్నే కాఫీ తాగితే యిందదు." వా.
 • "వాడికి అన్నం యిందడం లేదు." వా.

ఇందునా అందునా

 • ఇహపరములలో.
 • "వాడు ఇందునా అందునా చెడ్డాడు." వా.

ఇందుప్పు

 • సైంధవలవణము.
 • నేటికీ ఆయుర్వేద వైద్యులు ఇందుప్పు అనే అంటారు. ఇందు______ఇందు 147 ఇంద్ర_____ఇంద్రు

ఇందు మోసము కలదే

 • ఇందులో అన్యథాత్వం ఏమీ లేదు.
 • "మీ జనకుడు దొడగిన జాలును, మునుముట్టన వత్తు మిందు మోసము గలదే." ఉ. హరి. 4. 40.

ఇందు ర మ్మనుటయు నిల్లు సేకొనెదవు

 • రమ్మంటే వచ్చి పీఠం వేస్తా నంటావు.
 • ఇలాంటి పలుకుబడులు చాలా ఉన్నవి. వీనిభావార్థం కొంచెం అవకాశం ఇవ్వగా దానిని పరిపూర్తిగా ఆక్రమించు కొందు రనుట.
 • "అవ్విక చపంకజలోచన పాంథ యిందు ర, మ్మనుటయు నిల్లు సేకొనెద వద్దిర మత్పతి వచ్చువేళ." శుక. 3. 196.

ఇందు ర మ్మన్న నిల్లెల్ల గైకొనినట్లు

 • ఆశ్రయ మివ్వగా అంతా అపహరించినట్లు.
 • "కామినీమార! వాడు నిక్కముగ జేసె, నిందు రమ్మన్న చోట ని ల్లెల్లగొనుట." కువల. 2. 23.

ఇందుల

 • 1. ఇందలి.
 • "ఇందుల తాత్పర్యము." భార. శాంతి. 5. 17.
 • 2. ఇక్కడికి.
 • "ఎందుండి వచ్చి తిందులకు." భార. ఆది. 4. 23.
 • 3. దీనికి.
 • "ఇందులకు బొందుపడు ప్రత్యుత్తరంబుల." ఆము. 6. 36.
 • 4. వీనిలో.
 • "నీకు నెద్ది ప్రియ మిందులలో." జైమి. 5. 133.

ఇంద్రకోశము

 • మంచె.

ఇంద్రగోపం

 • ఆరుద్రపురుగు.

ఇంద్రచాపము

 • ఇంద్రధనుస్సు.
 • "ఇంద్రచాపంబు వొడిచె." హర. 2. 18.

ఇంద్రజాలము

 • మాయ.
 • "ఇంద్రజాల మీ దేహ సుఖంబు." కవిరా. 1.32.

ఇంద్రపదవి

 • గొప్పది, ప్రాప్యము.
 • "తెగువయె యింద్రపదవి యన, దగు బుద్ధి జనింప బోలు దరుణీ! నీకున్." హంస. 1. 126.

ఇంద్రభోగము

 • గొప్పవైభవము.
 • "ఉర్వీపతి కింద్రభోగ మటు వేడ్క నొనర్ప ముఖాబ్జముం గడున్." కళా. 7. 157.

ఇంద్రుడు చంద్రుడు అను

 • పొగడు.
 • "తా రెవ్వేఇ నొల్ల కొక్క టయి యింద్రుడు చంద్రు డటండ్రు." ఆము. 5. 56. ఇంద్రు____ఇక 148 ఇక____ఇక్క
 • "కాస్త పలకరిస్తే ఇంద్రుడు చంద్రుడు అనడం వానికళ." వా.

ఇంద్రుడు చంద్రుడు దేవేంద్రుడు అను

 • పొగడు.
 • "ఎవడు పై నుంటే వానిని ఇంద్రుడు చంద్రుడు దేవేంద్రుడు అనడం వాడి కలవాటు." వా.

ఇం పారగ

 • బాగుగా.
 • "ఈ సువ్రతం బవశ్యము ముద మింపారగ జరుపుడు." రుక్మాం. 1. 110.

ఇంపిత మగు

 • హిత వగు.
 • "నాకు వంకాయలు వంటి కింపితం కావు."
 • "ఆ యి ల్లెంతో కంటి కింపితంగా ఉంది." వా.

ఇం పెసలారు

 • ఒప్పు.

ఇంపొందు

 • సంతోషించు.
 • "తెల్లం బౌను నిం పొందగన్." భాస్క. రా. యు. 401.

ఇకఇకలు పకపకలు

 • నవ్వుతూ తుళ్లుతూ ఉండుటనే నిరసనభావంతో అంటారు.
 • "వాడూ అదీ ఆ గదిలో చేరుకొని ఒకే యికయికలు, పకపకలు." వా.

ఇక చాలు

 • కట్టిపెట్టు, చాలించు.
 • "ఇక చాలు, ఊరుకో." వా.

ఇక చెప్ప నేల?

 • చెప్పవలసిన అవసరం లేకనే తెలుస్తున్న దనుట.
 • "చల మరిగాడ్పులం గలుగు చల్లదనం లిక జెప్ప నేటికిన్." విప్ర. 2. 66.
 • "వాడి సంగ తిక చెప్పాలా? దేవాంతకుడు." వా.

ఇకమీద

 • ఇప్పటినుండీ.
 • "ఈ రోజు క్షమించాను. ఇకమీద పది గంటలకు సరిగ్గా రావాలి." వా.

ఇకిలించు

 • పండ్లికిలించు.
 • కావ్యాల్లో ఇగిలించుగా నున్నా వాడుకలో ఇకిలించు అనే వినిపిస్తుంది.
 • "తగిలించుకొన్న పిమ్మట, నిగిలించుటె కాని కార్య మే మున్నది?" శుక. 3. 78.
 • "ఎదురుగా ఇకిలించడం వెనుక తిట్టడం వాని అలవాటు." వా.
 • చూ. ఇగిలించు.

ఇక్కట్టు

 • ఇబ్బంది, ఇఱుకు.
 • "ఎందు జనగ రాని యిక్కట్టు ప్రాప్తించె." కృష్ణ. 3. 43.
 • "ఇక్కట్టు త్రోవల నెదు రైన." దశా. 8. 214.

ఇక్కడక్కడ వడు

 • చెల్లాచెద రగు, నిలువరము లేక బాధపడు.
 • "అదరి మొన లిక్కడక్కడ వడి." నిర్వ. 6. 121. ఇక్క____ఇక్కు 149 ఇక్కు____ఇగి

ఇక్కడ పుల్ల అక్కడ పెట్టడు

 • ఏమాత్రం వంగి పని చెయ్యడు అనుట.
 • స్త్రీలింగంలోనూ ఇదే 'పెట్టదు' అని ఉంటుంది.
 • "వాడు ఇక్కడ పుల్ల అక్కడ పెట్టడు. మరీ వేళకు అన్నీ కావాలి." వా.
 • చూ. అక్కడ పుల్ల ఇక్కడ పెట్టదు.

ఇక్క డున్నట్టుగా

 • వెంటనే.
 • కొత్త. 51.
 • "ఇక్కడున్నట్టుగా రావాలి." వా.

ఇక్కన్ను

 • రెండుకన్నులు.
 • "ఇక్కంటితో నొక్క యింతి యే తెంచె." బస. 3. 18 పు.

ఇక్కపట్టు

 • ఉనికిపట్టు.
 • "క్రొక్కాఱు మెఱుగుల యిక్క ప ట్టిది." కుమా. 3. 18.

ఇక్కలువడు

 • కదలిపోవు.
 • "ఒండొంటిం దా కురభసంబున నిక్కలువడ గ్రుక్కుం ద్రొక్కుచు మెండు చెడి బెండువడి." భాగ. 8. 55.

ఇక్కిలి దక్కి

 • విరివి యై, లా వెక్కి.
 • "ఇక్కిలి దక్కి నిక్కి మెఱు గెక్కి.... తగునీచనుదోయి." మల్హ. 3. 101.

ఇక్కుపాటు

 • కష్టము, ఇక్కట్టు.
 • "నీ కిట్టి యిక్కుపాటు గల్గెనే తండ్రి యనుచు." రంగ. రా. సుందరా. 436.

ఇక్కువ లంటు

 • కళ లంటు.
 • "ఇక్కువ లంట.." నీలా. 3. 94.

ఇక్ష్వాకులనాటిది

 • చాలా ప్రాచీనము ; తాతల నాటిది.
 • వ్యంగ్యంగా కూడా ఇదిచాలా పాతపడింది అనే అర్థంలో ఉపయోగిస్తారు.
 • ఇక్ష్వాకులు మనకు చాలా ప్రాచీనపాలకులు. అందుపై వచ్చినది.
 • "బోటి యద్ది యిక్ష్వాకులనాటి దౌర." పాణి. 2. 104.
 • "ఆ సిద్ధాంతం ఇక్ష్వాకులనాటిది. ఇప్పుడేమి పనికి వస్తుంది? వా.
 • "అదంతా యిక్ష్వాకులనాటి మాట లే. ఇప్పటి సంగతి చెప్పు." వా.

ఇగిరించు

 • 1. చిగుర్చు.
 • "...వీణాదండము చిగిరించె నా." రాజ. చ. 1. 4.
 • 2. ఎఱ్ఱబడు.
 • "అనుమ డలిగి మొగ మిగిరింపన్." యయాతి. 3. 25.
 • 3. ఇంకించు.
 • "పయోధినాథజీవన మిగిరించి." పద్మ. 7. 39.

ఇగిలించు

 • పం డ్లిగిలించు. ఇగు____ఇగు 150 ఇగు____ఇగ్రు
 • "తగిలించుకొన్న పిమ్మట, నిగిలించుటె కాని కార్య మే మున్నది? శుక. 3. 78.
 • చూ. ఇకిలించు.

ఇగురబెట్టు

 • (అన్నము) ఉడకబెట్టు.
 • "అన్నం ఇగరబెట్టడం అన్నా రావాలి గదా అంత పెద్దపిల్లకు." వా.
 • 'ఇగుర' ఇగరగా వినవస్తుంది.

ఇగురవేయు

 • వండు.
 • "రాత్రికి నాలుగుగింజలు ఇగర వేస్తే పోతుంది. ఉన్న పచ్చడితో ఏదో యింత తింటాము." వా.

ఇగురుకూర

 • పొడికూర, వేంపుడు, తాళింపు.
 • తాళింపు వేసి వండినకూరను ఒక్కొక్క వేపూ, ఒక్కొక్క వర్గంవారూ పై పేళ్లలో ఏదో ఒకదానితో వ్యవహరిస్తారు. కూర చేర్చకనే ఇగురు అనీ అనడం కద్దు.

ఇగురుకొను

 • ఇగురొత్తు.
 • చూ. ఇగురొత్తు.

ఇగురువంటకము

 • సరెసురు పెట్టి అనగా అత్తెసరు పెట్టి వండిన అన్నము.
 • చూ. ఇగుర వేయు.

ఇగురొత్తు

 • కలుగు.
 • "మోద మిగురొత్త బాదాబ్జములకు మ్రొక్కి." రుక్మా. 1. 29.

ఇగుర్కొను

 • చూ. ఇగురుకొను.

ఇగో

 • ఇదిగో.
 • "వీడి గో గుఱ్ఱపుదొంగ వచ్చె." జైమి. 3. 114.
 • "ఇగో ఈ రెండు రూపాయలూ ఇప్పుడు తీసుకో. తర్వాత చూద్దాం." వా.

ఇగ్గులాడు

 • లాగు, పట్టుక వేలాడు, పెనగులాడు, పీకులాడు.
 • కొంచెం అసంతృప్తిని తెలుపుతూ అనేమాట. 'నన్ను పట్టుకొని యిగ్గు లాడితే యేమి లాభం ఉంది? ఇంక ఎవరి నైనా ధనవంతుల నాశ్రయించు' ఇలా రాయలసీమలో విరివిగా వినవస్తుంది.
 • "ఏదో దీన్ని పట్టుకొని ఇగ్గులాడు తున్నాను. ఏ మవుతుందో ఏమో." వా.
 • "ఏదో వాణ్ణి నేను పట్టుకొని ఇగ్గులాడడం తప్పితే వాడికి ఏ మైనా నాపైన ఉందా?" వా.

ఇగ్రుచు

 • ఇగురొత్తు.
 • "ఇగ్రుచుకోర్కుల దనడెంద మివతళింప." కవిక. 3. 222.
 • శివరాత్రి. 2. 39.
 • చూ. ఇగురొత్తు. ఇచ్చ_____ఇచ్చ 151 ఇచ్చ_____ఇచ్చి

ఇచ్చక బుచ్చకములు

 • అచ్చిక బుచ్చికలు. జం.
 • నలచ. 6. 162.

ఇచ్చక మాడు

 • ముఖప్రీతి మాటలాడు, ముఖ స్తుతు చేయు.

ఇచ్చకలమారి

 • ముఖస్తుతి చేయువాడు.
 • "వాడు వట్టి ఇచ్చకాలమారి. వాడి మాటలు నమ్మవద్దు." వా.

ఇచ్చకులు

 • ఇచ్చకాలు మాట్లాడువారు.
 • "అప్పు డిచ్చకు లగుకుబ్రాహ్మణులు గొందఱు." ఆము. 4. 46.

ఇచ్చకు వచ్చినట్లు మాట్లాడు

 • ఇష్టము వచ్చినట్లు మాటలాడు అనగా నిందించు, తూలనాడు.
 • "ఇత్తఱి రేగి రేగి తన యిచ్చకు వచ్చిన వెల్ల నాడెడిన్." కా. మా. 3. 44.

ఇచ్చగించు

 • ఇష్టపడు, కోరు.

ఇచ్చగొను

 • కోరు.

ఇచ్చగోరు

 • కోరు, ఇష్టపడు.
 • "కేవల తా సుఖ మిచ్చ గోరుచున్." భీమ. 4. 7.

ఇచ్చమానికము

 • చింతామణి.
 • "ఇచ్చమానిక మేయూరిరచ్చఱాయి." చంద్ర. 2.66.

ఇచ్చ మెచ్చు

 • 1. ప్రియపడు, మెచ్చుకొను.
 • "ఆత్మ చిత్తముం దోచిన చందముం దెలియ దోచిన నచ్చర లిచ్చ మెచ్చరే." ఉ. హరి. 1. 163.
 • 2. సంతోషించు.
 • "సకలసైన్య మిరుగడల గొల్వ దన పురీవరము జేరె, నేలికయు దల్లిదండ్రులు నిచ్చ మెచ్చ." శుక. 1. 429.

ఇచ్చసలుపు

 • కోర్కె తీర్చు.
 • "నా యిచ్చ సలుపు మోజియ్య." పండితా. ద్వితీ. పర్వ. పుట. 477.

ఇచ్చికబుచ్చిక సేయు

 • విజయ. 3. 30.
 • చూ. అచ్చికబుచ్చిక సేయు.

ఇచ్చిపుచ్చుకొను

 • 1. పరస్పరం వియ్య మందు.
 • "మాకూ వాళ్లకూ యిచ్చిపుచ్చుకోవడాలు తరతరాలుగా వస్తున్నవి." వా.
 • 2. పరస్పరం సహాయము చేసుకొను.
 • "ఇరుగూపొరుగూ వా ళ్లన్నతర్వాత యిచ్చి పుచ్చు కోవడా లంటూ ఉంటేనే." వా.
 • "వాళ్లకూ మాకూ ఇచ్చిపుచ్చుకొనడాలు ఉన్నాయి." వా.
 • 3. లావాదేవీలు.
 • "ఆ షాహుకారు దగ్గర యిచ్చి పుచ్చుకోవడం మా నాన్నకాలంనుంచీ అలవాటు." వా.

ఇచ్చిపుచ్చుకోలు

 • చూ. ఇచ్చిపుచ్చుకొను. ఇచ్చి____ఇజా 152 ఇజ్జ_____ఇటు

ఇచ్చిపుచ్చుకొను సంబంధము

 • సమీపబాంధవ్యము.
 • కాళ. శత. 36.

ఇచ్చిపుచ్చుకొన్న యీలగ్రద్ద

 • దాన మిచ్చినది తిరిగి తీసు కొనేలోభి.

               "ఏము నలువురందు నెవ్వాడు గాజాలు
                నిచ్చిపుచ్చుకొన్న యీలగ్రద్ద
                మాకు నింపు గావు మాను మీసుద్దులు
                కలహముల మొగంబ కలియుగంబ!"
                                                 నైష. 7. 107.

ఇచ్చుబాస

 • వాగ్దానము.
 • "నా, యిచ్చుబాస కౌరవేంద్ర వినుము." భార. ద్రోణ. 5. 338.

ఇచ్ఛావృత్తి

 • స్వేచ్ఛాసంచారము.
 • హంస. 5. 211.

ఇచ్ఛించు

 • కోరు.
 • "ఎవ్వని గరుణింప నిచ్ఛించితిని వాని." భాగ. 8. 661.

ఇజారాపాట

 • కల్లు, సారాయి అమ్ముతున్న రోజుల్లో కల్లంగళ్లను ప్రభుత్వం వేలం వేసేవారు. ఆ వేలంపాటను ఇజారాపాట అని, అలా వేలం పాడి గుత్తకు తీసుకొనడమును ఇజారా తీసుకొనుట అనీ అంటారు.

ఇజ్జలజ్జలవారు

 • దగ్గఱివారు, ఇరుగుపొరుగు వా రన్నట్టు.
 • "తమ యిజ్జలజ్జలవారి దనవారి, దన తల్లిదండ్రుల వారి...రప్పింప."
 • పండితా. ప్రథ. పురా. పుట. 288.

ఇటబట్టి

 • ఇప్పటినుంచీ.
 • "ఇటబట్టి నీకు మీ యనిమిష రాజు పాదముల యాన సుమీ మఱి యేమి పల్కినన్." నైష. 3. 114.

ఇటు న టాడకుండ

 • ఏమీ అనకుండా, అదీ యిదీ అనకుండా.
 • "తనతల్లి యతని నేమియు నిట్టటాడ కుండం బ్రార్థించుచుండె." కళా. 4. 74.

ఇటు పుల్ల అటు వేయకుండు

 • ఏ మాత్రం పని చేయక ఉండు.
 • "ఆ ఆడపడుచు ఇటు పుల్ల తీసి అటు వేయదు. అంతా కోడలే నెత్తిన వేసికొని చేయాలి." వా.
 • చూ. ఇక్కడ పుల్ల అక్కడ పెట్టదు.

ఇటువంటి

 • ఇట్టి.
 • "ఇటువంటివి యిట కెక్కుడువి." ఆము. 6. 60.
 • "మగ వా రిటువంటివారి మదిలో." విక్రమ. కళా. 3. 88.
 • "ఇటువంటి దానిని నే నెక్క డా చూడ లేదు." వా. ఇటు_____ఇట్ట 153 ఇట్ట_____ఇట్టి

ఇటువలె

 • ఇట్లు, ఈలాగు.
 • ఇట్లా అనేరూపంలో నేడు వాడుక.
 • "ఇటువలె జవ్వనంపుమద మెచ్చగ." ఉత్తరరా. 1. 172.
 • "ఇట్లా జరుగుతూండగా...." వా.

ఇట్టట్టనక

 • అడ్డు చెప్పక.
 • "ఇట్టట్టన కింక దత్ఫలము లన్నిటి నొందుము." భార. శల్య. 2. 134.
 • "ఇట్టట్టనక." కాశీ. 4. 98.

ఇట్టట్టనజాలవు

 • కిం అన లేవు? ఏ మాత్రం ఎదురు చెప్ప లే వనుట.
 • "చిత్తంబు తనయాజ్ఞ జేసి వర్తించెనే, నిట్టట్టనగ జాల వింద్రియములు." భీమ. 5. 160.

ఇట్టట్టన వచ్చునే!

 • ఏమాత్రం అనడాని కైనా వీ లుందా అనుపట్ల ఉపయోగించేపలుకుబడి.
 • "నిన్ను నిట్టట్టన వచ్చునే." భార. ఉద్యో. 1. 297.
 • "వా డేదైనా పని చేస్తే ఇట్లా అని అనడానికి వీ లుందా?" వా.
 • ఇదే నేటి వాడుక.

ఇట్టటు గ్రుక్కు

 • నీళ్లు నమలు, మాటలు మ్రింగు.
 • "ప్రత్యుత్తరం బేమియు దోపకునికి నిట్టటు గ్రుక్కుచు నున్నట్టిలా గరసి." ప్రభా. 5. 73.

ఇట్టట్టుపడు

 • 1. క్రిందుమీదు లగు.
 • "దట్టి బడినపులుగులగతి నిట్టట్టు పడంగ నునిచి యెంతయు వేడ్కన్." కా. మా. 3. 201.
 • 2. గందరగోళపడు.
 • "అతని విధ మెఱిగింప నిట్టట్టు పఱచు." ఆము. 4. 154.
 • "పట్టణ మిట్టట్టువడ గదల్చి." ఉ. హరి. 1. 20.

ఇట్టట్టు వడగా

 • అటూ ఇటూ కదలునట్లు - పూరిగా అనుట.
 • "అయ్యేటినీరు పఱపె బట్టణ మిట్టట్టు వడ గదల్చి." ఉ. హరి. 1. 9.

ఇట్టట్టొనరించు

 • చెల్లాచెదరు చేయు, ఇటు అటు పాఱిపోవునట్లు చేయు.
 • "భల్లూకమండలి నిట్టట్టొనరించి యుండ దండ న్విస్మయం బొప్పగన్." శుక. 1. 265.

ఇట్టిక సూడినవాడు

 • తిరిగి చూడక పారిపోవువాడు. ఇటుక కాల్చినవాడు వెనుకకు తిరిగి చూడక పరుగెత్తి పోవలె ననుఆచారముపై వచ్చినది.
 • "ఇట్టిక మాడినవాడో, యొట్టిడు కొన్నాడొ." ఉ. హరి. 1. 36.

ఇట్టికాడు

 • ఈటెకాడు.
 • "ఉచ్చిపోవైచునిట్టికాని." కుమా. 11. 39. ఇట్టి______ఇడు 154 ఇడు______ఇడు

ఇట్టిపాటి

 • ఈ మాత్రం.
 • "కా దన కిట్టిపాటి యపకారము." భార. ఆది. 1. 124.

ఇట్టే

 • ఉన్న పాటున, వెంటనే.
 • "ఇట్టె చనిబాలభానుని బట్టె నపుడు." ఉత్త. రా. 5. 100.
 • "ఇట్టే పోయి వచ్చేశాడు."
 • "పద్యం చదివీ చదవక ముందే అతను ఇట్టే అర్థం చెప్పేస్తాడు." వా.

ఇట్లు ఎల్ల దినములు రావు

 • ఇట్లాగే ఎప్పుడూ ఉండదు. నీ వనుకొన్న దానికంటే విరుద్ధంగా జరుగవచ్చును సుమా అను హెచ్చరిక యిందులో గుప్తమై ఉన్నది.
 • "...ఇట్లు వర్తిలుటజేసి మృగేక్షణ యైన నిట్ల రా, వెల్ల దినంబులున్ సవతి యేగతి గల్గునొ." కళా. 1. 166.
 • "ఊళ్లోవా ళ్లెవ్వరినీ నువ్వు లెక్క చేయడం లేదు. రోజులు ఇలాగే ఎప్పుడూ ఉండవు." వా.
 • ఇదే వాడుకలో రూపం.

ఇట్లే ఎప్పుడూ ఉండదు

 • చూ. ఇట్లు ఎల్లదినములు రావు.

ఇడికుడకలు

 • పిండివంట, ఆవిరికుడుములు.
 • "ఏలకికాయలు వెన్న మెఱుంగులు నిడికుడకలు....ఆదిగా గల భక్ష్యవిశేషంబులు." హంస. 1. 105.

ఇడుగడవడు

 • బాధపడు.
 • "కడలేని విరహ వేదన నిడుగడవడు చుండుకంటె." కుమా. 6. 5.

ఇడుగడసేయు

 • బాధపడు, బాధ పెట్టు.
 • "ఆత్మలో నిడుగడ సేయుచున్ గడు సహింపక కద్రువ." భార. ఆది. 2. 42.
 • "వేయి విధంబుల భంగ పెట్టుచున్... ఇడుగడసేయగా వలయు నీలుపుమాలిన ఱంకుటాండ్రకు." విజ్ఞా. ఆచా. 111.

ఇడుపులు సాటు

 • బీరములు పల్కు.
 • దశ. 6. 70.

ఇడుమపడు

 • కష్టపడు.
 • "ఇడుమపడడె కాననభూమిన్." భార. అర. 2. 6.

ఇడుమపాటు

 • కష్టము.
 • "ఇడుమపాట్లకుజొచ్చినయింగితంబు." కళా. 4. 99.

ఇడుమలు గుడుచు

 • కష్టాలు పడు.

               "బ్రహ్మరాక్షసు డింతిపై బాయకున్న,
                మంత్రవాదుల వెదకుచు మందు లెఱుగు,
                వారి దడవుచు గనుకలివంత జింత,
                నొంది యిడుమలు గుడుచుచు నున్నవాడు."
                                                  దశ. 11. 36.

               "అనుచు దగ డాసి చేష్టలు, కనుగొని
                 ప్రజ విరియ నరచి గారుడమంత్రం,
                 బున దోషంబుం దీర్చెద, నని యిడు
                 మలు గుడిచి మంత్ర మఫాం బైనన్."
                                          దశకు. 5. 98.

ఇడుముకొను

 • ఇముడ్చుకొను, చేర్చుకొను. ఇడ్డ_____ఇత 155 ఇత______ఇద
 • "కడు బ్రియ మెలర్ప గౌగిట, నిడుము కొని...." శుక. 1. 305.

ఇడ్డబొట్టు వలె

 • కదలకుండా.
 • పెట్టుకొన్నబొట్టు అని ఇం దాకా ఇడ్డబొట్టును అందరూ అంటున్నారు.
 • ఇ దింతేనా అని సందేహం. బొట్టులాగా అనడంకంటే మఱిం కేదైనా విశేషార్థ ముందేమో అనిపిస్తుంది.
 • ఆలోచింపవలసి ఉన్నది. ఇంకా తేల లేదు.
 • "ఇడ్డబొట్టువోలె నింటిలో నుండక." కుమా. 6. 16.

ఇత:పరము

 • ఇంతకంటె వేఱు.
 • "నీవే తప్ప నిత:పరం బెఱుగ." భాగ. 8. 90.

ఇత డెంత వాడు?

 • వీ డెంత?
 • "ఇంతింతవారల కీశ్వరావసర, మింత దుర్ఘట మన్న నిత డెంతవాడు."
 • పండితా. ప్రథ. పురా. పుట. 379.

ఇతని కితండె సాటి

 • ఇతనికి సమానుడు లేడు అనుట, అప్రతిమానుడు.
 • "ఇతనికితండె సాటి యగు నీతని కీతడె సాటి వచ్చు." పారి. 5. 29.

ఇతర మనక

 • ఏమీ అనక.
 • ఇం కేమీ అనక అన్నది వాడుకలో రూపము.
 • "ఏమి సేయుదు మని ధూర్తు నితర మనక, డెందమున సందియ మొకింత చెంద కపుడు." హంస. 2. 215.

ఇత రేతరమతి

 • అన్యోన్యబుద్ధి.
 • "ఇత రేతరమతి సంభా, వితలక్షణకలన మొంది." భార. శాంతి. 6. 454.

ఇతి కర్తవ్యతామూడుడు

 • ఏమి చేయుటకూ దిక్కు తోచనివాడు.

ఇతోధికంగా

 • ఇంతకంటే ఎక్కువగా. మంచి జరుగుతుం దన్న సందర్భంలోనే దీనిని ఉపయోగిస్తారు.
 • "ఈసారి సకాలంలో వానలు కురవడం వల్ల యితోధికంగా పంటలు పండవచ్చు నని రైతులు సంతోషిస్తున్నారు." వా.

ఇత్యాదులు

 • మొదలగునవి, వగైరా.
 • "ఉప్పూ, చింతపండూ, మిరపకాయలూ ఇత్యాదు లన్నీ ఆ అంగట్లోనే కొంటూ ఉంటాము." వా.

ఇదంతన మైన

 • ఆధునిక మైన, ఇప్పటి దనుట.

ఇదమిత్థ మను

 • నిర్ధరించి చెప్పు.
 • "ఇది గాక శమనకృత్యం, బిద మిత్థ మ్మనగ గూడదు." దశా. 2. 142.
 • "ఈవ్యాజ్యం ఎలా పరిణమిస్తుందో ఇదమిత్థ మని చెప్ప లేము." వా. ఇద____ఇది 156 ఇది____ఇది

ఇదమిత్థము

 • 1. ఇది ఇట్లా అని.
 • "ఇదమిత్థ మ్మని యేనును మది మితి సేయంగ నేఅ..." పాండు.. 3. 125.
 • 2. సారాంశము.
 • "అతను గంటలకొద్దీ ఏవేవో చెప్తాడు. ఇదమిత్థం తేల్చి చెప్పడు." వా.

ఇదానీంతనము

 • ఆధునికము.

ఇది గాక

 • మరిన్నీ.
 • ఏదైనా చెప్తూ మరొక ఉపపత్తిని తెలిపేటప్పుడు ఉపయోగించేపలుకుబడి.
 • ఈ 'ది' 'దీ' అని దీర్ఘంతో కూడా వినిపిస్తుంది.
 • "ఇది గాక మఱొక మెలిక కూడా ఇందులో ఉంది." వా.
 • చూ. ఇదీ గాక.

ఇదిగో అంటే ఇన్నూ రేండ్లు

 • ఇప్పుడే చేస్తా నంటూ కాలం గడిపేవాని విషయంలో ఉపయోగించేపలుకుబడి.
 • "వాణ్ణి నమ్ముకుంటే ఇక నాపని అయినట్లే. వాడు ఇదుగో అంటే ఇన్నూ రేండ్లు." వా.
 • రూ. ఇదుగో అంటే ఇన్నూ రేళ్లు.

ఇదిగో అదిగో అని చూచు

 • ఇదో వస్తుంది అదో వస్తుంది అని వృథాగా ఎదురు చూచు.
 • "మా, కోసము తల్లిదండ్రు లిదిగో నదిగో నని చూచు టాయె." నానా. 47.

ఇది తడవ బని లేదు

 • దీన్నిగూర్చి ఆలోచించవలసిన అవసరం లేదు.
 • "దీని కెంత వలసిన నేమి యిది దడవం బని లేదు." కళా. 3. 66.

ఇది పోలు నిది పోల దని

 • ఇది మంచీ, ఇది చెడ్డా అని.
 • "ఇది పోలు నిది పోల దని చెప్ప దెలియునే, యసదు బొడువ." పాండు. 5. 229.

ఇది యది యనక

 • అడ్డు చెప్పక.
 • "ఇది యది యన కూరకునికి యెంతయు నొప్పున్." భార. ఉద్యో. 2. 59.
 • "వాడిపాటికి వా డేదో చెప్పుకొంటూ ఉంటాడు. ఇదీ అదీ అనకుండా వింటే సరి. మన కెందుకు వచ్చినగొడవ." వా.
 • రూ. ఇదీ అదీ అనకుండా.

ఇదియే పదివేలు

 • ఇంతే చాలు.
 • జరిగిన యేస్వల్ప మైనపనినో మహత్కార్యంగా భావించుటలో ఉపయోగించుపలుకుబడి.
 • "ఇదియె పదివేలు వైభవం బెల్ల నాడు, నల్ల పూసలు చెవియాకు నాకు జాలు." శుక. 2. 84.
 • "నువ్వు తిరిగి వచ్చావు. అదే నాకు పది వేలు, డబ్బు పోతే పోయింది." వా.
 • రూ. అదియే పది వేలు.